కథ

ఏమో! గుఱ్ఱం ఎగరావచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్మీడియట్ రెండో యేటి పరీక్షా ఫలితాలొచ్చాయి. మా కాలేజీకి ర్యాంకుల మాట దేవుడెరుగు - ఉత్తీర్ణతా శాతం కూడా ఏ మాత్రం మెరుగుపడలేదు. సాయంత్రం ప్రిన్సిపాల్ రూమ్‌లో నేనూ ఆయనా కూర్చొని ఫలితాల గురించి విశే్లషిస్తున్నాం. మా కాలేజీలో స్కాలర్‌షిప్ హోల్డర్స్ తప్ప మెరిట్ స్టూడెంట్స్ చేరకపోవడం ఇంత పూర్ రిజల్ట్‌కి ప్రధాన కారణం. ఇతర అంశాల మీద కూడా మా చర్చ సాగుతుండగా మధ్యలో మా ప్రిన్సిపాల్ కంగారుగా లేచి నిల్చొని ‘ఇప్పుడే వస్తాను మాస్టారూ...’ అంటూ హఠాత్తుగా రెండో గుమ్మం ద్వారా బయటకు వెళ్లడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతలో ప్రిన్సిపాల్ రూమ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర సకిలింపు వినిపించి, అటు చూశాను- అక్కడ ఓ అమ్మాయి, వాళ్ల నాన్న వీరభద్రుడూ..!
‘నమస్కారం మాస్టారూ...’ వీరభద్రుడు ఆ అమ్మాయిని తీసుకొని లోపలకొచ్చి నా యెదురుగా నిల్చున్నాడు. నాకు చెమటలు పడుతుండగా తడబడుతూ కూర్చోమని అతనికి కుర్చీ చూపించాను.
‘అయితే ఈ ఇద్దరినీ చూసే నన్ను పులిబోనులో వదిలేసి ప్రిన్సిపాల్‌గారు చల్లగా జారుకొన్నారన్నమాట!’
ఆ అమ్మాయి తండ్రి పక్క నిలబడి నన్ను చూసి నవ్వుతోంది. ఆ నవ్వుకర్థం? అమ్మో! ఆ రోజు, ఆ సంఘటన గుర్తొచ్చాయి.
* * *
‘సారీ, కొంచెం లేటయింది..’ అన్నాను వస్తూనే ప్రిన్సిపాల్ ముందు నిలబడి.
‘్ఫర్వాలేదు మాస్టారూ. ఇంకా ఫస్ట్‌బెల్లే కదా అయింది. ఏమనుకోక ఈ రోజు రూమ్‌కెళ్తారా? అనుకోకుండా స్వామి లాస్ట్ మినిట్‌లో ఫోన్‌చేసి సెలవడిగాడు. అందుకని తప్పని సరయి మిమ్మల్ని ఇన్విజిలేషన్‌కి రూమ్‌లో వెయ్యక తప్పడంలేదు. ప్లీజ్.. రూమ్ నెంబర్ నైన్‌కి వెళ్లండి. బిందు ఆల్రెడీ పేపర్స్ తీసుకొని వెళ్లింది...’ ఆయన స్వరంలో అభ్యర్థన...
ప్రిన్సిపాల్ అవస్థ అర్థమైంది. నిజానికి ఆయన నాకు జూనియర్. కేడర్ సీనియారిటీని బట్టి ప్రిన్సిపాల్ అయ్యారు. అందువల్ల నా సీనియారిటీని గౌరవించి నాకిలాంటి డ్యూటీ వెయ్యరు.
‘నో ప్రాబ్లెమ్. అలాగే వెళ్తాను’ అంటూ నేను ఆ రూమ్‌కి వెళ్లేసరికి బిందు ఆన్సర్ పేపర్స్ పంచేస్తోంది. నన్ను చూసి ‘సర్, మీరు...’ అంటూ ఆశ్చర్యంగా దగ్గరకొచ్చింది.
‘ఇవాళ నేను మూడు గంటల కూలికి ఒప్పుకున్నాను. అదీ నువ్వున్నావనే ధైర్యంతోనే!’ అన్నాను నవ్వుతూ.
బిందు నా ఓల్డ్ స్టూడెంట్. ప్రస్తుతం మా కాలేజీలోనే అడ్‌హాక్ లెక్చరర్‌గా పనిచేస్తోంది.
‘సర్! మీతో కలిసి పనిచెయ్యడం నా అదృష్టం. మీరు కూర్చోండి చాలు. అన్నీ నేను చూసుకుంటాను’
‘అమ్మాయ్.. అందర్నీ చెక్ చేశావా?’
‘ఆ కర్మకాండంతా అయిపోయింది సార్. సంతకాలు చేయించడం కూడా పూర్తయాక మీకో ఆశ్చర్యకరమైన విషయం కూడా చెబుతాను’ నవ్వుతూ బిందు తన పనిలో నిమగ్నమైంది.
‘ఓ.ఎం.ఆర్’ షీట్లను సరిగా పూర్తి చేయించడం, హాల్‌టికెట్స్ వెరిఫై చేసి కలెక్ట్ చేయడం.. మొదలైన ప్రభుత్వం వారి నియమ నిబంధనలను అమలుపర్చి, అటెండెన్స్ తీసుకొన్న తర్వాత అడిగింది బిందు ‘సర్! ఇంత ప్రాసెస్ అవసరమంటారా?’ అని.
‘అన్ని రంగాల్లోలాగే ఇది కూడా ‘షో’ అంతే!’
‘ఈ జంబ్లింగ్ సిస్టమ్, ఇన్ని సెట్ల పేపర్లు, అన్నింటికీ మించి ఒక్క నిమిషం ఆలస్యమైనా పిల్లల్ని పరీక్షకు అనుమతించకపోవడం.. ఇది వరకు ఉండేవి కావు కదా! ఈ విధానాలవల్ల నిజంగా మేలు జరుగుతుందంటారా?’
‘ఇంత స్ట్రిక్ట్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నా ఉత్తీర్ణతా శాతం మా హయాంలో ఎంత పెరుగుతుందో చూశారా?’ అని ప్రభుత్వం ప్రకటించుకోడానికి ఉపయోగపడ్డంలే మరి?’
‘పరీక్ష మిస్ అయితే పిల్లలు పడే మానసిక వేదనను అర్థం చేసుకోవాలి కదా. ట్రాఫిక్ బీభత్సంగా పెరిగిపోయిన ఈ కాలంలో ఈ ఒక్క నిమిషం నిబంధన అమానుషం! రాజకీయ నాయకులు, పెద్దలు ఇలాంటి న్యాయమైన విషయాల కోసం ఎందుకు పోరాడరో అర్థంకాదు. మేం చదువుకొనే రోజుల్లో ఆలస్యంగా వచ్చిన వారిని అరగంట వరకు అనుమతించడమే కాదు - మన కాలేజీలో దయతో మరో అయిదు నిమిషాలు ఆలస్యంగా బెల్ కొట్టించేవారు. అప్పుడు పిల్లల పీకల మీద ఇలా కత్తి వేలాడేది కాదు’
‘అమ్మా. ఇప్పుడెలాంటి కఠిన నిబంధనలున్నా, నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ‘ఇన్‌స్టాంట్ ఎగ్జామ్స్’ సౌకర్యం ఇచ్చారు కదా!’
‘ఇదో దండగమారి ప్రహసనం సార్. ఇప్పటికే ‘స్పాట్ వాల్యూయేషన్’ పేరుతో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అసలే ఎగ్జామినర్స్ కళ్లు మూసుకొని సంబంధం లేని జవాబులు రాసినా చదవకుండా మార్కులు వడ్డిస్తున్నారు. ఇంకా పది మార్కుల ప్రశ్నకు పనె్నండు మార్కులిస్తున్న ప్రబుద్ధులూ, వేరే సబ్జెక్ట్‌కి చెందిన ఆన్సర్ పేపర్స్ కూడా దిద్దేస్తున్న ధృతరాష్ట్రులూ, గాంధారులూ కూడా లేకపోలేదు! ఇలా యెలాగో పాతిక మార్కుల వరకు వచ్చిన సుడి పేపర్లకు మరో అయిదో పదో కలిపేసి పుణ్యం కట్టుకోమని చీఫ్ నుంచి, పై నుంచి ఆదేశాలు...! ఇంతగా గేట్లు తెరిచేసి చెత్తనీ చెదారాన్నీ వడకట్టకుండా పాస్ ముద్రవేస్తూ ఇంకా ఈ ఇన్‌స్టెంట్ నిర్వహించడం ఎవర్ని ఉద్ధరించడానికి?’ బిందు మాటల్లో ఆవేశమే కాదు, ఆవేదనా ఉంది. కాలేజీలో అవకతవకలు జరిగిన అనేక సందర్భాల్లో బిందు తీవ్రంగా రియాక్ట్ అయ్యేది.
