మెయిన్ ఫీచర్

పిల్లల్ని ఆడుకోనిద్దాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో వయోభేదం లేకుండా అందరి జీవితాలూ ఉరుకులు, పరుగుల మయమే. ఎల్‌కెజి చదివే పిల్లలు సైతం ఆటపాటలకు నోచుకోకుండా పుస్తకాల భారాన్ని మోయక తప్పడం లేదు. చిన్నారుల్ని ఆడుకోవడానికి అనుమతిస్తే వారు చదువులో వెనుకబడిపోతారనే భ్రమలో పేరెంట్స్ వారిని కట్టడి చేస్తున్నారు. ఆటపాటలు అలవాటైతే తమ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేరని తల్లిదండ్రులు భావిస్తుంటారు.
పిల్లలు కూడా టీవీలో వచ్చే కార్టూన్ నెట్‌వర్క్, వీడియో గేమ్‌లకు అలవాటు పడిపోతున్నారు. దీంతో చిన్నారులకు శారీరక శ్రమ లేకుండాపోతోంది. ఎటూ కదలక పోవడం, జంక్‌ఫుడ్‌కు బానిసలు కావడంతో చాలామంది పిల్లలు ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు.
ప్రతిరోజూ ఎంతోకొంత సమయం ఆడుకునే పిల్లలు చదువులో ముందంజలో ఉంటున్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. టీవీ, కంప్యూటర్, స్మార్ట్ఫోన్‌తో కాలక్షేపం చేసే చిన్నారుల్లో బద్ధకం, ఊబకాయం తలెత్తుతున్నాయని, వారు చదువులో వెనుకబడిపోతున్నట్లు ‘జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) జరిపిన అధ్యయనంలో తేలింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 6,722 పాఠశాలల్లోని 24,486 మంది ఉపాధ్యాయులు, 1,88,647 మంది విద్యార్థులపై ఈ సర్వేను నిర్వహించారు.
రోజూ కొంత సమయం ఆటలాడుకునే విద్యార్థులు గణితం, సైన్స్, సోషల్ సైనె్సస్‌లో మంచి ప్రతిభను చూపుతున్నట్లు సర్వే పేర్కొంది. ప్రతిరోజూ ఎక్కువ సేపు టీవీ చూసే పిల్లలు చదువులో అంతగా రాణించడం లేదని గుర్తించారు. కంప్యూటర్‌లో, స్మార్ట్ఫోన్‌లో గేమ్స్‌కు అలవాటుపడిన పిల్లలు గణితంలో వెనకబడినట్లు పరిశోధకులు గమనించారు. వారానికి ఒకటి,రెండు సార్లు మాత్రమే టీవీ చూసే పిల్లలు చదువులో ముందంజలో ఉన్నారు. ఆటపాటలతో పాటు దినపత్రికలు చదివే వారు సైన్స్, సోషల్ స్టడీస్‌లో మంచి ప్రతిభను కనబరుస్తున్నారు.
ఎన్‌సిఇఆర్‌టి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తరచూ సర్వేలు నిర్వహిస్తున్నా, వాటి ఆధారంగా పిల్లలు, తల్లిదండ్రులను చైతన్యవంతం చేసేందుకు మాత్రం విద్యాశాఖ అధికారులు చొరవ చూపడం లేదు. ఆటపాటల వల్ల సమయం వృథా తప్ప పిల్లలకు ప్రయోజనం ఉండదని చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ అపోహపడుతున్నారు. ఎన్‌సిఇఆర్‌టి సర్వే ఫలితాలు అనేక వాస్తవాలను ప్రతిబింబిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదన్నది నిజం.
మార్కులు, ర్యాంకులు తప్ప పాఠశాలల్లో క్రీడలకు ఎలాంటి వసతులు ఉన్నాయన్న విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ర్యాంక్‌లపై యావతో పిల్లల్ని ఖరీదైన కార్పొరేట్ సంస్థల్లో చేర్పించేందుకు పేరెంట్స్ నానాపాట్లు పడుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించకపోతే పిల్లలకు భవిష్యత్ లేదన్న భావన తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు పాలకులు శ్రద్ధ చూపడం లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆటస్థలం లేని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు. ఈ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో కానె్వంట్లు, కార్పొరేట్ బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యార్థులు ఆటలాడుకోవడానికి బడిలో విధిగా కొంత సమయం కేటాయించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా అది అమలు కావడం లేదు. పాఠశాల టైమ్‌టేబుల్‌లో ‘డ్రిల్’కు, గేమ్స్‌కు తప్పనిసరిగా కొన్ని పీరియడ్స్ కేటాయించాలి. డ్రిల్ మాస్టర్లు, మైదానాలు, క్రీడా పరికరాలు ఉన్న పాఠశాలలు అతి తక్కువే. అయినా, ఈ విషయమై పాఠశాల యాజమాన్యాలను తల్లిదండ్రులు నిలదీస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. చదువుకు సంబంధించి ఒత్తిడి తగ్గించి, పిల్లల్ని ఆటపాటల్లో ప్రోత్సహిస్తేనే వారిలో మేధస్సు వికసిస్తుందనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. మానసిక వికాసం ఎంతగా పెరిగితే పిల్లలు అంతగా చదువులో రాణిస్తారు. చిన్నారులు చలాకీగా ఉన్నపుడే వారు ర్యాంకుల్లోనూ ముందంజలో ఉంటారు.

-పి.భార్గవరామ్