కథ

రెండో పెళ్ళి! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...................................................................
-బులుసు సరోజినీదేవి

ప్రత్యేక బహుమతి రూ.2,000
పొందిన కథ

కళలకు కాణాచిగా వాసికెక్కిన విజయనగరానికి చెందిన బులుసు సరోజినీ దేవి ఆరేళ్ల క్రితం రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి వివిధ సాహితీ ప్రక్రియల్లో నిరంతర కృషి చేస్తున్నారు. తన తల్లిదండ్రులకు సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక, లలితకళల్లో అభినివేశం ఉండడంతో తనకూ ఆయా రంగాలపై అనురక్తి కలిగిందని సరోజిని చెబుతుంటారు. చలం పుస్తకాలపై రాసిన వ్యాసం అచ్చులో ఆమె తొలి రచన. ఆ తర్వాత కవితలు, కథలు, రేడియో నాటికలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలతో సాహితీ సేద్యం కొనసాగిస్తున్నారు. 2010లో ‘రజని-కుందుర్తి’ అవార్డును, 2011లో ‘ఎక్స్ రే’ పురస్కారాన్ని అందుకున్నారు. ‘మంచుపుష్పం’ కథకు రాష్టస్థ్రాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. పలు దిన,వార పత్రికలు ఆమె కథలను ప్రచురించాయి. ‘ఆకాశవాణి’లో నాలుగు నాటికలు ప్రసారం కాగా, ‘ఈ ప్రశ్నకు బదులేది?’ నాటిక పలు టీవీ చానళ్లలో ప్రసారమైంది.
...............................................................

కొండమల్లిలా... కొత్త మొలకలా ఉందా పిల్ల. పేరు ఇందుమతిట. మతి పోగొట్టేసింది మనోహర్‌కి. ‘సై’ అనేశాడు ఠక్కున...
పెళ్లిచూపుల తతంగం క్షణాల్లో ముగిసిపోవడం మనోహర్ అక్క సుందరికి ఆశ్చర్యమే కలిగింది.. స్వీట్లు పంచుకోడాలు దాక వెళ్లే ముందు తమ్ముడి చెవిలో ‘ఏమన్నా అడగాల్సినవి ఉంటే అడగమంది..’ ఏం లేవన్నాడు మనోహర్.. ‘చదువు గట్రా, ఉద్యోగం చేయడం ఇష్టమేనా?’ లాంటివైనా అడిగి తెలుసుకోమంది. ‘నువ్వడిగేయ్’ అని తేలిగ్గా అనేశాడు. సుందరి ఇందుమతి పక్కకి చేరింది.. ఇందుమతి తండ్రి కాబోయే వియ్యంకుడికి తనేం ఇచ్చుకోగలడో వివరించాడు.

కాస్సేపట్లో తమ్ముడితో అంది సుందరి.
‘బాగా చదువుకున్న పిల్లరా. ఎం.ఏ లిటరేచర్.. గోల్డ్ మెడలిస్ట్’ అంది సంబరంగా.
అప్పటికే పెళ్లి కుదిరిందన్న హుషారులో ఉన్న ఇరుపక్కల వారు సంతోషాలతో గొంతులు పెంచి లొడలొడ మాట్లాడేసుకుంటున్నారు. అక్క చెప్పింది విన్నట్టు తల ఊపినా మనోహర్‌కి అదేం వినపడలేదు. అతడి దృష్టంతా ఇందుమతి అందం మీదే ఉంది. మళ్లీ ఏదో చెప్పబోయింది సుందరి తమ్ముడికి.
‘నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అక్కా! అక్కవైనా అమ్మవైనా నువ్వేగా!’ అన్నాడు.
‘హమ్మయ్య’ అనుకుంది సుందరి.
ఒకరికొకరు నచ్చడం, ఇచ్చిపుచ్చుకోడాల్లో కూడా పేచీలేవీ ఉండకపోవడంతో వారం తర్వాత మంచి ముహూర్తంలో పెళ్లి. పెళ్లి కూడా అలా అలా జరగలేదు. ధూంధాం అంటూ చేశాడు పిల్ల తండ్రి. బంధువుల సహకారంతో అట్టహాసంగా, హాస్య చతురోక్తులతో, బాజాభజంత్రీలు, బాండు మేళాలతో టిప్‌టాప్‌గా జరిగిపోయింది. పెళ్లైన మర్నాడు ఎప్పుడెప్పుడా అని మనోహర్ ఎదురుచూసిన మొదటి రాత్రి వచ్చేసింది.
