మెయిన్ ఫీచర్

వీళ్లేరా.. విలన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణంలో -రావణుడు మహాబలశాలి. అంతటివాణ్ని పడగొట్టాడు కనుకే -రాముడి శక్తి మరింత ఎలివేట్ అయ్యింది. అసలు రావణుడే లేకుంటే -రాముడి పరాక్రమాలు అంత గొప్పగా రక్తికట్టి ఉండేవి కాదు. అందుకే -ప్రపంచ సినీ చరిత్రలో హీరోతో సమానంగా విలన్‌కూ ఇంపార్టెన్స్ పెరిగింది. మంచిచెడుల మధ్య సాగే పోరాటమే సినిమా కనుక -చెడును ఎంత బలంగా, ఎంత భయంకరంగా చూపిస్తే హీరో అంత గొప్పగా కనిపిస్తాడన్న స్కెచ్ బలపడింది. ఏ సినిమాలోనైనా హీరో గెలుపుతోనే శుభంకార్డు పడుతుంది. ఆ విషయం పోస్టర్ చూసి కూడా ప్రేక్షకుడు చెప్పేస్తాడు. ఎంత బలమైన విలన్ అయినా -హీరో చేతిలో ఓడిపోతాడు. ఈ సినిమా ముందే తెలిసినా ఎందుకు చూస్తామంటే -అంతటి బలమైన, భయంకరమైన విలన్‌ను కుర్ర హీరో ఎలా పడగొట్టాడన్న ఆసక్తి. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు తెలుగు తెరపై విలన్ బలపడుతున్నాడు. హీరో రేంజ్‌ని క్రమంగా అందుకుంటున్నాడు. అందుకే -హీరోలతోపాటు విలన్లకూ క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

మంచి గురించి చెప్పాలంటే చెడుని చూపించాలి.
హీరోయిజాన్ని హైలెట్ చేయాలంటే విలనిజాన్ని వయొలెంట్‌గా డిజైన్ చేయాలి. ఆ విషయంలో తెలుగు సినిమా ఎప్పుడూ ట్రాక్ తప్పలేదు. పైగా, విలనిజం ట్రాక్‌ను విస్తరిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చింది. నిజానికి ఇదీ విలనిజం అన్నంతగా ఓ ట్రాక్ వేసి ట్రెండ్ సెట్ చేసిన నటులు తెలుగులో ఎందరో. ఒకప్పటి తెలుగు సినిమాలో ఎస్వీ రంగారావు, సిఎస్సార్, కొంగర జగ్గయ్య, రాజనాల లాంటి గొప్ప నటులు తమదైన స్టయిల్‌లో విలనిజాన్ని పండించి శెభాష్ అనిపించుకున్నారు. 80వ దశకం వచ్చేసరికి ప్రభాకర్ రెడ్డి, రావుగోపాల రావు, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, మోహన్‌బాబు, ఆ తరువాతి కాలంలో కోట శ్రీనివాస రావు, తనికెళ్ల భరణిలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులూ -విలనిజాన్ని పండించడంలో ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే. తెలుగు సినిమా విస్తరించి పరభాషా నటులకు విస్తృతంగా అవకాశాలు ఇవ్వడం మొదలైన దగ్గర్నుంచీ -ఇతర సినీ పరిశ్రమల నుంచి ఎందరో నటులు తెలుగు తెరపై భయంకరమైన విలనిజాన్ని పండించారు. పరేష్ రావల్, షాయాజీ షిండే, ప్రకాష్‌రాజ్, ప్రదీప్‌రావత్, ముఖేష్‌రుషి లాంటి నటులూ విలనిజాన్ని ప్రదర్శించడంలో టాప్ అనిపించుకున్నారు.
