లోకాభిరామం

తోలుబొమ్మలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఊరు పాలమూరు అనే మహబూబ్ నగరానికి దగ్గరగా ఉన్నది. కనుక మా దగ్గర పోరగాండ్లకు అంతా సినిమా చూడడం బాగా అలవాటు. సినిమాకు పోదామా అన్నది ప్రశ్న. అయితే నాతానైతే దుడ్లు లేవు. ఇయాల నీవు వెట్టు. మల్ల వొయినప్పుడు నేను పెడుత, అంటూ సాగేవి.
అయినా ఆ సినిమాలు అందరికీ అర్థమవుతయి కనుకనా. లవకుశ లేదంటే ఓ మైరావణ వంటి సినిమా వస్తే అందరికీ అర్థమవుతుంది. రాము అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక తండ్రి పిల్లవాడిని పెంచుకోవడం కోసం నానా యాతన పడతాడు. ఎద్దులబండ్లు కట్టుకుని పల్లెల నుంచి కూడా మనుషులు వచ్చి ఆ సినిమాను చూసి చేతనైనంత ఏడ్చి వెళ్లిపోయినరు. అంతేగాని మరేవో పిచ్చి సినిమాలు వస్తే అవి అర్థం అయి చావవు కదా!
కనుకనే పల్లెలో చిరుతల రామాయణం అంటూ ప్రతి రాత్రి కాలక్షేపం గడిచేది. బైండ్ల కథలు, జముకుల కథలు లాంటి వినోద కార్యక్రమాలు కూడా పల్లెలో పుష్కలంగా వుండేవి. ఇక ఏనుగొండ అనే మా పల్లెకు మరింత ప్రత్యేకత ఉంది. భోగ మాట అనే వీధి నాటకం మా పల్లెలో బాగా పెరిగింది. కేశవయ్య గారు అనే ఒక పెద్ద మనిషి వీధి నాటకాలు రాసేవాడు. వాటికి ఈ వరుసలు కట్టేవాడు. అవసరమైన దుస్తులు కుట్టేవాడు. కిరీటాలు, భుజకీర్తలు తయారుచేసేవాడు. ఈ రకంగా అతను ఒకే మనిషి అన్ని కళలకు కేంద్రంగా ఉండి, ఊళ్లో పిల్లలను చేరదీసి, పిల్లలేమిటి పెద్దలను కూడా చేరదీసి భోగమాట నేర్పించేవాడు. మూడున్నర వజ్రం అని ఆట ఉండేది. దాని పేరు కృష్ణ గారడీ కూడా. అటువంటి ఆట నుంచి మొదలు మా ఊర్లో కూడా లవకుశ ఆడేవారు. బబ్రువాహన ఆడేవారు. ఎనె్నన్నో కథలు ఆడేవారు. పండుగ లేదా పెద్ద ఇంట్లో పెండ్లి వచ్చిందంటే ఊళ్లో కేంద్రంలో భోగ మాట ఏర్పాటు అవుతుంది. దానికి కావలసిన ఖర్చును ఎవరో ఒకరు భరిస్తారు. ఫలానా వారు ఆట చెప్పినారు అని ఊరంతా పాకిపోయేది. ఇక రాత్రంతా కూర్చుని ఆట చూడడానికి అందరూ సిద్ధం.
ఇదిలా ఉండగా చిన్నప్పుడు నేను అప్పుడో ఇప్పుడో తోలుబొమ్మలాట చూసిన గుర్తు ఉంది. ఈ తోలుబొమ్మలాట వాళ్లు స్థానికులు కారు. రాయలసీమ నుంచి వస్తారని తరువాత తరువాత తెలిసింది. ఈ ఆటకు పెద్ద గుడారం అవసరం లేదు. ఆడేవాళ్లు మాత్రం గుడ్డలతో తడికలతో ఒక గది లాంటిది కడతారు. దానికి ఒకవైపున బట్టతో తెర ఏర్పాటు చేస్తారు. ఆ లోపల కళాకారులు ఉంటారు. వాళ్ల దగ్గర ఇంచుమించు మనిషి ఆకారంలో ఉండే బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలను కర్రల సాయంతో తెర మీద అదిమి పట్టుకుని వెనక నించి వెలుతురులో ఆ బొమ్మలు తెర మీద కనిపించేటు చేసి ఆట సాగించేవారు. చక్కగా పాటలు డైలాగులు కూడా ఉంటాయి. తోలుబొమ్మలాటలో భారతం కన్నా రామాయణం ఎక్కువ చూసినట్లు గుర్తు ఉంది. హనుమంతుడు వస్తాడు. దశకంఠుడు వస్తాడు. అతని ముందు ఆంజనేయుడు తోక చుట్టుకొని అల్లంత ఎత్తున ఎక్కి కూర్చుంటాడు. రావణునికి పది తలలు ఉంటాయి. తెర మీద సగం వెడల్పు అతనే కనిపిస్తాడు. అంత ఎత్తు కూడా ఉంటాడు. వెనుక వాళ్లు పాటలు పాడుతూ కింద పెట్టిన సానరాళ్ల మీద కాలితో దరువులు వేస్తూ చక్కగా కథను రక్తి కట్టించేవారు.
హనుమంతుడు వేసిన కుప్పిగంతులు వాళ్లు తెర మీద చూపించిన తీరు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. నాకు నిజానికి వాళ్లు పాడిన పాటలు జ్ఞాపకం లేవు. అయితే తోలుబొమ్మలాటలోని ఒక అంశం మాత్రం గట్టిగా గుర్తు ఉంది.
హాస్యం పేరిట తోలుబొమ్మలాటలో మధ్యన అత్త, పిల్లోడు అని రెండు పాత్రలు వస్తాయి. పిల్లోడు అనే అల్లుని చేత అత్త పని చేయించాలని ప్రయత్నిస్తుంది. వెళ్లి గడ్డి తీసుకు రమ్మంటుంది. తిండి ఆశ పెడుతుంది. తాటిబెల్లం, తమిద రొట్టెలు పెడతాను అయ్య పోరా గడ్డికి, మా అయ్య పోరా గడ్డికి అంటుంది. వాడు ఆమెకు అయ్య కాదు. వాడి ద్వారా నాటకంలో బండ బూతులు పలికించేవారు. ఆ కాలంలో హాస్యం అంటే బూతు లేకుండా గడిచేది కాదేమో. మూడు రొట్టెలు ముడ్డికి, నా మొలిలిలిలి పోత గడ్డికి అంటూ వాడు పాడతాడు. ఇక చూడవచ్చిన వాళ్ల ఆనందానికి అంతు ఉండదు. నాకు కూడా ఈ ఒక్క పాట జ్ఞాపకం ఉంది. అంతటితో ఆగకుండా పిల్లోని పాత్రకు పొడుగాటి బెల్లకాయ కూడా ఉన్నట్టు చూపించేవారు. అప్పట్లో అది బూతుగా అనిపించలేదేమో? నాకు ఇవ్వాళటికి ఆ సంగతి అర్థం కాదు.
ఈ మధ్యనే ఎక్కడా తోలుబొమ్మలాట వాళ్లు కనిపిస్తున్న జాడ లేదు. సురభి వాళ్ల నాటకం కంపని హైదరాబాద్‌కు చేరింది గాని రాయలసీమలోనే ఉన్న తోలుబొమ్మల వాళ్లు మాత్రం పట్నం చేరినట్టు లేదు. అక్కడో ఇక్కడో తోలుబొమ్మలాట పద్ధతిలోనే మరేమో వస్తువులను తయారుచేసి అమ్ముతున్నట్టు కనిపించింది. చిన్నచిన్న బొమ్మలు కూడా అమ్మకానికి కనిపించాయి. మొత్తం నాటకం జరగాలంటే పెద్ద జట్టు ఉండాలి కదా? అది బహుశా వీలవుతున్నట్టు లేదు.
