క్రైమ్ కథ

దీపపు పురుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది అమెరికాలోని సదరన్ పసిఫిక్ రైల్వే ట్రాఫిక్ డివిజన్ కంపెనీకి చెందిన ఓ చిన్న రైల్వేస్టేషన్. అందులో స్టేషన్ మాస్టర్‌గా పనిచేసే హంకీ విచారంగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన జిప్సీ చెప్పాడు.
‘నీ పెంపుడు కుక్క రోవర్ కారు కింద పడి మరణించింది కదా. కావాలంటే పది సెంట్లకి ఇంకో కుక్కని కొని తెస్తాను..’
‘దొంగిలించిన కుక్క నాకు వద్దు. నేనే కొనుక్కుంటాను’
అరగంటలో హంకీ అసిస్టెంట్ పొలాస్కీ డ్యూటీలోకి రాగానే హంకీ అతనికి బాధ్యతని అప్పజెప్పి కారులో సమీపంలోని ఊరికి చేరుకున్నాడు. ఇరవై డాలర్ల కుక్కని పది డాలర్లకి బేరమాడాడు. పదిహేనుకి తగ్గనని దుకాణం యజమాని చెప్పాడు. దాంతో బేరం కుదరని హంకీ సమీపంలోని రెస్టారెంట్‌కి వెళ్లాడు.
ఓ టేబుల్ ముందు కూర్చున్న హంకీ ధరించిన డ్రెస్‌ని చూసి అతను డబ్బున్న వాడని బెట్టీ ఇట్టే గ్రహించింది. సిగరెట్ నోట్లో పెట్టుకుని ‘నిప్పుందా?’ అని అడిగితే ఆమె వంక చూడకుండానే తనకి సిగరెట్ అలవాటు లేదని చెప్పాడు. వెయిటర్ బిల్ తెచ్చాడు.
అతని పర్స్‌లోని డబ్బు చూసి బెట్టీ చెప్పింది.
‘నా పేరు బెట్టీ. అంత డబ్బుతో ఇలాంటి చోటికి రావడం మంచిది కాదు’
‘నాకు తెలుసు. కుక్కపిల్లని కొనడానికి తెచ్చాను’ హంకీ చెప్పాడు.
‘నాకూ కుక్కలంటే ఇష్టం’ బెట్టీ చెప్పింది.
అతను లేస్తే బెట్టీ అనుసరించింది. ఇద్దరూ సంతలో కొద్దిసేపు తిరుగుతూ గడిపారు. హంకీ తన గురించి చెప్పాడు. ముప్పై ఏళ్ల క్రితం చెకోస్లోవేకియా నించి అమెరికాకి వలస వచ్చాడు. రెండేళ్ల క్రితం భార్య పోయింది. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. బెట్టీ అతన్ని ఓ నికెల్ అడిగి తీసుకుని వెళ్లి జ్యూస్ బాక్స్‌లో ఓ పాట పెట్టింది.
కొద్దిసేపటికి హంకీ బాధగా రెండు చెవులు మూసుకున్నాడు. అతనికి చెవుల్లో చిన్న కూత లాంటి శబ్దం వినిపించసాగింది. అతను తలని బల్ల మీద ఆనించి బాధ పడటం గమనించిన బెట్టీ అడిగింది.
‘ఏమైంది?’
‘నాకు తెలీదు. ఇంటికి వెళ్తాను’ లేస్తూ చెప్పాడు.
* * *
‘ఏమైంది?’ తలకి ఐస్ పేక్ పెట్టుకున్న హంకీని చూసి జిప్సీ అడిగాడు.
హంకీ జవాబు చెప్పలేదు. బెట్టీతో సంతలో అతను తీయించుకున్న టేబిల్ మీది ఫొటోని చూసి అడిగాడు.
‘ఈమె ఎవరు?’
‘సంతలో పరిచయమైంది. చాలా మంచి అమ్మాయి. సంగీతం ఇష్టం. కుక్కలంటే ఇష్టం... వచ్చే ఆదివారం కూడా వెళ్లి... ఆ కుక్కని కొంటే?’ ఆలోచనగా చెప్పాడు.
