లోకాభిరామం

అవగాహన (లోకాభిరామమ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.బి. గోపాలం
---------------
వడ్డెర రాములు మా ప్రాంతంలో బాగా పేరున్న మనిషి. వృత్తి రాళ్లు కొట్టడమే. అట్లా కొట్టి కొట్టీ బాగా సంపాదించాడు కనుక ఇప్పుడతను రాళ్లు కొట్టడు. కేవలం కొట్టిస్తాడు. ఇక తాను సైకిల్ ఎక్కి తిరుగుతూ పని వాళ్ల మీద పెత్తనం చేస్తాడు. పెత్తందారులకు పద్ధతులు ఉంటాయి. వాటికి తగినట్టు రాములు కొనగాళ్ల దాకా తెల్లని ధోవతీ కట్టుకుంటాడు. మా పల్లెలో ఎవరన్నా పంచెలు, ధోవతిని పిక్కలు కనిపించకుండా కిందికి దాకా కట్టుకుంటే వాడికి పోజుల రాయుడని ఒకవేపు లేదా పెద్ద మనిషి అని మరొక వేపు అనుకునేవాళ్లం. పెద్ద మనుషులు పని చేయరు. పోజుల రాయుళ్లు కూడా పనిచేయరు. పనిచేసే వాళ్లకు బట్టలు మోకాళ్ల కంటే మరీ కిందికి ఉండవు. నమ్మండి, నమ్మకపోండి. మా చిన్నతనంలో జరిగిన వ్యవసాయ కుటుంబాల స్ర్తి జనం కూడా చీరలు పిక్కల్లో మధ్యదాకా మాత్రమే కట్టుకునేవారు. వడ్డెర రాములు కొనగాళ్లదాకా పంచె కట్టడం మొదలుపెట్టాడు.
మరిక చేతికి అందిన సొమ్మును అందరి ముందూ ప్రదర్శించడానికి మరికొన్ని హంగులు ఉండాలి. మా చిన్నతనంలో ఊళ్లో ఎవరికయినా పెళ్లి జరిగితే, పిలగానికి ఏమిచ్చినరు? అని ప్రశ్న బయలుదేరేది. ఆ కాలంలో గ్రామీణ యువకులకు సైకిలు, రేడియో, చేతి గడియారం ఇస్తే అదొక పెద్ద స్టేటస్ ప్రదర్శన క్రింద అందరికీ తెలిసేది. ఆ మర్నాటి నుంచి ఆ కొత్త పెళ్లికొడుకు చేతికి గడియారం కట్టుకుని, రేడియోను సైకిల్ హ్యాండిల్‌కు తగిలించుకుని ఊరి మీదకు బయలుదేరేవాడు. తోటివారంతా అతగాణ్ణి చూచి కుళ్లుకోవాలనేదాకా వాళ్ల మనసుల్లో ఉండేదని నాకు తరువాత తోచింది. రాములు కూడా గడియారం కొన్నాడు. పాపం అక్షరం ముక్క తెలియని మనిషి. వ్యాపారం లెక్కల కోసం ఎవరి మీద ఆధారపడేవాడో తెలియదు. అతని మీద నేను జాలి పడుతున్నానే తప్ప ఆటపట్టించే ఉద్దేశం అంగుళం కూడా లేదని మనవి. రాములు ఇక రేడియో కూడా కొన్నాడు. అది నిజానికి టేబుల్ రేడియో కాదు. వెంట పెట్టుకు వెళ్లడం వీలయ్యే సిస్టర్ కాని సిస్టర్! ఆ సిస్టర్ పాడుతుంది కూడా! అదేనండి ట్రాన్సిస్టర్! అంటే, పోర్టబుల్ రేడియో. రాములు చేతనయినంత పెట్టి మంచి రేడియో కొన్నాడు. మరొకరెవరో నా రేడియోలో భానుమతి పాటలు రానేరావు, మరో రేడియో కొనాలి అన్నాడట! రాములు ఆ పని చేసిందీ లేనిదీ నాకు తెలియదు. తరచూ అతను మా పొలం వేపు వచ్చి మమ్మల్ని పలకరించేవాడు కనుక కొన్ని సంగతులు తెలుసు.
