మెయిన్ ఫీచర్

ఇంట్లో రాజకీయాలు మాట్లాడుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్త పేరున్న ప్రజాప్రతినిధి, మంత్రి. అయినా ఆమె అతి సామాన్యంగా స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పేది. కరడుగట్టిన కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చినా ఆ వాసనలేవి ఆ ఇంట్లో కనిపించవు. అసలు ఎలాంటి రాజకీయ చర్చలే జరగవు. ఇంట్లో ఏమి వండారు? ఏం తిన్నారు? కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? వారితో జోక్స్.. ఇవే ఆ ఇంట కనిపించే దృశ్యాలు. ఇంతకీ ఎవరిది ఆ ఇళ్లు అని అనుకుంటున్నారా? మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించనున్న కేరళ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పినారయి విజయన్ ఇంట కనిపించే సందడి. కుటుంబ సభ్యులంతా కమ్యూనిస్టు భావాలు కలిగినవారే. కాని ఎవ్వరూ ఇంట్లో రాజకీయాల గురించి మాట్లాడనే మాట్లాడుకోం. సీపీఎం నిర్వహించే ఆందోళనలు, ఉద్యమాల గురించి అసలే ప్రస్తావించుకోం. భోజన సమయంలో ఆ రోజు ఇంటిలో చేసిన వంటలపైనే మాట్లాడుకుంటాం. ఇవే మా మధ్య ప్రతిరోజూ జరిగే సంభాషణ అని పినరయి విజయన్ భార్య కమలా విజయన్ అంటున్నారు. బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి దినపత్రికల చదువుతాను, స్థానిక ప్రజల నుంచి తెలుసుకుంటానే తప్పా భర్తను ఇప్పటివరకు ఏ విషయం అడిగి తెలుసుకోలేదని చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షఫ్రంట్ విజయకేతనం ఎగురువేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న విజయన్ భార్య కమలా విజయన్ మీడియాతో ముచ్చటిస్తూ.. భర్త అంతరంగం, కటుంబ నేపథ్యం గురించి వివరించారు.
కమ్యూనిస్టు కోటలాంటివారు...
ఆయన ఓ విధంగా కమ్యూనిస్టు కోట లాంటివారు అని చెప్పవచ్చు. ఎవ్వరికీ అందులోకి ప్రవేశం లేదు. కనీసం భార్యనైన తనకు కూడా అటువంటి అవకాశం లేదనే భావిస్తాను. ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి సంబంధించిన విషయాలే మాట్లాడతారు. ఎలాంటి రాజకీయ సంభాషణలు మా మధ్య చోటుచేసుకోవు అంటారు. కమలా విజయన్ తండ్రి ఉపాధ్యాయుడు. కమ్యూనిస్టు నేత. ఒంజియం గ్రామస్తులు మా నాన్నగార్ని ఎంతగానో గౌరవిస్తారు. మాకుటుంబం అంతా సీపీఎంలో పనిచేస్తారు. నేను కాలేజీలో చదువుకునే రోజులలో కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో సభ్యురాలిగా ఉండేదాన్ని. మా తండ్రి, సోదరులు,బంధువులు అందరూ కూడా సీపీఎంలో పనిచేశారు.
పినరయ విజయన్‌తో
వివాహం పెద్దలు కుదిర్చిందే...
1978లో బిఇడీ చేస్తుండగా నాకు పెళ్లి చేయాలని ఇంట్లో ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన విజయన్ కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకుంటాననే ప్రతిపాదన మా తండ్రి ముందు ఉంచటంతో ఆ విషయం నా ముందు ఉంచారు. నేను కూడా సరేననటంతో నన్ను చూడటానికి ఆయన మా ఇంటికి వచ్చారు. ఆరోజు కూడా మా మధ్య ఎలాంటి మాటలు దొర్లలేదు. ఇక నేను వెళ్లవచ్చా? అని అడగటంతో ఒకే వెళ్లండి అని మాత్రమే చెప్పటం జరిగింది. కనీసం పార్టీ గురించి, పార్టీలో ఏం చేస్తారనే విషయాలుగానీ ఇప్పటివరకు అడిగిన సందర్భమే లేదు. అసలు మా ఇంట్లో పార్టీ విషయాలే మాట్లాడుకోం.
సింపుల్‌గా పార్టీ పెళ్లి చేసుకున్నాం...
1979లో మా పెళ్లి జరిగింది. అపుడు కూతుపురంబ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ పెళ్లి కదా! చాలా సీదాసాదాగా జరిగింది. పెళ్లికి వచ్చినవారికి నిమ్మరసం, బిస్కెట్లు మాత్రమే అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి ఈకె నయ్యర్ తమ పెళ్లి చేశారు. విజయన్‌తో పాటు ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. ఇది పూర్వీకుల ఇళ్లు. ఇటీవలనే కొద్దిపాటి మార్పులు చేసి సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ ఇంట్లో మేమిద్దరం, మాతోపాటు వృద్ధురాలైన అత్తగారు మాత్రమే ఉండేవారం.
మొదటి సలహా ఇదే...
