మెయిన్ ఫీచర్

అమ్మాయిల మనసు తెలుసుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన సాంప్రదాయాలకు, మేలైన కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టే భారతీయ సమాజంలో పెళ్లిళ్లకు సంబంధించి ఇప్పటికీ పెద్దల మాటే చెల్లుబాటవుతోంది. కుటుంబ పెద్దల ఇష్టప్రకారమే అధికశాతం వివాహాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు చూసిన వరుడితో మూడుముళ్లూ వేయించుకుని యువతులు దాంపత్యబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఉన్నత చదువుల్లో, ఉద్యోగరంగంలో మగువలు పోటీ పడుతున్నప్పటికీ పెళ్లి విషయంలో మాత్రం అధికశాతం మంది పెద్దల మాటను ఇప్పటికీ శిరసావహిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు పెద్దలు కూడా మారాలని, పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందు అమ్మాయిల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆధునికులు వాదిస్తున్నా, కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగానే ఉన్నందున తల్లిదండ్రుల మాటే శిరోధార్యమవుతోందని ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి పదిమంది వధువుల్లో కనీసం నలుగురు పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల్ని ఏ విధంగానూ ప్రశ్నించడం లేదు. కుటుంబ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల కారణంగా చాలా సందర్భాల్లో అమ్మాయిలు తమ మనోభావాలను బహిర్గతం చేయడం లేదు. తల్లిదండ్రుల నిర్ణయాలు తమకు ఎల్లప్పుడూ శ్రేయస్కరంగానే ఉంటాయని అధికశాతం మంది అమ్మాయిలు భావిస్తున్నారు. పెళ్లి విషయంలోనే కాదు, ఇంకా అనేక సందర్భాల్లోనూ అమ్మాయిలు పెద్దల అనుమతిని కోరుకునే పరిస్థితి ఇంకా కొనసాగుతోందని జాతీయ మానవాభివృద్ధి సర్వేలో తేటతెల్లమైంది. ‘నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్’ సంస్థ ఆ మధ్య జరిపిన అధ్యయనంలో కుటుంబ వ్యవస్థ, పెళ్లిళ్లు, మహిళల మనోభావాలకు సంబంధించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వైద్యుడి వద్దకు వెళ్లాలంటే- ప్రతి పదిమంది మహిళల్లో కనీసం ఎనిమిది మంది తమ ఇళ్లలో పెద్దల అనుమతి తీసుకుంటున్నారని తేలింది. తలపై ముసుగు ధరించే విషయంలోనూ పెద్దల ఇష్టమే తమకు వేదవాక్కని ప్రతి పదిమంది మహిళల్లో ఆరుగురు భావిస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి సందర్భంగా ప్రతి కుటుంబం సగటున 30వేల రూపాయలను కట్నకానుకల కింద ఖర్చు చేస్తోంది.
బాలికల అక్షరాస్యతను, మహిళాసాధికారతను గణనీయంగా పెంచాలని పాలకులు ఎనె్నన్నో పథకాలను అమలు చేస్తున్నా పరిస్థితిలో ఆశించినంత మార్పు రావడం లేదు. చదువు, ఉపాధి, పెళ్లి, ఆర్థిక స్వేచ్ఛ వంటి విషయాల్లో ఇంకా ఎన్నో అవరోధాలను మహిళలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కుటుంబ ఆదాయం, ఖర్చు, ఆరోగ్యం, ఆహారం, సామాజిక ప్రగతి వంటి అనేక కోణాల్లో అధ్యయనం చేయగా మహిళల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కులం, ప్రాంతం, లింగవివక్ష వంటివి ఇంకా కీలక పాత్ర వహిస్తున్నాయి. జాతీయ మానవాభివృద్ధి సర్వే సందర్భంగా దేశవ్యాప్తంగా 42వేల కుటుంబాల్లో పరిస్థితులను విశే్లషించగా, పెళ్లిళ్లు, ఆస్తిపాస్తుల క్రయవిక్రయాలు వంటి కీలక విషయాల్లో మహిళలకు స్వేచ్ఛ తక్కువగానే ఉన్నట్లు తేలింది. 2011-12 నాటి గణాంకాలను అధ్యయనం చేయగా యుక్తవయసు రాకుండానే యువతులకు పెళ్లిళ్లు చేస్తున్నట్లు వెల్లడైంది. 18 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకునే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. బాల్యవివాహాలను నిరోధించేందుకు చట్టాలెన్ని ఉన్నా, యువతుల మనోభావాలను తెలుసుకోకుండానే వారిని దాంపత్య బంధంలోకి నెడుతున్నారు. 2011-12లో పెళ్లిళ్లు చేసుకున్న మహిళల్లో 18 ఏళ్లు రాకుండానే మూడుముళ్లూ వేయించుకున్న వారి సంఖ్య 40 శాతం అని తేలింది. 2004-05లో ఇది అరవై శాతంగా నమోదైంది. పదునైన కొత్త చట్టాలకు భయపడి బాలికలకు పెళ్లిళ్లు చేసేందుకు వెనుకంజ వేస్తున్నా, 18 ఏళ్ల వయసులో ఎక్కువ మంది యువతులకు వివాహాలు జరుగుతున్నాయి. వీరిని బాలికలుగా పరిగణించలేక పోయినా, పెళ్లీడు రానివారిగానే భావించాలి. చదువు, ఉద్యోగం గురించి సొంత ఆలోచనలున్నప్పటికీ చాలామంది యువతులు పెళ్లి కారణంగా వాటికి దూరం కాకతప్పడం లేదు. మేనరికం సంబంధాలు మంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలాకుటుంబాల్లో అమ్మాయిలకు దగ్గరి సంబంధాల పేరిట యుక్తవయసు రాకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాలు, కర్నాటకల్లో దాదాపు ఇరవై శాతం పెళ్లిళ్లు దగ్గరి సంబంధాలేనని తేలింది.
