కృష్ణ

స్థానికేతరుల ఆశ్రయమిచ్చిన బందరు పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : మచిలీపట్నం పార్లమెంట్ అవిర్భావం నుండే స్థానికేతరులకు ఆశ్రయమిస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేసిన గెలిచిన వారిలో అత్యధికులు స్థానికేతరులే కావటం విశేషం. స్థానికంగా వారిని కాకుండా స్థానికేతరులనే ఈ ప్రాంత ప్రజలు పార్లమెంట్‌కు పంపారు. పార్లమెంట్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మొత్తం 17 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ 17 పర్యాయాల్లో 13 మంది ఎన్నికయ్యారు. వీరిలో తొమ్మిది మంది స్థానికేతరులు కాగా నలుగురు మాత్రం స్థానికులు కావడం విశేషం. ఏడుగురుని స్థానికులను ఇంటికి పంపారు. తొలిగా జరిగిన ఎన్నిక నాటి నుండి నిన్న జరిగిన ఎన్నిక వరకు బందరు ఎంపీగా స్థానికేతరులే నెగ్గుతూ వచ్చారు. 1952లో తెనాలి పార్లమెంట్ పరిధిలోని దివిసీమకు చెందిన సనకా బుచ్చికోటయ్య సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కెవి రామయ్యను ఓడించారు. ఆ తర్వాత 1957 లో మళ్లీ దివిసీమకే చెందిన కాంగ్రెస్ తరఫున మండల వెంకట కృష్ణారావు స్థానికుడైన యలమంచిలి నాగభూషణం (ఇండిపెండెంట్)ను ఓడించి పార్లమెంట్‌కు వెళ్లారు. 1962లో అదే దివిసీమ నుండి ఇండిపెండెంట్‌గా మండల వెంకట స్వామి పోటీ చేసి స్థానికేతరుడైన మండలి కృష్ణారావును ఓడించారు. 1967లో తెనాలి పార్లమెంట్ పరిధిలోని నిడుమోలు నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గుడివాడకు చెందిన సీపీఎం నేత మోటూరి హనుమంతరావును ఓడించి విజయం సాధించారు. 1971లో గుంటూరు జిల్లాకు చెందిన మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి మండల వెంకటస్వామిని పరాజితుల పాలు చేశారు. ఆ తర్వాత 1977, 80 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బందరు పార్లమెంట్ పరిధిలోని గుడివాడకు చెందిన మాగంటి అంకినీడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అయితే అంకినీడు 1977లో స్థానికేతరుడైన వడ్డే శోభనాధీశ్వరరావును ఓడించగా 1980లో స్థానికుడైన బూరగడ్డ నిరంజనరావును ఓడించారు. ఆ తర్వాత 1984, 89లో కూడా అదే గుడివాడ ప్రాంతానికి చెందిన స్థానికుడైన కావూరి సాంబ శివరావు విజయం సాధించారు. సాంబ శివరావు చేతిలో ఓడిపోయిన వడ్డి రంగారావు, బి గంగాధర చౌదరి ఇద్దరూ స్థానికులే కావడం విశేషం. 1991లో తెనాలి పార్లమెంట్ పరిధిలోని మొవ్వ మండలానికి చెందిన కొలుసు పెద రెడ్డియ్య టీడీపీ తరఫున పోటీ చేసి గతంలో రెండు పర్యాయాలు వరుసగా ఎంపీగా ఎన్నికైన కావూరి సాంబశివరావును ఓడించారు. 1996లో అదే కెపి రెడ్డయ్యపై గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన స్థానికుడు, ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కావూరి సాంబశివరావు కైకాలను ఓడించి మూడవ సారి ఎంపీ అయ్యారు. 1999లో తెనాలి పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డకు చెందిన స్థానికేతరుడు అంబటి బ్రాహ్మణయ్య స్థానికుడైన కావూరి సాంబశివరావుపై విజయం సాధించారు. 2004లో కూడా స్థానికేతరుడిని విజయం వరించింది. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాడిగ రామకృష్ణ పోటీ చేసి స్థానికేతరుడైన అంబటి బ్రాహ్మణయ్యను ఓడించారు. 2009, 2014 ఎన్నికల్లో బందరు పార్లమెంట్ వాసులు స్థానికుడికే పట్టం కట్టారు. ఈ రెండు విడతలు మచిలీపట్నంకు చెందిన కొనకళ్ల నారాయణరావు టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు స్థానికేతరులైన బాడిగ రామకృష్ణ, కొలుసు పార్థసారథిలను కొనకళ్ల ఓడించారు. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని బాలశౌరికి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు ఓట్లు వేసి పార్లమెంట్‌కు పంపడం విశేషం. మొత్తంగా చూస్తే బందరు పార్లమెంట్‌లో స్థానికేతరుల హవానే కొనసాగుతూ వచ్చిందనడంలో సందేహం లేదు.

అభయాంజనేయునికి మల్లెలతో అర్చన

హనుమాన్ జంక్షన్, మే25: స్థానిక అభయాంజనేయునికి శనివారం మల్లెలతో అర్చన నిర్వహించారు. హనుమజ్జయంతి ఉత్సవాలను పురస్కరించుని ప్రత్యేక అర్చన నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు తెలిపారు. స్వామివారికి ప్రభాత సేవ, మల్లెల అర్చన, వెండి, బంగారు పూలతో నక్షత్ర హారతి తదితర పూజలు స్వామివారికి జరిగాయి. నల్లజర్లకు చెందిన శ్రీరామకృష్ణ భజన సమాజం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం,బొమ్మూలూరు శ్రీకోదండ రామాంజనేయ భజన సమాజం ఆధ్వర్యంలో 58సార్లు చాలీసా పారాయణం, ఎస్.యం సుభాని ఆధ్వర్యంలో సినీ భక్తి రంజని, కడియాల విజయ భాస్కర రావుసమర్పించిన సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. ఉత్సవాలలో రెండోరోజున స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.

రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తా

పామర్రు నుండి ఎన్నికైన కైలే అనిల్‌కుమార్

పామర్రు, మే 25: కుల, మత, రాజకీయాలకు అతీతంగా పామర్రు నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందిస్తానని పామర్రు నూతన ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఓటర్ల తీర్పు తరువాత ప్రజలందరూ తనకు సమానమన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్న ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరు, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న కొమరవోలు లాంటి గ్రామాలలో కూడా తన పట్ల ఆ గ్రామాల ప్రజలు విశ్వాసం చూపించటం ఆనందాన్ని కలిగించిందన్నారు. కృష్ణాజిల్లాకు పామర్రు మండలం నిమ్మకూరులో ప్రజా సంకల్ప యాత్రలో జగన్ పాదయాత్ర నందు కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతానని ప్రకటించారని, త్వరలో జిల్లాకు ఆ పేరు వచ్చేలా తాను కృషి చేస్తానన్నారు. నెమ్మలూరు వద్ద నిర్మిస్తున్న బెల్ కంపెనీ నిర్మాణం జరిగేలా నూతన ముఖ్యమంత్రి జగన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో త్వరితగతిన నిర్మాణం జరిగేలా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అంతర్గత రోడ్లను పునః నిర్మిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలో మహిళల ఓట్లు, రైతుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, వారి అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి మరింత నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే పామర్రు నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ప్రజల సహకారం, తన పార్టీ నేతల సహకారంతో కృషి చేసి ఉత్తమ శాసనసభ్యుడిగా పేరు తెచ్చుకుంటానని కైలే అనిల్ కుమార్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా శనివారం తాడేపల్లి వెళ్లి జగన్‌ను కలిసినట్లు కైలే అనిల్ కుమార్ తెలిపారు.

ఇసుకకు అనుమతులు ఇస్తే సహించం

తోట్లవల్లూరు, మే 25: మండలంలోని రొయ్యూరు శివారు రావిచెట్టులంక కృష్ణానదీపాయ వద్ద ప్రైవేటు ఇసుక క్వారీకి అనుమతులు ఇస్తే సహించేది లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇక్కడ ఓ రైతు పొలంలో ఇసుక తవ్వకాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పొలంలో ఎంత లోతున ఇసుక మేట ఉంది అనే అంశాన్ని పరిశీలించేందుకు వ్యవసాయాధికారి జివి శివప్రసాద్, విఆర్‌ఓ రామ్‌కుమార్ శనివారం వచ్చారు. సదరు రైతు పొలంలో బుల్‌రోజర్‌తో ఇసుక లోతును పరిశీలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు జరిపితే వరదలకు భూమి కోతకు గురై గ్రామానికి ప్రమాదం ఏర్పడుతుందని, భూగర్భ జలాలు అడుగంటుతాయని సత్యనారాయణ అన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బుల్‌రోజర్‌ను నిలిపివేశారు. విషయాన్ని తహశీల్దార్ ఎస్ శ్రీరామకృష్ణకు తెలపగా ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే అనుమతులు ఇవ్వమని చెప్పారు. దీంతో బుల్‌రోజర్‌ను వదిలి పెట్టారు. నెల రోజుల క్రితం కూడా ఇలాగే అడ్డుకున్నారు.