మనోహర్ కళ్లు విల్లు ఎక్కుపెట్టిన మన్మథ బాణాలతో సిద్ధంగా ఉన్నాయి. ముద్దులొలికే మోముతో తన ‘ప్రణయ సంపద’ని అర్పిద్దామని ఇందుమతి రాబోయే శుభ ఘడియల కోసం ఎదురుచూస్తోంది. ఇంకా వారిద్దరూ గదిలోకి జొరబడనే లేదు.. మరి కాస్త వేచి చూసే టైము ఉందని సిద్ధాంతి చెప్పడంతో మదనకామరాజు మరో ఇంటికి వెళ్లాడు. సీతాకోక చిలుక ఆ కాసేపటిలోనే ఆలోచనల జోరీగలా మారి తేనెతుట్టెని కదిలించి పోయింది... పెళ్లంతా సినిమా రీళ్లలా తిరిగింది మనోహర్ బుర్రలో. ఇందుమతి ఒక్కసారైనా తన వైపు చూడలేదనిపించింది. స్నేహితురాళ్లతో కిసుక్కు కిసుక్కున తనని చూసే నవ్వినట్టనిపించింది. జీలకర్రా, బెల్లం నెత్తిమీద పెట్టాక మధ్య ఉన్న తెర అడ్డు తీశాక ఒక్కసారి తన కళ్లల్లోకి చూసిందేమో? గుర్తు రాలేదు. తలంబ్రాలు పోస్తూ, చుట్టుపక్కల హాస్యాలకి నవ్వినట్టుగా తోచింది. వెండి బిందెలో ఉంగరాల ముచ్చటలో తనకి దొరిన ఉంగరం భర్తకివ్వడంలో ఏదో ఉందనిపించింది..
ఎంత వెతికినా ఒక్కటి.. ఒకే ఒక్కటి కూడా చిలిపి చూపో, కొసరు నవ్వో గుర్తుకి రాలేదు.. తనకి ‘తన
పెళ్లి’లో జరిగిన తీపి జ్ఞాపక మొక్కటీ లేదా?’ మనోహర్‌లో దిగులు, ఆవేదన పొంగి పొర్లుతున్నాయి. ఇంకా ముందుకి పోయాయి ఆలోచనలు.
‘ఇందుమతి’!.. అంతటి అందగత్తె తనని చేసుకోడానికి ఒప్పుకుందంటే ఒక్క క్షణం ఆలోచించొద్దూ? ఎంతసేపు తన బంధువుల్తో కబుర్లు, స్నేహితులతో పరిహాసాలు, ఆ కవ్వింతలు, తుళ్లింతలె తప్ప తనని ఎవడి కోసం చేసుకుంటాడన్నట్టు లేదూ?... పోయిన కామరాజు మళ్లా రాలేదు. ఈలోగా శోభన ముహూర్తం మొదలైపోయింది.
మొదటి రాత్రి పైటకి ముడి వేయమని ఒక మంచి వజ్రపు టుంగరం ఇచ్చాడు తండ్రి.. ఇందుమతి రిటర్న్ గిఫ్ట్‌గా మనోహర్ మెడలో జెఅరిపోతు లాంటి దట్టమైన వెడల్పున్న గొలుసు వేసింది.. తన వజ్రపు టుంగరం వెలవెలపోయేలా. ‘అహం’ బాగా ఉన్నట్టుంది. ‘పెనం పొయ్యి మీద పెట్టినట్టు’ అనిపించింది. మంట ఇంకా సిమ్‌లోనే ఉంది.’
అలా నిల్చుంది ఇందుమతి... పది నిమిషాలు ఇరవై ఒకటి నుంచి ఒకటి దాకా అటు ఇటు చుక్కలేసింది కుడికాలి బొటన వేలితో. ఇంక మొగుడుగారు ముగ్గెయడమే తరువాయి భాగం అనుకుంటే నవ్వొచ్చి ముసిముసిగా నవ్వుకుంది. అబ్బో కూర్చోమంటే గాని కూర్చోదేమో అనుకుని-
‘కూర్చో ఇందూ!’ అన్నాడు మనోహర్... గొంతు మృదువుగా పలికిందేంటా? అని విస్తుపోయాడు. ఇందుమతి వెనె్నల తనని సుతారంగా తాకినంత సుకుమారంగా కూర్చుంది పందిరి మంచం చిగురున. లేలేత అరిటాకులా ఆమె దేహం చిరుగాలికే కంపిస్తున్నట్టు ఉంది. సిగ్గుల మొగ్గై పులకరింత ఆమెలో. అవన్నీ గమనించి ‘రెడీ ఫర్ ద మాచ్’ అనుకున్నాడు మనోహర్... అప్పటికి కూడా రాలేదు కాముడు. ‘అన్నీ తిప్పితిప్పి ఆలోచిస్తున్నాడు తను’ అనుకున్నాడు మనోహర్.
