కథ

ఎవరికి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
వనజకి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కోపంతో, ఉడుకుమోత్తనంతో దహించుకు పోతోంది.
నిన్న సాయంత్రం ముగ్గురూ కలిసొచ్చారా! తలోదిక్కునా ఉద్యోగాలు చేసుకునే ముగ్గురూ కలిసెట్లా వచ్చారని అడిగితే కలిసి రాలేదు, వీధి చివరే కలుసుకున్నాం అన్నారు ముగ్గురూ కలసికట్టుగా. ఆలస్యమైందేంటని అడిగితే ఇంక మొదలుపెట్టారు, తలా ఒక కథ చెప్పడం.
ఎంతో నిదానంగా, ప్రశాంతంగా ఉండే తన భర్త ఆఫీస్‌లో బాస్‌తో గొడవైందంటే ఎంత కంగారుపడింది తను? గొడవలంటే ఏంటో తెలియనట్టుండే ఆయన బాస్‌తో గొడవ పడ్డాడంటే అసలు ఏం జరిగిందో, ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుందేమోనని తను గాభరా పడిపోతుంటే - తీరిగ్గా ‘రిజిగ్నేషన్ లెటర్ వాడి మొహాన కొట్టి వచ్చాను. ఇంక రేపట్నించి ఆఫీసుకి వెళ్లక్కర్లేదు’ అంటాడా? ఎంత బాస్‌తో గొడవైతే మాత్రం ఉద్యోగం వదులుకుంటారా ఎవరైనా? ఊళ్లోనే వేరే బ్రాంచికి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి, కుదరలేదూ, పొరుగూరికి వెళ్లడానికైనా సిద్ధపడాలి. అదీ ఇష్టంలేదూ, ఆ బాస్‌గాడు బదిలీ మీద వెళ్లిపోయేదాకా - ఆర్నెల్లో, సంవత్సరమో - సెలవు పెట్టేసుకుని హాయిగా ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని నెలకి డెబ్బై వేల జీతమొచ్చే బంగారంలాంటి ఉద్యోగం అంత తేలిగ్గా వదులుకుంటారా బుర్రున్న వాళ్లెవరైనా? ఆత్మాభిమానం ముందు డబ్బు బలాదూర్ అంటాడు మాట్లాడితే. ఉద్యోగమూ, సంపాదనా ఒదులుకున్నాక ఆత్మాభిమానం తిండి పెడుతుందా? ఆత్మాభిమానం ఉన్నవాళ్లు ఉద్యోగం వదులుకోవడానికి సిద్ధపడతారా? ఉద్యోగమన్నాక పై అధికారులతో ఒక మాట పడవలసి వస్తుంది. మన తప్పుంటే తలకాయొంచుకుని పోవాలి. అవతలి వాళ్లదే తప్పయితే వాళ్లు మనకి క్షమాపణలు చెప్పేలా తెలివిగా వ్యవహారం నడుపుకోవాలి. అవసరమైన చోట సర్దుకుపోవాలి. అంతేగాని పౌరుషానికి పోయి, ఆవేశపడి ఆధారా న్నొదులుకుని జారి కింద పడితే అభిమానవంతు లవుతారా? ‘అంత మాత్రం ఆలోచన లేని మనిషయిపోయాడేమిటి ఈయన? అని తనెంత బాధపడింది.
ఆయన సంగతట్లా ఉంటే తన పుత్రరత్నం సంగతో? స్నేహితులతో కలిసి వేరే ఉంటాడట, ఇల్లు వెతుక్కుని వచ్చాడట, అందుకే ఆలస్యమైందట. అన్నాచెల్లెళ్లంటే ఇట్లా ఉండాలి అనిపించేట్టుండేవారు తన కొడుకు, కూతురు. అటువంటిది కూతుర్ని తను అతిగారాబం చేసి వాణ్ణి నిర్లక్ష్యం చేస్తోందట. అందుకని వాడింక దానితోపాటుగా ఈ ఇంట్లో ఉండడట.