నిజానికి తర్వాతి ఆదివారం కుక్క కోసం హంకీ సంతకి వెళ్లలేదు. మళ్లీ సంతలోని ఓ బార్‌లో బెట్టీ తారసపడింది.
‘మీరుండేది ఎక్కడ?’ అతని ఖరీదైన కారుని చూసి ప్రశ్నించింది.
‘ఇక్కడికి కొన్ని మైళ్ల దూరంలో. వస్తావా?’ ఆహ్వానించాడు.
* * *
‘ఇలాంటి చోట ఎవరైనా ఎలా ఉండగలరు?’ అతని చిన్న ఇంటిని ఆమె ఇబ్బందిగా చూసి ప్రశ్నించింది.
‘నాకు అలవాటై పోయింది’ హంకీ బదులు చెప్పాడు.
అతను కాఫీ కలిపే లోపల ఆమె రహస్యంగా అతని డ్రాయర్ సొరుగులు వెదికింది. డబ్బు దొరకలేదు కాని ఓ అరలో అతని పెన్షన్ బుక్ కనిపించింది. అందులోని బేలన్స్ లక్షా పదిహేడు వేల మూడు వందల డాలర్లు! ప్రతి నెల అయిదువేల డాలర్లు జమ అవడం గమనించింది. అకస్మాత్తుగా హంకీ పట్ల ఆమె ధోరణి చాలా మర్యాదగా మారింది.
‘ఇక్కడ ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. ఈ గదిలో కొన్ని ఫ్లవర్
పాట్స్, కర్టెన్స్ పెడితే అందం వస్తుంది’ కుర్చీలో కూర్చుని చెప్పింది.
‘అది వృధా ఖర్చు కదా?’ హంకీ చెప్పాడు.
‘డబ్బు దేనికి? ఖర్చు చేయడానికే... అప్పుడప్పుడూ ఎవరినైనా తెచ్చుకోవచ్చుగా?’ బెట్టీ అడిగింది.
‘అది నా జీవన విధానం కాదు. ఒక్కోసారి నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ నాతో ఇక్కడ ఉండడానికి ఒప్పుకునే వారు నాకు ఇంతదాకా తారసపడలేదు’
‘సిగరెట్ ఉందా?’ అడిగింది.
‘సారీ నాకా అలవాటు లేదు’
పక్క గదిలోంచి అప్పుడే వచ్చిన అసిస్టెంట్ పొలాస్కీ ఆ మాటలు విని ఆమెకి సిగరెట్ ఇచ్చి వెలిగించాడు.
‘మీరు సిటీకి వెళ్తూంటే నాకు లిఫ్ట్ ఇస్తారా?’ పొలాస్కీని కోరింది.
‘అలాగే’
కాఫీ తాగాక బెట్టీ అతని కారులో బయలుదేరింది.
‘సంవత్సరం క్రితం ఓ రాత్రి మనం కలిశాం’ దారిలో పొలాస్కీ చెప్పాడు.
‘నేను చెడ్డదాన్నని తెలుసన్నమాట’ బెట్టీ నవ్వింది.
‘అది చూసే కోణాన్నిబట్టి ఉంటుంది’
అకస్మాత్తుగా కారుని రోడ్డు పక్కన ఆపి ఆమెని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. బెట్టీ అభ్యంతరం చెప్పలేదు. అతను కారుని మళ్లీ ముందుకి పోనించాడు. ఆమె నివసించే హోటల్ పక్కన ఆపి ఆమెని దింపి వెళ్లిపోయాడు.
మెట్ల కింద సామానుతో కూర్చున్న తన రూమ్‌మేట్‌ని చూసి బెట్టీ అడిగింది.
‘ఏమైంది?’
‘మూడు నెలల నించి అద్దె కట్టడం లేదని నన్ను గదిలోంచి తరిమేశారు’
‘ఇది చట్ట వ్యతిరేకం. పోలీసులకి రిపోర్టు ఇస్తాను’ బెట్టీ చెప్పింది.