పెళ్లి సంబంధం గురించి తమకు ఎలాంటి వివరాలు తెలియవని సర్వేలో 41 శాతం మంది మహిళలు చెప్పగా, పెళ్లికి ముందు వరుడి వివరాలు తెలుసునని 18 శాతం మంది అమ్మాయిలు చెప్పారు. ఉన్నత చదువులు, సంపాదన, పట్టణీకరణ ప్రభావం ఉన్న అమ్మాయిలు మాత్రమే పెళ్లి సంబంధం గురించి పెద్దల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అయితే పెళ్లి సంబంధం విషయంలో అమ్మాయిల మనోభావాలను తెలుసుకునే పరిస్థితి అంతగా లేదు. చదువుకున్న కుటుంబాల్లో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వివాహం విషయంలోనే కాదు, కుటుంబ నిర్వహణ విషయంలోనూ పెద్దలను అడిగాకే ఏ పనైనా చేస్తామని సర్వేలో అధికశాతం మంది మహిళలు చెప్పారు. గృహావసరాలకు ఏది కొన్నా పెద్దల అనుమతి తీసుకుంటామని వారు తెలిపారు. ఆస్పత్రికో, బజారుకో వెళ్లాలన్నా కుటుంబ పెద్దలకు ముందుగా చెబుతామని 60 శాతం మంది మహిళలు తెలిపారు. కుటుంబ వ్యవస్థకు, పెద్దల మాటకు విలువ ఇవ్వడం తప్ప- ఇది తమ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని వారు భావిస్తున్నారు. భద్రత దృష్ట్యా కొన్ని ఆచారాలు, పద్ధతులు అవసరమేనని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక, పెళ్లిళ్ల సందర్భంగా ఆడంబరంగా ఖర్చు చేయడం అన్ని కులాల్లో, మతాల్లో ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే 18 ఏళ్లలోపు వివాహం చేసుకున్నవారి సంఖ్య 49 శాతంగా ఉంది. దాదాపు 59 శాతం మంది యువతులు పెళ్లి సంబంధాల విషయంలో ఎలాంటి అభిప్రాయాలను బహిర్గతం చేయలేదు. యుక్తవయసు రాకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడంలో రాజస్థాన్, యుపి, ఎంపి, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తమిళనాడు, కేరళ, ఎపి, అస్సాంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. మహిళల వస్తధ్రారణకు సంబంధించి రాజస్థాన్, బిహార్, హర్యానా, యుపిల్లో కట్టుబాట్లు ఇంకా బలంగానే ఉన్నాయి. తమిళనాడు, ఎపి, ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి కట్టుబాట్లు తక్కువగానే ఉన్నాయి. 55 శాతం మంది మహిళలు వారి పేరిట బ్యాంకు అకౌంట్లను కలిగి ఉన్నారు. ఆస్తిపాస్తులకు సంబంధించి 19 శాతం మంది మహిళలు లిఖిత పూర్వకంగా హక్కులను కలిగి ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లాలంటే కుటుంబ సభ్యుల అనుమతి ఉండాలని 81 శాతం మంది, గృహోపకరణాలు కొనాలంటే పెద్దల అంగీకారం ఉండాలని 76 శాతం మంది మహిళలు అధ్యయనం సందర్భంగా చెప్పారు. పెళ్లి సమయంలో బైక్, టీవీ, ఫ్రిజ్, కారు వంటివి భర్తకు కట్నం కింద ఇస్తున్నట్లు 39 శాతం మంది తెలిపారు. పల్లెల్లో కంటే నగరాల్లోను, దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోను కట్నకానుకలు భారీగా ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

-లాస్య