మెయిన్ ఫీచర్

శృతిమించుతున్న సినిమా భజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్ పడితే -నీ అంతటివాడు లేడంటారు. ఫట్‌మంటే -తప్పంతా నీదేనంటారు. ఇది సినీ ఇండస్ట్రీ రీతి. ఆర్టిస్టులు మొదలుకుని 24 క్రాఫ్టుల వారికీ ఇది వర్తిస్తుంది. అందుకే ఒకసారో, రెండుసార్లో వచ్చే పాల పొంగు చూసి మురిసిపోతే -నిండా మునిగినట్టే. ఆడియో వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్‌ని.. సక్సెస్ మీట్‌లలో సినీ డైరెక్టర్‌ని మోసేయడం సహజం. ఇక ఇప్పటి హీరోలైతే -ఏకంగా దర్శకుడికి ఆజన్మాంతం రుణపడి ఉంటాననే స్టేట్‌మెంట్లే ఇచ్చేస్తున్నారు. విడుదల తరువాత పొరపాటున ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర బొల్తాపడితే -రుణపడి ఉంటానన్న దర్శకుడికి తిరిగి డేట్స్ ఇచ్చే పరిస్థితే ఉండదు. ఇలాంటి అనుభవాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. ప్రాధాన్యత కలిగిన విభాగాల్లోని వారికి ఎదురయ్యే ఉంటాయి కనుక -దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసే నానుడిని పక్కా స్క్రీన్‌ప్లేతో ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు.
**
ఒకనాటి హీరోల నుంచి నేటి టెక్నీషియన్ల వరకు చాలామందికి చెక్‌బౌన్స్‌లు కేసులు -పరిశ్రమలో సర్వసాధారణగా ఎదురవుతూనే ఉన్నాయి. అయినా ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకంటే గ్లామర్ ప్రపంచం మరొకటి లేదు. ఫేమ్ తగ్గితే కనీస ఆహ్వానాలు కూడా రావు. ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక జీవితాలకు ప్యాకప్ చెప్పేసిన వాళ్ల కథలు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇమేజ్ తగ్గినా ఇండస్ట్రీపై మోజు తగ్గక దుర్భర జీవితాలు అనుభవించిన అగ్రతారలూ ఉన్నారు. ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయా? అంటూ జీవితంలో నటించుకుంటూనే జీవించేస్తుంటారు.
***
సినిమాను తన భుజాలపై మోసి ఫలితానికి తగ్గ ప్రతిఫలం పొందే దర్శకుడిని ఈనాడు హీరోలు మోసేయడం ఎక్కువైపోయింది. ఎందుకంటే వీరు కేవలం దర్శకులే కాదు, రైటర్స్ కూడా. అందుకే ఖరీదైన బహుమతులను సైతం అందిస్తూ -దర్శకులకు హీరోలు ఫ్యాన్‌లైపోతున్నారు. తమ కెరీర్‌లోనే బిగ్ హిట్ అని చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ హిట్‌ని అంకితం కూడా చేసేస్తున్నారు. ఇదంతా సగటు ప్రేక్షకుడికి తమాషాగా అనిపిస్తుంది. ఎందుకంటే హిట్స్.. ఫ్లాప్స్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు సహజం. ఇండస్ట్రీలో స్వశక్తికంటే సపోర్ట్ శక్తే బాగా పనిచేస్తుందన్నది నిజం. ఒక్కోసారి సపోర్ట్ ఎంత బలంగావున్నా స్టార్‌డమ్ రాని హీరోలూ ఉండొచ్చు. అది వేరే విషయం.
