లోకాభిరామం

మగువ పొలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసు చరిత్రలో ప్రవరుడికి కొండలలో తిరుగుతూ ఉంటే ఆడమనిషి వాసన తగిలిందట! అదెట్లాగో నాకు అర్థం కాలేదు. ఒకానొక సినిమా పేరు సెంట్ ఆఫ్ ఎ వుమెన్! ఆశ్చర్యమేమంటే ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ అంతకన్నాలేదు. ఒక గుడ్డి ముసలతను, ఒక కుర్రవాడు కథను ముందుకు నడిపిస్తారు.
లోకాభిరామంలో నేను అప్పుడప్పుడు సినిమాల గురించి కూడా రాస్తున్నాను. ఇక్కడ ఈ కూడా అన్న మాటను అందరు తప్పక గమనించవలసి ఉంది. నాకు ఒకప్పుడు ఉన్నట్టు సినిమాల మీద మోజు ఇప్పుడు లేదు. హాలుకు వెళ్లి సినిమా చూచే ఓపిక అస్సలు లేదు. అట్లా సినిమా చూచి దశాబ్దాలయి ఉంటుంది. అయినా నేను సినిమాలు పోగు చేసుకుని, కొని కూడా చూచాను. ఎందుకు అని మీరు అడగకముందే జవాబు చెపుతాను. నేను మేనేజిమెంట్ ట్రైనింగ్‌లో ఉదాహరణలుగా సినిమాలలోనుంచి చిన్న ముక్కలు చూపించేవాడిని. ఆ క్రమంలోనే ఈ ‘మగువ పొలుపు’ సినిమా కూడా చూచాను. దీన్ని గురించి నాకు చెప్పింది నా కుమారుడు.
సినిమా గురించి చెప్పడం అంటే అందులోని కథను చెప్పడం అస్సలు కానే కాదని నాకు గట్టి అభిప్రాయం. నేను ఈ కాలంలో ఆ కాలంనాటి కథతో నడిచిన ఒకానొక సినిమా గురించి రాశాను. ఒక యువ మిత్రుడు నా వ్యాసం చదివాడు. వెదికి తెచ్చుకుని ఆ సినిమా చూచాడు. అతనికి కూడా అది నచ్చింది. ఆ సంగతి నాతో చెప్పాడు. అదీ సంగతి! కనుక ఇప్పుడు కూడా ఈ చిత్ర రాజం గురించి నాకు తోచిన సంగతులు మాత్రం మీ ముందు ఉంచుతాను. సినిమా పేరు వినగానే ఇందులో ఒకరెవరో అమ్మాయిలను వేటాడుతు తిరుగుతాడని అనిపించక మానదు. సినిమాలో హీరో అంటూ ఉంటే ఇందాకే చెప్పినట్టు అతను ఒక పెద్ద వయసు మనిషి. కల్నల్ స్లేడ్ అనే ఈ పాత్రలో అల్-పచీనో అనే నటుడు జీవించాడు అనడంకన్నా, మరెంతో ఎక్కువ చేసినట్టున్నాడు. ఆ సంగతి తరువాత గానీ, ముందు మరొక విషయం. ఈ సినిమాకు ‘ఎ’ సర్ట్ఫికెట్ ఇవ్వలేదు గానీ, పెద్దలు తోడులేనిదే పిల్లలు చూడకూడదన్నారు. అంటేగింటే ఈ సినిమాలో బూతు ఉంది, కానీ లేదు అని అర్థం. సినిమా మొత్తంలో ఆడవాళ్ల గురించి గట్టి చర్చలే ఉంటాయి. అక్కడక్కడ బూతు మాటలు కూడా ఉంటాయి. స్లేడ్ ఒక సాని ఇంటికి వెళ్లి కూడా వస్తాడు. మనకు ఆ ఇంటి తలుపు కూడా చూపించరు. బూతు లేని బూతు సినిమా అంటే ఇట్లా ఉండాలని ఒక ఉదాహరణ.
