కథ

ఇదేమి పండుగ బాబోయ్ (ఉగాది కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏవండోయ్ ఇవాళ ఉగాది పండుగ! ఆఫీసుకు సెలవు పెట్టమన్నాను కదా...’ అంటూ అరిచింది ఓ ఇల్లాలు.
‘సెలవు పెట్టినా.. పెట్టకపోయినా.. ఇవాళ ఆఫీసుకు వెళ్లే వాళ్లు ఎవరూ ఉండరు? అఫిషియల్‌గా సెలవు ఇవ్వలేదు గానీ.. సెలవు పెట్టుకోండి అని.. సియంగారే చెప్పేశారు!’ అన్నాడు ఆమె భర్త-
‘మీరు లీవ్‌లెటర్ ఇచ్చి రావడానికి వెళ్తున్నారు అనుకున్నాను’
‘సర్లే! మనం లీవ్ లెటర్ ఇచ్చినా.. తీసుకోడానికి ఆఫీసులో ఒక్కరైనా వుండాలిగా! మా బాస్ అబ్దుల్ రెహమాన్ కూడా.. మూడు రోజుల సెలవు వచ్చింది అని - నాలుగో రోజు కూడా లీవ్ పడేసి.. వాళ్ల ఊరు వెళ్లిపోయాడు’
‘ఆయన కూడా.. ఉగాది పండుగ చేసుకుంటున్నాడా?’
‘లేదు! వాళ్ల ఊళ్లో ఆయనకి అత్తగారు ఇచ్చిన భూమిని ఎవరో కబ్జా చేశారట! అందుకని వెళ్లిపోయాడు. ఇక మా ఆఫీసులో ఆఫీసు ప్యూన్ ఏసుపాదం ఒక్కడే ఉంటాడు అందుకే.. ఆ లీవ్‌లెటర్ ముందే రాసి.. మా ఆఫీసర్ డ్రాలోకి తోసేశాను...’
‘మరి... మీరు ప్రొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు? అని అడగకూడదు కానీ.. అడిగేశా మరి?’
‘ఇవాళ పండుగ కదా? ఓసారి అమ్మని చూసి.. ఆశీస్సులు తీసుకొని వచ్చేస్తానే్ల!’
‘నిజమేనా? లేకుంటే ఎక్కడయినా.. మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో ప్రత్యేక పూజలు పెట్టుకున్నారా?’
‘చిఛీ! ఉగాది ప్రసాదం తీసుకోకుండా.. అలాంటి పాపం పనులు చేస్తానా?.. అయినా.. పట్టపగలు ఎవరు తాగుతారు?’
‘వెధవ అలవాట్లు అవాలేగానీ.. పగలేంటీ.. రాత్రేంటీ? సరేగానీ.. మీరు వచ్చేప్పుడు... మీ అమ్మగార్ని అడిగి... కాస్త ఉగాది పచ్చడి తీసుకురండి!’
‘అదేమిటీ? నువ్వు చెయ్యడం లేదా?’
‘అంత ఓపిక నాకు లేదు! ఒకవేళ నేను కష్టపడి చేసినా.. మీరు పదహారు వంకలు పెడతారు! మీకు నచ్చదు! అందుకని ఈ ఏడాది బజార్లో ఉగాది పచ్చడి కొనుక్కొద్దామని అనుకున్నాను...’ అంది ఇల్లాలు.
‘పోనే్ల.. ఆ సంగతి ముందే చెప్పావు! పోయిన ఉగాదికి.. పక్కింట్లో.. ఎదురింట్లో అడుక్కుని తెచ్చి పెట్టావుగా!’
‘ఏం చెయ్యనూ! మీ అమ్మ చేసినట్టుగా ఉగాది పచ్చడి చెయ్యడం నాకు చేతకాదు మరి!’
‘అందుకేగా... అమ్మని అడిగి తెస్తానే్ల! కనీసం వంటైనా చేస్తావా! పండగ పూట హోటల్‌కి పోదాం అంటావా!’ అని గొణుక్కుంటూ బయలుదేరాడు భర్త.
* * *
‘ఏమండోయ్... అల్లుడుగారు ఫోన్ చేశారు! త్వరగా రండి!’ అంటూ కేక వేసింది ఓ గృహిణి.
‘వస్తున్నా... లైన్లో వుండమను’ అంటూ బాత్‌రూమ్‌లో నుంచి సమాధానం చెప్పాడు భర్త. క్షణంలో... తుండుగుడ్డ చుట్టుకొని.. నీళ్లు కారుతుండగా.. వచ్చేశాడు ఆ ఇంటి యజమాని!
‘హలో! హలో... అల్లుడుగారూ!.. వేపపువ్వు కొరియర్‌లో పంపించా! అందుకున్నారా?’
‘అందుకున్నా ఇవాళే! కానీ... ఉగాది పండుగ నిన్ననే అయిపోయింది అంటున్నారు!’
‘అబ్బే... అదేం లేదు! నిన్న మన గవర్నమెంట్ వారికి మాత్రమే ఉగాది! అసలై ఉగాది ఇవాళే!’
‘అలాగా! ఈ మధ్య పండుగలు కూడా.. రెండు రెండు రోజులు వస్తున్నాయి! కలికాలం కదా..’
‘ఇంతకీ మీకు ఇవాళ సెలవు ఉందా?’
‘సెలవు లేదు! మాకు మేము తీసేసుకోవచ్చు!’