‘అందువల్ల నీకే నష్టం. నువ్వు గదిలోంచి దొంగిలించి అమ్మిన సామాను రేపు ఈపాటికి తేకపోతే నిన్ను జైలుకి పంపిస్తానని యజమాని చెప్పమన్నాడు. నేను మా ఊరు వెళ్లిపోతున్నాను. నువ్వేం చేస్తావు?’ రూమ్‌మేట్ అడిగింది.
బెట్టీ కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించింది.
* * *
అలారం బెల్ మోగింది. గది తలుపు తెరుచుకుని బయటికి వచ్చి హంకీ అలారాన్ని ఆపాడు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూండగా సోఫా మీద పడుకున్న జిప్సీ చెప్పాడు.
‘గుడ్మార్నింగ్’
‘లోపలికి ఎలా వచ్చావు?’ హంకీ తన భార్య ఏనే ఫొటోని తీసి, ఆ స్థానంలో బెట్టీ ఫొటోని పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు.
‘నువ్వు తరచూ పెళ్లి చేసుకుంటూంటే మంచిది. తలుపు లోపల గడియ పెట్టడం మర్చిపోతావు’ జిప్సీ నవ్వుతూ చెప్పాడు.
‘బ్రేక్‌ఫాస్ట్ రెడీ’ హంకీ తన బెడ్‌రూం తలుపు మీద కొట్టి చెప్పాడు.
‘టైమెంతయింది?’ బెట్టీ కంఠం బద్ధకంగా వినిపించింది.
‘మధ్యాహ్నం పనె్నండు ముప్పై ఆరు’
‘రాత్రంతా ఒకటే రైళ్ల చప్పుడు. సరిగ్గా నిద్రపట్టలేదు’ బెట్టీ విసుగ్గా ఫిర్యాదు చేసింది.
‘దానికి నేనేం చేయను? రైళ్లని ఆపలేనుగా?’ హంకీ చెప్పాడు.
బయటికి వచ్చిన బెట్టీ బ్రేక్‌ఫాస్ట్‌ని చూసి అసహనంగా చెప్పింది.
‘మళ్లీ బేకన్, ఎగ్సేనా?’
‘రాత్రి అది నీకిష్టం అని చెప్పావుగా?’
‘నేను చాలా చెప్పాను. అవన్నీ నిజం కావు. ఇక్కడ కూర్చుని రైలు పట్టాల వంకే చూస్తూండాలి. భలే జీవితం! నువ్వు వెంటనే రిటైరైతే మనం ఊళ్లోకి మారచ్చు. నీ పెన్షన్ డబ్బుతో మిత్రులు, సినిమాలతో అక్కడ జీవితం సరదాగా ఉంటుంది’
‘ఆరేళ్లల్లో రిటైరవుతాను. అప్పుడు చాలా పెన్షన్ వస్తుంది. అంతదాకా...’
‘ఆరేళ్లా! అంతదాకా ఇంతేనా?’ విసుగ్గా అడిగింది.
‘నేను రైలు పట్టాల ఇన్‌స్పెక్షన్‌కి వెళ్తున్నాను. నాతో వస్తే తాజా గాలి పీలుస్తూ ప్రకృతిని చూడచ్చు’ ఆహ్వానించాడు.
ఆమె సిగరెట్ వెలిగించి అతన్ని అనుసరించింది. పట్టాలని ఓ పరికరంతో కొడుతూ సమీపంలోని సొరంగం నించి బ్రిడ్జ్ దగ్గరికి ఆమెతో నడిచాడు. పర్వతాల్లోని ఆ పట్టాల పక్కన అంచు దగ్గరికి వెళ్లి కిందకి చూసిన బెట్టీకి కళ్లు తిరిగాయి. ఐదు వందల అడుగుల కింద పెద్ద లోయ. తూలే ఆమెని పట్టుకుని హంకీ ఆపాడు.
‘ఇక్కడ ఫెన్స్ ఎందుకు పెట్టలేదు?’ ప్రశ్నించింది.