**
కాలానుగుణంగా తెలుగు సినిమా ఎప్పటికప్పుడు మారుతోంది. జాతీయ, ప్రపంచ సినిమాల పరిణామ ప్రభావానికి గురవుతూనే ఉంది. అలాంటి మార్పుల కారణంగా -కొందరు విలన్లు హీరోలయ్యారు. ఇంకొందరు విలన్లు కమెడియన్ల అవతారం ఎత్తారు. చాలామంది పాత విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులగానూ ఒదిగిపోయారు. దీంతో తెలుగు సినీ ప్రేక్షకుడు కొత్త విలన్‌ను కోరుకోవడం మొదలెట్టాడు. దర్శకులు, నిర్మాతలు కూడా ప్రేక్షకుడి నాడి పట్టుకుని, హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం ఎక్కడెక్కడి విలన్లనూ వెతుక్కురావడం మొదలెట్టారు. వయసు మళ్లిన నటులనో, పెద్దరికంగా కనిపించే ఆర్టిస్టులనో వెతుక్కు రావడంవల్ల ప్రయోజనం లేదని గ్రహించి హీరో వయసుకు, వేడికి సమ ఉజ్జీల్లాంటి విలన్లకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా విలనిజం క్రేజ్ పెరిగిపోతుండటం, హీరోకి సమఉజ్జీగా విలన్‌స్థాయి ఎదిగిపోవడంతో -ఇప్పుడు హీరోలే విలన్ వేషాలేసేందుకు ‘సై’ అంటున్నారు. హీరోలుగా ఒకట్రెండ్ సినిమాలు చేసిన కుర్రాళ్లు విలన్ అవతారం ఎత్తేందుకు సై అంటుంటే, చాలాకాలంగా హీరోయిజాన్ని ప్రదర్శించి అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో తమ నట ప్రావీణ్యాన్ని విలనిజంలో చూపించేందుకు సీనియర్లూ సిద్ధపడుతున్నారు. ఈ కోణంలో నిన్నమొన్నటి హీరోలు, ఒకప్పటి హీరోల కోసం పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయి. విలన్ పాత్రను అందుకున్న వాళ్లూ తమను తాము ప్రూవ్ చేసుకోవడం కొత్త మేనరిజమ్స్, టెరిఫిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో -తెలుగు ప్రేక్షకుడికి కొత్త రుచులు చూపిస్తున్నారు.
తెలుగు సినిమా స్వర్ణయుగం కాలంలో ఎన్టీఆర్, ఎన్నార్‌లాంటి సీనియర్ హీరోలు పురాణ, ఐతిహాసిక, సాంఘిక చిత్రాల్లో నెగెటివ్ షేడ్ కలిగిన పాత్రలు చేసినా అప్పుడప్పుడో, ఎప్పుడో ఒకప్పుడో మాత్రమే ఉండేది. ఇప్పుడా ధోరణి బలపడింది. -క్యారెక్టర్ క్లిక్ అయితే విలన్‌గా కంటిన్యూ అయిపోవడానికీ హీరోలు రెడీ అవుతుండటం ఇప్పటి పరిణామం. విలనిజంలో ట్రెండ్ సెట్ చేసే రోజులు కావివి. ట్రెండీ విలన్లు సినిమాను సెట్ చేస్తున్న రోజులివి.
***
భారతీయ సినిమాలో విలన్‌ది ప్రత్యేక పాత్రే. తన శాడిజంతో హీరోని టార్చర్ పెట్టడం, అతని కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేయడం.. చివరకు హీరో విలన్‌పై పగబట్టి మట్టుబెట్టడం. వందల వేల సినిమాల్లో విలన్ హీరో మధ్యవుండే ఈ రివేంజ్ బంధం మాత్రం మారదు, మారలేదు. విలన్ పాత్రలు పోషిస్తోన్న వారికి క్రేజ్ పెరుగుతుండటంతో, హీరోలూ విలన్ పాత్రలు పోషించి మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో పలువురు హీరోలు విలన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. ఇప్పుడిది సౌత్‌కూ బలంగానే పాకుతోంది. తెలుగు మాజీ హీరోలు విలన్‌లు టర్న్ తీసుకుంటున్నారు.
తానిఒరువన్ సినిమాలో విలన్‌గా మెప్పించాడు అరవింద్‌స్వామి. 90వ దశకంలో రోజా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి క్యూట్ లుక్‌తో అమ్మాయిల మనసు కొల్లగొట్టిన అరవింద్‌స్వామి, తరువాత పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఈమధ్యే కొంత గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, తానిఒరువన్‌లో ఎవరూ ఊహించని పాత్రతో మెప్పించాడు. అది పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడంతో, అరవింద్‌స్వామిని మళ్లీ విలన్‌గా చూపించేందుకు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న జగపతిబాబుకు హీరోగా పెద్ద బ్రేక్ రాకుండానే -కెరియర్‌కు బ్రేక్ పడింది. కొంచెం గ్యాప్ తరువాత -నిర్ణయం మార్చుకుని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. రీఎంట్రీ ఇస్తూ బాలకృష్ణలాంటి పెద్ద హీరోకి ధీటైన విలన్‌గా ఆకట్టుకున్నాడు. లెజెండ్ సినిమాలో జగపతిబాబు చూపించిన విలనిజానికి ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. ఒక్క సినిమాతో విలన్‌కు జగపతిబాబుకి అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. హీరోగా అతను చూడని రేంజ్ విలన్‌గా అందుకోవడం గమనార్హం. సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో జగపతిబాబు వేసిన ట్రాప్‌పై జర్నీ మొదలెట్టేందుకు -సీనియర్ హీరోలూ రెడీ అవుతున్నారు. విలన్‌గా టర్న్ తీసుకోవడానికి సినిమాలు వెతుకుతున్నారు.
ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది హీరో రాజశేఖర్ గురించి. నిజానికి రాజశేఖర్ విలన్‌గానే కెరీర్ మొదలెట్టినా, అనుకోని అవకాశాలతో మాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా టర్న్ తీసుకున్నాడు. వరుస విజయాలతో ఇమేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ పడ్డాయి. కొత్త హీరోల వేగం పెరగడంతో -హీరోగా
రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. నిలదొక్కుకోవడానికి హీరోగా ఒకటీ అరా సినిమాలు చేసినా -బలమైన కథ లేకపోవడం, ట్రెండీ హీరోయిజాన్ని ప్రదర్శించలేకపోయిన పరిస్థితుల్లో దాదాపుగా కనుమరుగైపోయాడు. ఆమధ్య చిరంజీవి హీరోగా చేస్తే, ధీటైన విలన్ పాత్రను పోషిస్తానంటూ మనసులో మాట చెప్పుకోవడంతో -ఒకప్పుడు విలన్ పాత్రలతో మెప్పించిన రాజశేఖర్‌ను మళ్లీ విలన్‌గా చూపించేందుకు పరిశ్రమలో రంగం సిద్ధమైంది. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రాజశేఖర్‌ను విలన్‌గా చూపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే కోవలో హీరో శ్రీకాంత్ సైతం విలన్ టర్న్ తీసుకున్నాడు. పరిశ్రమకు కుర్ర విలన్‌గా వచ్చిన శ్రీకాంత్, తరువాత హీరో అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన పాత్రలతో ఒక తరహా కుటుంబ కథా చిత్రాలకు శ్రీకాంత్ ఒకప్పుడు సూపర్ హీరో అయిపోయాడు. ఫ్యామిలీ హీరోగా, స్టార్ హీరో సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన శ్రీకాంత్, ఇటీవలి కాలంలో చేసిన సోలో సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడుతున్నాయి. దాంతో పెద్ద హీరోల సినిమాల్లో ప్రాధాన్యతవున్న క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. తెలుగు స్క్రీన్‌పై విలనిజం ప్రాధాన్యత పెరుగుతుండటంతో, ఇప్పుడు విలన్‌గా మారేందుకు శ్రీకాంత్ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ఒక సినిమాలో విలన్ పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పరిశ్రమ టాక్. ఇక తమిళ, తెలుగు భాషలలో హీరోగా నటించిన ఆది కూడా ఇప్పటికే సరైనోడు సినిమాలో స్టైలిష్ విలన్‌గా మెప్పించాడు. బాహుబలిలాంటి భారీ సినిమాలో రాణా దగ్గుబాటు విలన్‌గా మెప్పిస్తే, బాలీవుడ్ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ తెలుగు హీరో సుధీర్‌బాబు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. విలన్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. తమిళంలో చాలామంది యువ హీరోలు కూడా ఇతర హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఇలా విలన్‌గా మారిన, మారుతోన్న హీరోల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న కార్తీక్ సైతం విలన్ పాత్రలు చేశాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ రాజవౌళి ఈగ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోలు రెండు పాత్రల్లో నటించి ఒక పాత్ర హీరోగా నటిస్తే, మరో పాత్రలో విలన్‌గానూ అదరగొడుతున్న సినిమాలు వస్తున్నాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబో చిత్రంలో ఒక పాత్ర హీరోగా చేస్తే, మరో పాత్రలో విలన్‌గా మెప్పించాడు. భారతీయుడు సినిమాలో కమల్‌హాసన్ రెండు పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. హీరో అజిత్ వాలి చిత్రంలో రెండు పాత్రలు చేసి దుమ్ము దులిపాడు. తాజాగా సూర్య 24 చిత్రంలో ఏకంగా మూడు పాత్రల్లో నటించి అందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో ఇమేజ్ తెచ్చుకున్నాడు.
తెలుగు తెరపై వెలిగిపోయిన ఒకప్పటి హీరోయిన్లు, తాజా సినిమాల్లో అక్క అత్త అమ్మ పాత్రలతో వెలిగిపోతుంటే -నిన్నటి హీరోలు ఇప్పుడు విలన్ పాత్రలను వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారు.

-శ్రీనివాస్