‘బిందూ, ఇలాంటివి ఇప్పుడే కాదు - రాష్టమ్రంతటికీ ఒక్క హైదరాబాద్‌లోనే ‘స్పాట్’ నిర్వహించిన రోజుల్లో కూడా జరిగేవి. అప్పుడు కూడా ‘టిప్పు సుల్తానులూ’ ముప్పై పేపర్లు దిద్దాల్సిన కాలంలో అరవై డెబ్బై లాగించేసే భుజబల సంపన్నులూ ఉండేవారు. ఎటొచ్చీ...’
నా మాటలు పూర్తి కాకుండా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఎడిషనల్ షీట్స్ కోసం లేచి నిలబడ్డారు. బిందు హడావిడిగా వాళ్ల దగ్గరకు వెళ్లింది.
‘సరే, ఆ రోజుల్లో స్పాట్ సంపాదన బావుండేదట కదండీ’ బిందు పిల్లల దగ్గర నుంచి, వస్తూనే అడిగింది.
‘సంపాదన ఇప్పుడే ఎక్కువ. ఎటొచ్చీ అప్పుడు విలువ ఎక్కువ. నాలుగొందల రూపాయలు జీతం వున్న కాలంలో ‘స్పాట్’కి వెళ్లి రెండు నెలల జీతం సంపాదించే వాళ్లం. ఆపైన రెండు మూడు తరాల వాళ్లం కలుసుకోవడం వల్ల ‘స్పాట్’ అంటే పండుగలా వుండేది’
కేంపస్‌లో వాహనాలు ఆగిన చప్పుడు వినిపించడంతో బిందు ఎలర్ట్ అయ్యింది. ఇద్దరు స్క్వాడ్ మెంబర్స్ రూమ్‌లో చొరబడి తనిఖీ పూర్తి చేసి, మాకు థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత గుర్తొచ్చి అడిగాను ‘అవును బిందూ. ఇందాక ఏదో ఆశ్చర్యకరమైన విషయం చెపుతానన్నావ్?’ అని.
బిందు సిగ్గుపడుతూ తన బ్యాగ్‌లో నుంచి ఓ కాగితం మడత తీసి నా చేతికిచ్చింది. ‘ఇది స్లిప్స్ చెక్ చేస్తుంటే ఓ అమ్మాయి దగ్గర దొరికింది’ అంటూ! ఆశ్చర్యంగా మొదటి రెండు పంక్తులూ చదివాను - అది ఆ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ రాసిన లవ్‌లెటర్!
‘మొబైల్స్, ఎస్‌ఎంఎస్‌లూ ప్రేమను నడుపుతున్న ఈ కాలంలో వీళ్లెవరో బుద్ధిమంతుల్లా ఉన్నారు - ఇంకా ప్రేమలేఖలు రాసుకొంటున్నారు. ఎంత భద్రంగా దాచుకొందో అమ్మాయి. వెళ్లేటప్పుడు ఇచ్చెయ్’ అన్నాను కాగితం మడిచి తిరిగి ఇచ్చేస్తూ. అనూహ్యమైన నా ధోరణిని, చిరునవ్వునూ చూసి బిందు విస్తుపోయింది.
బిందు బాధ్యతగా గదంతా కలియ తిరుగుతోంది గనుక నేనాట్టే శ్రమ పడ్డం లేదు. మధ్యమధ్యలో బిందు తను స్టూడెంట్‌గా వున్నప్పటికీ ఇప్పటికీ కాలేజ్ వాతావరణంలో వచ్చిన మార్పుల గురించే ఎక్కువగా మాట్లాడింది.
గంట వినిపించేసరికి తెలిసింది - ఇక ఆఖరి అరగంట కాలం మాత్రమే మిగిలి ఉందని! అంతవరకు బలవంతంగా కూర్చున్న పదిమంది స్టూడెంట్స్ బిలబిలమంటూ లేచి ఆన్సర్ పేపర్స్ ఇచ్చి వెళ్లిపోయారు.
