కృష్ణ

అమాత్యగిరీకి గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : ఇప్పుడు అందరినీ తొలిచే ప్రశ్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో జిల్లా నుండి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఈ విడత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ పాగా వేసింది. గతంలో ఎన్నడూ లేని మెజార్టీలతో ఆయా నియోజకవర్గ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. విజేతల్లో అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వారితో పాటు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండగా రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయిన వారు కూడా ఉన్నారు. అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులు ఇస్తారా..? లేక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మెప్పు పొందిన వారికి అవకాశం ఇస్తారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అసలు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయనేది కూడా ప్రశ్నార్ధకంగానే ఉంది. మంత్రి పదవులను ఆశించే వారిలో తొలి వరుసగా సామినేని ఉదయభాను, కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు, కొలుసు పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొక్కిలిగడ్డ రక్షణనిధితో పాటు వసంత కృష్ణప్రసాద్‌లు ఉన్నారు. తూర్పు కృష్ణా నుండి ఎన్నికైన వారిలో సామినేని ఉదయభాను ఒక్కరికే ప్రాధాన్యతను సంతరించుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని దివంగత నేత వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడు. వైఎస్‌ఆర్ మరణానంతరం సామినేని జగన్‌కు బాసటగా నిలిచారు. గత ఎన్నికల్లో ఓటమిని చవి చూసినా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాపు సామాజిక వర్గం నుండి సామినేనికి దాదాపు మంత్రి పదవి ఖరారైనట్టు తెలుస్తోంది. అలాగే పశ్చిమ కృష్ణా నుండి మైలవరంలో మంత్రి దేవినేని ఉమాను చిత్తుగా ఓడించిన వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. మైలవరంలో వసంత-దేవినేనిల మధ్య పోటీ రాష్ట్ర ప్రజలను సైతం ఆకర్షితులను చేసింది. తెలుగుదేశంలో ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న దేవినేనిని ఎదుర్కొనేందుకు వసంత కృష్ణప్రసాద్ ధీటుగా నిలబడి వైఎస్‌ఆర్ సీపీ జెండాను ఎగుర వేశారు. ఎస్సీలకు మంత్రి పదవి ఇచ్చే తిరువూరు నుండి పోటీ చేసి రెండవ సారి విజేతగా నిలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. తూర్పు కృష్ణాకు వస్తే కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) పేరు ప్రథమంగా వినిపిస్తోంది. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన కొడాలి నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించి గత దశాబ్ద కాలంగా బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబును విమర్శించే విషయంలో ఏ మాత్రం బెరుకు ప్రదర్శించకుండా ఏకిపారేస్తున్నారు. గుడివాడలో వరుసగా నాల్గవ సారి విజయం సాధించిన కొడాలి నానికి మంత్రి పదవి దాదాపు ఖాయంగా తెలుస్తోంది. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో కూడా కొడాలి తొలిగా ఉండటం మరింత విశేషం. గతంలో వైఎస్‌ఆర్ హయాంలో మంత్రిగా పని చేసిన కెపి సారథి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ పటిష్ఠతకు కృషి చేశారు. అలాగే బందరు నుండి పోటీ చేసిన పేర్ని వెంకట్రామయ్య (నాని) సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. నానికి ఏ మేర మంత్రి పదవి వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్‌గా కొనసాగిన పేర్ని నాని జగన్ పార్టీ స్థాపనతో రెండేళ్ల పదవీ కాలం ఉన్న పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. నాటి నుండి పార్టీని కష్టకాలంలో నీరశించకుండా తన వ్యక్తిగత స్టామినాతో పాటు జగన్ పోరాట పటిమతో కార్యకర్తలను నూతనోత్సాహపరుస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా బందరు పోర్టు భూముల విషయంలో రైతులకు బాసటగా నిలిచారు. సామాజిక వర్గీకరణలే పేర్నికి అడ్డంకిగా మారాయి. కాపు సామాజిక వర్గం నుండి పశ్చిమ కృష్ణాలో సామినేనికి మంత్రి పదవి ఇస్తే పేర్నికి మొండి చెయ్యి చూపక తప్పదు. తొలి సారిగా విజేతలుగా నిలిచిన వారి నుండి మంత్రులుగా తీసుకునే ఆలోచన ఉంటే జిల్లా నుండి ఎవరిని తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అవనిగడ్డలో శాసనసభ ఉపసభాపతిని ఓడించిన సింహాద్రి రమేష్‌కు అవకాశం ఇస్తారా లేక ఎన్టీఆర్ సొంత గడ్డ పామర్రులో అత్యధిక మెజార్టీతో గెలిచిన కైలే అనీల్ కుమార్‌కు ఎస్సీ సామాజిక వర్గం నుండి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.