నిజమే! ఈ మధ్య తను కూతుర్ని కాస్త అపురూపంగానే చూసుకుంటోంది. ఎందుకు? దానికి పెళ్లీడొచ్చింది. సంబంధాలొస్తున్నాయి. పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక దానింట్లో దాని తిప్పలు అది పడాలి. తమ ఇంట్లో ఉన్న ఈ నాలుగురోజులైనా కడుపులో పెట్టుకుని చూసుకోవాలని తల్లిగా తనకి అనిపించడం తప్పా? అయినా వాడికి, దానికి తనేం పెద్ద తేడా చూపించింది? అది అడిగినప్పుడల్లా దాని కిష్టమైన టిఫిన్లు, కూరలు చేసి పెడుతోంది. వాటిల్లో ఏదో ఒకటి వాడి కిష్టం లేకపోతే ‘ఆడపిల్ల, ఇంక మనింట్లో ఎన్నాళ్లుంటుందిరా? ఈ నాలుగు రోజులు దానిష్ట ప్రకారమే కానివ్వరాదూ? కాస్త సర్దుకుపోలేవా?’ అని తననన్నదని వాడికి రోషమొచ్చింది. వేరే ఇల్లు తీసుకుని ఉంటూ హోటల్లో తింటే ప్రతిపూటా వాడికిష్టమైన వంటలే చేసిపెడతారా వాళ్లు? వాళ్లే గడ్డిపెడితే అదే తినాలిగా అప్పుడు వాడు. వాడి లాప్‌టాప్ వాడు పెట్టినచోట ఉంచకుండా పక్కకి పెట్టిందని ‘నా వస్తువులు సక్రమంగా ఉండనివ్వదు. ఇల్లంతా దానిష్ట ప్రకారమే సర్దుకోవాలా?’ అంటూ చిందులేశాడు. స్నేహితులతో కలిసి వేరే ఇంట్లో ఉంటే వాళ్లు ఇల్లంతా వీడిష్ట ప్రకారం సర్దుతారు కాబోలు.
ఇంక కూతురి విషయానికొస్తే- ‘నువ్వెక్కడికీ వెళ్లక్కర్లేదు. నేనే వెళ్లిపోతాను’ అంటూ అన్నతో వాదనకు దిగింది. ‘ఎటూ పెళ్లి చేసుకుని వెళ్లిపోతాను కదా! అప్పటిదాకా ఓపిక పట్టు’ అంటోందనుకుంది తను. ‘అమ్మయ్య! ఇదొక్కతైనా తెలివిగా మాట్లాడుతోంది’ అని సంతోషించేలోపే అదొక బాంబు పేల్చింది. యాభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పల్లెటూరి బళ్లో తెలుగు టీచరు అర్జంటుగా కావాలట, ‘నే వెళతాను’ అంటూ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ ఇచ్చేసొచ్చిందట. అందుకే రావడం ఆలస్యం అయిందట. నాలుగు రోజుల్లో ఆర్డర్స్ రావడమూ, రిలీవయి అక్కడ చేరిపోవడమూ జరిగిపోతాయట. పెళ్లయితే ఎట్లాగూ వాళ్లాయన ఎక్కడ ఉంటే అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లాలి కదా? ఈలోపలే ఈ ట్రాన్స్‌ఫర్ ఏంటి? అయినా ఆ మారుమూల పల్లెలో స్కూలుకి టీచర్ కావాలనగానే వెళ్లడానికి ఇది తయారై పోవడమేంటి? పెళ్లవగానే మళ్లీ ట్రాన్స్‌ఫర్ అడిగితే ఇస్తారా? ఆ పల్లెలో ఎన్నాళ్లుండి పోవల్సొస్తుందో ఆలోచించకుండా ఈ తొందరపాటు నిర్ణయమేంటి? అసలు ఇది వెళ్లి అక్కడెక్కడో ఉంటే ఇంక సంబంధాలేం చూస్తాం. పెళ్లేం చేస్తాం? దేశసేవ చేస్తున్నా ననుకుంటోందో ఏమిటో? ‘నువ్వా పల్లెటూరికి వెళ్లడానికి వీల్లేదు’ అని గట్టిగా చెప్పక ‘ఎందుకమ్మా అట్లాంటి నిర్ణయం తీసుకున్నావు?’ అంటూ వాళ్ల నాన్న బుజ్జగించి అడగడమొకటి. వాళ్ల స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ సుమతికి దీనికి మాటమాట వచ్చిందట. నా భాష గొప్పదంటే నా భాష గొప్పదని ఇద్దరూ వాదులాడుకున్నారట. స్కూల్లో పిల్లలూ, టీచర్లూ అందరూ సుమతిని ఎంతో గౌరవిస్తారట. హెడ్‌మాస్టర్ కూడా ప్రతి విషయానికీ సుమతి సలహాలు తీసుకుంటారట. అందుకని దీనికి ఈ స్కూల్లో పని చేయడం ఇష్టం లేదట. ఊరు విడిచి వెళ్లిపోతుందట. అయినా ఆ సుమతికి దీనికి నిన్నటిదాకా ఎంత గాఢ మైత్రి ఉండేది. ఒక్కరోజు సెలవు వచ్చినా ఒకర్నొకరు కలవకుండా ఉండలేక పోయేవారు. ఇది వాళ్లింటికైనా వెళ్లాలి. ఆవిడ ఇక్కడికైనా రావాలి. అటువంటిది వీళ్లిద్దరూ పోట్లాడుకోడమేంటి? ఇది ఈ పని చెయ్యడమేంటి? ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జీవితాంతం నిలబెట్టుకోవలసింది కదా స్నేహమంటే. ఏ ఇద్దరు మనుషుల మధ్య అయినా ఎప్పుడో ఒకప్పుడు ఏవో చిన్నచిన్న భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయా? అంతమాత్రాన ఆజన్మ శత్రువుల్లు మారిపోతారా?