‘నీ కాలేజీ కబుర్లు చెప్పు.. నీ గురించి ఇంతవరకు నేనేమీ తెలుసుకోలేదు. చెప్పు!’ అడిగాడు సిగ్గుగా తలవంచుకుంది మాట్లాడలేనట్టు.. మాట్లాడమని ఒత్తిడి చేశాడు మనోహర్.
‘ఓసోస్.. మీ అక్కగారు, అదే మా వదినగారు మీరడిగి రమ్మన్నారని చెప్పారు, మళ్లీ మీ దగ్గరకొచ్చి చెప్పడం నేను చూసానుగా?’ అంది తమాషాగా కళ్లు ఆర్పి తెరుస్తూ. ‘ఓ.. అదా?’ గుర్తొచ్చింది.. కానీ తనేం వినలేదు.. అదే చెప్పాడు.
ఆశ్చర్యపోయింది. తనేం చదివిందో చెప్తూ ‘గోల్డ్ మెడలిస్ట్’నంది.
‘ఏంటీ?’ చాలా పెద్ద దీర్ఘం తీశాడు మనోహర్ కళ్లు తిరిగినట్టయి. ఉక్రోషం పొడుచుకొచ్చింది.
‘నేను ఉఠ్ఠి బి.కాం.గాణ్ణి. తెలిసే ఒప్పుకున్నావా?’ అడిగాడు.
‘పెళ్లికి, పెద్ద చదువుకి సంబంధం ఏమిటి? మీకున్న గొప్ప ఉద్యోగం నాకుందా మరి?’ అంది ఇందుమతి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం. వాతావరణంలో ఆ గంభీరత చూసి భయపడింది ఇందుమతి. క్షణాల్లో మామూలయిపోతూ-
‘నిజంగా నేనంత నచ్చానా?’ అడిగాడు.
‘మరి? నాన్న చెప్పారు కూడా... మీకున్న మంచి పేరు..’ అంది.
‘ఓహో! మీ నాన్న చెప్పారనా? సరే కాని పెళ్లికి ముందు మా దగ్గర అంతంత మాత్రమే ఆస్తులున్నాయని చెప్పిన మీ నాన్న ఇందాక నన్ను పక్కకి తీసుకెళ్లి నాకున్నదంతా పిల్లకే.. ఇప్పుడు ఇల్లు, పొలం రాసిస్తాను అని అన్ని వివరాలు చెప్తున్నారు. ముందంతా ఏం మాట్లాడలేదే మీకేమున్నాయో? లేవో? నేనడిగానా?’ అన్నాడు సాధ్యమయినంత మేర గొంతుని సాధారణంగా ఉంచుతూ.
‘్ఛఛ! మీరడిగారని కాదు.. నేను అస్సలు కష్టపడకూడదని ముందు జాగ్రత్త.. తండ్రి కదా, ఆత్రుత!’ అంది.
‘నా దగ్గరకొస్తే కష్టపడతావనేగా దాని అర్థం?’ అన్నాడు. ఆశ్చర్యంగా తలెత్తి చూసింది ఇందుమతి. తేలిగ్గా నవ్వేస్తూ-
‘రాజుగారి పెద్ద భార్య సామెత గుర్తొస్తోంది’ అంది ఇంకా నవ్వుతూ.
