కృష్ణ

దళారీ దోపిడీపై ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల: సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర లేకపోగా పేపరు కంపెనీకి చెందిన దళారీ అడ్డంగా దోచుకుంటున్నారని ఆగ్రహించిన రైతులు సోమవారం ఉదయం 65వ నెంబరు జాతీయ రహదారిపై కంచికచర్లలో రాస్తారోకో నిర్వహించి సుబాబుల్ కర్రను తగులబెట్టారు. గత వారం రోజులుగా రాజమండ్రికి చెందిన పేపరు మిల్లు యాజమాన్యం రవాణాదారుడు టన్నుకు రూ.650లకుపైగా రవాణా చార్జీల పేరిట గత కొన్ని నెలలుగా దోచుకుంటున్నాడని రైతులు పలు దఫాలు ఆందోళనలు చేశారు. శనివారం పేపరు మిల్లుకు లారీలు వెళ్లకుండా మిల్లు డంపింగ్ యార్డ్ ఎదురుగా రైతులు కర్రను అడ్డంగా తోలి రవాణా నిలిపివేసారు. దీనిపై కంచికచర్ల ఎస్‌ఐ శ్రీహరి జోక్యం చేసుకుని సోమవారం ఉదయం 10గంటలకు స్థానిక మార్కెట్ యార్డ్‌లో రైతులతో సమావేశం జరిగేంత వరకూ రవాణా నిలిపివేయాలని కోరారు. సోమవారం ఉదయం 10.30గంటలకు సమావేశం జరుగుతుందని ప్రకటించినప్పటికీ పేపరు మిల్లుకు చెందిన ఏజంట్ ఉదయం 7గంటలకే కాటా వద్ద లారీలకు కర్రను ఎత్తి పంపించడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న గొట్టుముక్కల, మొగులూరు, కంచికచర్లకు చెందిన పలువురు రైతులు డంపింగ్ యార్డ్ వరకూ హుటాహుటిన వెళ్లి లారీలను నిలుపుదల చేశారు. చర్చలు జరుపుతామని చెప్పి కర్ర రవాణా చేయడం అక్రమమని ఆగ్రహించిన రైతులు ట్రాక్టర్‌తో సుబాబుల్ కర్రను తీసుకువచ్చి కాటా ఎదురుగా జాతీయ రహదారిపై దింపారు. దీంతో జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమ వద్ద అక్రమంగా వసూలు చేస్తున్న రూ.650లకు లెక్క చెప్పాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర టన్నుకు రూ.4200లు చెల్లించాలని నినాదాలు చేసారు. అక్కడకు నందిగామ డీఎస్‌పీ రమణమూర్తి, రూరల్ సీఐ సతీష్, ఎస్‌ఐ శ్రీహరి సిబ్బందితో వచ్చి రైతులు, కర్రను తొలగించే ప్రయత్నం చేశారు. దీన్ని రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల సమక్షంలో జరిగిన హామీని గాలికి వదిలివేసి కాంట్రాక్టర్ కర్రను రవాణా చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యానికి చెందిన ప్రతినిధిని పిలిపించాలని కోరారు. దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై రైతులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఇదే సమయంలో కొందరు రైతులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులను హెచ్చరించారు. తాము తెచ్చిన పెట్రోల్ కర్రపై పోసి నిప్పు అంటించారు. తక్షణమే స్పందించిన పోలీసులు మంటలు లేవకుండా కర్రను తొలగించారు. రెండు గంటలకు పైగా రైతులు ఉద్యమించినప్పటికీ ఎమ్మెల్యే గానీ, ఇతర ప్రజా ప్రతినిధులు గానీ ఎవరూ రాలేదు. డీఎస్‌పీ రమణమూర్తి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావుతో మాట్లాడి సాయంత్రం నందిగామలో కంపెనీ ప్రతినిధులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. సమస్య తేలకపోతే రేపటి నుండి తిరిగి ఉద్యమిస్తామని గత ఐదు సంవత్సరాలుగా నిలువునా దోచుకుంటున్నారని, కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో సుబాబుల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బండి జానకి రామయ్య, గొట్టుముక్కల సహకార సంఘ అధ్యక్షుడు తాటుకూరు గంగాధరరావు, మాజీ సర్పంచ్ గుదె రంగారావు, వైసీపీ నాయకులు దమ్మాలపాటి వెంకట్రావు, గుదె వెంకటేశ్వరరావు, గుదె సాంబశివరావు, కంచికచర్ల, మొగులూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, అన్ని పార్టీలకు చెందిన రైతులు పాల్గొన్నారు.