లోకాభిరామం

మళ్లీ సైన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహ్వకొక రుచి, పుర్రెకొక బుద్ధి అన్నారు. ఎందుకన్నారో నాకు తెలియదు. బహుశా నా గురించే అని ఉంటారు. నా పుర్రెకు ఒకటి రెండు విషయాలు మాత్రమే తెలుసు. తెలిసింది పుర్రెలోని మెదడుకు. దాన్ని మరి బుర్ర అంటారేమో! సొరకాయ బుర్రలో లోపల ఖాళీ ఉంటుంది. పుర్రె అనే బుర్రలో బుర్ర ఉంటుంది. ఆ బుర్రలో పదార్థం ఉంటుంది. అందులో ఆలోచనలు ఉంటాయి! కన్యాశుల్కంలోని వెంకటేశానికి చేగోడీలు, గేదె పెరుగు తెలుసు. విజయగోపాలం అనే వాడికి సైన్స్ తెలుసు. అంటే, వెంకటేశానికి చేగోడి తినడం మాత్రమే తెలుసు. అదే పద్ధతిలో గోపాలానికి సైన్స్ గురించి ఆలోచించడం మాత్రమే తెలుసు. అది కూడా చాలా మందికి తెలిసినట్టు లేదు. లేకుంటే సైన్స్ గురించి మాట్లాడమని వాడిని నాందేడ్‌దాకా ఎందుకు పిలుస్తారు?
పెద్దవాళ్లు సైన్స్‌ను పట్టించుకోరు. అది పిల్లలకు సంబంధించినది అంటారు. పోనీ, పిల్లలు పట్టించుకుని చదువుతారంటే, దానికీ అడ్డం తగులుతారు. నిజానికి తల్లిదండ్రులు, పంతుళ్లకు ముందు సైన్స్ తలకెక్కించవలసిన అవసరం ఉంది. మామూలు తల్లిదండ్రులను గురించి ఏమీ అనడానికి లేదు. సైంటిస్టులు, సైన్స్ వివిధ స్థాయిలలో పాఠాలుగా చెపుతున్న వారు ఒక విచిత్రమయిన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ల సైన్స్ క్లాస్ రూంలోనే అంతమవుతుంది. అక్కడి నుంచి బయటకు వస్తే, అందరిలో ఒకరిగా మారి సైన్స్ అనే ధ్యాస లేకుండా బతుకుతూ ఉంటారు. ఈ ద్వంద్వ వైఖరితో చాలా చిక్కుంది. మామూలు వాళ్లతోపాటు వీళ్లు కూడా ఈ ప్రపంచంలో అందరూ అయితే ఇంజనీర్లు, కాదంటే డాక్టర్లు కావాలంటారు. అందరూ సైన్స్‌ను వాడుకునేవాళ్లే అయితే, మరి కొత్త సైన్స్‌ను పుట్టించేవాళ్లు ఎవరు? ఉన్న సైన్స్‌ను కొనసాగించేవాళ్లు ఎవరు? ఈ ప్రశ్న చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు తోచనే తోచదు. కనుక సైన్స్ చదువుకునేవాళ్లు కరవయ్యారు. ఇప్పటికే మన దేశంలో మంచి సైన్స్ జరగడం లేదని ప్రపంచమంతా కోడి అయి కూస్తున్నది. అయినా మనకు పట్టదు. ఎవరు చెప్పారో తెలియదుగానీ, కేంద్ర సర్కారు వారికి ఈ సంగతి తలకెక్కింది. అంటే, నిజంగా నిర్ణయాలు చేయగలిగిన వారికి సంగతి అర్థమయింది. ఇన్‌స్పైర్ అని ఒక కార్యక్రమం మొదలయింది. పదవ తరగతిలో నిజంగా మంచి మార్కులు సంపాయించి ఇంటర్ చదువుతున్న పిల్లలను ఒకచోట చేర్చి మనసు మార్చే ప్రయత్నాలు అక్కడ జరుగుతాయి. పెద్ద సైంటిస్టులు, సైన్స్ తలకెక్కిన నాలాంటి వాళ్లు అక్కడ పిల్లల ముందు మాట్లాడతారు. పిల్లలతో మాట్లాడతారు. పిల్లల మధ్యన చేరి ఆడతారు. ఏం చేసినా మొత్తానికి సైన్స్‌లోని సరదా పిల్లల మెదడులోకి ఎక్కాలి.