ఇంతలో చివరి బెంచ్‌లో ఓ అమ్మాయి లేచి నిలబడింది. బిందు వెళ్లి అడిషనల్ షీట్ ఇవ్వబోయింది. ఆ అమ్మాయి అందుకోసం కాదన్నట్టు తల అడ్డంగా ఆడించి క్వశ్చన్ పేపర్ చూపించి బిందునేదో అడుగుతోంది. బిందు క్వశ్చన్ పేపరూ, ఆన్సర్ పేపరూ పరిశీలించి కంగారు నణచుకొంటూ ఆ అమ్మాయికేదో నచ్చజెపుతోంది. ఆ అమ్మాయి వినిపించుకోకుండా స్వరం పెంచి వాదిస్తోంది. ఏదో ‘సీన్’ క్రియేట్ అవుతున్నట్టనిపించి ఆందోళనగా నేను అక్కడికెళ్లాను.
ఆ అమ్మాయి రాయాల్సింది బాటనీ పరీక్ష - రాసింది సివిక్స్ పేపర్! తనకు బాటనీ పేపర్‌కి బదులుగా బిందు సివిక్స్ పేపర్ ఇచ్చిందని ఆ అమ్మాయి ఆరోపణ. ఆ అమ్మాయి క్వశ్చన్ పేపరు చూసుకోకుండా ఇంతసేపు యేం రాసిందని బిందు వాదన! బిందు తనను సమర్థించుకుంటోంది కాని, తన తప్పు గ్రహించి టెన్షన్ ఫీలవుతోంది. నిజానికి బిందు కంటె ఎక్కువగా భయపడాల్సింది నేనే! పొరపాటు యెవరిదయినా సీనియర్ లెక్చరర్‌గా బాధ్యత నాది!
ఆ అమ్మాయి హాల్ టికెట్ పరిశీలనగా చూశాను. ఆ అమ్మాయి పేరు దేవి. తండ్రి పేరు వీరభద్రుడు! నాకు గుండాగినంత పనయింది. వీరభద్రుడు మా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్. ఊళ్లో పేరుమోసిన రౌడీ! ఆ అమ్మాయిని అక్కడ ఇంకా మాట్లాడనిస్తే మేము అడ్డంగా దొరికిపోతామని, పెదవుల మీదికి లేని నవ్వు తెచ్చుకొని దేవిని సముదాయించాను - ‘చూడమ్మా, మీ నాన్న నాకు బాగా తెలుసు. జరిగిందేదో జరిగింది. ఇంకా రాయాల్సిందేదో రాసి పేపరిచ్చి వెళ్లిపో. నీకు నష్టం జరక్కుండా నేను చూస్తాను’ అంటూ.
దేవి పరీక్ష హాలు నుంచి బయటకొచ్చి కూడా నన్ను విడిచిపెట్టలేదు. సీన్ ప్రిన్సిపాల్ రూమ్‌కి మారింది.
ప్రిన్సిపాల్‌గారు కొంతసేపు చిర్రుబుర్రులాడి చిందులు తొక్కారు. బిందును కార్నర్ చేసి నిప్పులు చెరిగారు. రిటైర్‌మెంట్‌కి దగ్గరగా వున్న నన్నూ ఉపేక్షించలేదు. చివరకు ఆయన చేతికి మట్టి అంటకుండా నన్ను, బిందును కాగితం రాసి ఇమ్మన్నారు. కాని ఆ తర్వాత దేవి తండ్రి వీరభద్రుడికి విషయం తెలిస్తే తన మీద దాడి చేసి కాలేజీ పీకి పందిరేస్తాడనీ, మీడియాకు తెలిస్తే పరువు మంటగలుస్తుందని భయపడి, కొంత స్థిమితపడి - ఊళ్లో నాకున్న పలుకుబడి నుపయోగించి ఈ ఆపద నుంచి గట్టెక్కే మార్గం చూడమని రాజీ ధోరణికొచ్చారు.
‘అమ్మాయ్, అంతసేపు ఏదో రాశావు కదా! నీకు సివిక్స్‌కీ బాటనీకి ఎందుకు తేడా తెలియలేదు?’ మందలిస్తున్నట్లు ప్రశ్నించాను.