‘వేళాకోళం’! ఘీంకరిస్తూ కాలుని నేలతో తన్నాడు మనోహర్. కాస్సేపు అతి నిశ్శబ్దం... అనునయ స్వరంతో నెమ్మదిగా-
‘పాలు తాగండి. ఇది మన మొదటి రాత్రి’ అంది పాల గ్లాసు అందిస్తూ. తీసుకున్నాడు కాని తాగకుండా పక్కన పెట్టాడు.. కాస్సేపాగి చిరునవ్వు అరువు తెచ్చుకుని ఇందుమతి వైపు చూశాడు. ఆమె చాలా చక్కగా నవ్వింది.. ఏదో చెప్పబోయి ఆగితే - చెప్పమని నొక్కినొక్కి అడిగాడు. చెప్పకపోతే నామీద ఒట్టన్నాడు. అప్పుడు నోరు విప్పింది ఇందుమతి. ‘కోపం రాకూడదు మరి’ అంటే ‘రాదన్నాకే’
‘ప్రభువులు మితిమీరి మాట్లాడిన వారిని మూగవాణ్ని గానూ, యుక్తాయుక్తంగా మాట్లాడితే పేలుతున్న వాడిగానూ, సామీప్యంగా, దగ్గరితనంతో ఉంటే గట్టిదనం కలవాడిగానూ, దూరంగా ఉంటే శక్తిలేని వాడిగాను, ఓర్మి కలిగి ఉంటే పిరికిగానూ, ధైర్యవంతుడైతే శాంతం లేని వాడుగానూ చెప్తారు. రాజుల్ని కొలవడం యోగులకైనా సాధ్యం కాదని ‘్భర్తృహరి’ చెప్తాడు. కాని కట్టుకున్న మొగుణ్ణి కొంగున ముడేసుకుంటామనుకున్న ఆడాళ్లు ఉత్తి చవటలు’ అంది ఇందుమతి పకపకా నవ్వుతూ. అలా నవ్వుతూనే ఒళ్లు విరుచుకుంది. అలా విరుచుకోడం ఏ మాత్రం నచ్చలేదు మనోహర్‌కి. ‘ఆ నవ్వేంటి? ఆడది నవ్విందంటే నవరత్నాలు సున్నితంగా రాలినట్టుండొద్దూ?’ నచ్చలా.. నచ్చలె...’ అని గొణుక్కున్నాడు.
‘తెగ పోజు నీకు’ అన్నాడు ఉడుకుమోత్తనంగా.
‘మీక్కూడా!’ అంది అల్లరిగా నవ్వుతూ.
‘మాటకి మాట. గీరెక్కువ?’ అన్నాడు.
‘మీకు మాత్రం?’ అంది కవ్వింతగా.
ఠక్కున లేచి నుంచుని ఒక్క కోర చూపు చూసి తలుపు తీసుకుని ఒక్క ఉదుటున బయటికి వెళ్లిపోయాడు. కదలని శిలై పోయింది ఇందుమతి. బయట ఉన్న ఆడ, మగ పెళ్లివారంతా అతడు గదిలోంచి బయటికి వచ్చెయ్యడాన్ని వింత వింతగా.. ఆ రావడానికి కారణం కేవలం పెళ్లికూతురికి తల తిరుగుడే కారణమని చెప్పుకోడం.. అంత విరగబాటు తగదని అంచెలంచెలుగా చెవులు కొరుక్కోవడం దాకా వెళ్లింది.. పెళ్లి వారు పెట్టెబేడా సర్దుకుని వెళ్లే చివరి నిమిషం వరకు కాళ్లు చేతులు పట్టుకుని బతిమాలిన ఇందుమతి తండ్రి, బంధువర్గం జరిగిన సంఘటనకి నోట మాట రానివారయ్యారు.. విషయం విడాకుల దాకా వెళ్లే వరకు ఎన్నో ఉత్తరాలు, మెసేజ్‌లు పంపి విసిగి వేసారి పోయింది ఇందుమతి. కోర్టులో కూడా మనోహర్ కాళ్లు పట్టుకుని ‘ఏం చెప్తే అది చేస్తానని, ఎలా ఉండమంటే అలా ఉంటానని’ మొత్తుకుని ఏడ్చింది. అందరూ ఆమెని చూసి జాలిపడ్డారు.
సుందరి తమ్ముడిని నిలదీసింది. ఇది తప్పని చెప్పబోయిన తండ్రిని, మామగారిని, పెద్దలెవ్వరినీ లక్ష్య పెట్టకుండా గర్వంతో విర్రవీగాడు మనోహర్. విడాకులు మంజూరు కాగానే పెద్దగా చదువుకోని, ఎక్కువ తక్కువ మాట్లాడని, అన్నింటికి తల మాత్రమే ఊపే గంగిగోవు లాంటి సీతని చేసుకుని కాపురం పెట్టాడు మనోహర్. రెండేళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. అప్పుడొక స్నేహితుడు ఇందుమతికి పెళ్లయిందనీ, భర్త మనోహర్ కంటే పెద్ద ఉద్యోగస్తుడనీ, పువ్వులా చూసుకుంటాడనీ తెలిసింది. సీతకి ఈ విషయం చెప్తూ వెక్కిరించాడు మనోహర్. సీత లాంటి నెమ్మదస్తురాలు తనకి దొరకడం తన అదృష్టమన్నాడు. అప్పుడు సీతకి ఎనిమిదో నెల.. ఆడపిల్ల పుట్టిందీసారి మనోహర్‌కి.