నాందేడ్ యూనివర్సిటీకి ఈ ప్రయత్నం మీద నేను ఒకటిరెండుసార్లు వెళ్లాను. అక్కడికి నిజంగా పెద్ద సైంటిస్ట్‌లు అంతా వచ్చారు. వాళ్ల మధ్యన తిరుగుతూ నేనూ పిల్లలతో తలపడ్డాను. కార్యక్రమం ముగిసే సమయంలో చేసిన సర్వేలో గోపాలం అనేవాడు అందరికన్నా బాగా పిల్లలను ఆకర్షించినట్లు పిల్లలే చెప్పారని అక్కడి పెద్దలు తరువాత నాకు చెప్పారు. అది ఎట్లా వీలయిందని నేను ఆలోచించాను.
నిజంగా నిపుణులయిన పెద్దవాళ్లకు తమ రంగం గురించి మాత్రమే మరీ లోతుగా తెలిసి ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కణ్ణన్ గారిని చూస్తే, గుడికి వెళుతున్న అయ్యవారులా ఉంటారు. ఆయన లెక్కల గురించి చెప్పడం మొదలుపెడితే, అందరూ ముక్కున వేలు వేసుకోవడం కూడా మరచిపోతారు. ఆయన పక్కన మరి నేనేమిటి? జవాబు చెప్పేస్తున్నాను. సర్కస్‌లో గుండెలు తీసిన ఫీట్లు చేసేవారి మధ్య బఫూన్‌లు కూడా ఉంటారు. ఆ సమావేశంలో నేను బఫూన్‌ను! పిల్లల ముందు పిల్లిమొగ్గలు వేశాను. నా శరీరానికి అంతటి శక్తి లేదు గనుక, మాటలతో, మ్యాజిక్ లాంటి ట్రిక్కులతో, మరిన్ని పనులతో నిజంగానే మొగ్గలు వేశాను. చప్పట్లు కొట్టించడానికి నాకంటే గొప్పవాళ్లు లేరని అక్కడివారు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. నేను చేసిన సైన్స్ ట్రిక్కులు మ్యాజిక్‌లకన్నా బాగా పండాయి! మ్యాజిక్ కూడా ఇటువంటి ట్రిక్కులేనని పిల్లలకు అర్థమయింది.
నాకు ఒక సంగతి గట్టిగా తెలుసు. సర్కస్‌లో బఫూన్ కేవలం హాస్యానికి మాత్రమే పరిమితం కాని పాత్ర. ఆ మనిషికి ఇంచుమించు అన్ని ఫీట్లూ తెలిసి ఉండాలి. ఉయ్యాల ఫీట్లలో అందరూ ఒక పద్ధతిలో ఊగుతూంటే, క్లౌన్ అనే ఈ హాస్యగాడు (ఆయనే బఫూన్) వచ్చి ఒంటిచేత్తో ఊగి చాలా ధైర్యంగా కిందకు వలలోకి వచ్చి పడతాడు. నేను అక్కడ ఇంచుమించు అటువంటి పని ఒకటి చేయదలచుకున్నాను. లేకుంటే, నా బఫూన్ పాత్ర సార్థకం కాదు. నవ్వులాటగానే మిగిలిపోతుంది. పిల్లలను ముందు మన మాట వినడానికి సిద్ధం చేయాలి. అందుకొరకు కొన్ని చమక్కులు చేయవలసి ఉంటుంది. అట్లాంటివి అవసరం కంటే ఎక్కువే చేశాను. అప్పుడిక నేను చెప్పదలుచుకున్న అసలయిన సైన్స్ విషయాలను కూడా పిల్లలు సులభంగా అంగీకరిస్తారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
జీవశాస్త్రం కొత్త తీరును గురించి ఇక నేను అక్కడ ఒక గట్టి ప్రజెంటేషన్ చేశాను. మొక్కలు, జంతువులు, వాటి వర్గీకరణ మాత్రమే జీవశాస్త్రం కాదిప్పుడు. మోడరన్ బయోలజీ ప్రకారం ఇప్పుడు మొత్తం స్కీమ్‌ను కలిపి చూపి అది మిగతా సైన్స్ రంగాలతో కలగలసి పోతున్న తీరును కొత్త బయోలజీగా చెప్పుకుంటున్నారు. చెప్పుకోవాలి. చేతనయినంత సులభంగా ఇక్కడ కూడా నాలుగు మాటలు చెప్తాను. కాస్త ఓపికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
జీవులన్నీ కణాలతో తయారయినయి. కణాల నిర్మాణం, ప్రత్యేకతలు, పనితీరు మొత్తంగా జన్యువుల మీద ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో జీవం పుట్టిన నాటి నుంచి నేటి వరకు, జన్యువుల ఆధారంగా పరిణామం అన్న ఒక పద్ధతి జరుగుతున్నది. కనుకనే, ఇవాళ మనమూ, మిగతా చెట్లు, జంతువులు ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నాయి. ఇదంతా కణంలో ఉన్న జన్యువుల కారణంగా వీలయింది. కణమన్నా, మనమన్నా, మనలోని జన్యు పదార్థం అన్నా కేవలం రసాయనాలే! అంటేగింటే, జీవమంటే రసాయనాలు అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక ఆలోచనను అందరమూ పంచుకుందాము. ఒక కప్ప శరీరంలో ఏయే రసాయనం ఎంత ఉన్నది, సులభంగానే తెలుసుకోవచ్చు. ఆ రసాయనాలను తెచ్చి గినె్నలో పోసి కలిపితే, గజిబిజి పుడుతుందిగానీ, కప్ప పుట్టదు! అది గుర్తించవలసిన సంగతి. జీవంలోని ప్రత్యేకత అదే!
