లోకాభిరామం

ఓరుగల్లులో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూచివాడు అనే చీనుగాడు అనే శ్రీనివాసు వరంగల్‌లో చదువుకుంటున్నాడు. మొదటి నుంచి వాడు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండేది అలవాటు. చదువు వదిలి వరంగల్ పోవుడు కుదురదు గాని, చుట్టపుచూపుగ పోవచ్చు గద! ఆలోచన రావాలెగాని, ఆచరణలో లోపము ఏనాడు ఉండదు. పాలమూరు నుంచి అంత దూరము పోయేటందుకు పైసలు ఎవరు యిచ్చినది గుర్తులేదు. చీను ఇచ్చి ఉంటడని నా అనుమానము. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్ అని ఉంటుంది. అక్కడే వారి హాస్టల్ కూడ ఉంటుంది. చీను గాక నాకు తెలిసిన మరి ఒకరిద్దరు అక్కడ ఉన్నరు. వారిలో మోహన్‌రెడ్డి ముఖ్యుడు. వాడు నన్ను చాలా అభిమానించిన మనుషులలో ఒకడు. హాస్టల్‌లో వాళ్ల ఇద్దరి మిత్రులంత నాకు గూడ మిత్రులయేందుకు ఎక్కువ కాలము పట్టలేదు. వారిలో కొందరితో హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది గనుక మరింత సులభమయింది. తరువాత ఎంతో సన్నిహితుడయిన రాజు లేదా దేవరాజు మహారాజు కూడ అక్కడనే ఉన్నడు. అతను హాస్టల్‌లో లేడు. బయట ఒక గదిలో ఉన్నడు. ఇక కాలక్షేపానికి కరువు లేకుండ వరంగల్ మొదటి సందర్శనం మొదలయింది. ఆ తరువాతి సంవత్సరం నేను అక్కడికి వెళ్లి అదే పీజీ సెంటర్‌లో చదువుకుంట అన్న ఆలోచన అప్పుడు కలలో కూడ రాలేదు.
అంతకంటే విచిత్రము, సరిగ్గ నేను వరంగల్‌లో ఉండంగనే, ఉస్మానియా విశ్వవిద్యాలయములోని తెలుగు శాఖ విద్యార్థులు అక్కడికి విహార యాత్రగ రావడము. ఆ వర్గములో నాకు పరిచయం కన్నా ఎక్కువే మైత్రి గలవారు కొందరు ఉండడము గూడ అనుకోకుండ జరిగిన సంగతి ఏమీ కాదు. వాళ్లంత ఒక బస్ తీసుకుని విద్యా విహార యాత్రగ వచ్చినరు. బస్‌లో ఇంకా సీట్లు ఖాళీగ ఉన్నయి. నీవు మాతో రాదగిన మనిషివి. వస్తే నీకు, మాకు అందరికి బాగుంటుంది అన్నరు మిత్రులు. ఎగిరి గంతు వేసిననో లేదో గుర్తులేదు గానీ, వారితో కలిసి బస్ ఎక్కిన. నూచివాడు అనే చీను, మోహన్ ఏదో సాయంత్రము కొంతసేపు నాతో తిరగగలుగుతరు కానీ, చుట్టుపక్కల ప్రదేశాలకు రావాలంటే తరగతులు వదులుకోవలసి ఉంటుంది. అది ఎవరికీ అంగీకారము గాని పని! కనుక తెలుగు విద్యార్థులతో కలసి తిరిగేది చక్కటి అవకాశముగ నాకు దొరికింది. ఆ జట్టుకు పెద్ద దిక్కుగ శ్రీమతి యశోద తిరుమలరెడ్డిగారు వచ్చినరు. ఆమెకు నన్ను పరిచయము చేసినరు. భాషాభినివేశము గురించి కూడ చెప్పినట్టున్నరు. ఆయమ్మ నన్ను, సులభముగ తన రెక్కల కిందకు చేరనిచ్చింది. ఆ తరువాతి సంవత్సరము నేను ఎమ్మే తెలుగులో చేరి చదువుతనని నాకుగానీ, మరెవరికి గానీ కలవదను గూడ లేదు. ఎమ్మేలో చేరిన. ఆరు వారాల తరువాత వదిలిపెట్టి వరంగల్ వచ్చి ఎమ్మెస్సీలో చేరిన. అది వేరే కథ!