‘నేను తప్ప ఎవరూ రారు కాబట్టి ఆ అవసరం లేదు’
‘హంకీ! ఆరేళ్లు ఆగడం దేనికి? గుండె జబ్బనో, రుమాటిజమనో చెప్పి ముందే రిటైర్ అవచ్చుగా? ఈ పట్టాల నించి దూరం అవడం నా జీవితంలోని ఆనందకరమైన భాగం అవుతుంది. నా కోసం ఆ పని చేయచ్చుగా’ అడిగింది.
‘కుదరదు’
ఆమె వెనక్కి తిరిగి కోపంగా ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత హంకీ బాధగా రెండు చెవులు మూసుకుని బ్రిడ్జి అంచు పట్టుకుని ఆగాడు. అతనికి చెవుల్లో చిన్న కూత లాంటి శబ్దం మళ్లీ వినిపించసాగింది. కళ్లు మూసుకుని వెంటనే హంకీ ఆ పరికరంతో పట్టాల మీద కొట్టాడు. అతనికి శబ్దం వినపడలేదు. ఈసారి బ్రిడ్జి ఇనప కమీల మీద గట్టిగా కొట్టాడు. చెవుల్లోని ఆ కూత తప్ప ఇంకే శబ్దం వినపడలేదు. అతనికి తల పగిలిపోతున్న భావన కలిగింది.
‘నాకు వినపడడం లేదు’ ఇంట్లోకి వచ్చిన హంకీ చెప్పాడు.
‘నేను నమ్మలేను. ఇంతసేపు బానే ఉన్నారుగా?’ బెట్టీ ఆందోళనగా చెప్పింది.
జిప్సీ సలహా మీద రైలు కంపెనీకి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పింది. అతన్ని తక్షణం రైల్వే హాస్పిటల్‌కి రమ్మని కోరారు.
‘ఏం జరిగింది?’ సైకిల్ మీద వచ్చిన పొలాస్కీ బయట కూర్చున్న జిప్సీని అడగడం విన్న బెట్టీ బయటికి వచ్చి చెప్పింది.
‘ఇంత ఆలస్యంగా వచ్చావా? నీ పడక పక్క షెడ్‌కి మార్చాను. ఇక నించి అక్కడే ఉండు’
‘ఆమె ఇక్కడ ఏం చేస్తోంది?’ బెట్టీ లోపలికి వెళ్లాక పొలాస్కీ అడిగాడు.
‘వాళ్లిద్దరికీ నిన్న రాత్రి పెళ్లయింది. నీకు తెలీదా?’ జిప్సీ అడిగాడు.
హంకీకి మర్నాడు కూడా చెవుల్లో కూత తప్ప మరో శబ్దం వినపడలేదు. మర్నాడు జిప్సీ కారుని డ్రైవ్ చేస్తూ హంకీని ఊరుకి తీసుకెళ్తూంటే హంకీ చెప్పాడు.
‘బహుశా ఇది మమ్మల్ని రైలు పట్టాల నించి దూరం చేయడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం అనుకుంటా’
ఆ సమయంలో ఇంట్లో బెట్టీతో పొలాస్కీ చెప్పాడు.
‘నిన్ను చూసినప్పటి నించి నిన్ను మర్చిపోలేక పోతున్నాను’
‘మరణిస్తే అంత్యక్రియలకే నీ దగ్గర డబ్బు లేదు’ బెట్టీ నిరసనగా చూస్తూ చెప్పింది.
* * *
కారు దిగి జిప్సీ లైబ్రరీలోకి వెళ్లాడు. హంకీ పక్కనే ఉన్న హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్ పరీక్షలు నిర్వహించి చెప్పాడు.
‘సారీ. నీకు చెవుడు వచ్చింది. ఐనా నాలుగైదు రోజుల తర్వాత ఇంకోసారి రా’
బయటకి వచ్చి రోడ్ దాటుతున్న హంకీకి కారు హార్న్ వినపడలేదు. డ్రైవర్ సరైన సమయానికి బ్రేక్ వేయకపోవడంతో కారు గుద్దుకుని కిందపడ్డాడు. డ్రైవర్ ఆందోళనగా కారు దిగి అతని దగ్గరికి వెళ్లాడు. చుట్టూ మూగిన అనేక మంది మాటలు హంకీకి వినిపించసాగాయి.
