కథ

పులి నెదిరించిన లేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఓ అడవి. అది చిట్టడివే. అయినా చీమలు దూరుతాయి. అది కారడివే. అయినా కాకులు దూరుతాయి. అటవీ శాఖ వారు తమ జీపులూ మందీమార్బలంతో యధేచ్ఛగా దూరుతారు. ఇక వేటగాళ్ల సంగతి వేరేగా చెప్పనవసరం లేదు. అటవీ శాఖ వారి సహకారంతో అప్పుడప్పుడూ, వాళ్ల కళ్లుగప్పి తరచూ దూరిపోతుంటారు.
ఆ అడవి మధ్యన ఎప్పుడూ పారే ఓ ఏరు ఉంది. దానికి రెండు వేపులా ఏపుగా పెరిగిన పచ్చిక ఉంది. ఆ పచ్చికను కడుపారా భోంచేసి, ఏటి నీళ్లు తాగి చెట్లనీడన విశ్రమించటానికి, కుందేళ్లు, లేళ్లూ, అడవి దున్నలూ వస్తాయి. వాటిని వేటాడి కడుపు నింపుకోవటానికి, చిరుతలు, పులులు, గుంటనక్కలు వస్తాయి.
ఏరుకు రెండు వేపులా పెరిగిన వృక్షాల్ని ఆశ్రయించి బ్రతికే పక్షులూ, వచ్చిపోయే శాకాహార, మాంసాహార జంతువులతో ఏరు ప్రాంతం అంతా చిన్నపాటి నగరంలా కళకళలాడుతూ ఉంటుంది.
ఆ అడవిలో ‘కృష్ణ’ అనే మగజింక ఉంది. బంగారు రంగు చర్మం, తెలుపురంగు చుక్కలు, సమ్మోహపరిచే కళ్లు, సన్నటి నడుము, బలిష్టమైన పొడవైన కాళ్లు, తల మీద ‘కిరీటం’లా అందమైన కొమ్ములున్నాయి. ఏటి ఒడ్డున మొలిచిన పచ్చగడ్డి మేస్తూ, హాయిగా ఉంటోంది.
తమ పూర్వీకులకు గొప్ప చరిత్ర ఉందని, రామాయణ భారతాల్లోనే కాకుండా, ఈజిప్టు గ్రీకు పురాణాల్లో తమ ప్రసక్తి ఉందని కృష్ణకు తెలుసు. బుద్ధుడు లాంటి మహా పురుషులు తమను ఒళ్లోకి తీసుకుని ముద్దు చేసేవారని దానికి తెలుసు. ఆదిదేవుడు శివుడు తమలో ఒకరిని చేతిలోకి తీసుకోవటం వల్లే ఆయన ‘సారంగపాణి’ అయ్యాడని కృష్ణకు గర్వంగా ఉండేది. తన వంశాన్నీ దాని గొప్పతనాన్ని తలుచుకుంటే కృష్ణకు వొళ్లు పులకరించేది. రోజూ పచ్చిక ముట్టే ముందు ఆ పరమశివుడిని తలుచుకుని మరీ మేతకుపక్రమించేది. తన బలిష్టమైన దేహం, బంగారు రంగు చర్మం, పొడవై శాఖలుగా విస్తరించిన కొమ్ములు, ఠీవి చూసి, ఆడలేళ్లు జతకట్టటానికి పోటీ పడుతుంటే కృష్ణకు గర్వంగా ఉండేది.
ఎప్పటిలా, ఓ రోజు కృష్ణ ఏటిగట్టుకు వచ్చింది. లేత పచ్చికను కడుపారా మేసింది. చల్లటి ఏటి నీటిని తాగింది.
మిట్టమధ్యాహ్నం, చల్లటి చెట్ల నీడ, పక్షుల కలకలరావాలు, కడుపు నిండా మేసిన పచ్చగడ్డి, తీయని సెలయేటి నీరు - కృష్ణకు తన్మయత్వం కలిగింది. ‘పరమేశ్వరా! ఎంత గొప్ప జీవితాన్నిచ్చావు తండ్రీ. నీకు ధన్యవాదాలు’ అనుకుంటూ, బెత్తెడు తోకను ఊపుకుంటూ, బంగారు రంగు చర్మం అంతా పులకరిస్తూంటే, స్వర్గం అనేది మరెక్కడో లేదని, ఇదేనని, పరిసరాలను విస్మరించేంతగా ఆనందం కలిగింది.
అంతటి తన్మయత్వం, ఆనందం ఒక్కసారిగా చెదిరిపోయి నట్లనిపించింది కృష్ణకు. కడుపు నిండిన తన్మయత్వంలో తాను తేలియాడుతుంటే, కడుపు నింపుకోవటానికి చెట్ల నీడన పులి మాటేసి తనవేపు వస్తోందని కృష్ణకు అర్థం అయ్యింది.
తప్పనిసరియై, ఎక్కడలేని చురుకుదనం తెచ్చుకుని.. ఛెంగుఛెంగున గంటకు అరవయి కిలోమీటర్ల వేగంతో పరుగందుకుంది కృష్ణ.
నోటికి అందబోయే కూడు దూరమవడంతో, ఆకలితో ఉన్న పులికి కోపం వచ్చింది. అంతే వేగంతో కృష్ణను వెంబడించింది. ప్రాణం దక్కించుకోవటానికి ఒక జంతువు, ఆకలి తీర్చుకోవటానికి మరో జంతువు అలా పరుగు పెడుతూనే ఉన్నాయి.
అలా పరిగెడుతూనే కృష్ణ పులితో అంది. ‘పులిరాజా! నేనెవరికీ అపకారం చేసిన దాన్ని కాదు. నా మానాన నేను ఏటిఒడ్డున పెరుగుతున్న పచ్చిక తింటూ, సెలయేటి నీరు త్రాగుతూ బ్రతుకుతున్నాను. ననె్నందుకు చంపాలని నా వెంటబడ్డావు? ఇది అన్యాయం, ఆ పరమేశ్వరుడు ఎలా మెచ్చుతాడు?’
అందుకు జవాబుగా పులి ‘నేనేం చేసేది కృష్ణా! ఆ పరమేశ్వరుడే నిన్ను వేటాడి కడుపు నింపుకోమని నిర్ణయించాడు. ఇది అధర్మం కాదు. ప్రకృతి ధర్మం’ అంది.
కృష్ణ వెనుక పులి - అలా పరుగెడుతూనే ఉన్నాయి. దొరికించుకోవాలని ఒకరు; దొరక్కూడదని మరొకరు.
పరుగెత్తీ, పరుగెత్తీ, కృష్ణకు ఆయాసం వస్తోంది. దాని సన్నని కాళ్లూ, నడుము నొప్పెడుతున్నాయి. ఒక్కోసారి ‘గేలప్’ మూడు మీటర్ల దాకా ఉంటోంది. కాని దాని అందమైన కిరీటం లాంటి కొమ్ములు చెట్ల కొమ్మల్లో, అడవి తీగల్లో ఇరుక్కుపోతున్నాయి. పరుగు మందగిస్తోంది. అయినా, తెలివిగా, లేనిబలం తెచ్చుకుంటూ పులికి చిక్కకుండా పరుగెడుతోంది.
అలా పరుగెడుతున్న కృష్ణకు భాగవతంలోని గజేంద్రుడు గుర్తుకు వచ్చాడు. ఎన్నో దినాల ప్రార్థనానంతరం విష్ణుమూర్తి చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడిని కాపాడాడట!
‘అమ్మో! అన్ని రోజులే!’ అనుకుంది. రోజుల మాట దేవుడెరుగు. ఏ క్షణాన్నయినా పులి తన మీదకు లంఘించవచ్చు. దేవతల కంటే, ఆడదేవుళ్లు నయం. ఎంతైనా మాతృహృదయం’ కదా అనుకుంది.
‘తల్లీ! జగజ్జనని. పార్వతీమాతా! నువ్వే శరణు’ అంటూ స్తుతించటం మొదలుపెట్టింది కృష్ణ.
పైన కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నందినెక్కి విహారానికి బయలుదేరరు.
కృష్ణ ఆర్తనాదం పార్వతి చెవినపడింది.
కృష్ణ ఎంతటి శివభక్తుడో పార్వతికి తెలుసు. శివయ్య ఆగకుండా, పట్టించుకోకుండా పయనించటం కొంచెం ఆశ్చర్యం కలిగింది. నందీశ్వరుణ్ని ఆగమంది. సర్వజ్ఞుడైన శివయ్యకు ఈ కృష్ణ ఉదంతం అంతా తెలుస్తూనే ఉంది. అయినా ఆవిడ నోటి నుండే వినాలనుకున్నాడు. సమయం దొరికినప్పుడెల్లా ఒకర్నొకరు ఆట పట్టించుకుంటారు. అదో సరదా...
‘ఏం దేవతలండి మీరు? ‘్భక్త సులభుడు’ ‘ఆశ్రీత పక్షపాతి’ అన్న బిరుదులు కూడా! మిమ్మల్ని తలవందే పచ్చికముట్టని ఆ మూగజీవి, పులికి ఆహారం అవుతుంటే చోద్యం చూస్తున్నారు ఇదేం న్యాయం? అసలు మీకు మనసంటూ ఒకటి ఉందా?’ అంటించసాగింది ఆ జగజ్జనని.
జవాబుగా ‘నేనేం చేసేది పార్వతీ! పులి జింకను వేటాడ్డం సహజం. ప్రకృతి ధర్మం. తమను తాను రక్షించుకునే ప్రయత్నం ఎవరికి వారు చేయాల్సిందే’ అన్నాడు శివయ్య.
వారి సంభాషణ కృష్ణ వింటూనే ఉంది. ‘ఇక తనను ఏ దేవుడూ రక్షించలేడు’ అనుకుంది. పరమేశ్వరా! ఇన్నాళ్ల నా భక్తికి ఇదా ఫలం’ అనుకుంది.
వెర్రి ఆవేశం వచ్చింది. పరుగెడుతున్నదల్లా ఆగి పులికి ఎదురు నిలుచుంది.
‘ఎప్పుడు కృష్ణ వేగం తగ్గుతుందా - ఎప్పుడు దాని వీపున పంజా విసిరి నేలకు కూల్చి, గొంతును నోటకరిచి, వెచ్చని రక్తం రుచి చూద్దామా’ అని అనుకుంటున్న పులికి అలా కృష్ణ ఆగిపోవటం, ఎదురునిలవటం, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసాయి.
ప్రకృతి ధర్మాన్ని తు.చ. తప్పకుండా అమలుపరిచే పరమేశ్వరా! నీకు కోటిదండాలు’ అనుకుంది పులి.
ముందు కాళ్లు రెంటినీ ముందుకు చాచి, వాడిగోళ్లను పంజాలోంచి బయటకు తీసి, గాల్లో ఎగిరి కృష్ణ మీద వాలిపోవటానికి ముందుకు దూకింది పులి.
‘ఎవరికి వారు తమను తాము రక్షించుకోవాల్సిందే’ అన్న శివయ్య మాటలు కృష్ణ చెవుల్లో గింగురుమంటున్నాయి. ధైర్యం కూడగట్టుకుంది. తలను దించి తన కొమ్ముల్తో పులి బరువును మోయటానికి తనను తాను సమాయత్తం చేసుకుంది.
పులి ముందు కాళ్లు, వాటికున్న వాడిగోళ్లు కృష్ణ మెడ మీద పడకముందే, పులి మెడ క్రింద కృష్ణ కొమ్ములున్నాయి.
సుమారు వంద కిలోల పులి బరువు కృష్ణ కొమ్ముల మీద పడింది. తమాయించుకుంది. ఉదుటున తన కొమ్ముల్ని ఒక్క ‘జర్కు’తో పైకి లేపింది.
పులి ముందు కాళ్లు గాల్లో అలాగే తేలి ఉన్నాయి. కృష్ణ వాడికొమ్ముల కొసలు పులి గొంతులో అంగుళం మేర దిగబడ్డాయి.
ఊహించని ఈ పరిణామానికి, వేటాడే పులీ, వేటాడబడే జింక క్షణంపాటు తెల్లబోయాయి.
తన కొమ్ముల మీద ఆనిన పులినీ, దాని శరీరాన్ని బలంగా విదిలించింది. కృష్ణ కొమ్ములు పులి మెడలో మరింత లోతుకు దిగబడ్డాయి.
అనుకోని ఈ ఘటనకు పులి బిత్తరపోయింది.
ఆహారం మాట దేముడెరుగు. ఇప్పుడు దాని ప్రాణమే గాలిలో కలిసిపోయేలా ఉంది.
తన వెనుక కాళ్లను నేల మీద ఆన్చి, బాధతో గర్జిస్తూ పులి తన మెడను ఎత్తింది. కృష్ణ కొమ్ముల మీది నుండి పులి మెడ వేరు పడింది.
వెచ్చని కృష్ణ రక్తం చవి చూడాలన్న పులి గొంతుకే రక్తసిక్తం అయింది. ‘బ్రతికి ఉంటే ఆకో అలమో తిని ప్రాణాలు నిలుపుకోగలను’ అనుకుని వెనుదిరిగి చూడకుండా పరుగందుకుంది పులి.
మధ్యాహ్నపు ఎండలో పులి రక్తంతో తడిసిన కొమ్ముల కొసలు పగడాల తొడుగుల్లా మెరుస్తున్నాయి.
కృష్ణ ధైర్యానికి దేవుడు బహూకరించిన పురస్కారాల్లా మిలమిలలాడుతున్నాయి.
తోకముడిచి పారిపోతోన్న పులి వేపు ఆనందంగా చూసింది కృష్ణ.
‘బాబ్బాబు... నన్ను తినకు, వదిలిపెట్టు’ అని పులిని వేడుకున్నా, ఆపద్బాంధవా, అనాథ రక్షకా అని ఆకాశం వేపు చూస్తూ ప్రార్థించినా, అడ్రసే గల్లంతయ్యేది. ఎదురు నిలిచి పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాను’ అనుకుంది.
ఇదంతా ఆకాశం పై నుండి చిద్విలాసంగా శివయ్యా, ఉత్కంఠతో ఆ జగజ్జనని చూస్తూనే ఉన్నారు.
‘దేవీ!’ శివయ్య చెప్పుకు పోతున్నాడు. ‘్భలోకపు కాలమానం ప్రకారం క్రీ.శ.పందొమ్మిదో శతాబ్దంలో ‘డార్విన్’ అనే మానవమాత్రుడు ‘్ధర్యంతో పోరాడే వాడే బ్రతికి బట్ట కడతాడని’ అన్నాడు.
మరేం మాట్లాడలేదు పార్వతి. వాళ్లాయనను ఆక్షేపించినందుకు ఆమెకూ అపరాధ భావం కలిగింది.
బసవయ్యను ఇంటిదారి పట్టమంది.
కొమ్ముల కంటిన పులి రక్తం పగడపు తొడుగుల్లా మెరుస్తుంటే, మందవేపు నడిచింది కృష్ణ.

-కూర చిదంబరం.. 8639338675