మెయిన్ ఫీచర్

మహిళలెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెలుగు చిత్ర నిర్మాతలు సినిమాలు రూపొందించే పద్ధతి మారిపోతోంది. ఆకాశంలో సగం నిండితేనే మిగతా సగం కూడా నిండుతుంది. మహిళా ప్రేక్షకులు లేని థియేటర్లలో నడిచే చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ అందదు. వారిని దృష్టిలో పెట్టుకొని నిర్మించిన చిత్రాలకు కనకవర్షం కురుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు మహిళల ఇతివృత్తాలతో చిత్రాలను నిర్మించేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా తిలోదకాలిచ్చారు. మహిళలు కేవలం టీవీలలో వచ్చే సీరియల్స్‌కే అంకితమైపోవడంతో మహిళాప్రేక్షకులను విస్మరించి చిత్రాలను కేవలం యువత కోసమే నిర్మించే సంప్రదాయం టాలీవుడ్‌లో నెలకొంది. ఇది ఏ వెలుగులకు ప్రస్థానం అని పరిశ్రమలో ఉన్నవారందరూ ఆలోచిస్తున్నారు. ఎప్పటిదాకా ఈ పద్ధతి సాగనుంది?
గతంలో సినిమాలు మహిళల పేర్లతో నిర్మించేవారు. అన్నపూర్ణ, శాంతి, శారద, విమల, జ్యోతి లాంటి పేర్లతో కుటుంబ సంబంధాలతో, మంచి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఆదర్శకుటుంబం లాంటి చిత్రాలు మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పండంటి కాపురం, కోడలు దిద్దిన కాపురం, సంసారం ఒక చదరంగం, వింత కాపురం, ఇల్లాలు, దేవత లాంటి చక్కని పేర్లతో చిత్రాలను నిర్మించి స్ర్తిల సెంటిమెంట్‌ను పండించేవారు. ఉండమ్మా బొట్టుపెడతా, బంగారు గాజులు, చిట్టిచెల్లెలు, అమ్మ, రక్తసంబంధం, అమ్మరాజీనామా, భార్యాభర్తలు లాంటి పేర్లతో మహిళలను థియేటర్లకు ఆకర్షించేవారు. కానిస్టేబుల్ కూతురు, తాశీల్దారుగారి అమ్మాయి, కలెక్టర్ జానకి, అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి చిత్రాలు, మహిళల కథలే ప్రధానంగా వున్న ప్రతిఘటన, ప్రతిధ్వని, ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలు వచ్చాయి. కుటుంబ కథలతో అశ్లీలం, బూతు పదాల్లేకుండా దర్శక నిర్మాతలు చిత్రాలను నిర్మించడానికి ప్రయత్నించేవారు. హీరోహీరోయిన్లు అందమైన చీర, పైట, చక్కని జడ, తలలో పూలతో తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించేవారు. హీరోయిన్లు తమ ఆకట్టుకునే నటనతో హీరోతో పోటీపడి నటించేవారు. సంభాషణలు పలికే తీరు, పసందైన నటన, హావభావాలు ప్రేక్షకుల మనస్సు రంజింపజేసేవి. సినిమా కథ మనింట్లో సభ్యులమధ్య జరిగే కథలా అనిపించేది. చిత్రంలో ప్రేమ, వినయం, హాస్యం, భక్తి, త్యాగం, వేదన, ధర్మం, నీతి, మార్పు లాంటి ప్రతి అంశాన్ని పాత్రలలో చూపేవారు. జుగుప్స కలిగించే వస్తధ్రారణ, దయ్యంలా విరబోసుకుంటున్న పిచ్చి హెయిర్ స్టయిల్ అప్పట్లో కనిపించేవి కాదు. నాయికను సంప్రదాయ మహిళగా కట్టుబొట్టుతో నిండుగా ఉంచేవారు కనకనే అప్పటి చిత్రాలకు మహిళా ప్రేక్షకులు తమ పిల్లాపాపలతో వచ్చేవారు. వాల్‌పోస్టర్లపై మహిళా చిత్రం, మహిళలను విశేషంగా ఆకర్షిస్తున్న చిత్రం అంటూ ప్రకటించేవారు. మహిళా ప్రేక్షకుల ఆదరణ లేని సినిమాలు రెండో రోజే వెళ్లిపోయేవి.