పూలకు అదే సమయానికి పూయాలని, విచ్చుకోవాలని ఎవరు చెప్తున్నారు? కోయిలకు సకాలానికి కూయాలని ఎవరు చెప్తున్నారు? ఎన్ని వెలుగులున్నా, కోడి తెల్లవారుజామునే ఎందుకు కూస్తున్నది? మనిషికి ఆకలి ఎందుకు అవుతున్నది? మరో ఆలోచన ఎందుకు పుడుతున్నది? ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు? జవాబులు ఎవరు వెదుకుతున్నారు? అంతా తెలిసిపోయింది అనుకుని బతుకుతున్నాము తప్ప, ఆంతర్యం తెలుసుకోవాలని అనుకోవడం లేదే? సైన్స్ పేరిట బోలెడంత సమాచారాన్ని అందజేస్తున్నారే తప్ప అసలు తత్వాన్ని గురించి పట్టించుకోవాలని సైంటిస్టులు కూడ అనుకోవడం లలేదు. జీవశాస్త్రంలో నిండా భౌతికశాస్త్రం ఉంది. రసాయనాల కుప్పలు కప్పలుగాను, మనుషులుగాను, మరెన్నో రకాలుగాను మనుగడ సాగిస్తున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమయిన విషయం. సబ్బులో ‘కెమికల్స్’ లేవు అంటున్నవాళ్లు మన శరీరమంతా కెమికల్స్‌తోనే తయారయిందని అర్థం చేసుకోలేక పోతున్నారు. వాళ్లకు ఆ సంగతి చెప్పి వివరించే వారు కూడా లేరనే అనాలి. చెప్పవలసిన వారే అమాయకంగా బతికేస్తున్నారు. నేను జీవం గురించి ప్రశ్నలు అడిగాను కదా. అయితే ఈ ప్రశ్నలు మొదటిసారిగా వచ్చినవి మాత్రం కాదు. జీవశాస్త్రాన్ని ఈ రకంగా చూడాలని అన్నవాళ్లలోనూ నేను మొదటివాణ్ణి కాదు. కానీ, కనీసం ఆ వరసలో నేను చివరివానిగా నిలబడ్డానన్నది నా సంతోషం. నా ఉపన్యాసం ఆనాడు నిజంగా పండింది. జీవం, బతుకు అంటే భౌతిక, రసాయన శాస్త్రాలు అని నేను చెప్పిన మాట పిల్లలకు నచ్చింది. వాళ్ల చప్పట్లే అందుకు నిదర్శనం. మరి ఆ భౌతిక, రసాయన శాస్త్రాలు తెలియకుండానే బతుకు కొనసాగిస్తే, ఎలాగ ఉంటుంది? బతుకంటే ఏమిటో తెలియకుండానే బతికినట్టు ఉంటుంది.
సైన్స్‌లో గొప్ప ఆనందం ఉన్నది అన్నది అనుభవం మీద నేను చెపుతున్న మాట. ఈ ప్రపంచంలో సైన్స్ కానిది ఏదీ లేదు. అంత అవసరం లేదు గానీ, ఎదురుగా జరుగుతున్న సంగతుల గురించి ఆలోచించి వాటి వెనుక సైన్స్ ఉందని అర్థం చేసుకుంటే కలిగే ఆనందం గొప్పది. దాన్ని అందరితో పంచుకుంటే మరింత బాగుంటుంది. ఈ పద్ధతి అందరికీ అలవాటు కావాలి. అందుకు నాకు చేతనయిందేదో నేను చేయాలి. అందుకే పనిగట్టుకుని లోకాభిరామంలో కూడా నేను సైన్స్ గురించి చెపుతాను. చదవండి, చదివించండి, ఆనందాన్ని వెతకండి. దొరికితే, మరింతమందికి చెప్పండి. నాకు చెప్పినా చెప్పకున్నా కొంపమునగదు. నేను ఆ ఆనందంలో మునిగి తేలుతూనే ఉంటాను.

- కె.బి. గోపాలం