‘ఎలా ఉంది?’
‘ఎవరైనా అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి’
వెంటనే హంకీ నవ్వుతూ ‘అద్భుతం. వినిపిస్తోంది’ అంటూ లేచాడు. అతను కుక్క అరుపులు, చర్చి గంటలు, ట్రాఫిక్ రొద, విమానం ఎగిరే చప్పుళ్లని ఆనందంగా విన్నాడు.
* * *
తన ఇంటి తలుపు తెరవబోతూ, లోపల నించి బెట్టీ మాటలు విన్న హంకీ ఆగిపోయాడు.
‘ఇంక ఆరేళ్ల దాకా ఆగక్కర్లేదు. హంకీ వెంటనే రిటైరైపోతాడు. రైలు పట్టాల నించి దూరమవుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది’
తనకి వినిపిస్తుందని తెలిస్తే ఉద్యోగం కొనసాగించాల్సి వస్తుందని, అందుకు బెట్టీ బాధ పడుతుందని, తన భార్య ఆనందమే తన ఆనందం అనే నిర్ణయం తీసుకుని లోపలికి వచ్చాడు.
‘ఎలా ఉంది?’ లోపలికి వచ్చిన హంకీని పొలాస్కీ అడిగాడు.
హంకీ కొంతకాలం చెవిటి వాడిగా నటించ దలచుకున్నాడు. దాంతో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు.
అంతా భోజనానికి డైనింగ్ టేబిల్ ముందు కూర్చున్నారు.
‘రిటైర్ అవుతున్నాను. ఇంకో ఐదారు వారాల్లో నాకు పెన్షన్ వస్తుంది’ పొలాస్కీకి చెప్పాడు.
‘అంతదాకా నేనిక్కడే ఉండాలా?’ బెట్టీ అసహనంగా అడిగింది.
‘సూప్ బావుందా?’ పొలాస్కీ హంకీని గట్టిగా అడిగాడు.
చెవిటి వాడుగా నటించే హంకీ అది వినపడనట్లుగా జవాబు చెప్పలేదు.
‘ఇలాంటి ఒకవైపు సంభాషణకి నువ్వు అలవాటు పడాలి’ పొలాస్కీ బెట్టీతో చెప్పాడు.
‘ఐతే అది ఎక్కువకాలం కాదు’
‘అంటే?’ పొలాస్కీ ప్రశ్నించాడు.
‘నేను ఇతనితో ఉండబోవడం లేదు. నేను పెళ్లి చేసుకుంది ఆరోగ్యవంతుడ్ని. నా భర్త అంగవికలుడు. ఆ పెన్షన్ డబ్బు నా చేతిలో పడగానే దాంతో వెళ్లిపోతాను’
‘మరి ఈయన్ని పెళ్లెందుకు చేసుకున్నావు?’
‘డబ్బులేక రోడ్డు మీద పడడంతో. ఆ కష్టంలో నాకు ఎవరైనా ఒకటే. ఆయన అనారోగ్యం వల్ల నాకు విడాకులు వస్తాయంటావా?’
‘నా చెల్లెలు లాయర్ దగ్గర పని చేస్తోంది. ఆమెని అడుగుతాను’
‘నాకీ సహాయం నిజంగా చేస్తావా?’ బెట్టీ అర్థించింది.
‘నీ కోసం ఏదైనా చేస్తాను. ఈ చెవిటివాడు ఇక్కడ లేకపోతే అది చేసి చూపించేవాడిని’
‘అవుట్. ఇలాంటివి ఆయన ముందు చేయకు. ఆయన చెవిటివాడు తప్ప గుడ్డివాడు కాదు. నా వంక ఎలా చూస్తున్నాడో చూసావా?’ అంటూ ఆమె నవ్వుతూ కాలు వెనక్కి తీసుకుని చెప్పింది.
వారి మాటలకి హంకీ చకితుడయ్యాడు.