అసలీ ఇంట్లో ఏం జరుగుతోంది అని అయోమయంలో పడిపోయింది తను. అయితే మాత్రం తనూరుకుంటుందా? తనకున్న విద్యార్హతలు, లోకజ్ఞానం చూసి ఊళ్లో మహిళా సంఘం వాళ్లు తనని గౌరవ సలహాదారుగా నియమించుకున్నారు. ఎంతోమంది ఆడపిల్లలని వాళ్ల సమస్యలకి పరిష్కారాల కోసం తన దగ్గరికి తీసుకొస్తుంటారు మహిళా సంఘం వాళ్లు. వాళ్లందరికి తను ఎంతో విలువైన సలహాల నిస్తుంటుంది. తన ఇంటి సమస్యని తను పరిష్కరించుకోలేదా? తనకి పుట్టిన పిల్లలు, ముప్పై ఏళ్లుగా కలిసి జీవిస్తున్న భర్త సృష్టించిన ఈ చిన్నచిన్న ఆటుపోట్లని తను ఎదుర్కోలేక పోవడమా? అని ఎంతో ఆత్మవిశ్వాసంతో వాళ్లని అడగవలసినవన్నీ అడిగేసింది. ఇంక అప్పుడు మొదలుపెట్టారు ముగ్గురూ ఉపన్యాసాలు ఒకరి తరువాత ఒకరుగా, తనని గుక్క తిప్పుకోనీయకుండా.
పది రోజుల క్రితం జరిగిన సంగతి ఎత్తుకున్నాడీయన. ఆ రోజు ఆఫీసు నుంచి వస్తూ ఒకమ్మాయిని తీసుకొచ్చాడు. సునీతట ఆ అమ్మాయి పేరు. వాళ్ల ఆఫీసుకి ట్రాన్స్‌ఫర్ మీద కొత్తగా వచ్చిందట. ఇల్లు చూసుకోవాలని ఆ అమ్మాయి అంటే ‘మా వీధిలో ఒక ఇల్లు ఖాళీగా ఉంది’ అని చెప్పి తీసుకొచ్చారుట. బాగానే ఉంది. తనే సునీతని తీసుకెళ్లి ఇల్లు చూపించింది. అదంతా వేరే విషయం. సునీతకి పెళ్లై నాలుగేళ్లయిందట. రెండేళ్ల కొడుకున్నాడట. ఈ నాలుగేళ్లూ భార్యాభర్తలు ఒకే ఊళ్లో ఉన్నారట. ఇప్పుడు సునీతని ప్రమోషన్ మీద ఇక్కడికి వేశారు. సునీత భర్త ‘ఇద్దరం చెరోచోట ఉండడం నాకిష్టం లేదు. పిల్లాణ్ణి నువ్వు తీసుకెళ్లి పోతావు. వాడి ముద్దుముచ్చట్లు నాకు, నా ప్రేమ వాడికి అక్కర్లేదా? ప్రమోషన్ తీసుకోవద్దు’ అంటాడట. ‘నా కెరీర్ నాకు ముఖ్యం’ అని చెప్పి వచ్చేసిందట అతని మాటలు పట్టించుకోకుండా. ‘నా నిర్ణయం సరైనదేకదా ఆంటీ? ఆయనేమన్నా చిరాకు పెడితే నేనేం చెయ్యాలి?’ అని సలహా అడిగింది. ‘అతను సర్దుకుపోతే సరే. లేకపోతే విడాకులిచ్చి పారెయ్. నీ ఉద్యోగం నీకుంది. నీ బతుకు నువ్వు బతకగలవు. అతను చెప్పినట్టల్లా వింటూ అతని మీద ఆధారపడి బతకవలసిన అగత్యం నీకు లేదు’ అని చెప్పింది తను. అది తప్పట ఈయనకి.