ఆనాడు బస్‌లో రామప్ప గుడికి పోయినది ఒక గొప్ప అనుభవము. అందరూ సాహిత్య విద్యార్థులు. యశోదమ్మ తనదయిన శైలిలో చరిత్ర గురించి, సంస్కృతి గురించి చెపుతున్నది. బృందములో ఇద్దరు అమ్మాయిలు ఉన్నరు. వారు అక్కచెల్లెండ్లు. రామప్ప గుడిలో ‘రాళ్ల లోపల పూలు పూచిన రామమందిర లీల, ఆరామ సుందరహేల’ అంటూ గొంతెత్తి చక్కగా పాడినరు. వారిద్దరూ వరంగల్ వారేనట. వారికి అక్కడ సినిమా హాలు ఉందట. ఆ సాయంత్రము మొత్తం బృందాన్ని ఆ హాలులో సినిమా చూడడానికి ఆహ్వానించినరు. మధ్య విరామంలో అందరికీ ఉపాహారం, పానీయాలు కూడా ఏర్పాటు చేసినరు. అన్ని గుర్తున్నయి, కని, వాండ్ల పేర్లు మాత్రము గుర్తులేవు! ఎంత అన్యాయము.
వేయి స్తంభాల గుడి, భద్రకాళి గుడి కూడ చూచినట్టు గుర్తు. వేయి స్తంభాల గుడి అన్నది పేరేగానీ, అందులో వెయ్యి కాదు గదా, వంద స్తంభాలు కూడా లేవు! గోడలన్నీ స్తంభాల వలె మలిచి ఉన్నయి. అక్కడ అడుగు పొడవు, అంతే వెడల్పు ఉండే ఇటుకలు చూపించినరు. వాటిని నీటిలో వేస్తే తేలినయి. అట్ల అందరికి చూపించి, చూపించి, ఆ యిటుకలు లేకుండ పొయి ఉంటయి. ఓరుగల్లు కోటకు పోతిమి. నాకు కొంచెము ఇమాజినేషన్ ఎక్కువ. సినిమా వాండ్లది గూడ నా పద్ధతే అన్నది నాకొక సంతృప్తి. రాజసభ అనంగనే పెద్ద, ఫుట్‌బాల్ గ్రౌండంత చూపిస్తరు. ఫోర్ట్ వరంగల్‌లో సభ అని చూపించిన హాలులో వంద మందికన్న ఎక్కువ పట్టరేమో అనిపించింది. ఆ రాజులు ఉండిన కాలంలో మేరవయినా నిర్మాణాలు ఉండేవేమో!
వరంగల్ అనంగనే ఇప్పటికి గూడ, నాకు ఎందుకో సంతోషము అవుతుంది. ప్రపంచం గురించి అప్పుడే అవగాహన కలుగుతున్న వయసులో ఆ ఊరు అక్కున చేర్చుకున్నది. చదువులోనూ, సహజీవనంలోనూ ఉండే శక్తిని రుచి చూపించింది. అక్కడ ఉన్న రెండు సంవత్సరాలు ఎంత హాయిగ గడిచినదీ తలుచుకుంటే సంతోషము రెండంతలు అవుతుంది. నిజంగ మనసుపెట్టి చదువుకుంటే ఉండే ఆనందము అది అన్నిటికన్న మించినది. నేను కొంతకాలము ఉస్మానియా క్యాంపస్‌లో చదువుకున్న. తరువాత పీఎచ్‌డీ అక్కడనే మిడికిన. అనగూడదు గానీ, ఉస్మానియాలో క్రమశిక్షణ తక్కువ. వరంగల్‌లో పద్ధతి వేరుగా ఉండేది. నిజానికి నేను అరాచకం మనిషిని. ఆ క్రమశిక్షణ భరించలేకపోయిన. అందరూ చదువుతుంటే, పరీక్షల ముందర గూడ పారిపోయి సినిమా చూచి వచ్చేవాడ్ని.