‘అతన్ని నా వంక అలా చూడద్దని చెప్పు. లేదా ఈ సూప్‌ని ఆయన కళ్లల్లోకి పోసేస్తాను’ బెట్టీ క్రోధంగా అరిచింది.
‘వద్దు. సహనం’
పొలాస్కీ వంక చూసి బెట్టీ పకపక నవ్వుతుంటే, ‘మంచి జోకా?’ అని హంకీ కూడా నవ్వసాగాడు.
‘నాకేం చేయాలని ఉందో తెలుసా? నిన్ను ఆ చెంపా ఈ చెంపా వాయగొట్టాలని ఉందిరా కోతి వెధవా. నేను పెళ్లి చేసుకుంది నిన్ను కాదు. నీ పెన్షన్ ఎకౌంట్‌ని’ బెట్టీ హంకీ వంక చూస్తూ చెప్పింది.
జోక్ విన్నట్లుగా హంకీ మళ్లీ నవ్వసాగాడు.
* * *
మర్నాడు ఉదయం కారు హార్న్ విని బెట్టీ పొలాస్కీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి ప్రశ్నించింది.
‘నా విడాకుల గురించి మీ చెల్లెలు లాయర్ని అడిగిందా?’
‘అడిగింది. విడాకులు కుదరదన్నాడు’
పొలాస్కీ జేబులోంచి బంగారు ఉంగరం తీసిచ్చి చెప్పాడు.
‘నా చెల్లెలి నించే కాదు. నీ కోసం ఎక్కడి నించైనా ఏదైనా దొంగతనం చేయగలను. నువ్వంటే నాకు పిచ్చి’
లోపల నించి టెలిఫోన్ బెల్ వినపడడంతో పొలాస్కీ పరిగెత్తుకెళ్లి రిసీవర్ తీసుకుని వచ్చే రైలుకి క్లియరెన్స్ ఇచ్చాడు.
‘హంకీని చూసావా? ఎప్పుడూ శవంలా పైకి చూస్తూ పడుకునే ఉంటాడు’ బెట్టీ చెప్పింది.
‘శవం అంటే గుర్తొచ్చింది. లాయర్ చెప్పాడు. హంకీ మరణిస్తే పెన్షన్ అంతా నీకే వస్తుందిట’ పొలాస్కీ చెప్పాడు.
‘కానీ ఈయన వందేళ్లు జీవించే మనిషిలా నాకు తోస్తున్నాడు’ బెట్టీ చెప్పింది.
పొలాస్కీ హంకీకి పేక ముక్కలని చూపించి ఆడదామని సైగ చేస్తే, లేచి వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు.
‘శవంతో దేనికి?’ బెట్టీ ప్రశ్నించింది.
‘నాకు ఎందుకో ఇతనంటే జాలి. హంకీకి కొద్దిగా వినిపిస్తుందేమో?’ పొలాస్కీ అడిగాడు.
కొద్ది క్షణాల తర్వాత హంకీ వెనక ఉన్న బెట్టీ ఓ వస్తువుని చప్పుడయ్యేలా నేలకేసి బాదింది. చేతిలోని కార్డుల వంక చూసే హంకీ తల తిప్పి చూడలేదు. అకస్మాత్తుగా ముందుకి వంగి బెట్టీ అతని చెవిలో ‘హా’ అని పెద్దగా అరిచింది. ఐనా అతనిలో చలనం లేదు.
‘చూశావా? ఏమీ వినపడలేదు’ బెట్టీ చెప్పింది.
‘మంచి కార్డ్ వచ్చింది. నేనే గెలుస్తాను’ హంకీ చెప్పాడు.
‘నువ్వు ఇతన్ని చంపరాదు? పట్టాల పక్కనే లోయ. ఆ అవకాశం తీసుకో. నువ్వు రేపు అతన్ని లోయలోకి తోసి చంపెయ్. పెన్షన్ డబ్బుతో మనం ఎటైనా వెళ్లిపోదాం’ ఆమె పొలాస్కీని కోరింది.
ఆ రాత్రి బెట్టీ రహస్యంగా పొలాస్కీ షెడ్‌లోకి వెళ్లడం హంకీ గమనించాడు.