ఇంక కొడుకు విషయానికి వస్తే - వారం రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. పక్కింటి వసంత వచ్చింది తనతో మాట్లాడడానికి. తాము మాట్లాడుకునేది వాడు వింటున్నాడని కూడా తననుకోలేదు. ఆ విషయం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు వాడు.
వసంతకి పెళ్లయి నాలుగు నెలలైంది. భర్త ఉద్యోగస్థుడై ఉండాలన్నది వసంత కోరిక. అదేం పెద్ద కోరిక కాదు. అసలు వసంతకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని చేసుకోవాల నుండేది. వాళ్ల నాన్న ‘అంత పెద్ద సంబంధం నేను తేలేను’ అన్నాడు. తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వసంత ఏదో ఒక ఉద్యోగం చేసేవాడైతే చాలు అని సరిపెట్టుకుంది. ఈ సంబంధం వచ్చినప్పుడు వాళ్లు ‘అబ్బాయికి గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. ఇంకా ఆర్డర్స్ రాలేదు. ఈ లోపల తండ్రి చేసే వ్యాపారమే చూసుకుంటుంటాడు’ అన్నారు. ఉద్యోగం వచ్చింది కదా! చేరడానికి కాస్త ఆలస్యం అయితే ఏంలే అనుకుని వసంత ఒప్పుకుంది. పెళ్లయ్యాక నెలకి ‘ఇంకా ఎన్నాళ్లు పడుతుంది ఉద్యోగం రావడానికి’ అని అడిగితే ‘కోర్టులో వేశారు. ఎప్పుడొస్తుందో తెలీదు’ అన్నారు. ఇప్పుడేమో ‘ఆ ఉద్యోగం కోసం పరీక్ష జరిగినప్పుడు అక్రమాలు జరిగాయట. అందుకని ఆ పరీక్షని రద్దు చేశారు. ఇంక ఆ ఉద్యోగం రాదు’ అంటున్నారు. ఆ అబ్బాయి వ్యాపారంలో స్థిరపడిపోయాడు. వసంతకది ఇష్టం లేలదు. ఈ మొగుడు నాకొద్దు అంటూ పుట్టింటి కొచ్చేసింది. వసంతకి నచ్చచెప్పమని వాళ్లమ్మ తనని అడుగుతుంది. ఇష్టంలేని మొగుడితో కాపరం చెయ్యమని తనెట్లా చెప్తుంది? ‘రాత్రి తొమ్మిదిన్నరదాకా షాపులో కూర్చుని వస్తాడు. నాకట్లా ఇష్టం లేదు. నా భర్త చక్కగా ఆఫీసు నుంచి ఆరింటికల్లా ఇంటికి రావాలని నా కోరిక’ అంటుంది వసంత. ‘ఆ అమ్మాయి కోరుకున్నట్టే సాఫ్ట్‌వేర్ మొగుణ్ణి తెచ్చుంటే వాడు నైట్‌డ్యూటీలని రాత్రంతా ఇంటికి రాకుండా ఆఫీసులోనే ఉండిపోతాడు. అది నచ్చుతుందా ఆ అమ్మాయికి?’ అంటూ ఎద్దేవా చేశాడు తన కొడుకు. ‘నేనింక ఆ ఇంటికి వెళ్లను’ అంది వసంత. ‘నీకిష్టం లేకపోతే వెళ్లద్దు’ అని చెప్పింది తను. ‘విడాకులు తీసేసుకుంటాను’ అంది వసంత. ‘సుబ్బరంగా తీసేసుకో’ అని సమర్థించింది తను. ఆ మాట గురించి తన కొడుకు తనని తప్పు పడుతున్నాడు. ‘వాళ్లు చేసింది మోసం కాదా?’ అని. తనంటే ‘పాపం! ఉద్యోగం విషయంలో వాళ్లే మోసపోయారు’ అంటాడు.
ఆ విషయం అట్లా ఉంచితే కూతురు మరీ విచిత్రంగా మాట్లాడింది. టీవీలో సీరియల్స్ అన్నీ చూసే అలవాటు కూడా లేదు తనకి. ఒకేఒక్క సీరియల్ ఇష్టంగా చూస్తుంది తను. దాంట్లో హీరోయిన్ కేరెక్టర్ తనకి చాలా నచ్చుతుంది. భర్తతో అభిప్రాయ భేదం వస్తే ఎంత మాత్రం సర్దుకుపోదు. తన ఇంట్లో అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలని కోరుకునే ఆధునిక మహిళ ఆ అమ్మాయి. అంతే మరి! తరతరాలుగా, యుగ యుగాలుగా ఆడవాళ్లే అన్నిటికీ అణిగిమణిగి ఉంటున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ పరిస్థితి? అనిపిస్తుంది తనకి. అందుకే తన దగ్గరికి ఎవరు సలహా కోసం వచ్చినా ఆ సీరియల్‌లోని ఆ అమ్మాయి గురించి చెప్పకుండా ఉండదు తను. తన కూతురికేమో ఆ పాత్రంటేనే ఎగతాళి. ఆ సీరియల్ గురించి నిన్న ఎట్లా మాట్లాడింది? ‘్భర్యాభర్తల అభిరుచులు కలవనప్పుడు భర్తకు అనుగుణంగా భార్య అభిరుచులను మార్చుకోవలసిన అవసరం లేదు. మార్చుకోమన్న ఒత్తిడి అవతల నుంచి మరీ ఎక్కువైతే భర్తని విడిచిపెట్టెయ్యడానికైనా ఆడపిల్ల వెనుకాడ కూడదు’ అని నమ్మి అదే ఆచరిస్తుందా సీరియల్‌లో అమ్మాయి. అంతేకాకుండా ‘్భర్తని వదిలేసిన ఆడపిల్ల ఒంటరిగా జీవిస్తూ అవస్థలు పడనక్కరలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లకి మారుమనువు కష్టమేం కాదు. నచ్చినవాణ్ణి చూసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు’ అని కూడా చెప్తుందా పాత్ర. దానికి తన కూతురు ఎంత ఎగతాళిగా మాట్లాడింది? భర్తకి ఇడ్లీ ఇష్టంట. భార్యకి దోసె ఇష్టంట. నీ ఇష్టం నా ఇష్టం కలవనప్పుడు నీతో నాకేంటని ఆ అమ్మాయి అతనికి విడాకులిచ్చేసి మళ్లీ పెళ్లి చేసుకుంటుందట. ఈ రెండో భర్తకి ముదురురంగు కర్టెన్లు వెయ్యడం ఇష్టంట. ఆ అమ్మాయికేమో లేతరంగులు ఇష్టంట. నీ ఇష్టం నా ఇష్టం కలవనప్పుడు నీతో నాకేంటని ఆ అమ్మాయి ఇతనికి కూడా విడాకులిచ్చేస్తుందట. అట్లా ఎంతమందిని చేసుకుంటుంది? ఎంతమందిని వదిలేస్తుంది? అంటూ ఆ సీరియల్‌నీ, దాంట్లోని హీరోయిన్ పాత్రని విమర్శిస్తూనే ‘ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోమనా నువ్వు నీ దగ్గరికి సలహా కోసం వచ్చేవాళ్లకి చెప్పేది’ అని తనని కూడా ఏకిపారేసింది.
బాస్‌తో సర్దుకుపోవడానికి, చెల్లెలితో సర్దుకుపోవడానికి, స్నేహితురాలితో సర్దుకుపోవడానికి లేని అభ్యంతరం భర్తతో సర్దుకుపోవడానికెందుకో మాకర్థం కావట్లేదని చివరికి అమాయకంగా అడిగారు ముగ్గురూ కలిసి. దానికీ దీనికీ తేడా లేదా అంటే ఏంటి తేడా అంటారు. భర్తతో ఒకసారి సర్దుకుపోవడం మొదలుపెడితే జీవితాంతం సర్దుకుపోతూనే ఉండాలి అంటే ఒకసారి ఏర్పడిన బంధాన్ని జీవితాంతం నిలుపుకోవద్దా అంటారు.
‘అయితే ఇప్పుడు ననే్నం చెయ్యమంటారు? నోరు మూసుకుని పడుండమని చెప్పనా వాళ్లకి?’ అని కోపంతో గట్టిగా అరిచేసింది తను.
ఇంక అప్పుడు మొదలుపెట్టింది తన కూతురు హితబోధ ముగ్గురి తరఫునా.
‘నువ్వు ఉన్నత విద్యావంతురాలివి. తెలుగు కథా సాహిత్యం విస్తృతంగా చదువుకున్నావు. గురజాడ గారు ఆయన మొదటి కథ ‘దిద్దుబాటు’లో ఏం చెప్పారు? తప్పుదారి పట్టిన భర్తని వదిలెయ్యమన్నారా? ఆ కథలో భార్య చాకచక్యంగా భర్తని సంస్కరించుకోలేదూ? భర్త చేసిన తప్పును భార్య సరిదిద్దడమే గదా భండారు అచ్చమాంబ గారు ధనత్రయోదశిలో రాసింది. ఆవిడే రాసిన స్ర్తి విద్యలో చదువురాని భార్యని చదువుకొమ్మని భర్త ప్రోత్సహించలేదా? భార్యాభర్తలిద్దరూ ఒకరి లోపాలను ఒకరు సరిదిద్దుకుంటూ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలనే కదా మన పెద్దలు చెప్పింది. శ్రీపాదగారి కథల్లో స్ర్తి పాత్రలు ఎంత గడుసుగా తమ పంతం నెగ్గించుకుంటాయి. అటువంటి తెలివితేటలు కలిగించొచ్చు కదా నీ దగ్గరికొచ్చే ఆడపిల్లలకి నువ్విచ్చే సలహాల ద్వారా’ అంటూ పాఠం ముగించింది కూతురు.
మగాడి అణచివేత నుండి బయటపడి స్వతంత్రంగా జీవించమని తను ఆడపిల్లల కిచ్చే సలహాలని వీళ్లు ముగ్గురూ తప్పుపడుతున్నారు. ప్రేమ కావాలట, మనశ్శాంతిగా జీవించాలట, నేర్పరితనంతో జీవితాన్ని నిలబెట్టుకోవాలట. ఈ మాటలు చెప్పడానికి ఎంత నాటకం ఆడారు ముగ్గురూ కలిసి. ఉద్యోగం మానేస్తానని నర్త, ఇల్లు వదిలి వెళ్లిపోతానని కొడుకు, వేరే ఊరికి మారిపోతానని కూతురు - తననెంత కంగారు పెట్టారు?
అవునా? మిగతా వాళ్లందరితో సర్దుకుపోయినట్టే భర్తతో కూడా సర్దుకుపోవచ్చా?
తననంత కంగారు పెట్టారని, నాటకాలాడారని వాళ్ల మీద కోపం తెచ్చుకుని ‘మీరు నాకక్కర్లేదు. మీ ఇష్టమొచ్చిన చోటికి మీరు పొండి’ అనో, ‘ఇల్లు వదిలిపెట్టి నా దారిన నేను పోతాను. మీ ఏడుపేదో మీరు ఏడవండి’ అనో అనగలిగిందా తను? అందరూ ఒక్కటిగా ఉండాలని ఎంత తాపత్రయపడింది? మరి తన దగ్గరికి సలహాల కోసం వచ్చే ఆడపిల్లలకి తనెందుకు ఎంతో తేలిగ్గా భర్తని వదిలి పారెయ్యండి అని సలహా లిస్తోంది? ఆ మగాళ్లేం దుష్టులూ, దుర్ముర్గులూ కాదుకదా! ఏవో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు, అంతేకదా!
నిజమే కదా! సర్దుకుపోవచ్చు కదా! సర్దుకుపోలేనంత, సరిదిద్దుకోలేనంత ఘోర తప్పిదాలేం కావుగా అవి.
ఇబ్బందుల్లో ఉన్న ఆడపిల్లలు చాతుర్యంతో వ్యవహరించి పరిస్థితుల్ని వాళ్లకి అనుకూలంగా మార్చుకోవచ్చు కదా!
అల్లకల్లోలంగా ఉన్న మనసుని ప్రశాంతపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది వనజ.

పాలపర్తి జ్యోతిష్మతి.. 97011 15600