లోకాభిరామం

ప్రేమ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లు సినిమాలో హీరో హీరోయిన్లు ఉన్నచోట నుంచి కదలకుండా చేతులు మాత్రం కదిలిస్తూ యుగళ గీతం, అందునా ప్రేమ పాట పాడేవారు. ముఖంలో భావాలు మాత్రం కనిపించేవి. ఆ తరువాత తెలుగు సినిమా నాయకా నాయికలు ప్రేమ పాట పాడాలంటే మైసూరు బృందావన్ గార్డెన్స్ వెళ్లకుండా కుదిరేది కాదు. అక్కడికి పోవడానికి వీలుగాకపోతే చెట్లు, గట్లు పట్టుకుని పరిగెత్తుతూ పాడుకునేవారు. ఆ పద్ధతీ పోయింది. ‘ఐ లవ్ యూ’ చెపుతావా లేక తన్నులు తింటావా? అటొక డజను, ఇటొక డజను హంగుదారులను వెంట వేసుకుని హీరో హీరోయిన్లు కుప్పిగంతులు వేస్తూ పాడుకునే రోజులు వచ్చాయి. వాళ్లు పాడుతున్న పాట తెలుగేమో తెలుసుకోవాలంటే బాగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది.
‘రావోయి చందమామ’ అంటూ వెనె్నల కోయిలల మీద పెట్టి ప్రేమలు చెప్పుకోవడం ఒకప్పటి పద్ధతి. ‘నువ్వంటే నాకెందుకో అంత ఇది, నీవన్నా నాకెందుకో అదే ఇది!’ అనే పద్ధతి పాటలొచ్చాయి. అవి సులభంగా అర్థమయినందుకేమో అందరికీ నచ్చాయి. ‘్థల్లానా థిల్లానా నా కసి కళ్ల కూన!’ ‘అరబిక్ కడలందం’ అంటే ఏమిటో ఎవరికీ తెలియలేదు. వినడానికి ఊపు బాగుంది కదా అని విన్నారు. కానీ వాటిని విన్నంత సులభంగానే మరచిపోయారు.
సినిమా ప్రేమ గీతం సంగతి ఇవాళ ఎట్లాగుందో వివరిస్తే అందరికీ కోపం వస్తుందేమో. ‘నీవు వస్తానంటే, నేను వద్దంటానా?’ అన్న పాట గుర్తుంది. నాకు నచ్చిన సినిమా క్షణక్షణంలో ప్రేమ పాటే లేదు. ఆ తరువాత నేను సినిమాలు చూడడం లేదు. అయినా సరే ఆరోగ్యం బాగుండడం లేదు. అంటే నష్టపోతున్నది నేనేనని అర్థమయింది.
సినిమా డుయ్యట్టు (డ్యూయెట్) అనగా యుగళ గీతం, అంటే ప్రేమ పాట సంగతి అట్లాగుంటే నాకు సినిమాకు ఎక్కని ఒక జంట పాట తరచూ గుర్తుకువస్తూ ఉంటుంది. రోజులకొద్దీ మెదడులో తుమ్మెదలాగ రొద పెడుతూ ఉంటుంది. బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం పాడిన (పేర్లు తిరగేసి చెప్పాలేమో? పాట రత్నం మొదలు ఎత్తుకుంటారు. పురుషాహంకారమా?) మన ప్రేమ అనే పాట అది.
ఈ పాటలో హద్దులు మీరిన ఆవేశం, పొంగులు వారే ప్రేమ కనిపించవుగాక కనిపించవు. పాట నిండా సంస్కృతం సమాసాలు ఉంటాయి. మురళిగారు బడికి పోకుండానే సంగీత సాహిత్య ప్రపంచాలను ఉర్రూతలూగించగల పండితులయ్యారు. ఆయన తమిళ్‌లో కూడా కీర్తనలు రాసి పడేశారు. ఈ పడేశారు అన్న మాటకు చక్కని ఉద్దేశం ఉంది. ఆయన ఒకప్పుడు ఎప్పుడో పాడిన పాటను గట్టిగా పట్టుకుని మళ్లీ మళ్లీ పాడరు. పాత పాటను జ్ఞాపకం చేస్తే ‘పాడే ఉంటానోయ్’ అనడం స్వయంగా విన్నాను. ఆయన రాసిన పాటలను మరెవరో పాడాలిగాని కలకాలం తానే పట్టుకుని వేలాడడం ఆయన పద్ధతి కాదు. ఇదంతా అప్రస్తుతం కానీ ఆయనకు మన ప్రేమ అన్న పాట అర్థమయ్యే ఉంటుంది. ఇక గోపాలరత్నంగారు తన పాటలోని గొప్పతనం కూడా తనకు తెలియని అమాయకం మనిషి, అయినా పాడాలి గనుక పాట అర్థం అడిగి తెలుసుకున్నారేమో తెలియదు. పాటలోని మాటలను ఇద్దరూ పలికిన తీరు బాగా పరిశీలిస్తే తేడా కనిపిస్తుంది. పాట విని ఆనందించాలిగానీ, ఇంతగా పరిశీలించడం తప్పు అని నాక్కూడా తెలుసు.
ఎన్నిసార్లు చెప్పినా పాట మన ప్రేమ అన్న మాటతో మొదలవుతుంది. ప్రేమించుకుందాం రా అనే పద్ధతి ఈ పాటలో ఎక్కడా ఉండదు. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో కూడా చెప్పుకోరు. చాలా ఆలోచించిన ప్రేమికులుగా ఇద్దరూ కలిసి మన ప్రేమ ఏమవుతుంది అని కొంచెంసేపు మదనపడతారు. సస్య సౌందర్య భూములలో ప్రభవించి ప్రభవించి నమ్రమరుసీమమగునో, కమ్ర సుమధామమగునో అన్న మాటలు అనుపల్లవిగా లెక్కించుకోవాలి. మీకేమయినా అర్థమయిందా? కాకున్నా సరే పాట విన్నవాళ్లెవరూ పట్టించుకున్నట్లు లేదు. మన ప్రేమ పంట పొలాలలో పుట్టిపుట్టి చివరికి ఎడారిగా మిగులుతుందా? లేక చక్కని పూదోట అవుతుందా అని అడుగుతున్నట్టున్నారు.
చరణాలు అంటూ ఉంటే అవి రెండూ కూడా అనుపల్లవి నడకలోనే నడుస్తాయి. మొదటి చరణం అనదగ్గ మాటలు గమనించి చూడండి. కల్లోలినీ తరంగములన్ పయనించి పయనించి శీర్ణ సికతాద్రి అగునో, పూర్ణ కలశాబ్దియగునో, ఏమిటది? అదేనండి, మన ప్రేమ! వాళ్లిద్దరూ కలిసి ఒకరినొకరు అడుగుతున్నారు. కల్లోలిని అంటే మామూలుగా చెప్పుకుంటే ఒక నది. కానీ అన్ని నదులను కల్లోలిని అనకూడదు. పెద్దగా అలలు, హోరు ఉన్న నది మాత్రమే కల్లోలిని. కనుకనే తరంగాల గురించి చెపుతున్నారు. వీళ్ల ప్రేమ ఆ అలల మీద పడి కొట్టుకుపోతుందట. మరి అది చివరికి చెదిరిపోయిన ఇసుకమేట అవుతుందా? లేక నిండుగా ఉన్న సముద్రం అవుతుందా? అని ప్రశ్న. సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలిగానీ చివరికి మరెవరినో వెళ్లి అర్థమడిగేలా ఉంటే అది ఎవరికి నచ్చుతుంది? కానీ ఈ పాట చాలామందికి నచ్చింది. ఓ కాలంలో చాలామంది దీన్ని పాడుకున్నారు.
పనిలో పనిగా పాట చివరి భాగాన్ని కూడా చూద్దాం. కాల గాఢాగ్ని కీలల తపియించి తపియించి దగ్ధ తరుకాండమగునో, ముగ్ధ మధు భాండమగునో అంటారు ఈ చరణంలో. ప్రేమ నిప్పులలో కాలిపోతున్నదట. అది చివరికి కాలిన చెట్టు బోదె అవుతుందా? లేక తేనె కుండ అవుతుందా? అని ప్రశ్న.
మొత్తానికి ఒక విషయం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరన్నా ప్రేమించుకుంటే ‘చాలా బాగుంది, చక్కగా పెళ్లి చేసుకుని కలకాలం హాయిగా బతకండి’ అనే పద్ధతి తక్కువన్నమాట. ఎందుకోగానీ ప్రేమించుకున్నాం అనగానే పెద్దవాళ్లందరూ కత్తులు పుచ్చుకుని, కత్తులకన్నా వాడి మాటలను అరువు తెచ్చుకుని ఆ జంట వెంటపడతారు. అప్పుడిక అమ్మాయి, అబ్బాయి అన్యాయంగా పాటలు పాడుకుంటారు. ఈ పాట రాసింది ఎవరో నాకు తెలియదు. తెలిసిన వాళ్లు చెప్పి పుణ్యం కట్టుకోండి. ఈ పాట పాడిన జంట మాత్రం బాగా తెలివిగలవాళ్లని అర్థం. నిజంగా పాడిన మురళీ, రత్నంగారు కూడా నిజంగా తెలివిగలవాళ్లు. పాట చేతనయిన వాళ్లు. ఎంత బాగా పాడారో చెప్పలేను.
ఇంత చెప్పిన తరువాత కొంతమందికి ఈ పాట వినాలని అనిపించవచ్చు. అడిగిన వారికి లేదనకుండా అన్నీ అందించే అంతర్నేత్రం అనే జాలం అనే ఇంటర్‌నెట్ ఉండనే ఉంది. మిగతా సెర్చ్ ఇంజన్స్‌ను మరిపింపజేసిన గూగులమ్మ ఉండనే ఉంది. అందులోకి వెళ్లి ‘మన ప్రేమ, బాల మురళి’ అని కొట్టి చూడండి. పాట దొరికి తీరుతుంది. దొరకలేదు అనండి, అప్పుడు ఆ రెండు పేర్లతోపాటు లోకాభిరామం అనే మాటను ఇంగ్లీషులో కొట్టండి. నేరుగా నా బ్లాగ్ లింక్ దొరుకుతుంది. మరింత ఎక్కువగా ఫలితాలు కనిపిస్తే సెర్చ్ మాటలలో డ్యుయెట్స్ అనే ఇంగ్లీషు మాట కూడా కొట్టండి. అప్పుడు నా బ్లాగ్‌లో రెండు యుగళ గీతాలను ప్రపంచానికి అందించిన పోస్ట్ దొరుకుతుంది. అందులో పాటలను వినడానికి వీలు కూడా దోరుకుతుంది. వినండి, ఆనందించండి. ఈ రెండు పాటలను నేను 2010 సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రపంచానికి అందించాను. వందలాది మంది వాటిని విన్నారు. బ్లాగ్‌లోని అంకెలు అంటే లింకులు తెగలేదు. ఈ పాటతోబాటు అన్నమయ్య రాసిన మరొక యుగళ గీతం కూడా ఆ పోస్టులో వినవచ్చు.
నా మట్టుకు నాకు ఈ పాట మెదడులో తిరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పాటలను నేను హాంటింగ్ మెలొడీస్ అంటాను. నా మెదడులో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పాట రొద పెడుతూ ఉంటాయి. అయితే వాటి సంఖ్య ఎక్కువగా లేదు. మీరు వింటానంటే, చదువుతానంటే మరో పాట గురించి మరోసారి చెపుతానేమో!

కె.బి. గోపాలం