‘కుటుంబం మీద రెండు మూడు ప్రశ్నలున్నాయి. బాటనీలో కూడా మొక్కల కుటుంబాలుంటాయి. అందుకని పొరబడ్డాను’ మొదట తడబడినా తర్వాత సర్దుకొని సమాధానం చెప్పింది దేవి.
‘సర్లే. నీ చదువిలా తగలడింది. ఈ విషయంలో ముమ్మాటికీ తప్పు నీదే. జరిగిన పొరపాటును పట్టుకొని లాగడం వల్ల నీకు ఏ మాత్రం లాభం ఉండదు సరికదా - అందరి పీకలకు చుట్టుకొంటుంది. అందువల్ల నువీ విషయం మర్చిపో. నీదీ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే తప్పితే, తగిన కోచింగ్ ఏర్పాటు చేసి ‘ఇన్‌స్టాంట్’లో పాసయ్యేలా చూసే పూచీ నాది. నేనిలా అన్నానని మీ నాన్నతో చెప్పు..’
‘మాస్టారూ ప్లీజ్. నాన్నకీ విషయం తెలియనివ్వకండి. తెలిస్తే చంపేస్తాడు’
‘సరే. రిజల్ట్స్ వచ్చాక కనిపించు. ఆల్ ది బెస్ట్’ అంటూ దేవిని ఏ గొడవా జరక్కుండా పంపించేశాను. నేనా సమస్యనంత చాకచక్యంగా ‘డీల్’ చేసి, అందర్నీ ‘సేవ్’ చేసినందుకు ప్రిన్సిపాల్‌గారు నన్ను మెచ్చుకున్నారు.
* * *
‘గురువుగారూ, బావున్నారా? అమ్మాయా ఆ విషయం ఇవాళే చెప్పింది...’ వీరభద్రుడు మాట్లాడ్డం ప్రారంభించగానే నాకు నోరు తడారిపోయింది.
‘అంటే పరీక్షలో తప్పడం తన తప్పు కాదని, పేపరు మారిన సంఘటన తండ్రికి ఈ రోజు చెప్పిందా?’ నాకు ముచ్చెమట్లు పోస్తున్నాయి. వీరభద్రుడు నా దగ్గర వినయంగా ఉంటాడు కాని, అతని పేరు చెపితే ఊరంతా హడల్!
‘అదే! ఆ రోజే చెప్పమన్నాను...’ నాకు మాట పెగలడం లేదు!
‘నాకు అప్పుడు చెప్పకపోవడమే మంచిదయ్యింది. దేవి మీ దయవల్ల సెకండ్ క్లాస్‌లో పాసయ్యింది. మీకా శుభవార్త చెప్పి వెళ్దామని వచ్చాం’ దేవి చేత నా చేతిలో స్వీట్స్ పేకెట్ పెట్టించి నా పాదాలకు నమస్కరింపజేశాడు. మరో స్వీట్స్ పాకెట్ ప్రిన్సిపాల్ కోసం టేబిల్ మీద ఉంచి వెళ్లారు.
ఆ పేకెట్ కింద ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్న డైలీ పేపర్‌లో ‘రికార్డ్ టైమ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల!’ అనే విద్యామంత్రిగారి ప్రకటన మీద నా కళ్లు పడ్డాయి.
‘నా కళ్లూ, నా చెవులూ నన్ను మోసం చెయ్యడం లేదు కదా!’ అనే అనుమానం నన్ను పట్టి కుదిపేస్తోంది! జరిగింది కలో, నిజమో, వైష్ణవమాయో, స్పాట్‌వేల్యుయేషన్ లీలో! - అంతా అయోమయం! ‘ఇది ఏప్రిల్ ఫూల్ కాదు కదా!’ డైలీ పేపర్ మీద డేట్ చూశాను - కాదు! మరి? - ‘ఏమో! గుఱ్ఱం ఎగరావచ్చు!’ అన్నారు కదా!

(మంచి మనిషి, మంచి మిత్రుడు, మంచి రచయిత కీ.శే.నాయుని కృష్ణమూర్తిగారి స్మృతికి)

డాక్టర్ పైడిపాల.. 99891 06162