రాములు రేడియో కొన్నాడు. అది మోగుతుంది. అప్పట్లో సినిమా పాటలు వారంలో రెండుసార్లు మాత్రమే అరగంటపాటు వచ్చేవి. షార్ట్‌వేవ్ పెడితే, సిలోన్‌లో ప్రతి నిత్యం సాయంత్రం అరగంట అవే పాటలు మళ్లీ మళ్లీ వినిపించేవి. రాములుకు బ్యాండ్ మార్చి స్టేషన్లు మార్చి వినే నైపుణ్యం లేదు. అంగడి మనిషి హైదరాబాద్ స్టేషన్ మీద ముల్లు పెట్టి ఇచ్చేశాడు. ఇతను ఆ ఒక్క స్టేషనే వింటున్నాడు. పరిస్థితి బాగానే ఉంది. కానీ, వద్దన్నా కదిలే కాలం ఒకటి ఉంది కదా? మూడు నెలలయింది. ఓ శుభక్షణాన రేడియో గొంతు తగ్గించింది. ఆ తరువాత కొన్నాళ్లకు అది మూగబోయింది. రాములుకు కోపం వచ్చింది. సిస్టర్‌ని వెంట పెట్టుకుని అంటే, ట్రాన్సిస్టర్‌ని సైకిల్‌కు తగిలించుకుని అంగడి మనిషి దగ్గరికి వెళ్లాడు. సంగతి చెప్పాడు. ఆ అంగడి మనిషి కొంచెం దొంగ పద్ధతుల రకంగా ఉన్నట్టు నాకు అర్థమయింది. రేడియో సులభంగనే బాగవుతుంది. సాయంత్రం రా! అని చెప్పి పంపించినడు. సాయంత్రం రాములు వెళ్లేసరికి రేడియో మళ్లీ మామూలుగా పాడుతున్నది. ఇంతకూ అంగడి మనిషి చేసిన మరమ్మతు ఏమిటో మీకు ఎవరికయినా తోచిందా? మూడు బారానాలు అంటే, రెండు రూపాయిల పావలా పెట్టి బ్యాటరీలు మార్చినడు. వీని దగ్గర మరి ఎంత వసూలు చేసినడో నాకు వివరం తెలియదు. పాపం, రాములు అట్లా అంగడికి వెళుతూనే ఉన్నాడు. అనవసరంగా అదనపు డబ్బులు ఇస్తూనే ఉన్నడు.
నేనిక్కడ ఎవరినీ తప్పుపట్టడం లేదు. సైన్స్, సాంకేతిక శాస్త్రం ఈ పద్ధతిలోనే కొనసాగుతాయి. వివరం తెలియకపోతే విషయం అర్థం కాదు. ఆ కిటుకేదో తెలిసినవాడు మనల్ని మప్పగిస్తాడు. అందుకే ప్రపంచం గురించి అందులో జరుగుతున్న పనుల గురించి అర్థం చేసుకోవాలని నేను గొంతు చించుకుని చెబుతూ ఉంటాను. లోకాభిరామంలో నేను సైన్స్ విశేషాలను ఎత్తుకుని వ్యాసం రాస్తే, ఆ వారం కొంతమందికి బోలెడంత అసంతృప్తిగా ఉంటుంది, అని నాకు అర్థమయింది. అయినా నేను సైన్స్ చెప్పడం మానను. లక్షసార్లు చెప్పినా, ఒకటే మాట. ఈ ప్రపంచమంతా సైనే్స. అర్థం చేసుకోకుంటే, అది అద్భుతం. ఆశ్చర్యం! ఆ రెంటికీ ముత్తాత! కనుకనే ప్రపంచంలో చాలా సంగతులు మన చేతిలో ఉండడం లేదు.
ఎక్కడో మరీ పల్లెకాని ఒక ఊర్లో ఉన్నాను. కరెంటు పోయింది. అది చాలాసేపటివరకూ రాలేదు. అక్కడ మాతోబాటు ఒక అత్తగారు ఉన్నారు. ఆమె మరీ పెద్ద మనిషి. నా మీద ఆమెకు బోలెడంత అభిమానము, ఆరివారము ఉన్నాయి. వారంలో ఉండే ఏడు దినాలు కాక, ఇదొక ఎనిమిదోవారము కాదు. ఆరివారమంటే, అదొక రకమయిన అందమయిన భావన. ఆ భావనతో అత్తగారు నన్ను పిలిచి ‘పొయ్యి స్తంభమెక్కి దీపాలెయ్యి పో!’ అని చెప్పింది. నాకు ఒక క్షణం బుర్ర తిరిగింది. స్తంభమెక్కి ఆమె చెప్పిన పని చేయడం నాకు సాధ్యమవుతుందన్న నమ్మకం నాకు లేదు. కానీ మా అత్తకు మాత్రం ఉంది! ‘అత్తా, కరెంటు పొయ్యింది గదా, వచ్చేటప్పుడు వస్తుందిగానీ, నేనెట్ల వెయ్యాలె?’ అని ఎదురుప్రశ్న వేశాను. ‘నీవు బాస చదువుకున్నవాడవు గదా, అంత మాత్రము చేతగాదా?’ అని ఆమె నన్ను మళ్లీ అడిగింది. అప్పట్లో నాకు అత్త కేవలం అమాయకురాలుగా మాత్రమే కనిపించింది. ఆ తరువాత ఆలోచించినప్పుడు ఆమెకు చదువు మీద, సైన్స్ మీద ఉన్న నమ్మకం కొండంత రూపంలో ఎదురయింది. చదువుకున్నవాడు ఇటువంటి పనులు చేయగలుగుతాడని అత్తకు నమ్మకమున్నది. చదువుకున్న నాకు లేదు!