‘అలాగా!... మీకు మంచి ముఖ్యమంత్రిగారే దొరికారు! ఈ రాష్ట్రంలో ఉగాది కూడా నిన్ననే అయిపోయిందట! సెలవు పెడితే ఒక రోజు జీతం లాస్! అందుకని - మేము మా ఉగాది ఈ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక జరుపుకోవాలి అనుకుంటున్నాము! ఫర్వాలేదా?’
‘్ఫర్వాలేదండీ! పండగ అంటే పండగే! రాత్రి అయినా.. పగలయినా.. పూజ చేసుకొని.. పిండివంటలు తినడమే కదా! ఇక.. మా అమ్మాయి వాళ్లు... చెన్నయ్‌లో వున్నారు కదా! వాళ్లు ఏప్రిల్‌లో ఉగాది చేసుకుంటున్నారట!’
‘అలాగా! ఏమయినా.. కాలం మారుతోంది! డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగలాగా.. మన పండుగలు కూడా... తిథులు మానేసి.. తేదీల ప్రకారం చేసుకుంటే.. ఈ గోల వుండదండీ మామగారూ!’
‘కరెక్టుగా చెప్పావ్ అల్లుడూ! మా ఊల్లో... అజ్ఞాన వేదిక అని ఒక కమిటీ ఉంది! వాళ్లకి ఈ సంగతి చెప్తాను! మన పండుగలన్నీ తేదీల ప్రకారం చేయాలని ఒక ఉద్యమం చెయ్యమని వాళ్లని రెచ్చగొడతాను! సరేనా...?’
‘మామయ్యగారూ! వాళ్లకి మన హిందువుల పండగలని మాత్రమే చెప్పండి! పొరపాటున... రంజాన్ పండక్కి కూడా... కచ్చితంగా డేట్ పెట్టాలని అన్నారు అనుకోండి.. పెద్ద గోల అయిపోతుంది! అల్లకల్లోలం అయిపోతుంది!’
‘నిజమేనయ్యా!... వాళ్లు మనలాగా కాదుగా! వాళ్ల పండుగలు వాళ్లు చాలా పవిత్రంగా చేసుకుంటారు! వాళ్ల ఇమామ్ ఢిల్లీలో నెల పొడుపు చూసి ఫలానా రోజు అని చెప్తేనే పండుగ చేసుకుంటారు! అంతవరకూ... ఉపవాసాలు చేస్తారు కానీ.. క్యాలెండర్ చూసి, టీవీలు చూసి పండుగలు చేసుకోరు!’ మనలాగా’ అని చెప్పారు మామగారు.
అంతలో ఆ ఇంటి ఇల్లాలు గబగబా వచ్చింది.
‘మీ ఫోన్ అయితే.. రెండు మాటలు చెప్పి.. ఓకే.. బై అని చెప్పి.. ఫోన్ కట్ చేస్తారు! అల్లుడు చేసిన ఫోను కదా అని... అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుతున్నారు! ఫోన్ ఇలా ఇచ్చి.. మీరు స్నానం చేసి రండి...’ అంటూ భర్త చేతిలో ఫోన్ తీసుకొని-
‘అల్లుడుగారూ!... మీరేమి అనుకోకండి! ఈ మధ్య ఇరవైనాలుగ్గంటలు వార్తలు ప్రసారం చేసే టీవీలు వచ్చాకా... అవి చూసిచూసి.. మీ మామగారు ఇలా చాదస్తంగా అయిపోయారు! ఓసారి ఫోన్ అమ్మాయికి ఇవ్వండి! ఉగాది ప్రసాదం ఎలా చెయ్యాలో చెప్తాను’ అన్నది ఇల్లాలు.
‘్ఫనిష్! ఇక నువ్వూ... నీ కూతురూ మాట్లాడుకోవడం మొదలుపెడితే.. అల్లుడిగారి ఈ నెల జీతం.. మొత్తం ఫోన్ బిల్లుకే సరిపోతుంది!’ అని గొణుక్కుంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు భర్త.
బాత్‌రూమ్ నీళ్ల పంపు కాస్త ఆగిపోయింది! నిన్న పక్కింట్లో పెళ్లి కదా.. టాంకులో వున్న నీళ్లన్నీ... వాళ్ల స్నానాలకు అయిపోయాయట! టాంకర్ వచ్చేవరకూ ఆగాలంటున్నారు... అపార్ట్‌మెంట్ అసోసియేషన్ వారు.
‘ఇదేం.. ఉగాది బాబోయ్...’ అన్నాడు మొగుడు - తుండుగుడ్డతో బయటకు వచ్చి.
ఈ సంవత్సరం అందరికీ మిశ్రమ ఫలితాలే! ఆదాయం కంటే వ్యయం... గౌరవం కంటే.. అవమానం ఎక్కువ అని... ఉగాది ఫలితాలు చెప్తున్నాడు టీవీలో ఎవరో గొట్టంగోవిందమ్‌గారు.
‘ఎలా వున్నా... ఈ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చే సూచనలేమైనా ఉన్నాయా?’ అని అడిగాడు పంచాంగ శ్రవణం చేస్తున్న ఓ ప్రతిపక్ష వినాయకుడు.
‘శుభం పలకరా.. మంచన్నా అంటే.. పెళ్లికూతురు ముండ ఎక్కడ చచ్చిందీ.. అన్నాడట ఇలాంటి వినాయకుడే!...’ శుభం కోరుతూ ఉగాది పండుగ చేసుకుంటుంటే ఇదేం గోల.. ఇదేం రాజకీయం...’ అని విసుక్కుంటూ టీవీ కట్టేశాడు ఇంటి యజమాని.

-గీతాసుబ్బారావు శర్మ 98480 34418