సినిమా అంటేనే 24 క్రాఫ్టుల సమష్ఠి కృషి. దానికి ప్రతి ఒక్కరూ ఆయా స్థాయిలో ప్రతిఫలం అందుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరికోసమో కాకుండా తమ నిలకడకోసం ఎవరికి వారే ప్రయత్నించడం సహజం. అలాంటప్పుడు ఒకరిని ఒకరు అతిగా పొగుడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అందరూ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి.. కెరీర్‌ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం జరుగుతుంది. ఈమధ్య కాలంలో సక్సెస్‌మీట్‌లు చూస్తుంటే అవి సినిమాకు హైపును పెంచేవిగా కాకుండా భజన కార్యక్రమంలా అనిపిస్తున్నాయి. సినిమా ఫట్‌మన్నా కూడా భజన గట్టిగా చేసేస్తున్నారు. అందుకే తెలివైన ప్రేక్షకుడు సినిమా ప్రమోషన్స్‌ని పక్కనపడేసి -వౌత్‌టాక్‌నే నమ్ముకుంటున్నాడు. వౌత్‌టాక్ మంచిగా వినిపించి సినిమా బావుందనిపిస్తే -చిన్న సినిమాకైనా పెద్ద పట్టం కడుతున్నాడు. గతంలోకి చూస్తే ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను రంజింపజేసాయి. రికార్డు కలెక్షన్లను రాబట్టాయి. అయినా ఇదంతా ఎవరికో ఒకరికి ఆపాదించబడలేదు. సక్సెస్‌ని అందరూ సమానంగా పంచుకున్నారు. ఆనాడు సక్సెస్‌మీట్‌లు లేకపోవచ్చు. కాని ఈనాటికి చెప్పాల్సి వస్తే ఇది అందరి కృషి అనే చెబుతారు. ఎవరికీ అతిగా భజన చేయరు.
అతి భజనకు గురైనవారు సక్సెస్ ట్రాక్ నుండి తప్పుకుంటే జీర్ణించుకోలేరన్న సత్యం నిరూపితమవుతూనే వుంది. ఈ కోవలో కొత్త కుర్ర హీరోలూ.. కొత్త దర్శకులు కనిపిస్తారు. టాలెంట్‌ని స్ట్రావేసి పీల్చేయడం యిండస్ట్రీలో నిర్మాతలకు అలవాటే. అందుకే ఫేమ్ ఉన్నవారి చుట్టూ భజన చేయడం కామనే. ఇదంతా నిజమనుకుంటే రాబోయే కాలం చుక్కలు చూపిస్తుంది. అందుకే ఆచితూచి గ్లామర్ ప్రపంచంలో అడుగులేయటం మంచిది. ఎవరి పని వారు చిత్తశుద్ధితో చేస్తే ఎవరికి దక్కాల్సిన ప్రతిఫలం వారికి దక్కడం ఖాయం. అయినా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికికోసం కష్టపడరన్న సంగతి వారికి తెలియంది కాదు.
ఇక -కలెక్షన్లను కోట్లలో అనౌన్స్ చేయడం, రికార్డులు బద్దలైనట్టు చెప్పుకోవడం పరిశ్రమలో పరిపాటిగా మారినా.. బయ్యర్లకు చుక్కలు చూపించిన సినిమాలు లేకపోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే, లోగొంతులో వినిపించే సమాధానం -పబ్లిసిటీ స్టంట్. పబ్లిసిటీ లేకపోతే ఇక్కడ మనుగడ ఉండదు. అందుకే హడావుడి ఓ రేంజ్‌లో చేయక తప్పని స్థితి. దీనిలో భాగమే భజన కార్యక్రమం కూడా. ఋణపడిపోవడాలు... తల్లిదండ్రులకు అంకితమిచ్చేయడాలు.. కెరీర్‌లో బిగ్‌హిట్స్‌గా చెప్పుకోవడాలు వంటివి సినిమాకు హైపు పెంచడం కంటే సినిమా టీమ్‌లో అతి విశ్వాసం పెంచేస్తుంది. తర్వాత అందరూ చిక్కుల్లోపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తీరులో అగ్ర హీరోలు ఒక్కరికే మినహాయింపు లభిస్తుంది. తప్పదు మరి అనుకుంటే -అనుభవించడమే మరి.

మెతుకు పట్టుకుంటే చాలు.. అన్నం ఉండికిందో లేదో తెలుసుకోవడానికి అన్నది తెలుగు నానుడి. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో వినిపించే భజన చాలు -బాక్సాఫీస్ దగ్గర సినిమా ఉంటుందో ఊడుతుందో తెలుసుకోవడానికి అన్నది ఆడియన్స్ చెబుతోన్న మాట. అతి భజన తెలుగు సినిమాకు చేటు తెచ్చేదిలానే కనిపిస్తోంది. ప్రేక్షకుడి తీర్పునకు ముందే -ఆడియో వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్‌ని.. సక్సెస్ మీట్‌లలో సినీ డైరెక్టర్‌ని మోసేయడం.. హీరోలైతే దర్శకుడికి ఆజన్మాంతం రుణపడి ఉంటాననే స్టేట్‌మెంట్లు చూస్తుంటే ఎటుపోతున్నాం అన్న సందేహాలు ముసురుతున్నాయ.

-పోలిశెట్టి

-పోలిశెట్టి