రాష్ట్రీయం

త్వరలోనే డిఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వేల టీచర్ పోస్టుల భర్తీ
రెండు నెలల్లో జిహెచ్‌ఎంసి, నారాయణఖేడ్ ఎన్నికలు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
వారంలో నామినేటెడ్ పదవులకు శ్రీకారం
త్వరలోనే బస్సు యాత్ర.. జిల్లాల్లో మకాం
కార్యాచరణ ప్రకటించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్, నవంబర్ 24: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జనవరి 30లోపు పూర్తవుతాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ తెరాస విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో ప్రజలు దీవించిన స్ఫూర్తితోనే హైదరాబాద్‌లోనూ దీవిస్తారన్నారు. హైదరాబాద్‌లో నేరుగా 80 డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఉప ఎన్నికల్లో తెరాస విజయం తరువాత తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. 15నుంచి 20 వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని, త్వరలోనే నియామకాల కోసం డిఎస్సీ నిర్వహించనున్నట్టు చెప్పారు. 14 ఏళ్లక్రితం నాటి క్వాలిఫై టీచర్లు ఉన్నారని, సుమారు 800 మందివరకు ఉన్న వీరిని త్వరలోనే ఉద్యోగాల్లో నియమించనున్నట్టు చెప్పారు. వారం రోజుల్లో నామినేటెడ్ పదవుల పంపకం ప్రారంభించనున్నట్టు చెప్పారు. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, రాష్టస్థ్రాయి కార్పొరేషన్ల నియామకాలు త్వరలోనే చేపట్టనున్నట్టు చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని వచ్చే మార్చినుంచి అన్ని వర్గాల పేదలకూ వర్తింపజేయనున్నట్టు తెలిపారు. కాలేజీ హాస్టల్ విద్యార్థులకు సైతం సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు పథకాల రూపకల్పన ప్రభుత్వ వ్యవహారాలపైనే దృష్టిసారించి, కార్యకర్తలకు కొంతవరకు దూరమయ్యానన్నారు. ఇకపై కార్యకర్తలను తరుచూ కలుసుకుంటానని చెప్పారు. పథకాలకు సంబంధించి కార్యాచరణ పూరె్తైందని, ఉద్యమ సమయంలో చెప్పినట్టుగా దగ్గరుండి ప్రాజెక్టుల పనులు చూస్తానన్నారు. గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఎన్నికల తరువాత రాష్టంలో బస్సు యాత్ర చేపడతానన్నారు. హైదరాబాద్‌లో తక్కువ సమయం ఉంటానని, ఒక్కో జిల్లాలో వారం పది రోజులపాటు ఉంటానని, ప్రాజెక్టుల పని పరిశీలిస్తానని సిఎం తెలిపారు. ఉద్యమ సమయంలో దగ్గరుండి ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తానని చెప్పాను. ఇప్పుడా పని చేస్తానన్నారు. 2020-2021 నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఇప్పుడింకా మూడున్నరేళ్ల సమయం ఉంది. ఆ తరువాత మరో ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ గురించి అవగాహన లేకుండా విపక్షాలు మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో వివాదాలు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయనున్నట్టు తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు లభించేలా ప్రాజెక్టు రీ డిజైనింగ్ జరుగుతుందన్నారు. ఆంధ్ర పాలకులు గొలుసుకట్టు చెరువులను విధ్వంసం చేశారని, 46వేల 500 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయకు అంతర్జాతీయంగా అభినందనలు లభించాయని చెప్పారు.
గృహ నిర్మాణ పథకానికి కేంద్రానికి కొత్తగా ప్రతిపాదనలు పంపనున్నట్టు చెప్పారు. ఏపీకి మంజూరు చేసిన పథకం, తెలంగాణలో చేపట్టిన పథకం వేర్వేరుగా ఉందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారని, ఏపీకి మంజూరు చేసిన తరహాలోనే గృహ నిర్మాణ పథకం తెలంగాణకు మంజూరు చేస్తారని చెప్పారు. ఆరులక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారి కోసం కేంద్రం, బ్యాంకుల సహకారంతో గృహ నిర్మాణ పథకం చేపట్టనున్నట్టు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో జర్నలిస్టులకు కూడా స్వల్పంగా కోటా నిర్ణయించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు 33వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్టు తెలిపారు.
ప్లానింగ్ వర్క్ అయిపోయినందున కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలపై సైతం దృష్టి సారించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 40నుంచి 50వేల మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీరికి ప్రయోజనం కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి, వచ్చే ఏడాది లక్ష ఇళ్లు, ఆ తరువాత వరుసగా రెండేసి లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 15-20 రోజుల్లో పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్దిదారులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేస్తారని, గ్రామాలను మాత్రం ఎమ్మెల్యే ఎంపిక చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.
జానారెడ్డి గులాబీ కండువాకు సిద్ధం కావాలి
ప్రాజెక్టులు పూర్తి చేస్తే గులాబీ కండువా కప్పుకొని తెరాసకు తాను కూడా ప్రచారం చేస్తానని గతంలో జానారెడ్డి అన్నారని, ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఆయన గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేయడానికి సిద్ధం కావాలని కెసిఆర్ చమత్కరించారు. (చిత్రం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్