మెయిన్ ఫీచర్
ఆరంభం అదిరింది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొత్త సంవత్సరంలో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో ఈ ఏడు మంచి విజయాలు సాధించి పరిశ్రమను లాభాల బాటలో పయనించేలా చేయాలనుకున్న నిర్మాతలు.. దర్శకులు ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. ఇప్పుడు మార్చిలోకి అడగులు పెట్టేశాం. అంటే క్వార్టర్లీ పూర్తయ్యిందన్నమాట. అసలే తీవ్ర సంక్షోభంలో వున్న తెలుగు చిత్ర పరిశ్రమ మరి ఈ మూడు నెలల కాలంలో సాధించిందేమిటి? ఎన్ని సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది? విడుదలైన చిత్రాలు ఎన్ని విజయాలను అందుకున్నాయి? అపజయాలను చవిచూసిన చిత్రాలేమిటి? ఒక సారి అవలోకిద్దాం..
ఆరంభం... అదిరిపోయే రేంజ్‌లోనే వుంది. అయితే తెలుగు చిత్రసీమకు ఓపెనింగ్ ఏ మాత్రం కలిసిరాలేదు. టాలీవుడ్‌కి సంక్రాంతి సీజన్ పవన్‌కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’తో మొదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతే భారీగా బోల్తాకొట్టి అందరి అంచనాలను తలకిందులు చేసింది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రంలో త్రివిక్రమ్ మ్యాజిక్ ఏ మాత్రం కనిపించకపోగా, పవన్‌కళ్యాణ్ స్టార్‌డమ్ సైతం సినిమాను గట్టెక్కించలేకపోయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి పరిశ్రమకు ఊపిరిపోసింది. ఎన్నో ఆశల్ని రేకెత్తించింది. అంతేకాదు, బాలయ్య ఖాతాలో కమర్షియల్ విజయాన్ని నమోదుచేసి ఆయనకు, అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలగజేసింది. కమర్షియల్ హంగులతో నిండుకున్న ఈ సినిమా మాస్‌ని విశేషంగా ఆకట్టుకుంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాత సి.కల్యాణ్ నిర్మించారు. బాలయ్యకు జోడీగా నయనతార, నటాషాదోషి, హరిప్రియ నటించిన ఈచిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయప్రకాష్‌రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. అత్యంత వేగంగా సినిమాను చేసే అగ్ర కథానాయకుల్లో బాలకృష్ణ ముందుంటారు. అంతేకాదు, యువ కథానాయకులకు పోటీగా డ్యాన్సులు, ఫైట్స్ చేస్తుంటారు. ‘మానసికంగా నేనెప్పటికీ కుర్రాణ్ణే. మనం ఏది చేసినా అభిమానులను అలరించేందుకే’ అంటూ నవ్వుతూ అనేస్తారు. ఇక సంక్రాంతి అంటే బాలకృష్ణ.. బాలకృష్ణ అంటే సంక్రాంతి.. పెద్ద పండుగకు విడుదలైన బాలయ్య ప్రతీ చిత్రమూ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నదే. అదే బాటలో ఈ ‘జై సింహా’ కూడా పయనించి మంచి వసూళ్లను రాబట్టి నిర్మాత జేబులు నింపింది. బాలకృష్ణ నటించిన మరో మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. సాధారణంగా బాలకృష్ణ సినిమా హెవీ యాక్షన్ డోస్‌తో ప్రారంభం అవుతుంది. ఒక పాటతో నో.. ఒక ఫైట్‌తోనో ఆయన పరిచయ సన్నివేశం ఉంటుంది. అయితే ఇందులో మాత్రం కాస్త భిన్నంగా సాగింది. ఓ చంటి బాబుతో కథానాయకుడిని పరిచయం