కథ

నైతిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
భర్త చనిపోయినప్పుడు కూడా రాజేశ్వరి అంత భయపడలేదు. పిల్లల భవిష్యత్ పాడవ్వకూడదంటే, ధైర్యంగా నిలబడి, తెలివిగా జీవితంతో పోరాడాలనుకొంది. తమకున్న ఆరెకరం కొబ్బరి తోటతో పిల్లలిద్దరి పోషణ, చదువు సాగడం సాధ్యం కాదని తెలిసినా కంగారుపడలేదు. పుట్టింటివారి సహకారంతో, భర్త తోబుట్టువుల సహాయంతో జాగ్రత్తగా జీవితాన్ని నెట్టుకొస్తోంది. కాని, ఆ రోజు జరిగిన సంఘటన ఆమెను వణికించింది. ఏం చేయాలో తెలియని అయోమయం ఆమెను ఆవరించింది. తనకు నష్టం జరిగితే ధైర్యంగా ఎదుర్కోగలదు. కాని, ఆ రోజు తనకు కాక, తన వల్ల మరొకరికి జరిగింది. వాళ్లకు జరిగిన నష్టం తను పూడ్చలేదు. భర్త అన్న, తమ్ముడు వచ్చి, ‘జరిగిందానికి, నీకూ ఏ సంబంధమూ లేదు. నువ్వేం భయపడకు’ అని చెబుతున్నారు. కాని, తను అలా అనుకోలేకపోతోంది.
కొబ్బరి తోపులతో కళకళలాడే కోనసీమలోని ఓ గ్రామం అది. గోదావరి ప్రక్కన రమణీయమైన దృశ్యాలతో అలరారే పచ్చని ఊరు. వరద ఊర్లోకి రాకుండా ఏటిగట్టు, దానికి ఈవల వైపున పంట కాల్వ, కాల్వను ఆనుకొని కొబ్బరి తోటలు, వాటిల్లో ఇల్లు, వాటిని కలుపుతూ తారురోడ్లతో కేరళలోని కొన్ని గ్రామాలను తలపింపజేస్తుంది. ఊరికి చివర వరి మాగాణీలు, మధ్యమధ్యలో కొబ్బరి తోటలు, వాటిలో అక్కడక్కడ మామిడి, సపోట లాంటి పండ్ల చెట్లుగల ఆ దృశ్యం ప్రకృతి సహజత్వానికి ప్రతిరూపంలా కనిపిస్తుంది. రాజేశ్వరి భర్త సోమేశ్వర్రావు ఉమ్మడి కుటుంబం నుంచి పంచుకొన్న అరెకరం కొబ్బరి తోటలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అందులోని మామిడిచెట్టు పళ్లను అమ్మడం ద్వారా ఓ చిల్లర మామిడి పళ్ల వ్యాపారితో పరిచయమై, అతని ద్వారా అన్నవరం, విశాఖపట్టణం మధ్యలో మామిడి తోటలు కౌలుకు తీసుకొని, మామిడి పళ్లను లారీల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే హోల్‌సేల్ వ్యాపారితో పరిచయం అయింది. ఇంట్లోని బంగారం, వెండి అమ్మి, అతని వ్యాపారంలో పావలా వాటాకి భాగస్వామై, బాగానే సంపాదిస్తుంటే, భగవంతునికే కన్ను కుట్టిందా అన్నట్లు అతను ప్రయాణిస్తున్న టాక్సీకి యాక్సిడెంటైంది. అందులోని మిగతా వారు చిన్నచిన్న గాయాలతో బయటపడగా, అతనికి ఆ మాత్రం దురదృష్టం సరిపోదన్నట్లు మరణవాతకు గురయ్యాడు. విధి నిర్ణయానికి తలొగ్గి, పిల్లల భవిష్యత్తే తన జీవితంగా జీవనం సాగిస్తున్న రాజేశ్వరికి మరింత కఠినమైన పరీక్ష పెట్టాడు ఆ పైవాడు.
వీరన్న కండలు తిరిగిన నిగనిగలాడే నల్లని శరీరంతో ఎంత శారీరక కష్టాన్నైనా తట్టుకోగల బలశాలిగా చూడగానే ఎవరైనా భావిస్తారు. అతనిది కొబ్బరికాయలు దింపు తీసే (కొబ్బరి చెట్లెక్కి కాయలు కోయడం) వృత్తి. రాజేశ్వరి వారం రోజులుగా తమ తోటలో దింపు తీయమని అడుగుతోంది. అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ రోజు అతడు మరో దింపతన్ని తోడుచేసుకుని రాజేశ్వరి తోట ప్రక్క నాలుగెకరాల తోటలో దింపు తీస్తున్నాడు.
‘మాలాంటి చిన్నచిన్న వాళ్ల దింపు ఎందుకు తీస్తావులే! నీ చేత దింపు తీయించుకోవాలంటే, కనీసం నాలుగెకరాల ఆసామీ అయినా అయి ఉండాలి’ అంది రాజేశ్వరి తన తోక సరిహద్దులో అతను దింపు తీస్తుండగా.
‘అది కాదమ్మగారూ! ఈ తోటలో తీత్తున్నప్పుడు పనిలో పనిగా మీ తోటలో కూడా తీద్దామనుకొన్నానండి. ఇంతలోనే మీరు అంత మాటనేశారు’
‘ఈరోజైనా తీస్తావా? అక్కడయ్యేటప్పటికి ఆలస్యమై పోయిందని వెళ్లిపోతావా?’
‘లేదమ్మగారూ! ఈ రోజెలా అయినా మీ తోటలో దింపు తీసేత్తానండి’
‘సరే. చూస్తాను. ఈ రోజు నువ్వు మాట నిలబెట్టుకోలేక పోతే, వేరే అతనికి పురమాయిస్తాను’
‘మీ మావయ్యగారికి ముందు నించీ మీ తోటల్లో మా తాత, మా నాన్న, నేను దింపులు తీత్తున్నాం. మీరిప్పుడు వేరోడికి పుర్మాయిత్తారా? ఈ రోజు ఎలా అయినా తీత్తనని చెబుతున్నాను కదమ్మా’
‘సరే అయితే’
ఆ నాలుగెకరాల్లో దింపు పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండయిపోయింది. ‘అన్నం తినొచ్చేత్తానమ్మా! వత్తానంటే ఈ సూరిగాణ్ణి కూడా తీసుకొత్తానండి. లేకపోతే, నేనొక్కణ్ణే అయినా వచ్చి తీసేత్తాను’ అని రాజేశ్వరితో చెప్పి వీరన్న భోజనానికి బయలుదేరబోయాడు.
‘ఈ రోజింక రాడితడు. కాని వస్తానంటున్నాడు’ అనుకొని రాజేశ్వరి, ‘సరే, బద్దకించకుండా రా మరి!’ అంది.
‘మాటంటే మాటేనండి. రాకుండా ఉండనంటే ఉండను’
‘పెద్ద సత్యహరిశ్చంద్రుడు మరి. మాటంటే మాటేనట’ మనసులో అనుకొంటూ వెనుదిరిగి నవ్వుకొని, ఇంట్లోకి వెళ్లిపోయింది.
నాలుగ్గంటలకు రాజేశ్వరి నిద్రలో ఉండగా వీధి వాకిట్లో నుంచి ‘అమ్మగారూ!’ అన్న వీరన్న కేక వినిపించింది. ఏప్రిల్ నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉండి, బడలికగా అనిపించి నడుం వాల్చింది. నిద్ర పట్టేయడంతో ఉలిక్కిపడి లేచింది. పాఠశాలలకు ఒంటిపూట సెలవులవడంతో పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. కొబ్బరికాయలను చెట్ల దగ్గర్నుంచి తెచ్చి, ఒకచోట పోయడానికి పిల్లలు కూడా తనకు తోడుగా ఉంటారని వాళ్లను కూడా నిద్ర లేపింది.
కొబ్బరి చెట్లు కల్పవల్లులుగా నాలుగు ప్రక్కలా గెలలు గెలలుగా కాయలు దిగి, ఆకుపచ్చని ఆకులతోనూ, కొన్ని పండుటాకులతోనూ, కొన్ని ఎండిపోయిన ఆకులు వేలాడుతూనూ జీవితంలోని వివిధ దశలను ఒకేసారి చూపిస్తున్నట్లున్నాయి. దింపు తీసి రెండు నెలలయింది. సాధారణంగా అయితే, కొబ్బరి తోటల రైతులు నెలకొకసారి గాని, నెలా పది రోజులకొకసారి గాని దింపులు తీయిస్తారు. దింపు తీసే పనివాళ్లు తగ్గిపోవడంతో ఒకోసారి ఇలా రెండు నెలలు పట్టేస్తోంది. అందువల్ల కాయలు రాలిపోయి, అవి వేరే వాళ్ల చేతుల్లో పడి రైతుకు నష్టం వస్తోంది. కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర లేక కూడా రైతు మరింత నలిగిపోతున్నాడు.
‘అయ్యగారున్నప్పుడు నేను రావడానికి బద్దకిత్తే, ఇంటికొచ్చి మరీ కేకలేసి తీసుకొచ్చేవోరు. మీరు నేను కనిపిత్తే అడుగుతున్నారు. లేకపోతే ఊరుకొంటున్నారు. మా ఇంటికి కబురెట్టడానికి పిల్లలు కూడా పెద్దోళ్లు కాకపోయారు. ఇక మీద నుంచి ఆలస్యం చేయనె్లండి’ అంటూ మొదటి చెట్టు ఎక్కుతున్నాడు వీరన్న. అతను మాట్లాడుతుంటే ఏదో వాసన వస్తోంది. రాజేశ్వరి పెద్దగా పట్టించుకోలేదు.
‘నువ్వు దింపు తీశాక, కొబ్బరికాయల వ్యాపారి అర్జన్నగారు వచ్చి కాయలు తీసుకెళితే, నా చేతికి నాలుగు డబ్బులొస్తాయి. మాకిదే కదా ఆధారం. పైగా కాయలు రాలిపోతున్నాయి. ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్ల కాయలు రాలినప్పుడు నేను చూడకపోతే, ఎవరొకరు పట్టుకుపోతున్నారు. అలా జరుగుతుంటే, ఇల్లు జరగడం మరింత కష్టమైపోతోంది. అందుకే, నిన్ను అన్నిసార్లు అడిగి విసిగించవలసి వస్తోంది. పాపం, ప్రొద్దుట్నుంచీ అలసిపోయి ఉన్నావు. అయినా నిన్ను ఇబ్బంది పెట్టక తప్పడంలేదు’ అంది రాజేశ్వరి. ఇంటర్మీడియెట్ చదువుకున్న ఆమె పనివాళ్ల ఇబ్బందెరిగి మాట్లాడటమే కాక, గౌరవంగా కూడా మాట్లాడుతుంది.
‘మా గంగ ‘పొద్దెట్నుంచీ కట్టపడ్డావు కదా మామా! ఇంకెళ్లకు’ అందండి. ‘ఈ ప్రేమంతా రాత్రికి చూపిద్దువుగానిలే!’ అని వచ్చేశానండి.’
ఆ మాటలు విని రాజేశ్వరి నిర్ఘాంతపోయింది. అతని అమాయకత్వం గురించి తెలుసు కాబట్టి, ‘ఇతనికి ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు’ అనుకొని ఆ ఇబ్బందికర పరిస్థితిని తేలికపరచుకొంది. అతను చెట్లెక్కుతూ యధాలాపంగా అనేశాడు తప్ప, ఆమెకు కలిగిన ఇబ్బంది అతనికి తెలీదు. ‘నీ పిల్లలిద్దరూ బడికి వెళుతున్నారా?’ అంటూ మాట మార్చాలనుకొందామె.
కాని, అప్పటికతను చెట్టును సగానికి పైగా ఎక్కేయడంతో తను మాట్లాడ్డం ఆపింది. అతను కాయల వరకూ ఎగబ్రాకాడు. దింపు తీసేవాళ్లు చెట్టుకు నిచ్చెన వేసి, కొంతవరకూ దాని సహాయంతో ఎక్కి, తర్వాత నడుముకున్న తాటినారతో చేసిన ఓ పెద్ద తాడును చెట్టు చుట్టూ వేసి, మరల నడుముకు మరో ప్రక్క నుంచి వచ్చిన అదే తాడు రెండో చివరకు తగిలించుకొంటారు. అలా తగిలించుకోవడానికి అమరికుంటుంది. నడుం వెనక ఓ చెక్కముక్క ఆ తాడుకి అమర్చి ఉంటుంది. అక్కడ కత్తి పెట్టుకునే అమరిక ఉంటుంది. కాళ్లకు బంధం వేసుకొనేందుకు అదే రకం తాడు చెక్కకున్న కొక్కేనికి తగిలించి ఉంటుంది. మొత్తం ఈ అమరికంతటినీ ‘దింపు బల్ల’ అంటారు. కొక్కేనికి తగిలించుకున్న తాడు తీసి, కాళ్లకూ బంధం వేసుకుని, ఆ రెండు తాళ్ల సహాయంతో మిగతా చెట్టును ఎక్కుతారు. వీరన్న తయారైన కాయలన్నీ కత్తితో కోసి, కత్తిని వెనుక తగిలించుకుని, దిగబోతుంటే, నడుముకున్న తాడు రెండు చివరలను కలుపుతూ అతను వేసిన లంకె తప్పుకుంది. అక్కడ్నుంచి భయంతో పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. ఆ తల్లీ పిల్లలు భయంతో వణికిపోతూ అతన్ని చూస్తున్నారు. అతని తల గట్టిగా ఉన్న ఓ దుక్కు బెడ్డకు బలంగా తగిలేసింది. దుక్కు దున్నినప్పుడు బెరడు బెరడుల్లా లేచిన మట్టిని దుక్కు బెడ్డలంటారు. అంత బలిష్ఠమైన శరీరమున్న ముప్పై ఏళ్ల వీరన్న అక్కడికక్కడే మరణించాడు. మరణం ఆసన్నమైనప్పుడు ఏ బలమూ మనిషిని కాపాడలేవు. రాజేశ్వరిని వణికించేలా విధి పెట్టిన పరీక్షిదే!
పదిమందీ గుమిగూడారు. ఎవరో ఒకతను శ్వాస పరీక్షించి, ‘చచ్చిపోయాడు’ అన్నాడు. ‘బ్రాందీ తాగి చెట్టెక్కినట్లున్నాడు. బ్రాందీ వాసన వస్తోంది. తాగిన తిమ్మిరిలో తాడు సరిగ్గా తగిలించుకోలేదేమో!’ అని కూడా అతనే అన్నాడు.
‘మందేసుకొని దింపుకు రావడం ఏమిటి? తెలివితక్కువ పనిచేసి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు’ అన్నాడు రాజేశ్వరి బావగారు.
‘అవును’ అంటూ ఆమె మరిదిగారు అన్నను సమర్థించాడు.
రాజేశ్వరి మాత్రం వీరన్నకు రోషం వచ్చేలా మాట్లాడి, అలసిపోయి ఉన్న అతను దింపుకు వచ్చేలా చేసినందుకు కుమిలిపోతోంది. అలుపును మరిచిపోవడానికి మద్యం తాగి వచ్చాడు. అంటే, ఆ సమయంలో అతను మద్యం తాగడానికి కూడా తనే కారణం. మధ్యాహ్నం కూడా ఆ నాలుగెకరాల రైతు తోటలో దింపు తీయవలసి ఉండి, అక్కడ చనిపోయినా బాగుండును. ఆ రైతుకు మరో పదెకరాల మాగాణి ఉంది. పట్టణంలో వ్యాపారాలున్నాయి. అతనైతే నాలుగైదు లక్షలు నష్టపరిహారంగా ఇవ్వగలిగేవాడు. ఆ డబ్బు వీరన్న భార్యకు, పిల్లకు ఉపయోగపడేది. తను వాళ్లకు ఏమివ్వగలదు? తన బావగారూ, మరిదిగారూ తను నష్ట పరిహారం ఇవ్వకుండా ఉండే పరిస్థితి కలిగించాలని చూస్తున్నారు. కాని, తను అలా అనుకోవడం లేదు. ఇవ్వలేని పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడంలేదు. తానేదొకటి చేసి, అతని భార్యాపిల్లలు వీధి పాలవకుండా చేయాలి.
ధైర్యంగా ముందుకు అడుగు వేసింది. భర్త మీద పడి, ‘నన్ను అన్నాయం చేసి ఎళ్లిపోయావా మావా!’ అని ఏడుస్తున్న గంగ దగ్గరికి వెళ్లి, ఆమె తల పైకెత్తి, ‘్భయపడకు గంగా! నేను నిన్ను వదిలేయను. నాకున్నదే చెరో ముద్ద పంచుకొని తిందాం! నా పిల్లలతోపాటే నీ పిల్లలూ చదువుకుంటారు. నన్ను నమ్ము!’ అంది రాజేశ్వరి. ఆమె మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు.
‘వాడు మందు తాగి, ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటే, నీకెందుకమ్మాయి వాళ్ల బాధ్యత?’ అన్నారు రాజేశ్వరి వర్గంవారు.
‘ఆ యమ్మ తోట్లో దింపు తియ్యడానికొచ్చి చచ్చిపోయాడు కాబట్టి ఆ యమ్మదే బాద్దెత. అయని, ఆ ఎమ్మే ఆ కుటుంబోనాకి ఏదేనా చెయ్యాలనుకొంటుంటే, అడ్డంపడతారేందయ్యా?’ గంగ తరుపు ఆడా, మగా గట్టిగా అన్నారు.
‘తింగరి రాజేశ్వరి’ అనుకొని, నోళ్లు నొక్కుకున్నారు ఆమె బంధువులు.
రాజేశ్వరి చెవిలోకి ఎవరి మాటలూ వెళ్లడంలేదు. తాను అన్న మాట ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తోంది. ‘నిలబెట్టుకోలేనేమో!’ అని భయపడుతోంది.
వీరన్న శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రాజేశ్వరి బంధువులు ‘తాను దూర సందు లేదు, మెడకో డోలు’ అన్నట్లు ఏంటి నీ ధైర్యం? వాళ్లకెలా నష్టపరిహారం ఇస్తావు? దింపు తీయడం వాడి వృత్తి. ఆ వృత్తిలో వాడు చనిపోయాడు. నీ తప్పేముంది? నీ అమాయకత్వాన్ని వాళ్లు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఎంతో తెలివైన దానవనుకొన్నాం ఇన్నాళ్లూ! ఇంత తింగరితనం ఏంటి నీకు?’
‘తింగరితనం కాదు, నైతిక బాధ్యత. దాన్ని నిర్వర్తించడానికి ఏదొకటి చేయక తప్పదు’
బంధువులు ‘నీ ఖర్మ’ అని మనసులో అనుకొని వెళ్లిపోయారు.