పెళ్లయిన కొత్తలో ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోయో ముందు తన తల్లి గురించి మాత్రమే చెప్పారు. చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకోవాలి. ఆమె ఈతరం మనిషి కాదు. ఎక్కువ మాట్లాడదు. వౌనంగా ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడమని మాత్రమే ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి సలహా. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ ఇంట్లో ఒంటరిగా ఉండలేక మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. తరువాత అలవాటుపడిపోయాను. కాపురానికి వచ్చిన వెంటనే ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా జాయిన్ అయ్యాను. తదనంతరం సెయింట్ జోసెఫ్ స్కూల్లో 16ఏళ్లపాటు టీచర్‌గా పనిచేశాను. మంత్రి పదవి వచ్చిన తరువాత తిరువనంతపురం వెళ్లవలసి రావటంతో టీచర్ ఉద్యోగాన్ని వదలివేయాల్సి వచ్చింది.

ఏ పనిచేసినా మద్దతు..
పెద్ద రాజకీయ నాయకుడితో వివాహం, కలిసి జీవించటం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని. అంతేకాదు తాను ఏ పని చేసినా మద్దతుగా విజయన్ మాట్లాడేవారని వెల్లడించారు. భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను ఏ మేరకు నిర్వర్తించాలో ఆమేరకు నిర్వర్తించారే తప్పా ఇంట్లో అనవసరంగా జోక్యం చేసుకోవటం జరగలేదని అన్నారు. సమయం లేక పిల్లలు, తనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లేకపోవటం అనేది అతి సాధారణ విషయంగా పేర్కొంటూ, దీని గురించి తాము ఏనాడు బాధపడలేదని, చాలా అరుదుగా మాత్రమే కన్యాకుమారి లాంటి కొన్ని ముఖ్యప్రదేశాలు కలిసి చూడగలిగానని చెప్పారు.
ఇంట్లో సరదాగా ఉంటారు...
విజయన్ ఫొటోలు గమనిస్తే చాలా సీరియస్‌గా ఉంటాయి కదా? ఇంట్లో కూడా అలాగే ఉంటారా? అని ప్రశ్నిస్తే ఇంట్లో చాలా సరదాగా జోక్స్ వేస్తుంటారు. ఏ మనిషైనా రోజంతా సీరియస్‌గా ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. ఇంటి గురించి పట్టించుకోకపోవటం అనే ప్రశే్న లేదు. కుటుంబంతో లేని సమయంలో కనీసం రోజుకు నాలుగైదు సార్లు నాతో మాట్లాడి కుటుంబ విషయాలు ముచ్చటిస్తారని వెల్లడించారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నపుడు వాళ్లకి స్కూల్లో ర్యాంకు వస్తే తానే స్వయంగా స్వీట్లు తీసుకువచ్చి వారి పడక మంచం పక్కన పెట్టి అభినందనలు తెలిపేవారని వెల్లడించారు.
వివాదాస్పద విషయాలు అసలు మాట్లాడుకోం..
తమ అబ్బాయి ఉన్నత చదువులు కోసం బ్రిటన్ వెళ్లినపుడు విజయన్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు కదా? అని ప్రశ్నిస్తే కమ్యూనిస్టు కుటుంబాల్లోని పిల్లలు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లటం నేరమా అని ప్రశ్నించారు. ఎంబీఏ చదువుతాను అని కుమారుడు అడిగినపుడు వాడిని ప్రోత్సహించి చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మామీద ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద విషయాలను గురించి ఇంట్లో అసలు చర్చించుకోమని, తప్పు చేయలేదనే స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నపుడు వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదని, తమ మధ్య కూడా ఆ విషయాలు ఏమి రావని, కేవలం ఇంటికి సంబంధించిన విషయాలు మాత్రమే అడిగి తెలుసుకుంటారని వెల్లడించారు. పెళ్లయిన కొత్తలో రాజకీయాలు గురించి అడిగి తెలుసుకున్నా ఎక్కువ సమాధానాలు చెప్పేవారు కాదని, కనీసం అడగమని ప్రోత్సహించలేదని, వౌనంగా ఉండటంతో తాను కూడా అలాంటి విషయాలు ప్రస్తావించటం మానేసానని వెల్లడించారు. మితంగా ఆహారం తీసుకుంటారని, ఆహారంలో చేపలు ఉంటే ఇష్టపడతారని వెల్లడించారు.
మిమ్మల్ని ఎలాంటి వార్తలైనా షాక్‌కు గురిచేశాయా? అని అడిగితే ఎస్‌ఎన్‌సి కుంభకోణానికి సంబంధించిన వార్తలు దినపత్రికలోనూ, టివీలలో తన భర్తను దొంగగా చిత్రీకరిస్తూ స్లోగన్స్ చేస్తుంటే బాధకు గురయ్యాయని, ఆ సమయంలో టివీ ఆఫ్ చేసి రజనీకాంత్ సినిమా సినిమా చూడమని ఛానల్ మార్చారని చెప్పింది. మీరు ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కున్నారా? అని అడిగితే స్కూలుకు వెళుతున్న తన కుమారుడ్ని చంపేస్తామని బెదిరింపు ఉత్తరాలు కొంతమంది నుంచి వచ్చేవని వెల్లడించారు. ఖాళీ సమయంలో విజయన్ పుస్తకాలు చదువుతుంటారని, అలాగే తమిళ సినిమాలు ఎక్కువగా చూస్తారని వెల్లడించారు. తామిద్దరం దేవడ్ని నమ్మమని, కాని అత్తగారు దేవడ్ని నమ్ముతారని, మంచి ఆలోచనలే మంచి పని చేస్తాయనే నమ్మకం ఇద్దరికీ ఉందని ముగించారు.