చేశారు. దీంతో సినిమా ఎలా సాగుతుందో ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేస్తాడు. అయితే దర్శకుడు తెలివిగా బాలయ్య అభిమానులకు ఏం కావాలో అవి ఇస్తూ, అక్కడక్కడా సెంటిమెంట్‌ను జొప్పిస్తూ, మధ్యలో కథ చెబుతూ నడిపించాడు. తొలి అర్థ్భాగం కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. అభిమానులను ఆకట్టుకునేలా ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సన్నివేశంలో బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు, నటన ఆకట్టుకుంటాయి. నయనతారతో బాలకృష్ణ ప్రేమ సన్నివేశాలు, ప్రకాష్‌రాజ్‌తో సెంటిమెంట్ సన్నివేశాలు బాగున్నాయి. మొత్తం మీద సెంటిమెంట్‌ను పండించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక జనవరి 14న విడుదలైన రాజ్‌తరుణ్ ‘రంగులరాట్నం’ స్పీడుతగ్గి నిరాశ పరిచింది. ‘జై సింహా’ మినహాయిస్తే ఏ చిత్రమూ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయేసరికి సంక్రాంతి కాస్త చప్పగా సాగింది. జనవరి 26న విడుదలైన ‘్భగమతి’ మాత్రం అంచనాలను అందుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని వంశీ-ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుష్క నటన, సాంకేతిక నైపుణ్యం ‘్భగమతి’ని నిలబెట్టాయి. అనుష్క ఖాతాలో మరో కమర్షియల్ విజయంగా ఈ చిత్రం నమోదైంది. ఈ తరం కథానాయికల్లో నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలంటే దర్శక, నిర్మాతలకు టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క. ‘అరుంధతి’తో అది నిరూపితమైంది. ఒక పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలను చేస్తూనే గ్లామర్ రోల్స్‌కూ సై అంటోంది. ఐఏఎస్ అధికారి చంచలగా అనుష్క విజృంభించింది. ఎప్పుడో 2012లో పునాదులపడ్డ ఈ సినిమా కేవలం అనుష్క కోసమే దర్శక, నిర్మాతలు ఇంతకాలం వేచి చూశారు. ప్రచార చిత్రాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ‘్భగమతి’పై దర్శక, నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం నిజమై బాక్సాఫీస్ కళకళలాడింది. అనుష్క నటనే చిత్రానికి ప్రధాన బలం. చంచలగా, భాగమతిగా రెండు పాత్రల్లోనూ చక్కటి అభినయం ప్రదర్శించింది. ముఖ్యంగా ‘్భగమతి’గా భయపెట్టిన విధానం బాగుంది. ఐఏఎస్ అధికారి పాత్రకు తగినట్టుగా చాలా హుందాగా నటించింది. రెండు పాత్రల విషయంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు, వైవిధ్యం చూపిన విధానం ఆమె అనుభవానికి అద్దం పట్టాయి. ఇక ఇదే నెల 19న ‘ఇగో’ విడుదలైంది. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఆశిష్ రాజ్, సిమ్రన్ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని కె.ఆర్. విజయ్ కరణ్ నిర్మించారు. అబ్బాయి అమ్మాయి కొట్టుకోవడం, ఆ తరువాత ప్రేమలో పడటం ‘ఆనందం’ సినిమా నుంచీ చూస్తున్నాం. దర్శకుడు మళ్లీ అదే కథను ఎంచుకున్నాడు. కాకపోతే నేపథ్యం పల్లెటూరికి మారింది. ఫలితం పరాజయమే!
ఫిబ్రవరి నెలలో ప్రేమకథల జోరు కనిపించింది. ‘్ఛలో’, ‘తొలిప్రేమ’ రెండూ ప్రేమకథలే. నాగశౌర్య, రష్మిక మందాన జంటగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషామల్పూరి నిర్మించిన ‘్ఛలో’ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యువతరాన్ని ఈ చిత్రం ఎంతగానో మెప్పించింది. ఓ కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద కాసులపంటను పండించింది. యువతరం కథానాయకుడు నాగశౌర్య కెరీర్‌లో ‘్ఛలో’ పెద్ద విజయంగా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నాగశౌర్య ఆ తర్వాత కల్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి వంటి చిత్రాలతో వరస విజయాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా, విభిన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాదాపు ఏడాది విరామం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన చిత్రం ‘్ఛలో’. దర్శకుడితో కలిసి ఈ చిత్ర కథకు మెరుగులు దిద్దడంతో పాటు, సొంత నిర్మాణ సంస్థలో దాన్ని తెరకెక్కించడం విశేషం. సరిగ్గా ఇలాంటి ఫలితమే అందుకున్నాడు వరుణ్ తేజ్. ఫిబ్రవరి 10న విడుదలైన ‘తొలిప్రేమ’ అంచనాల్ని అందుకుంటూ ఓ మర్చిపోలేని విజయాన్ని నమోదుచేసింది. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని బి.వి.ఎన్.ఎస్ ప్రసాద్ నిర్మించారు. నేటి యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ ఇలా వేటికవే ప్రత్యేకం. గతేడాది శేఖర్ కమ్ములతో కలిసి ప్రేక్షకులను ‘్ఫదా’ చేశారు. ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించారు. పవన్‌కళ్యాణ్ తొలినాళ్లలో నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌నే ఈ చిత్రానికి పెట్టడంతో సినిమాపై కాస్త హైప్ వచ్చింది. ఆదిత్యగా వరుణ్‌తేజ్ నటన ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు ఈ కథకు బలం. వాటి చుట్టూనే వినోదం, డ్రామా, భావోద్వేగాలు పలికించాడు. వరుణ్‌తేజ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కొన్ని యాక్షన్ సన్నివేశాల మేళవింపు ఆకట్టుకుంటుంది. వరుణ్-రాశీఖన్నాల మధ్య కెమిస్ట్రీ పండడంతో పాటు థమన్ సంగీతం వినసొంపుగా సాగడం.. ‘తొలిప్రేమ’కు బాగా కలిసొచ్చాయి. నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘అ!’ ఫిబ్రవరి 16న విడుదలై ఓ వినూత్న ప్రయోగంగా నిలిచింది. సగటు ప్రేక్షకుడు ‘అ’ చూసి కాస్త గందరగోళానికి గురైనా, విమర్శకులు మాత్రం దర్శకుడి పనితనాన్ని, స్క్రీన్‌ప్లే నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అయితే ఇదే నెలలో విడుదలైన రవితేజ టచ్‌చేసి చూడు (్ఫబ్రవరి 2), హౌరాబ్రిడ్జ్ (్ఫబ్రవరి 3), మోహన్‌బాబు గాయత్రి (్ఫబ్రవరి 9), సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ (్ఫబ్రవరి 9), నా లవ్‌స్టోరీ (్ఫబ్రవరి 14), మనసుకు నచ్చింది (్ఫబ్రవరి 16), శ్రీకాంత్ రారా (్ఫబ్రవరి 23), జువ్వ (్ఫబ్రవరి 23) ఇలా వరుసగా పరాజయాలు ఎదురవడంతో బాక్సాఫీస్ దగ్గర కళ తగ్గిపోయింది. మార్చి 1నుంచి చిత్రసీమ సమ్మెకు దిగింది. వారం రోజుల పాటు థియేటర్లను మూసేశారు. ఆ తరువాత సమస్య పరిష్కారమవ్వడంతో మళ్లీ థియేటర్లు కళకళలాడాయి. పోస్టర్లపై కొత్త సినిమా బొమ్మలు వెలిశాయి. మార్చి 16న విడుదలైన నిఖిల్ కిరాక్‌పార్టీ యువతరానికి కాలేజీ రోజుల్ని గుర్తు చేసింది. ఇదే నెల 9న ‘ఏ మంత్రం వేశావె’ విడుదలైంది. 23న శ్రీవిష్ణు హీరోగా నీదీ నాదీ ఒకే కథ ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల మెప్పుపొందింది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ద్వారా ఎవరికి నచ్చిన పని వాళ్లు చేయడమే నిజమైన విజయం అని చెప్పే ప్రయత్నం చేశారు. కల్యాణ్‌రామ్, కాజల్ జంటగా నటించిన ‘ఎం.ఎల్.