రాజేశ్వరి డ్వాక్రా మహిళ. తమ గ్రూప్‌నకు తనే సెక్రటరీ. తారీఖు దాటకుండా సభ్యుల దగ్గర డబ్బులు వసూలు చేసి బ్యాంక్‌లో కట్టేస్తుంటుంది. అలా చేయడం వల్ల తమ గ్రూపంటే బ్యాంక్ వాళ్లకు ఓ ప్రత్యేకమైన అభిమానం
ఉంది. పైగా, కొత్తగా వచ్చిన మేనేజర్ ఓ మహిళ. మొదటి పరిచయంలోనే ఆమె తన మీద ఎంతో ఆత్మీయత చూపింది. తను బ్యాంక్‌కు వెళ్లిన ప్రతీసారీ ఆమె ఎంత పని వత్తిడిలో వున్నా, పలకరింపుగా ఆప్యాయత నిండిన ఓ చిరునవ్వును తనవైపు ప్రసరింపజేస్తుంది. రెండు కుటుంబాలు బ్రతకడానికి సరిపడే ఆధారం ఆమె ద్వారా ఏర్పడగలదనిపించింది. ఆలస్యం చేయకుండా వెళ్లి, ఆమెను కలిసింది. తన తోట, ఇల్లు హామీగా పెట్టుకొని, అప్పివ్వమని అడిగింది. తనకు పుస్తకాలకు బైండింగ్ చేయడమంటే చాలా ఇష్టం. తన పిల్లల పుస్తకాలకు ఎప్పుడూ తనే బైండింగ్ చేస్తుంది. తన ఇష్టాన్ని అర్హతగా భావించి, ఇల్లు, తోట హామీగా తీసుకొని, ఆమె లోన్ ఇవ్వడానికి ఒప్పుకొంది. తన పని అంత సులభంగా అవుతుందని తను భావించలేదు. అది తన గొప్పతనం అనుకోలేదు. తను తీసుకొన్న బాధ్యతలో ఉన్న మహత్యం అనుకొంది.
ఇద్దరి పనివాళ్లతో బైండింగ్ పని తనింటిలో మొదలైంది. ఆ ఇద్దరూ, తనూ, గంగ. నోట్ పుస్తకాలు తయారుచేయడానికి కావలసిన కాగితాన్ని కొనడానికి డబ్బు సరిపోకపోతే, బ్యాంక్ మేనేజర్ తన పరపతి ఉపయోగించి అరువిప్పించింది. జూన్ నెల నాటికి నోట్ పుస్తకాలు తయారుచేసి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వారి సహాయంతో మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు పుస్తకాలన్నింటినీ అమ్మేసింది. మంచి లాభమే వచ్చింది. డ్వాక్రా మహిళ కావడంతో ప్రభుత్వం పన్ను విషయంలో కొంత రాయితీ ఇచ్చింది. స్టేషనరీ షాపుల వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొని, మరలా తయారీ మొదలుపెట్టింది. అలా.. అలా.. వ్యాపారం దినదిన ప్రవర్థమానంగా ఎదగనారంభించింది. అలా తన పరిశ్రమ ఇంటి నుంచి ప్రధాన రహదారి ప్రక్కన కొన్న స్థలంలోకి మారింది. అందుకోసం అక్కడ ఇటక, సిమెంట్‌లతో చుట్టూ గోడ, పైన రేకులంతా ఓ పెద్ద నిర్మాణం చేసి, అందులో యంత్రాలు పెట్టి, నూట యాభై మంది పనివారిని నియమించింది. గంగను అర్థం చేసుకొన్న అబ్బాయితో ఆమెకు పెళ్లి చేసింది. అతనిక్కూడా తన పరిశ్రమలోనే ఉద్యోగమిచ్చింది. వీరన్న పిల్లలను తన పిల్లలతోపాటే ఓ పెద్ద ప్రైవేటు పాఠశాలలో చదివిస్తోంది. ఇల్లు బాగు చేయించుకొంది. ఓ కారు కూడా కొనుక్కుంది. ఈ సిరంతా ఆ రోజు తను తీసుకొన్న బాధ్యత పుణ్యమే అని ఎప్పుడూ తలుచుకొంటూ ఉంటుంది.
ఓ స్ర్తి ఒంటరిగా ఇంత సాధించడం బంధువులకు మొదట ఈర్య కలిగినా, తర్వాత అలవాటుపడి సంతోషించారు.
ఏదేమైనప్పటికీ, బ్రతుకు భారంగా లేకపోవడంతో రాజేశ్వరి తానున్న కోనసీమలోని ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించగలుగుతోంది.

-టి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు.. 9908893669