సినిమా అంటే వినోదం, విజ్ఞానం, వికాసంగా తలపోసే అలనాటి దర్శక నిర్మాతలు, సినిమాను వ్యాపారపరంగా భావించలేదు కనుకే చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. సినిమా ప్రదర్శిస్తున్నా, ఘన విజయం సాధించినా, పరాజయం పాలైనా వాల్‌పోస్టర్ల ద్వారా దిన, వారపత్రికల ద్వారా ప్రేక్షకులకు తెలిసేది. విలువలు, సంప్రదాయాలను స్ర్తిపాత్రల ద్వారా సమాజానికి తమ చిత్రాల ద్వారా గౌరవభావం కలిగేలా చిత్రీకరణ చేసేవారు. ఇప్పుడు అర్థంపర్థంలేని పేర్లు, దానికో తోక (ట్యాగ్‌లైన్) తగిలిస్తున్నారు. టీ.విలలో వచ్చే ఆడియో వేడుకలు చూసినా, అందులోని పీల గొంతుల పాటలు విన్నా, భయంకర సంగీత ధ్వనులు వినలేక, నాయికల జానెడు బెత్తెడు వేషధారణ చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. ముఖ్యం గా కథానాయికల హెయిర్ స్టయిల్, సంభాషణల తీరు, హావభావాలు చూపలేని, అందమైన ముఖాలను మహిళా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. భాష రాని ఆయా హీరోయిన్ల కృత్రిమ నటనకు వెగటుపుట్టి మహిళా ప్రేక్షకులు థియేటర్‌వైపు రావడం మానుకున్నారు. నేడు సినిమా వారికి కావలసింది కోట్ల పారితోషికమే తప్ప చిత్రం చెబుతున్న విలువలు లేవని ప్రేక్షకులు గ్రహించారు. అందుకే థియేటర్ల వైపుకు రావడం మానుకున్నారు.
సినిమా జయాపజయాలు నిర్ణయం కాకముందే రెండుమూడు వేల థియేటర్లలో తమ సినిమాను విడుదల చేసి, గబగబా పెట్టుబడి ప్లస్ లాభం వస్తే చాలు అనుకుంటున్నారు. సినిమా ఆడకపోయినా లాభం వచ్చింది కాబట్టి, విజయం సాధించినట్లేనని భావించి, భుజాలు తడుముకుంటున్నారు. వారంలోపే బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. అంతమాత్రాన మహిళా ప్రేక్షకులు వస్తారా? రారన్నది వాస్తవం! వందరోజుల ఘనవిజయం కన్నా వంద కోట్ల రాబడి వస్తే చాలు అని సినీ రంగం భావిస్తే ఇటువంటి చెత్తచిత్రాలు చూడడం దండగే. అనవసరపు ఖర్చు అని మహిళాప్రేక్షకులు భావిస్తున్నారు. అలాంటి చిత్రాలను ఏమాత్రం ఆదరించలేకపోతున్నారు.
కుళ్లు రాజకీయాలు, పగ, ప్రతీకారం, హింసలతో కూడిన చిత్రాలను మహిళా ప్రేక్షకులు ఆదరిస్తారా? స్ర్తి పాత్రలకు ఇప్పటి చిత్రాలలో ప్రాముఖ్యం ఉన్నదా? విలువ గౌరవం ఆయా పాత్రలకు ఇస్తున్నారా? సన్నివేశాల నిండా అందాల ఆరబోత, కోతి గెంతులు తప్ప నాయికలుగా పనికిరారని ప్రేక్షకులేనాడో గ్రహించారు. అభిమానులు, పనిపాటాలేని (రాని) యువత తప్ప వేరే ప్రేక్షకులు థియేటర్లలో కనిపించరు. సంవత్సరానికి ఒకటో రెండో మంచి చిత్రాలు వస్తే పిల్లాపాపలతో మహిళలు థియేటర్లవద్దకు వెళ్లడానికి టికెట్లధర భూతం భయపెడుతోంది. ఆ ధరను చూసి భయపడి థియేటర్ వైపునకు వెళ్లడం లేదు. సినీరంగ ప్రముఖులు కోట్లు గడిస్తూ, పైరసీ పైరసీ.. అంటూ అరుపులు, కేకలు మానేసి, టిక్కెట్ల ధర తగ్గించే ఏ చిన్నప్రయత్నమైనా చేస్తున్నారా? ఒక కుటుంబంలో ఐదువందలతో సినిమా చూడడానికి వస్తారా? అలా రాలేరు, చూడలేరు. కాబట్టే 30 రూపాయల పైరసీ సీడీ చూస్తున్నారు. ఇలాంటి తప్పు ప్రేక్షకుడు ఎందుకు చేస్తున్నాడు? అనేది సినీ కళాకారులే ఆలోచించాలి.