సినిమా ఒక బడిలో మొదలవుతుంది. అక్కడ ఆకతాయి పిల్లలు ఉంటారు. వాళ్లు ప్రిన్సిపల్‌ని ఘోరంగా అవమానిస్తారు. ఆ పని చేసింది ఒకరయితే, అందరూ అనుకున్నట్టే వ్యవహారంలో చిక్కుకునేది మాత్రం అమాయకుడైన ఒక బీద అబ్బాయి. అతను మంచివాడు, అంతకన్నా అందగాడు. అయితే నోట్లో వేలుపెడితే కొరకాలని తెలియని అమాయకుడు. ఆ అమాయకుడిని బడిలోనుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది. వానికి రకరకాల ప్రలోభాలను చూపించి తప్పు చేసినట్టు ఒప్పుకోమంటారు. వాడు అమాయకంగా తన దారిన తాను పోతుంటాడు. మీరు గమనించారో లేదో నేను ఆ అబ్బాయిని ‘వాడు’ అంటున్నాను. ఆ అబ్బాయి నా కొడుకేమో అన్నంత అభిమానం నాకు ఆ పాత్రమీద కలిగిందని వినయంగా ఒప్పుకుంటున్నాను. ఇక అక్కడ కథ కొంచెం పక్కకు జరుగుతుంది. రంగం మీదకి ఒక రాక్షసుడు ప్రవేశిస్తాడు. ఆ రాక్షసుడు స్వభావానికి రాక్షసుడు నటనలో కూడా రాక్షసుడు. ఆ రాక్షసుడు సినిమా చివర సీన్‌లో చేసిన ఒక ఉపన్యాసాన్ని నేను నా శిక్షణ తరగతులలో వాడుకున్నాను. ఎదుటివారిని ఎదరించి అదరగొట్టే పద్ధతిలో నిజాలు చెప్పడమంటే ఆ సీన్‌లో పచీనో మాటలనుంచి నేర్చుకోవాలి.
కల్నల్ స్లేడ్ ఒకప్పుడు వెలుగు వెలిగిన సైన్యాధికారి. ఆశ్చర్యంగా అతనికి కళ్లు పోయాయి. ఆ దెబ్బతో అతనికి ప్రపంచం మీద కసి మొదలవుతుంది. పెళ్లాం పిల్లలు లేని మనిషి. ఒకానొక నీస్ ఇంట్లో అతను వుంటాడు. ఆ నీస్ కుటుంబం వారు అవసరంగా కొంతకాలంపాటు ఎక్కడికో వెళ్లవలసి వస్తుంది. అప్పుడు మన బడి అమాయకుడు కల్నల్‌కు సాయంగా వుండే ఏర్పాటు జరుగుతుంది. ఇక కథ ఊపందుకుంటుంది. నేను కథ గురించి ముక్క కూడా మీకు చెప్పదలచుకోలేదు. కానీ సినిమా గురించి చెప్పక వదలిపెట్టనూ తలచుకోలేదు. స్లేడ్‌కు కళ్లున్నాయి. చూస్తున్నట్టే ఉంటాయి. కానీ వాటికి చూపు వుండదు. కళ్లు లేనివారు అంటే చూపులేని వారు చివరికి కదిలే పద్ధతి కూడా ఒక రకంగా ఉంటుంది. అది గమనించి వారి దృష్టిలోపం గురించి మనం చటుక్కున పట్టేసుకోవచ్చు. అల్ పచీనో ఈ సినిమాలో చూపులేని మనిషిగా చూపించిన కదలికలు అతనికి అకాడెమీ అవార్డును ఇప్పించాయి. లేక బహుశా చివరి సీన్‌లో అతను చేసిన ఉపన్యాసం కారణంగా అతనికి ఆ అవార్డు ఇచ్చారేమోనని నా అనుమానం.
ముందే మిలటరీ మనిషి. అందునా తనంత తాను బతకడం వీలులేకుండా పోయింది. ఎవరిమీదనో ఆధారపడవలసి వచ్చింది. ఆ బాధ, అందుకు సంబంధించిన కసి స్లేడ్ ప్రతి కదలికలోను అల్ పచీనో మనకు కళ్లకు కట్టి చూపిస్తాడు. కథ రాసినవారు, డైలాగులు రాసినవారు కూడా అందుకు తగినట్లే తమ తమ శక్తియుక్తులను పూర్తిగా ప్రయోగించారు. సినిమా వివరాలు చూద్దామని ఇంటర్నెట్‌లో వెదికితే నాకు వికీపీడియాలో ఆ సినిమాలోని ఒక సీన్ సీనంతా కనిపించింది. ఇంకొంచెం వెదికితే మొత్తం సినిమా మాటలు దొరికాయి. అంటే సినిమాలో మాటలు అంత బాగున్నాయని అర్ధం. ఒకానొక సీన్‌లో స్లేడ్ తనకు సాయంగా వున్న ఛార్లీని నీ దగ్గర గడియారం ఉందా? అని అడుగుతాడు. అబ్బాయి అమాయకంగా టైమ్ చెపుతాడు. స్లేడ్ కోపంగా ‘నేను గడియారం గురించి అడిగాను. టైమ్ చెప్పమనలేదు’ అంటాడు. అంటే మీకు ఆయన తీరు కొంత అర్ధమై ఉంటుంది. మరొకచోట ఇద్దరూ కలిసి కారు దిగుతారు. పాపం అనుకుని ఛార్లీ పెద్ద మనిషికి చేయి అందివ్వబోతాడు. స్లేడ్ మాత్రం ఆ చేతిని తోసేసి తన కర్ర సాయంతో నడక సాగిస్తాడు. మీకు స్లేడ్ తీరు గురించి మరింత అర్ధమై ఉంటుంది. అయినా కాకున్నా మీకు ఈ సినిమా గురించి కొంచెం ఆసక్తి మొదలై ఉంటుంది. నేను సినిమా గురించి చెప్పను. ఈ మాట మరోసారి చెపుతున్నాను.
స్లేడ్‌కు చనిపోవాలని కోరిక. అది బతుకుమీద కసితో మాత్రమే. తాను ఎవరిమీదా ఆధారపడకూడదని అతని కోరిక. చనిపోయేలోగా ఇష్టమైన ఒకటి రెండు పనులు చేయాలని కోరిక. వాటి కోసమే సినిమా ముందుకు నడుస్తుంది. అలా నడుస్తూ ఉంటే స్లేడ్‌కు చార్లీమీద పుత్రభావం కలుగుతుంది. వాడిని (!) కాపాడాలన్న కోరిక బలపడుతుంది. చావు మానుకుని మళ్లీ వెనక్కు వస్తాడు. ఈ లోపల అతనిలోని మంచి మనిషిని మన ముందు వుంచడానికి ఒకటి రెండు సీన్లు ఎదురవుతాయి. ఒకచోట ఈ తండ్రి కొడుకూ కాని తండ్రీకొడుకులు ఒక పెద్ద హోటల్‌లో వుంటారు. అక్కడకు ఒక అందమైన అమ్మాయి వస్తుంది. స్లేడ్‌కు సెంట్‌లను గుర్తించి అమ్మాయిల గురించి చెప్పడం అలవాటు. అందంగా వున్న ఆ అమ్మాయిని వెళ్లి పలకరిస్తాడు. ఆమెతో కలిసి అద్భుతంగా డాన్స్ చేస్తాడు. అంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయితో నేస్తం చేయవచ్చుగదా అని చార్లీకి చెపుతాడు. మన అమాయకుడికి మరి అంతదూరం తోచనే తోచదు. ఇక్కడ నాకు మా నాన్న గుర్తుకు వచ్చాడు. అందమైన లంబాడీ అమ్మాయిని మా నాన్న నాకిచ్చి పెళ్లి చేయాలని సరదాగా చేసిన ఆలోచన గురించి నేను లోకాభిరామంలో ఎక్కడో ఒక చోట చెప్పాను. నాకిక ఆ సినిమా నచ్చిందంటే ఆశ్చర్యం ఏమన్నా ఉందా? నాకు ఆ సినిమాలో మా నాన్న కనిపించాడాయె!
మొదట్లో స్లేడ్ తానుంటున్న నీస్ ఆమె కుటుంబం గురించి కొన్ని భయంకరమైన మాటలు అంటాడు. కానీ చివరికి ఇంటికి తిరిగివస్తూ అక్కడే ఆడుకుంటున్న ఒక మనవడిని తలనిమిరి పలకరిస్తాడు. సినిమా కథ గడిచిన ఆ కొంత కాలంలో రాక్షసుడు మనసు మారిపోయిందని ఒక్క డైలాగు కూడా లేకుండా కేవలం ఒక చేతి కదలికతో చెప్పించాడు ఆ సినిమా డైరక్టర్. సినిమా అంటే మరి అట్లా ఉండాలి. ‘ఐ లవ్ యూ’ చెపుతావా లేక తన్నమంటావా? అనే ఈ కాలపు సినిమాల గురించి నేను మాట్లాడకుండా వుంటే బాగుంటుంది. లేదంటే, గ్రహాంతర వాసులు, దయ్యాలు మాత్రమే ఇంగ్లీషుసినిమాలతో సహా అంతటా ఎదురవుతాయి. కథగాని, నవలగాని చివరికి సినిమా గానీ మానవ సంబంధాలను గురించి చెపితే తప్పకుండా బాగుంటుంది. ఆ చెప్పే తీరు మొరటుగా కాక, మరో రకంగా ఉంటే మరింత బాగుంటుంది. అట్లా బాగున్న సినిమాలల్లోకి ఈ ‘సెంట్ ఆఫ్ ఎ ఉమెన్’ చేరుతుంది. నేను ఈ సినిమాను ఎన్నిసార్లు చూచానో గుర్తులేదు. వీలైతే త్వరలోనే మరోసారి చూస్తాను. ఎందుకు చూస్తాను? కళ్లు ఉన్నా చూపు లేనట్టు ఆ కళ్లను కదిలించిన ఆ మహానటుడిని మెచ్చుకోవడానికి చూస్తా. ఈ ప్రపంచంలో గొప్పతనం ఎక్కడైనా ఉంటే దాన్ని గుర్తించనినాడు మనం ఎందుకు పనికిరానివాళ్లం అనిపించుకుంటాం. నాకు ఆ వర్గంలో చేరాలని లేదు!

కె.బి. గోపాలం