నిజానికి తోలుబొమ్మలు తయారుచేయాలంటే, అదొక పెద్ద తతంగం. దాని గురించి ఎక్కడో చదివే అవకాశం కూడా దొరికింది. చాలాకాలంపాటు బొమ్మల కోసం జింక చర్మం వాడేవారట. జింకలను వేటాడడం ఇప్పుడు కుదరదు. అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. కనుక ఆ మధ్యనే బొమ్మల కోసం మేక చర్మాన్ని వాడడం మొదలైందట. పెద్ద సైజు బొమ్మలను తయారుచేయాలంటే ఒక మేక చర్మం సరిపోదు. రావణాసురుని బొమ్మకు మూడు మేకల చర్మం అవసరం అవుతుందట. అందులో ఒక మేక పది తలకాయలకు పోతే, ఒకటి కాళ్లకు పోతే, మరొకటి శరీరానికి సరిపోతుంది. ముందు ఆ చర్మాన్ని పారదర్శకంగా వచ్చేట్టు తయారుచేయాలి. ఆ తరువాత దీని మీద బొమ్మ గీసి ఆ ప్రకారం కత్తిరించాలి. దుస్తుల ప్రకారం బొమ్మ గీసి అందులో నుంచి వెలుగు బయటకు కనిపించేటట్టు రంధ్రాలు వేయాలి. ఆ రంధ్రాల వెంబడి గీతలు గీసి రంగులు పూయాలి. నిజంగానే పాత కాలంలో రంగులు కూడా వాళ్లే తయారుచేసుకునేవారు. ఉదాహరణకు మోదుగు పువ్వుల నుంచి అవసరమైన పసుపు ఎరుపు రంగును తయారుచేసేవారట. ఇప్పుడు అదంతా కుదిరే పరిస్థితి కాదు. కనుక రసాయనం రంగులను వాడక తప్పదు. అసలు ముందు చర్మాన్ని బొమ్మలకు అనుగుణంగా పారదర్శకంగా తయారుచేయడమే పెద్ద కళ. దాన్ని బొమ్మలు ఆడించే వాళ్లే చేసుకుంటారు. అంటే అంతకంటే ఆశ్చర్యం లేదు. కనుకనే ఈ కళ రానురాను మరుగున పడుతున్నది. కొన్ని బొమ్మలు కేవలం నలుపు తెలుపు రంగులలో ఉండడం కూడా నేను చూశాను. అటువంటి బొమ్మలు ఆడించి నపుడు అంత ఆకర్షణీయంగా ఉండవేమో.
నేను ఆ మధ్యన కాకిపడగలు అనే మరొక రకం బొమ్మలాట చూశాను. ఇందులో తెర, దీపం నీడలు మరో రకంగా ఉంటాయి. కథ పటాల వలే చిత్రించి ఉంటుంది. దీపం పట్టుకొని పటాల ముందు బొమ్మలు చూపుతూ కథలు చెబుతూ ఉంటారు. జానపద కళలు మరుగున పడుతున్నాయి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాస్ర్తియ నృత్యం లాంటివి కూడా కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉన్నాయి అనుకున్న పనులను కూడా లేకుండా పోతే ఇక చివరకు మిగిలేది తప్ప మరొకటి కాదు. ఆ సినిమా ఎవరికి కావాలి? చాలామందికే కావాలి. వాళ్లకు మరి కాలపు కళల రుచి తెలియదు.
