మెయిన్ ఫీచర్

ప్రేమించడం తప్పుకాదు కానీ... ( నేడు ‘వాలెంటైన్స్ డే’ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమ.. ప్యార్.. లవ్..’ అన్న పదాలు ఈ కాలం యువత పెదాలమీద ఊతపదాలుగా మారినంత మాత్రాన- ‘ప్రణ యం’ అనేది ఈ నవతరంలోనే పుట్టిందని అనుకోవలసిన అవసరం లేదు. మనిషి పుట్టినపుడే ప్రేమ కూడా పుట్టింది. ప్రేమానుభూతిని, అందులోని మాధుర్యాన్ని, ఘాడతను, అది దూరమైనపుడు కలిగే వేదనను, బాధను వర్ణించి చెప్పిన ప్రేమికుల కథలు మన కావ్యాల్లో, ప్రబంధాల్లో, చరిత్రలో ఎన్నో ఉన్నాయి. పురాణాల్లో పద్మావతీ వెంకటేశ్వరుడు, రాధాకృష్ణులు, శివపార్వతులు, సుభద్రార్జునులు, చరిత్రలో అయితే లైలా-మజ్నూ, జూలియట్- సీజర్, భాగమతి-సలీమ్ వంటి ప్రేమికులు అనేకమంది వున్నారు. ప్రేమకోసం ప్రాణత్యాగం చేసి అమరులైనవాళ్లు, ప్రేమకోసం సర్వస్వం వదులుకుని అనురాగంతో ఏకమైన వాళ్ళు... ఇలా ఎందరో...!