అక్కడ చదువుతున్నప్పుడు గూడ, పాకాల చెరువు, రామప్పగుడి చూడడానికి అందరము కలిసి వెళ్లినము. మాతోబాటు పెద్దలు ప్రొ.వాసుదేవ్‌గారు కూడ వచ్చినరు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ గనుక ఆ యాత్రలో తిండి ఏర్పాట్లు నా బాధ్యతగ నడిపినట్లు గట్టిగ గుర్తుంది. మామూలుగనయితే వలంటీర్లకు కొంత తిండి పక్కనపెట్టి, మిగతా వారికి వడ్డించుతరు. ఆనాడు, అందరికి కొసరి కొసరి తినిపించిన తర్వాత మాకు, ముఖ్యంగ నాకు తిండి మిగల లేదని గుర్తుంది. డబుల్‌కా మీఠా మాత్రం మిగిలి ఉంది. దానితోనే కడుపు నింపుకోవడము అదొక ఆనందము. ఎంతయినా మధురప్రియుణ్ని కదా! తిరుగు ప్రయాణంలో బస్‌లో మేమంత కలిసి చేసిన అల్లరి బాగ గుర్తున్నది. కాని, ఆ వివరాలు ఇప్పుడు చెప్పగూడదు. మా పంతుళ్లు మంచివాండ్లు ‘గనుక’ ‘పోనీ’ అని ఊరుకున్నరు. అక్కడ మాకు శాఖాధిపతిగా ఉండిన పి.ఆర్.రావుగారు ఉస్మానియా క్యాంపస్‌కు మారినరు. నేను పిహెచ్.డికి వారి వద్దనే చేరవలసి వచ్చింది. ఆ పని జరగకుంటే జీవితము మరొక రకంగా ఉండేది. అది అప్రస్తుతము గానీ, రావుగారు ఒకసారి నాకు గుంభనముగా ఒక హెచ్చరిక చేసినరు. ‘నీవు వరంగల్‌లో వలె, ఆకతాయిగా ఉంటే కుదరదు. ఇక్కడ సీరియస్‌గ పని చేయాలె’ అన్నరు. నాకు మాత్రం అది చేతగాలేదు. చదువుకన్న పరిశోధన తీరు వేరు. ఆ సంగతి పట్టకుండ నేను పరిశోధన కూడ ఆడుతు పాడుతునే చేసిన. అందుకే దాన్ని వదిలిపెట్టిననో ఏమో?
మొత్తానికి నేను వరంగల్‌లో చదువు కొరకు చేరకముందే, అక్కడి వాతావరణము, మనుషుల పరిచయం కలిగింది. చిత్రం ఏమంటే, నా చదువు పూర్తి అయిన తరువాత కూడ నేను అక్కడ ఉండవలసి వచ్చింది. రెండవ సంవత్సరం పరీక్షలు అయిపోయినయి. మూట ముల్లె సర్దుకోని వెళ్లి రావాలె. కానీ, జూనియర్లు, ‘మా పరీక్షలు ముగిసేవరకు నీవు వెళ్లే ప్రశ్న లేదు. మాతో ఉండి, కౌనె్సలింగ్ చేయాలె’ అన్నరు. ఎంతటి అభిమానం గలవారయితే అట్ల అంటరు? వాండ్ల పరీక్షలు అయిన దాక అక్కడనే ఉన్న. చేతనయినంత సహాయము చేసిన. వాండ్లంత రెండవ సంవత్సరములో ఉండంగ కూడ వరంగల్ పోవలసిన అవసరం వచ్చింది. ఒక మిత్రుని పెండ్లి హసన్‌పర్తిలో జరిగింది. అక్కడకు దారిలోనే గనుక, అప్పటికి కాకతీయగా మారిన క్యాంపస్‌లోకి వెళితే, మిత్రులంత కలిసి, తిరిగి, పెండ్లి తరువాత అక్కడికి రావాలె అన్నరు. నాకు ప్రపంచంలో కాకున్నా దేశంలో ఎక్కడికి పోయినా పుట్లకొద్ది ప్రేమ ఎదురవుతుంది. ఇంతగా ప్రేమాభిమానాలు పంచుత గనుక, వాటిని తిరిగి అందుకుంట! అని ఎవరో ఎక్కడో అన్నట్టు గుర్తు. హిందీలో అన్న ఆ మాటలు ‘ఇతనా జో ప్యార్ దేతే హైఁ, తో పాతే భీ హై!’ అన్నవి నా మెదడులో సుడులు తిరుగుతున్నయి.
ఆనందము ఎక్కడి నుంచో రాదు. అది మనలోపలి నుంచే వస్తుంది. రావాలె. రప్పించాలె. అది నా బతుకు తీరుగ మారింది. ఒకచోట మరింత ఎక్కువ కాలము గడిపి, ఎక్కువ ఆనందము పొందినము. గడిపినందుకు వరంగల్ మనసులో నిలబడిపోయింది. ఆ విషయం మీద ఒక పుస్తకమే రాయవచ్చు!

కె. బి. గోపాలం