ఒక పెద్దాయన ఈ మధ్యన, చదువుకున్న సైన్స్ నాకు ఏమీ పెట్టలేదు. ఎందుకూ పనికిరాలేదు అన్నాడట. అతను ప్రతి నిత్యం నిద్ర లేస్తున్నాడు. అంటే తెల్లవారుతున్నది అనుకుంటున్నాడు. కనుకనే లేస్తున్నాడు. పిల్లలకు కూడా సూర్యుడు కదలడం లేదు, మనమే అతని వెలుగులోకి వెళుతున్నామని అర్థమయింది. ఆ మహానుభావుడికి అసలు తెల్లవారుతున్న సంగతి కూడా అర్థం కాలేదని నా భావన. తెల్లవారిందంటే సైన్స్ కాదా? తింటున్నామంటే, తిన్నది అరుగుతున్నదంటే, అందుకు సంబంధించిన అవగాహన అదేదో మరొక శాస్తమ్రా? ప్రపంచంలో ప్రతి ఒక్క సంగతీ తన పద్ధతిలో జరుగుతూ పోతుంది. అందుకుగల కారణాలను లోనున్న సంగతులను అర్థం చేసుకుంటే అది సైన్స్. సైన్స్ అంటే కొబ్బరికాయ పగలగొట్టేందుకు పనికి వచ్చే గుండ్రాయి కాదు! గుండ్రాయితో కొబ్బరికాయను పగలగొట్టవచ్చునని తోచడం సైన్స్. కొబ్బరికాయను పగలగొట్టాలంటే, గుండ్రాయి కనీసం కొబ్బరికాయలో సగమన్నా ఉండాలి. గోళీకాయపెట్టి కొడితే అది పగులుతుంది కానీ, కొబ్బరికాయ పగలదు. ఈ సంగతి తెలిస్తే, అది సైన్స్. తెలియకపోతే, రాములు లాగే మనం కూడా బ్యాటరీ మార్చడానికి డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది.
మహా ఘనత వహించిన నిజాం నవాబుగారు కారు కొన్నారట. షికారుకు వెళ్లాలనిపించింది. ఉప్పల్ వేపు ఎక్కడికో బయలుదేరారు. నడుపుతున్న ఆ డ్రైవర్‌కు కూడా వ్యవహారమంతా కొత్తదే అనుకుంటాను. కొంతదూరం పోయిన తరువాత నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రాంతంలో కారు కదలకుండా మొరాయించింది. డ్రైవరేంద్రుడు సంగతిని అర్థం చేసుకోవడానికి నానా తంటాలూ పడ్డాడు. ప్రభువులవారు సంగతేమిటని అడిగారు. చమురు అయిపోయిందని డ్రైవరుడు తెలియజేశాడు. ఇరుసున కందెనబెట్టక పరమేశ్వరుబండి అయిన పారదు అని మనవాళ్లకు తెలుసు. మ.ఘ.వ. నిజాంగారికి ఆ సంగతి తెలియదని నా ఊహ. ‘అదేం మాట. ఇంటికి పద చమురు వేసుకుని మళ్లీ వద్దాం’ అన్నాడట. చమురు వేయందే బండి అంగుళం కూడా కదలదు. ఇక ఇంటికి పోయే ప్రశ్న లేదని, అందుకు మరేదో మార్గం వెతకాలని ఆయనకు అర్థం చేయించడం తప్పకుండా కష్టమయి ఉంటుంది. ఆ తరువాత ఏమయిందో నాకు తెలియదు. అవగాహన లేకుంటే ఎవరి పరిస్థితయినా అంతేనని మాత్రం గట్టిగా చెప్పగలను. నేను నిజామును అవహేళన చేయాలని ఈ ముచ్చట చెప్పలేదు. విషయం తెలియకుంటే పరిస్థితి ఎలాగుంటుందన్నది చెప్పడానికి మాత్రమే ఈ ప్రస్తావన చేశాను.
మొన్ననొక పెట్రోల్ బంక్‌లో కొంచెంసేపు నిలబడవలసి వచ్చింది. కారులోనే. కనుక కూచోవలసి వచ్చిందని చెప్పాలి. పక్కన ఒక ఏనుగంత వాహనం ఉన్నది. అందరూ దాని చుట్టూ చేరి కొంత చికాకు పడుతున్నారు. అరుపులు కూడా అరుచుకున్నారేమో! విషయం ఏమిటంటే, అనుభవం లేని ఒక ఆపరేటరు డీజెల్‌తో నడిచే బండిలో పెట్రోల్ నింపాడట. అయితే ఏమయిందట? అని అడిగేవారెవరయినా ఉంటే, వారికి నా నమస్కారం. తప్పకుండా అలాంటి వాళ్లు ఉండే ఉంటారు. ఆ బండిని స్టార్ట్ చేసి కొంచెం ముందుకు నడిపిస్తే, ఇంజన్ పేలినా పేలుతుంది. సైన్స్ గురించి అవగాహన లేకుండా బతికితే అన్నం చిముడుతుంది, డీజిల్ బండి పేలుతుంది!
*