బైండ్ల కథలు, జముకుల కథలు, బుర్ర కథ మొదలైనవి ఆయా పద్ధతులను వృత్తిగా చెప్పేవారు మాత్రమే నేర్చుకుని మిగతా వారికి అందిస్తారు. ఔత్సాహికులు వీటిని నేర్చుకుని అందరి ముందు ప్రదర్శించడం కుదిరేది కాదు. చుక్క సత్తయ్య లాంటి వారు ఒకతను అందరికీ నేర్పించే ప్రయత్నం చేసినట్టు ఉన్నారు. మిగతా వాటి గురించి ఈ రకమైన ప్రయత్నాలు కనిపించవు. కానీ, మా చిన్నతనంలో మా ఊరికి ఒక పంతులు వచ్చి ఉండిపోయాడు. అతను పల్లెలోని యువకులందరినీ ఒకచోట చేర్చి చిరుతల రామాయణం అనే ఒక పద్ధతి జానపద ప్రదర్శనను నేర్పించాడు. అందులో సుమారు 50 మంది పాత్రధారులు. రామాయణం కథ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాడినట్టు గుర్తుంది. ప్రదర్శన వారం రోజులపాటు సాగినట్టు గుర్తుంది. యువకులందరూ ఒకటికి రెండు పాత్రలు నేర్చుకుని రోజు రోజంతా ఆ పాటలను కూనిరాగాలు తీసుకోండి అని నాకు ఇవ్వాళ్టికీ గుర్తుంది. మొత్తానికి చిరుతల రామాయణం ప్రదర్శన చాలా బాగా జరిగింది. దీనికి ఒక వేదిక అంటూ లేదు. కళాకారులు చుట్టూ గుండ్రంగా నిలబడతారు. చేతులలో చిరుతను అనే వాయిద్యాన్ని పట్టుకుని దానితో లయబద్ధంగా వాయిస్తూ పాటలు పాడుతుంటారు. ఆ సందర్భంలో కథ జరుగుతున్న పాత్రలు మధ్యలోకి వచ్చి తమతమ సంభాషణలు వినిపించినట్టు గుర్తున్నది. కళా ప్రదర్శనలలో ఈ రకంగా పాల్గొన్న యువత నిజంగా గొప్ప ప్రేరణ పొందిన భాగం నాకు మిగిలి ఉంది. ఇప్పుడు పల్లెల్లో ఎవరికైనా ఇటువంటి పనులు గుర్తున్నాయా?
అడగడానికి నేనెవరిని? నేను కనీసం చూడడానికి కూడా పల్లెకు వెళ్లడంలేదు. పల్లెకు పట్టణానికి వచ్చే అవకాశం లేనే లేదు. ఆ మధ్యన ఆయనెవరో ఒక 12 తీగల వాయిద్యం వాయిస్తాడని పాలమూరు నుంచి వచ్చాడు. అతని గురించి ఫేస్‌బుక్‌లో ట్విట్టర్‌లో దుమారం రేగింది. అంతేగాని అతని ప్రదర్శన పలుచోట్ల పెట్టి చూసిన వాళ్లు ఎంత మందో నాకు తెలియదు.
కథలు మారిపోతున్నాయి. కలలు మారిపోతున్నాయి. కాలాలు మారిపోతున్నాయి. పాత పద్ధతులు ఎవరికీ పట్టవు. అవి పరిశోధన పుస్తకాలలో మాత్రమే మిగిలిపోతాయేమో. జానపద సంగీతం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఈ మధ్యన జానపద శైలిలో వచ్చే సంగీతాన్ని జానపదం అనుకుని అందరూ అందంగా వింటున్నారు. అసలు జానపదుల పాటలు ఏమయ్యాయి అర్థం కాదు. ఆ సంగతి చెప్పినా ఎవరికీ పట్టదు.
నేనిక్కడ ఒక విషయం గురించి ఏడవాలని ప్రయత్నించడం లేదు. గుర్తుకు వచ్చిన కొన్ని అంశాలు ఎక్కడైనా మిగిలి ఉన్నాయేమో తెలుసుకుందాం అని ఒకటే నా ఆశ.

-కె.బి.గోపాలం