విదేశీ సంస్కృతి పట్ల మోజు పెంచుకుంటున్న నేటి యువత ‘వాలెంటైన్స్ డే’ పేరిట ఏటా ఒక రోజున (్ఫబ్రవరి 14న) వేలం వెర్రిగా సంబరాలు జరుపుకుంటోంది. ఇలాంటి ‘ప్రేమ ఉత్సవం’ గత కాలంలోనూ ప్రేయసీ ప్రియుల మనసుల్లో నిత్యోత్సవంగా జరిగేది. ఎస్.ఎం.ఎస్‌లు, మెయిల్స్, గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవటం లేటెస్ట్ ట్రెండ్ అయితే ఆ రోజుల్లో ప్రణయ సందేశాలకు ప్రేమలేఖలు నడిచేవి. అందుకోసం రాజహంసలు రాయబారాలు నడిపితే- భావకుడైన ప్రేమికుడు చందమామ చేత, మేఘాల చేత కూడా ప్రేయసికి సందేశాలు పంపేవాడు. అదొక అద్భుతమైన ప్రేమభావన! ప్రేమలేఖల్లోని భాష, భావం అనుభూతి ప్రధానమై, దాన్ని అందుకున్న వారి మనసును గిలిగింతలు పెట్టేదిగా ఉండేది. ప్రకృతిలోని ప్రతి అందమైన వస్తువూ ప్రేమభావాలకు ఉపమానాలై- ప్రేమకు ఘాడతను, స్పష్టతను, పవిత్రతను చాటి చెప్పేవి. చల్లగాలి, చందమామ, పూల పరిమళం, వెనె్నల రాత్రులు, చంద్రకాంత వేదికలు, హంసతూలికా తల్పాలు ఇలా అందమైన ప్రకృతి, ఆనందాన్ని ఇచ్చే వస్తువులన్నీ ప్రేమికుల మనసుల్లో తమవంతు ఉద్దీపనాన్ని కలిగించేవి. మనసులోని ప్రేమభావనే మన్మథుడు మనోజుడై- సమయం చూసి పూల బాణాలు వేస్తూ ప్రేమతాపాన్ని మరింత రగిలించి ఆ విధంగా ప్రేమికులను ప్రోత్సహించేవాడు. అదొక అందమైన భావన! ఈ రోజుల్లో ప్రేమికులైన యువతకు ప్రేరణ కలిగించడానికి అశ్లీల పుస్తకాలు, సినిమాలు, నీలిచిత్రాలు, పోర్న్ సీడీలు దొరుకుతున్నాయి కదా..! అనుకునేవాళ్ళకు ఒక్కటే సమాధానం. అవి ఉద్దీపనలు కాదు, వాంఛను రగిలించే ఉత్ప్రేరకాలు. అది శృంగారం కాదు.. అశ్లీలం. వీటిని చూసి ప్రేమించే వయసు రాక ముందే ప్రేమలో పడేవాళ్ళు- దాన్ని ‘ప్రేమ’ అనుకోకూడదు. ఆకర్షణ, వ్యామోహం, వాంఛ అనుకోవాలి. ‘ప్రీ మెచ్యూర్డ్ లవ్’ అనుకోవాలి. అది నిజమైన ప్రేమ కాదు. యువ జీవితాలను తప్పుడు దోవలో నడిపించి ఆవేశపూరిత నిర్ణయాలతో అఘాతంలో పడేసే తెలిసీ తెలియని అపరిపక్వ ‘ప్రేమ కాని ప్రేమ’ అది. ‘ప్రేమ’ అనేది- ఆ కాలంలో అయినా, ఈ కాలంలో అయినా తప్పు అని ఎవ్వరూ అనలేదు. అనరు కూడా. అయితే- ఆ పేరుతో జరిగే మోసాలను, అన్యాయాలను, తొందరపాటుతనాన్ని, నేరాలను, ఘోరాలను మాత్రం అందరూ ఖండిస్తారు. నిజానికి ఇలాంటివాటి మూలంగానే ఈ రోజుల్లో ‘ప్రేమ’ అపఖ్యాతి పాలయింది. విదేశీ అలవాట్లు, ఫ్యాషన్లు, బహిరంగ ముద్దులు, ఆలింగనాలు, పెళ్లికి ముందు సెక్స్, డేటింగ్ వంటివి మన సంస్కృతికి, సంప్రదాయానికి తలవంపులు తెచ్చేదిగా ఉండటమే గాక ప్రేమికులు పెద్దల చేత మాటపడటానికి, సమాజం వాళ్ళని వేలెత్తి చూపించటానికి కారణమయింది. దీనివల్ల ఒకప్పుడు పవిత్రమైన భావంతో ప్రయోగింపబడిన ‘ప్రేమ’ అనే పదం- ఇపుడు వ్యామోహం, శారీరక కాంక్ష అన్న నీచార్థంలో వాడబడటం దురదృష్టకరం.
ఈ సందర్భంలో భావకవి రాయప్రోలు సుబ్బారావుగారు ప్రతిపాదించిన ‘అమలిన శృంగార’ తత్వాన్ని గుర్తుచేసుకోక తప్పదు. తన ‘తృణకంకణము’ అనే ఖండకావ్యంలో ఒక యువతి, ఒక యువకుడి పాత్రలను సృష్టించి, ఆ యువతి తన స్నేహితునికి తృణము (గడ్డి)తో చేసిన కంకణాన్ని బహూకరించినట్లు, మిత్రుడిని ‘ఓరుూ’ అని సంబోధించటంలోని హాయిని, ఇష్టాన్ని ప్రస్తావిస్తుంది. ‘శృంగారం’ అనే పదాన్ని రాయప్రోలు వారు పవిత్రప్రేమగా ప్రతిపాదించారు. ఇక, నిజమైన ప్రేమ లక్ష్యం ఎప్పుడూ పెళ్లి అయి ఉండాలి. ప్రేయసీప్రియులు వారి ప్రేమకు సార్థకత కల్పిస్తూ వివాహ బంధంతో ఒక్కటై నిండు నూరేళ్ళు భార్యాభర్తలుగా జీవితం కొనసాగిస్తే అలాంటి ప్రేమ సర్వదా ఆమోదయోగ్యం, అభిలషణీయం అవుతుంది. అలాకాకుండా వయసు జోరులో మోజు తీరాక- ఎవరి దారి వారిదే అన్నట్టు అయితే అది యువత వ్యక్తిత్వంపై మాయని మచ్చలాంటిదవుతుంది. రెండు హృదయాల ఆత్మీయ కలయికే ప్రేమ. అలాకాక బలవంతపు ప్రేమ.. అంగీకరించకుంటే లైంగిక దాడి, యాసిడ్ దాడికి పూనుకుని హింసకు పాల్పడటం, హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు. అందుకే ఈ రోజుల్లో ప్రేమ ఎంతగానో అపఖ్యాతి పాలవుతున్నది. ఈ పరిస్థితి తొలగిపోవాలంటే చదువుకోవలసిన వయసులో యువత చక్కగా చదువుకుని, తమ కాళ్లపై తాము నిలబడిన తర్వాత ప్రేమ గురించి ఆలోచించాలి. వయసు, మానసిక పరిపక్వత వచ్చాక ప్రేమించటంలో తప్పులేదు. ప్రేమలోకంలో విహరించడం కాదు, నిజ జీవితంలో పెళ్లి చేసుకుని, అదే ప్రేమతో కలకాలం కలసి జీవించగలిగితే మార్గదర్శకులు కాగలుగుతారు.

-కొఠారి వాణీచలపతిరావు