మెయిన్ ఫీచర్

బుడతడి విద్యాదానం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు అనగానే టీవీలో ఎపుడూ కార్టూన్ నెట్‌వర్క్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, పేరెంట్స్ తిడతారన్న ఒత్తిడికి లోనై చదవడం.. వంటివి మనకు వెంటనే గుర్తుకొస్తాయి. అయితే, ఆ కుర్రాడు మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాడు. పేదవర్గాలకు చెందిన తన వయసు చిన్నారులకు పాఠాలు చెబుతూ ‘టీచర్ అవతారం’ ఎత్తుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. పదకొండేళ్ల వయసులోనే ఉపాధ్యాయుడిగా మారిన ఆనంద్‌కృష్ణ మిశ్రా ఎంతోమంది పేదపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. తన తల్లిదండ్రులు, బంధుమిత్రుల ప్రోత్సాహంతో ఈ కుర్రాడు తరచూ మురికివాడలకు వెళుతూ అక్కడి పిల్లలకు చదువు చెబుతున్నాడు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంటున్న ఆనంద్ తల్లిదండ్రులు అనూప్ మిశ్రా, రీనా పోలీసుశాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆనంద్ తన పేరెంట్స్‌తో కలిసి మహారాష్టల్రోని ఓ ఆలయానికి వెళ్లాడు. అక్కడ గుడ్డి వెలుతురులో ఒక బాలుడు శ్రద్ధగా పుస్తకాలు చదువుతుండడాన్ని ఆనంద్ గమనించాడు. ఆలయంలో భజన ప్రారంభమైనపుడు అక్కడికి వచ్చిన ఆ కుర్రాడు భజన పూర్తికాగానే తిరిగి దూరంగా వెళ్లిపోయి మళ్లీ చదువుకోవడం ప్రారంభించాడు. ఆనంద్ ఆ బాలుడి వద్దకు వెళ్లి అతడి వివరాలు తెలుసుకున్నాడు. సమీపంలోని ఓ దుకాణానికి ఆ బాలుడ్ని తీసుకువెళ్లి అతడికి కావాల్సిన పుస్తకాలను ఆనంద్ కొని ఇచ్చాడు. ఈ సంఘటన ఆనంద్ మనసుపై చెరగని ముద్ర వేసింది. లక్నో చేరుకున్న తర్వాత కొన్ని మురికివాడలకు వెళ్లి అక్కడి పిల్లల దుస్థితి చూసి, వారికి సాయం చేయాలని సంకల్పించాడు. ఎంతోమంది పేదపిల్లలు చదువుకు దూరమై బాలకార్మికులుగా పనిచేయడం అతడ్ని ఆవేదనకు గురిచేసింది. దీంతో రోజూ సాయంత్రం ఆ పిల్లల వద్దకు వెళ్లి ‘బాల్ చౌపాల్’ పేరిట చదువు చెప్పడం ప్రారంభించాడు. వారికి గణితం, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్‌లను బోధించేవాడు. ఆసక్తికరమైన కథలు, ఆటపాటలతో బోధన సాగడంతో ఆనంద్ వద్ద పాఠాలు నేర్చుకునే పిల్లల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ కుర్రాడి నుంచి స్ఫూర్తిని పొంది ఇప్పటివరకు సుమారు ఏడు వందలమందికి పైగా పిల్లలు వివిధ పాఠశాలల్లో చేరారు. ప్రతిరోజూ పాఠాలు ప్రారంభించే ముందు ‘హమ్ హోంగే కా మ్యాబ్..’ (మేము ప్రతికూల పరిస్థితులను సైతం జయిస్తాం ...) అనే పాటను పిల్లలు పాడతారు. జాతీయ గీతంతో బోధన పూర్తి అవుతుంది. ఈ గీతాల వల్ల పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఆనంద్ అభిప్రాయం. ఆనంద్ చేపట్టిన ‘బాల్ చౌపాల్’ పట్ల అతడి స్నేహితులు కూడా ఆకర్షితులై తరగతుల నిర్వహణలో సహాయపడుతున్నారు. పేదింటి పిల్లలను బడిబాట పట్టించేందుకు ‘్ఛలో పడో అభియాన్’ను కూడా వీరు ప్రారంభించారు. ఆర్థికంగా బాగున్నవారు కనీసం ఒక పేద విద్యార్థికి సాయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ‘్ఛలో బహెన్ స్కూల్ చలో’ (రా సోదరీ.. పాఠశాలకు వెళదాం) అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మురికివాడలు, కుగ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ఆనంద్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. ఈ సేవలను గుర్తించి ఇప్పటికే ఎన్నో సంస్థలు పలు అవార్డులతో ఆనంద్‌ను సత్కరించాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యాపరంగా మన దేశం త్వరలోనే అద్భుత ప్రగతి సాధిస్తుందని ఆనంద్ చెబుతుంటాడు.

-పి.భర్గవరామ్