కృష్ణ

గోదావరి పడవ ప్రమాదంతో జంక్షన్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్ : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంతో హనుమాన్ జంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గుడివాడ రోడ్‌లో ఉన్న వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్న కొందరు ఆదివారం విహార యాత్రకు గోదావరి పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు. ఐదుగురు సభ్యులు కలసి వశిష్ఠ బోటులో ఎక్కారు. బోటుకు ప్రమాదం జరగడంతో బోటులో అందరూ గోదావరి నదిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో హనుమాన్ జంక్షన్ నుంచి వెళ్ళిన ఐదుగురు సభ్యులలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందినవారు బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన అబ్దుల్ సలీం (24), పెదపాడు మండలం తాళ్ళమూడి గ్రామానికి చెందిన నడుకుదురు శ్రీనివాస్ (19) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన ముగ్గురు పెరికీడు గ్రామానికి చెందిన మద్దిల జోజిబాబు, గొరిపర్తి సుబ్రమణ్యం, బాపులపాడు గ్రామానికి చెందిన ఉంగారాల శ్రీను. మృతి చెందిన ఇద్దరు వడ్రంగి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. విహార యాత్రకు వెళ్ళిన వారిలో ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వడ్రంగి కార్మికుల మృతిపట్ల హనుమాన్ జంక్షన్ కార్పెంటర్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ప్రభుత్వ వైఫల్యంతో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం: సూరిబాబు
జి.కొండూరు, సెప్టెంబర్ 15: ప్రభుత్వ వైఫల్యంతో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యామని తెలుగుదేశం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్‌ఆర్ సూరిబాబు విమర్శించారు. ఆయన ఆదివారం జి.కొండూరులో విలేఖరులతో మాట్లాడుతూ ఇసుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. ఇసుకను చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ, మనరాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారన్నారు. ప్రసార మాధ్యమాలపై ఉక్కుపాదం మోపారన్నారు. చీకటి రాజ్యాన్ని సృష్టించారన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరబడ్డాయన్నారు. నిర్లక్ష్యం, అవినీతి పెరిగిందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. పడమటి కనుమల్లోని ఐరన్‌ఓర్‌ను ఎలా దోచుకున్నారో ఇసుకను ఇదే విధంగా దోచేస్తున్నారన్నారు. ఇసుక విధానం వల్ల పేద కార్మికుల కుటుంబాలకు పూట గడవటమే కష్టంగా ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు.
వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక
మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
* రాష్ట్ర మహాసభలో ఏకగ్రీవ తీర్మానం
చల్లపల్లి, సెప్టెంబర్ 15: వ్యవసాయ కార్మికుల ఉపాధిని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆక్వా సాగును వ్యతిరేకించాలని, వ్యవసాయ కార్మికులకు సమగ్ర కార్మిక చట్టం తీసుకురావాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 28వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు. స్థానిక కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో గత మూడు రోజులుగా వ్యవసాయ కార్మిక సంఘం 28వ రాష్ట్ర మహాసభలు, కామ్రేడ్ గుంటూరు బాపనయ్య శత జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు వివిధ తీర్మానాలను ప్రవేశ పెట్టగా మహాసభలో చర్చించి ఆమోదించారు. ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని, కూలీ రేట్లు పెంచాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు పేదలకు, వ్యవసాయ కార్మికులకు భూ పంపిణీ చేపట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు పరచాలని, వ్యవసాయేతర రంగాలలో అసంఘటితంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అమ్మ ఒడి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని సమావేశాల్లో తీర్మానించారు. అనంతరం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా దడాల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మరోసారి ఎన్నికయ్యారు. మహిళా కన్వీనర్‌గా వి శివనాగరాణితో పాటు 82 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మహాసభలకు సంఘం నేతలు పాటూరు రామయ్య, రైతు సంఘం మాజీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, వంగల సుబ్బారావు, యద్దనపూడి మధు, రాజేష్, సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు, మాగంటి హరిబాబు, నరసింహరావు, శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, అన్నం గగారిన్ తదితరులు పాల్గొన్నారు.