మెయిన్ ఫీచర్

విధి వక్రించినా.. విజేతగా నిలిచింది ( తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్ స్ఫూర్తిదాయక కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్వీగౌడ్ మైసూర్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా సుపరిచితురాలు. పసి వయసు నుంచి చలాకీగా ఉండే సెల్వీగౌడ్ జీవితంలోకి అనుకోని ఉపద్రవం పెళ్లి రూపంలో వచ్చింది. 14ఏళ్లు నిండకుండానే వివాహం చేశారు. భర్త ఓ శాడిస్ట్. ఆమె శరీరంతో డబ్బు సంపాదించాలని చూశాడు. మూడు ముళ్లు ఉరితాళ్లు అయ్యాయి. పడుపు వృత్తి చేయనన్నందుకు చంపటానికి కూడా వెనుకాడలేదు. ఆ మానవ మృగం నుంచి ఈ లేడీకూన తప్పించుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది.
గరళంలాంటి గతాన్ని గొంతులోనే దిగమింగుకుని భావి జీవితాన్ని బంగారుమయం చేసుకునేందుకు బాటలు వేసుకుంది. దేశంలో తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా తన పేరును సార్థకం చేసుకోవటంతో పాటు నేడు ఆ ట్యాక్సీలను అద్దెకు ఇచ్చే కంపెనీకి యజమానురాలిగా.. భార్యగా..తల్లిగా విజేతగా నిలిచింది. వివరాల్లోకి వెళితే...
మైసూర్‌కు సమీపంలోని ఓ కుగ్రామం సెల్వీగౌడ్‌ది. 14 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. మూడుముళ్ల బంధం ఇంత భయంకరంగా ఉంటుందా అని భయపడేలా భర్త శాడిస్ట్‌గా వ్యవహరించేవాడు. పడుపు వృత్తి చేయమంటే చేయటంలేదని ఆ బాలికా వధువును బస్సు టైర్ల కిందకు నెట్టి చంపబోయాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. మైసూర్‌కు పారిపోయి. ఓ చర్చి వద్ద కూర్చొని చిన్నారి సెల్వీగౌడ్ ఏడుస్తుండటం కొంతమంది గమనించి ఆమెను ఒడినాడి అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు.
ఆ సంస్థలో ఉన్నవారంతా తనలాంటివారే. భర్తల వేధింపులు తాళలేక ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందినవారే. అక్కడ వాలంటీర్‌గా తన సేవలను అందించేది.
తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా...
తదనంతరం కాలంలో బ్యూటీ సెలూన్‌లో సైతం పనిచేసింది. మహిళల కనుబొమ్మలను తీర్చిదిద్దటంలో దిట్ట. ఏ పనిచెప్పినా ధైర్యంగా చేయటం గమనించిన ఒడినాడ సంస్థ డైరెక్టర్ ఆమెను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమని ప్రోత్సహించింది. ఆమెకు సైకిల్ నడపటమే రాదు. తొలుత భయపడింది. కాని ధైర్యంతో అడుగు ముందుకు వేసింది. అప్పటికే ఇద్దరు యువతులు డ్రైవింగ్‌లో శిక్షణపొందుతున్నారు. వీరితో సెల్వీగౌడ్ జతకలిసింది. ముగ్గురూ చక్కగా డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఫండ్స్ సేకరించి ట్యాక్సీని కూడా కొనుగోలు చేశారు. మిగిలిన ఇద్దరు డ్రైవింగ్ నుంచి తప్పుకోగా..సెల్వీగౌడ్ ట్యాక్సీ డ్రైవర్‌గా మైసూర్ వీధుల్లో కొత్త జీవితానికి నాంది పలికింది. తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా పేరు నమోదు చేసుకున్న సెల్వీగౌడ్ ఆ తరువాత నుంచి జీవితంలో వెనుదిరిగి చూడలేదు. తనకాళ్ల మీద తాను నిలబడటమే కాకుండా మహిళా సమస్యలమై గళమెత్తి పోరాడుతోంది.
ట్యాక్సీ ఎక్కేవారే కాదు...
ట్యాక్సీ డ్రైవర్‌గా మహిళ ఉండటం చూసి అసలు ట్యాక్సీ ఎక్కేవారే కాదు. మగవారు చేసే పని ఆడవాళ్లు చేస్తే ప్యాసింజర్లకు కూడా భయమే. భద్రంగా తీసుకువెళతుందో లేదోనని వారి సంకోచం. ట్రావెల్ ఏజెన్సీవారితో పరిచయాలు పెంచుకుని రెగ్యులర్ క్లయింట్స్‌ను సంపాదించింది. డబ్బు కోసం ఈ వృత్తిని స్వీకరించలేదు. కేవలం మానసిక శాంతి కోసం స్వీకరించిన ఆమెకు అదే లోకంగా మారిపోయింది. జీవితం ఓ గాడిలో పడిన తరువాత ఆమె విజి అనే డ్రైవర్‌ను వివాహమాడింది. ఇపుడు వారికి ఇద్దరు పిల్లలు. తొలి మహిళా డ్రైవర్‌గా ఆమె చరిత్ర సృష్టించటమే కాదు. తన కుమార్తెకు కూడా డ్రైవింగ్ నేర్పించి తొలి బాలికా డ్రైవర్‌గా ఆమె పేరు నమోదు చేయించటం విశేషం.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్న సెల్వీ గౌడ్ జీవితగాథ తెలుసుకున్న ఓ అమెరికా డాక్యూమెంటరీ ఫిల్మ్‌మేకర్ గత పదేళ్ల నుంచి ఆమెతో చెలిమి చేస్తూ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. అంతేకాదు ఈ డాక్యుమెంటరీకి ఇప్పుడే ముగింపు పలకనని కూడా డాక్యుమెంటరీ రూపకర్త అంటోంది.
సామాజిక సమస్యలపై
మహిళల సమానత్వం కోసం, వారిపట్ల చూపుతున్న వివక్షతపై గళమెత్తి పోరాడుతున్న సెల్వీగౌడ్‌కు మీడియాలో సైతం విస్తత్రమైన ప్రచారం జరిగింది. జీవన పోరాటంలో నెగ్గుతూ తోటి మహిళల కోసం పోరాడుతున్న ఆమెను అమెరికాలోని ఐటివిఎస్ సంస్థ ఆహ్వానించి సన్మానించింది. దాదాపు పది రోజులు అమెరికాలో పర్యటించిన ఆమె ఇప్పటికీ బాలికలు, మహిళల కోసం తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది.
.....................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03