* * *
మర్నాడు హంకీ పొలాస్కీతో కలిసి ట్రాక్ ఇన్‌స్పెక్షన్‌కి బయలుదేరాడు.
‘నేను చెప్పింది చెయ్యి’ బెట్టీ అరిచింది.
సిగరెట్ వెలిగించి ఇంట్లోనే పచార్లు చేస్తూ బెట్టీ ఆదుర్దాగా పొలాస్కీ కోసం వేచి చూడసాగింది. పావుగంట తర్వాత తలుపు చప్పుడైతే తెరిచింది. ఎదురుగా పొలాస్కీ మాత్రమే కనిపించాడు. ఐతే అతని వెనకే వచ్చిన హంకీని చూసి ఆమె ఆనందం క్షీణించింది.
‘ఎందుకు చంపలేదు?’ ప్రశ్నించింది.
‘నేనా పని చేయలలేనని నిన్న రాత్రే చెప్పాగా?’
‘ఒక్క క్షణం ధైర్యం చేయలేక పోయావు. ఐతే ఇంక నీతో నా వ్యవహారం ముగిసింది’ కోపంగా అరిచింది.
హంకీ ఆ మాటలు విన్నాడు. లోపలికి వెళ్లి డ్రెస్ చేసుకుని బయటికి వచ్చిన బెట్టీ చెప్పింది.
‘నేను వెళ్లిపోతున్నాను’
‘వెళ్లకు. నువ్వంటే నాకు పిచ్చి. దయచేసి నా మాట విను’ పొలాస్కీ వేడుకున్నాడు.
‘నువ్వెవరు నన్ను ఆపడానికి? నిన్న రాత్రి నువ్వు మాట ఇచ్చింది చేయలేదు. ఈ పిసినారి నించి ఆ పెన్షన్ డబ్బు నాకు రాదు. ఇక నీకూ నాకూ రాంరాం’
ఆమె తన గదిలోకి వెళ్లి సూట్‌కేస్ సర్దుకుంటూండగా పొలాస్కీ లోపలికి వెళ్లాడు. కోపంతో పొలాస్కీ ఆమె గొంతు పిసుకుతూండగా అరిచిన బెట్టీ అరుపుని హంకీ విన్నాడు. వెంటనే లోపలికి వెళ్లి అతని చేతుల్లోంచి ఆమెని విడిపించి కోపంగా అరిచాడు.
‘మూర్ఖుడా! ఈమె కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఈమెకంత విలువలేదు’
ఫోన్ మోగడం విని బయటికి వెళ్లాడు. ఆయన ఫోన్‌లో పక్క రైల్వేస్టేషన్ మాస్టార్‌తో మాట్లాడి రైలుకి క్లియరెన్స్ ఇవ్వడం విని ఇద్దరూ నిశే్చష్టులయ్యారు.
‘యూ డర్టీ ఇడియట్. నాకు తెలుసు. నువ్వు వినగలవని నాకు తెలుసు’ బెట్టీ అరిచింది.
సూట్‌కేస్‌తో బయటికి వెళ్తున్న బెట్టీని పొలాస్కీ బతిమాలుతూ అనుసరిస్తూంటే హంకీ చేతిని పట్టుకుని ఆపి చెప్పాడు.
‘నాలా దీపపు పురుగువి కాకు’
చేతిలో సూట్‌కేస్‌తో వెళ్తున్న బెట్టీని చూసి లోపలికి వచ్చిన జిప్సీ హంకీని నవ్వుతూ అడిగాడు.
‘ఇంటిని శుభ్రం చేశారన్నమాట’
జిప్సీ జేబులోంచి కుక్కపిల్ల అరుపులు వినిపించాయి. దాన్ని జిప్సీ ఇవ్వగానే హంకీ దాన్ని ప్రేమగా నిమురుతూ చెప్పాడు.
‘ఆ రోజు సంతలోంచి నిజానికి నేను దీనే్న తీసుకు రావాల్సింది’
*
(జోసెఫ్ కోఫ్టా కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి