లోకాభిరామం

ఒక్కసారి.. వెనుకకు తిరిగి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు నాకు ఒక పెద్ద పని అప్పగించారు. ఆ పని గురించి వాళ్లు చెప్పకుండానే నా మనసులో కొంతకాలంగా ఆలోచనలు సాగుతున్నాయి. అనుమానాలు కూడా సాగుతున్నాయి. పెద్ద సంస్థ వాళ్లు చెప్పినందుకు చిత్తశుద్ధిగా ప్రయత్నం మొదలుపెట్టాను. కొన్ని నెలల పాటు కష్టపడ్డాను. కానీ అప్పజెప్పిన పనిని నిజంగా బాగా చేయాలంటే అందుకు అవసరమయిన సమాచారం నాకు అందదని అనుమానం కాదు కదా, గట్టిగా అర్థమయింది. నేను ఆ ప్రయత్నం మానుకున్నాను. ఫలితంగా ఒక మిత్రుని కోపానికి కూడా గురయినట్టు ఉన్నాను. రాసే వాళ్లు రాస్తున్నారు, చదివే వాళ్లు చదువుతున్నారు. ఈ రెండూ కష్టమయిన పనులే. ఈ సంగతి నాకు ఈ మధ్యన మరీ మరీ అర్థమవుతున్నది. చాలా తెలుసుననుకున్న భావం వెనుకకు తగ్గుతున్నది.
వయోధిక పాత్రికేయుల సంఘం వారు చాలా చురుకుగా పని చేస్తూ ఉంటారు. అందరూ పెద్దవాళ్లే అయినప్పటికీ, వాళ్ల ఉత్సాహం అంటువ్యాధిలాగ అందరికీ అంటుకునేంత బాగా ఉంటుంది. వాళ్లు తమ సంఘం పెట్టి పదేండ్లయిన సందర్భంగా ఒక సెమినార్ చేశారు. అందులో నన్ను కూడా ఒక పత్రం చదవమన్నారు. ఈసారి కూడా నాకు అనుమానంగానే ఉంది. అయినా సరే మళ్లీమళ్లీ ఓడిపోవడం ఇష్టంలేదు. నిజానికి ఆ సమావేశం జరగవలసిన రోజున నాకు మరేదో పని ఉన్నట్టుంది. తప్పించుకోవాలని చూచాను. పెద్దలు వరదాచారిగారు, వ్యాసం రాసి పంపితే వాళ్లు చదువుకుంటాము అన్నారు. ఆయన స్వయంగా ఫోన్ చేసి మీరు వస్తే బాగుంటుంది అన్నారు. ఇక నాకు తప్పించుకోవాలని అనిపించలేదు. తప్పకుండా వెళ్లాలని ఆ వ్యాసం రాయడానికి తంటాలు పడ్డాను. విషయం గురించి చెప్పవలసింది చాలా ఉందని తెలుసు. అయినా వీలయినంత చోటికి రాసుకు వెళ్లి చదివాను. పెద్దలంతా బాగుందన్నారు. విచిత్రమేమిటంటే, సెమినార్‌లో పాల్గొనే వారంతా నాలాగే రాసుకు వెళ్లి పత్రాలు చదవాలి. వాటన్నిటినీ కలిపి పుస్తకాలుగా వేస్తారు కూడా. కానీ చాలామంది రాయకుండా అక్కడికక్కడ తమ ఉపన్యాసాలను సాగించడం నాకు కొంత ఆశ్చర్యాన్ని, మరి కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది.
మళ్లీ చెపుతున్నాను, రాత అంటే సులభం కాదు. ఎంతమంది గమనించారో తెలియదు గానీ లోకాభిరామం మొదలయి గత వారంతో మూడు సంవత్సరాలు ముగిసింది. నా పల్లె బతుకు, పుస్తకాలు, సంగీతం, పరిచయాలు, అనుభవాలు, ప్రయాణాలు, సినిమాలు, ఎనె్నన్నో విషయాలను గురించి రాస్తూనే ఉన్నాను. ఇందులో చాలా మటుకు నాస్టాల్జియా అంటే గతం గుర్తులు ఎక్కువగా వస్తున్నాయని నాకు కూడా తెలుసు. అయితే వాటిని పెద్ద, పిన్న అందరూ బాగున్నాయని అనడంతో ఉత్సాహంగానే ముందుగు సాగుతున్నాను. ఏ వారానికి ఆ వారం విషయం నిర్ణయించుకోవడం ఒక పెద్ద సమస్య. ఎంతమంది గమనించారో తెలియదుగానీ ఒక క్రమం పాటించాలని చాలాకాలం ప్రయత్నించాను. ఈ మధ్యన ఆ పద్ధతి కాస్త పక్కదారి పట్టిందని కూడా నాకు తెలుసు.