తెలుగు చిత్ర రంగం స్వర్ణయుగంలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, జగ్గయ్య, శోభన్‌బాబు, గుమ్మడి, యస్వీఆర్, కృష్ణంరాజు, చలం, పద్మనాభం, రాజనాల, కాంతారావు లాంటి హేమాహేమీలైన నటులు ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించేవారు. సావిత్రి, అంజలి, జమున, వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, జయప్రద, కాంచన, జానకి, బి.సరోజాదేవి, కృష్ణకుమారి, జయలలిత, రాజసులోచన, గీతాంజలి, రమాప్రభ, శారద లాంటి నటీమణులు చీరకట్టుతో అచ్చతెలుగు సంప్రదాయబద్ధమైన గృహిణిలా పాత్రలకు జీవం పోసేవారు. కథాబలం, చక్కని సంగీతం, మురిపించే సాహిత్యం, తియ్యని గాత్రధారులు వెరసి స్వర్ణయుగ చిత్రాలను శాశ్వతం చేశారు. జీవం ఉన్న అలాంటి చిత్రాలను చూసిన మహిళాప్రేక్షకులు పీనుగుల్లాంటి చిత్రాలను చూడగలరా? ఆదరించగలరా? స్ర్తి పాత్రధారులను సభ్యతగా చూపలేకపోవడం మరో మైనస్. పురుష ప్రేక్షకులే చీదరించుకునే విధంగా మహిళలను చిత్రాలలో చూపిస్తున్నారు. వారు చేసే చేష్టలు చూసి మగవారే తలలు వంచుకొని, పోస్టర్ చూడటానికి కూడా గతుక్కుమంటున్నారు. ఇలాంటి చిత్రాలను మహిళలు చూడగలరా? గతిలేక విధిలేని పరిస్థితులలో వనితలు ఇంట్లోనే వుంటూ వీధి నాటకాల కంటే తక్కువస్థాయి ఉన్న టీవి సీరియల్స్‌ను చూడడానికి అలవాటుపడిపోయారు. టీవిలలో ఎంత చెత్తవున్నా తప్పక చూసేస్తున్నారు. సీరియళ్లకు అలవాటుపడిన మహిళాప్రేక్షకులు నేటి చచ్చుపుచ్చు చెత్త చిత్రాలకు విడాకులిచ్చేశారు. థియేటర్లకు రావడం మానుకున్నారు. కుటుంబ కథలతో సెంటిమెంట్ పండిస్తూ స్ర్తిల పాత్రలను సభ్యతగా చిత్రీకరించి, టికెట్ ధరలు తగ్గిస్తేతప్ప నేటి చిత్రాలకు మహిళలు రారు కాక రారు! హాలీవుడ్ నాయికలే మన నాయికలకన్నా పద్ధతిగా కనిపిస్తున్నారు. వీలైనంత జుగుప్సాకరమైన కాస్ట్యూమ్స్ వెతుక్కుని మరీ ధరిస్తున్నారు. అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు కనుకే ఇలాంటి ఉపద్రవం ముంచుకొచ్చింది. స్ర్తిల గౌరవ మర్యాదలు కాపాడుతూ వారికి నచ్చిన విధంగా చిత్రాలను నిర్మిస్తే తప్ప థియేటర్లలో కనిపించడం సాధ్యంకాదు. ఈ పరిస్థితి మారే అవకాశాలు బహుశా ఇప్పట్లో ఉండేలా లేవు. మహిళాప్రేక్షకులకు దిక్కెవరు?

- మురహరి ఆనందరావు