ఏ’ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చి కమర్షియల్ విజయాన్ని నమోదు చేసింది. ప్రారంభ వసూళ్లు బాగుండడంతో నిర్మాతలు పెట్టుబడిని రాబట్టుకోగలిగారు. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. తొలి నుంచీ కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు కళ్యాణ్‌రామ్. ఆయన చేసిన సినిమాల్లో చాలా మటుకు ఫక్తు కమర్షియల్ కథలే ఉన్నాయి. ‘ఇజం’, ‘పటాస్’ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు ‘ఎం.ఎల్.ఏ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి లక్షాలు ఉన్న అబ్బాయిగానే కాకుండా ఎమ్మెల్యేగానూ మెప్పిస్తానని ప్రచార కార్యక్రమాల్లో వెల్లడించినట్లుగానే తన నటనతో అందర్నీ మెప్పించి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ విలువలతో పాటు చిన్న పిల్లలు చదువుకోవాలి తప్ప పనికి వెళ్లకూడదు అనే మంచి పాయింట్‌ని చూపించాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం ఊహకు అందుతూ సాగుతుంటుంది. కానీ వినోదం మాత్రం ఖాయం. మొత్తంగా ఇది తెలిసిన కథే. కమర్షియల్ విలువలు జోడించి వినోదాత్మకంగా తెరకెక్కించడంతో విజయాన్ని అందుకుంది. ‘పటాస్’ నుంచి కల్యాణ్‌లో ఈజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో అది కనిపిస్తుంది. వినోదం, భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇక మార్చి 30న విడుదలైన ‘రంగస్థలం’ రామ్‌చరణ్ కెరీర్‌లోనే అత్యుత్తమ విజయాన్ని అందించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. అటు క్లాస్‌నీ, ఇటు మాస్ నీ.. కుటుంబ ప్రేక్షకుల్నీ థియేటర్లకు రప్పించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ‘బాహుబలి’ తర్వాత వంద కోట్ల మార్క్‌ని వేగంగా అందుకున్న తెలుగు సినిమాగా ‘రంగస్థలం’ నిలిచింది. తొలి త్రైమాసికానికి ఘనమైన ముగింపును పలికి టాలీవుడ్‌కు ఊపిరిపోసింది. మెగా ఫ్యామిలీ వారసుడిగా వెండితెరకు పరిచయమైన రామ్‌చరణ్ తొలి నుంచి తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మాస్, కమర్షియల్ హీరోగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక దర్శకుడు సుకుమార్‌ది విభిన్న శైలి. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందకు వచ్చిన చిత్రం ‘రంగస్థలం’ అంచనాలను అందుకుని స్టామినా నిలబెట్టుకుంది. చిట్టిబాబుగా రామ్‌చరణ్ ఒదిగిపోయారు. గోదావరి యాస.. చెవిటి వ్యక్తిగా అతను పండించే నవ్వులు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకూ చరణ్ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్ర మరో ఎత్తు. పాత్ర కోసం రామ్‌చరణ్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చెవిటి వ్యక్తిగా ప్రియురాలి వద్ద తడబడే సన్నివేశాల్లో నవ్వులు పంచిన చెర్రీ ద్వితీయార్థంలో అన్న కోసం తపన పడే తమ్ముడిగా భావోద్వేగాలను పలికించడంలో నూటికి నూరుపాళ్లు విజయవంతమయ్యారు. కొన్ని రోజుల వరకు రామ్‌చరణ్ మనకు చిట్టిబాబుగానే గుర్తిండిపోతారు. రామలక్ష్మిగా తన నటనతో మరోసారి కట్టిపడేశారు సమంత. ఇక ‘రంగస్థలం’ కెప్టెన్ సుకుమార్ ‘లెక్క’ అదిరిపోయింది. ప్రతీ సన్నివేశంలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఈ త్రైమాసిక రిపోర్ట్‌ని చూస్తే ‘జై సింహా’, ‘ఎం.ఎల్.ఏ’లాంటి కమర్షియల్ చిత్రాలు వచ్చాయి. ‘్ఛలో’, ‘తొలిప్రేమ’లాంటి ప్రేమగాథలు చూశాం. ‘అ’, ‘నాదీ నీది ఒకే కథ’లాంటి కొత్త ప్రయోగాలు, ‘రంగస్థలం’లాంటి విభిన్న తరహా చిత్రాలతో బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు చిత్రసీమలో కొత్త దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇలా ఆరంభమే అదిరిపోయేలా ఉండడంతో టాలీవుడ్ హాయిగా ఊపిరి పీల్చుకుని మరో అడుగు ముందుకేస్తూ సాగింది మరెన్నో ఆశలతో..
*