ఏదో రాయాలనుకుంటాను, ఆ విషయం గురించి ఆలోచన మొదలవుతుంది. నేను రాస్తున్నది ఏదో మహా కావ్యమయినట్టు ఇక ఆనాడు నిద్రపట్టకుండా రాత్రి కూడా ఆలోచనలు ముసురుకుంటాయి. ఒకదాని నుంచి మొదలు మరొకటిగా ఎనె్నన్నో ఆలోచనలు, ఎనె్నన్నో అంశాలు మనసు తెర మీద మారుతూ కనిపిస్తాయి. వాటిలో కొన్ని మాత్రమే బాగా వెలుగుతాయి. అవి మరి గుర్తుండాలి. రాత్రి కూడా లేచి ఒక కాగితం ముక్క మీద రెండు మాటలు రాసి బల్ల మీద పెట్టుకోవడం మామూలుగానే జరుగుతుంది. ఇంటికి వచ్చిన ఒక సాహితీ మిత్రుడు చాలాకాలంగా నా కాలమ్ గురించి మెచ్చుకుంటూ మాట్లాడతాడు. అనుకోకుండానే అతను నా రాతబల్ల దగ్గర గోడ మీద గుచ్చిన కాగితాలను గమనించాడు. వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు. అందులో ఒక పట్టిక లాంటిది ఆయనను ఆకర్షించింది. ఇదేమిటని అడిగాడాయన. రాయవలసిన విషయాలు కాక రంగాల గురించి, అవి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే క్రమం గురించి వేసుకున్న ప్రణాళిక అని చెప్పక తప్పిందికాదు. అతను కనబరిచిన ఆనందం నాకు ఇవాళటి వరకు గుర్తుండి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంత ఆలోచిస్తావు గనుకనే నీవు రాసేది బాగుంటుంది అని ఆయన మర్మం లేకుండా మెచ్చుకున్నాడు.
పత్రిక వాళ్లు లేదా రచయిత కాలమ్ కొరకు ఒక విషయాన్ని నిర్ణయిస్తే చాలా సులభంగా ఉంటుంది. ఆ విషయానికి రూపాన్ని కూడా నిర్ణయిస్తే మరింత సులభంగా ఉంటుంది. నేను చాలాకాలంగా సైన్స్ కాలమ్స్ నడిపించిన వాడినే. పత్రిక వారి సలహా మేరకు ఒక పద్ధతిని నిర్ణయిస్తే ఆ వరుస అలా కొనసాగేది. అక్కడ కూడా ఒకే రంగం గురించి, ఒకే విషయం గురించి ఎక్కువగా రాస్తానేమోనని అనుమానం ఉండేది. ఎంత జాగ్రత్తపడ్డా ‘నీవు అమెరికా సైన్స్ గురించి ఎక్కువ రాస్తావు’ అనిపించుకోక తప్పింది కాదు. అమెరికా నుంచి ఎక్కువ సైన్స్ వచ్చినందుకు అట్లా జరిగి ఉంటుంది. కానీ ఆ తరువాత మాత్రం ఆ పద్ధతి గురించి కూడా జాగ్రత్త పడ్డాను. ఇక లోకాభిరామంలో రావలసిన సంగతులను గురించి పత్రిక వారు నాకు ఎటువంటి ప్రతిబంధకమూ పెట్టలేదు. ఇది ఒక గొప్ప గౌరవం. ఒక సమస్య కూడా. వచ్చే విషయాలలోని వైవిధ్యాన్ని నిలబెట్టే బాధ్యత పూర్తిగా నాదే. కనుకనే రాయడం ఎంత సులభమో అంత కష్టంగా ఉంటుంది. విచిత్రంగా ఒక విషయం ఎంచుకున్నప్పుడు అది మరీ విస్తృతంగా ఉండి ఈ ఒక్క పేజీ నుంచి ముందుకు సాగి మరింత పెరుగుతుంది. ఒకే విషయం గురించి వరుసబెట్టి ఎక్కువ వారాలు రాస్తే అందులో చిన్న చిక్కు ఉంది. అందరూ అదే పనిగా ప్రతి వారం లోకాభిరామం చదువుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మాధ్యమాలలో అనుభవం ఉన్న మనిషిగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను ఈ వారం మొదలు పెట్టిన అంశాన్ని వచ్చేవారం కూడా కొనసాగిస్తే ఈ వారం చదవని వాళ్లు వచ్చే వారం తికమక పడకూడదు. ఒకే విషయం గురించి సీరియల్‌గా రాసినా ఎక్కడికక్కడ రియల్‌గా తోచాలి.
లోకాభిరామంలో చెపుతున్నవన్నీ నూటికి నూరుపాళ్లు నిజాలు. నాకు ఈ రచనలో ఆదర్శంగా ఒకరిద్దరు ఉన్నారని చెప్పడానికి ఏ మాత్రం సందేహించను. తాను కనిపించకుండా ప్రపంచం గురించి రాయడంలో తిరుమల రామచంద్రగారు నాకు అసలు ఆదర్శమూర్తి. అలాగే ఆచంట జానకిరామ్‌గారు రాసిన తీరు కొంచెం వేరు. ఆయన తన అనుభవాలను మరీ బలంగా చెప్పారు. అందులో కొన్ని కథలుగా తోచాయి. నిజంగానే కట్టుకథలున్నాయని అన్నవాళ్లు కూడా ఉన్నారు. కథనంలో ఉండే ఆకర్షణ ఆచంట జానకిరామ్‌గారి లాగ మరొకరికి వీలు కాదని నాకు గట్టి నమ్మకం.
నేనయినా, మరొకరయినా చెప్పే విషయం పాఠక మిత్రులకు బాగా అందాలని ప్రయాస తప్పదు. మెప్పికోళ్లు ప్రత్యక్షంగాను, పత్రిక ద్వారాను అందుతుంటే భుజాలు పొందే పద్ధతి మాత్రం లేదు. కొన్ని విషయాలు చాలామందికి ఎక్కలేదని నాకు తెలుసు. అయినా నేను చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు చెప్పక తప్పదని చెపుతున్నాను. చెపుతుంటాను. ఆ విషయాలను నేను చెప్పకపోతే బహుశా మరొకరు చెప్పలేరు. బహుశా అన్న మాట అవసరం లేదు. నా అనుభవాలు నావి. నా అభిప్రాయాలు నావి. నా బతుకు నాది. చిత్రంగా వీటన్నిటినీ పాఠక మిత్రులకు అందించే అవకాశం నాకు అందడం అది నిజంగా గొప్ప విషయం.
నండూరి రామకృష్ణాచార్యులుగారు నా గురించి పద్యం రాసి అందులో నన్ను ‘గోపాల విజ్ఞాని’ అన్నారు. సైన్స్ చదువుకున్న వారంతా విజ్ఞానులేనా అన్నది నా ప్రశ్న. సైన్స్‌ను తలకెక్కించుకుని ఒంటికి పూసుకుని, కంటికి అద్దంగా పెట్టుకుని ప్రపంచమంతా ఆ అంశం గురించి నాలాగే ఆలోచించాలని కష్టపడుతున్నాను గనుక నన్ను ఆయన గోపాల విజ్ఞాని అని ఉంటారు. ఆయన ఆ మాట అని చాలా ఏళ్లు గడిచాయి. నాకు ఇవాళటికి ఆలోచించే గుణం పెరుగుతున్నది తప్ప తరగడం లేదు. సైన్స్ గురించి చదవడం, ఆలోచించడం మరీ ఎక్కువయింది. నన్ను నేను గోపాల విజ్ఞానిగా చెప్పుకోగలిగే చోటికి చేరాలని నా తపన.
భయపడకండి, లోకాభిరామం కొనసాగితే నిజంగా మరింత ఆసక్తికరంగా ఉండే ప్రయత్నం మనసారా చేస్తాను. ఇందులో మీలాంటి పాఠక మిత్రులు నాకు దారి చూపగలిగితే మరింత సంతోషంగా ముందుకు సాగుతాను.

కె.బి. గోపాలం