* * *
తెల్లారిందప్పుడే. సీత గురక బ్రహ్మాండంగా వినపడుతోంది. మనోహర్ కూతురు కిప్పుడు నాలుగేళ్లు.. పిల్లాడికి ఎనిమిది. దేనికో ఇద్దరు కొట్టుకుంటుంటే.. ‘ష్! నెమ్మది!’ అంటున్నాడు మనోహర్.
‘ఒరే మనూ!’ చిరపరిచితమైన అక్క సుందరి గొంతు అది. సంబరంగా చూశాడు అక్క వచ్చినందుకు. సూట్‌కేస్ లోపల పెట్టి మరదలకి నలతగా ఉందని చెప్పి తమ్ముడిచ్చిన కాఫీ తాగాక వచ్చిన విషయం చెప్పింది.. సుందరి కూతురికి అక్కడ ఇంజనీరింగ్ సీటొచ్చిందని, ఇక మీదట అక్కడే ఉంటుందని. గుండెల్లో గునపం దిగింది మనోహర్‌కి. జరగబోయే గొడవ ముందే తెలిసినట్టు.
‘ఎవరదీ?’ అంటూ హాల్లోకొచ్చింది సీత.
‘మీరా?’ అంది ఆడపడుచుని పలకరిస్తూ. సీతక్కూడా కాఫీ కలిపి ఇచ్చాడు.
‘ఇంక పిల్లల్ని స్కూల్లో దింపి రండి’ అంది సీత ఆర్డరు వేస్తున్నట్టు. పిల్లల్ని రమ్మని పిలిచి తను చెప్పులేసుకున్నాడు.
‘వచ్చేప్పుడు కూరలు, సరుకులు తెండి. ఈవిడొచ్చారుగా? బొత్తిగా చారు అన్నం పెడతామా ఏమిటి?’ అంది. తలూపాడు మనోహర్.
‘గంగిరెద్దులా తలూపడం కాదు. కూరల్లో చచ్చు పుచ్చు ఉన్నాయేమో చూడండి. సరుకులు ధరలు తెలుసుకుని హోల్‌సేల్‌లో పట్రండి. అర్థమయిందా?’ అంది.
తలూపి పిల్లల్ని స్కూల్లో దింపి రావడానికి వెళ్లాడు మనోహర్. దింపాక హాల్లోకి రాబోతూ వాళ్ల సంభాషణ వింటూ బయటే ఆగిపోయాడు.
‘నెమ్మదా? ఏం నా నెమ్మదితనం మీద పడ్డారు? మంచి మర్యాద? ఎవరికి? మీ తమ్ముడికి నేర్పాల్సింది. పెళ్లై శోభనం గదిలోనే తన ప్రతాపం చూపించానని తెగ విర్రవీగినప్పుడు ఏమయిందీ నెమ్మది? అయినా ఇదేమన్నా ధర్మసత్రమా మీ పిల్లని మేపడానికి?’ సీత అరుపులు.
ఇంక ఆగలేక లోపలికెళ్లి ఆపమన్నట్టు చెయ్యి ఎత్తాడు. కొట్టడానికి వచ్చాడంటూ గట్టిగా ఏడుస్తూ తనూ కొట్టడానికి చెయ్యెత్తింది సీత.. మరి కాసేపట్లో సుందరి తిరిగి వెళ్లిపోడానికి తయారయిపోతోంది.. మనోహర్ ఆటో తేవడానికి వెళ్లాడు. ఆటో తెచ్చాక లోపలికొస్తూ విన్నాడు.
‘మీరేమన్నా అనుకోండి. ఈ మాత్రం భయంలేకపోతే నేను ఈ సంసారం నెగ్గుకు రాలేను. వేలు చూపిస్తే మండ మింగుతారు మీ తమ్ముడి లాంటి వాళ్లు. కొట్టడానికి చెయ్యెత్తాననా? కొట్టేదానే్న కూడా! నాకేం భయం లేదు. నన్ను కూడా వదిలేస్తాడని. ఎక్కడికి పోగలడు? ఇది రెండో పెళ్లి. ఇద్దరు పిల్లలు. ఎవడిస్తాడు మళ్లా పెళ్లికి పిల్లని? కుక్కిన పేనులా నా దగ్గర పడి ఉండక తప్పదు. మా నాన్నకి తెలిసిందా తాట వొలుస్తాడు. మాదేం మామూలు పలుకుబడా? ఊరు ఊరంతా ఏకమై పోగలదు’ వాయించి పారేస్తోంది ఈ కాలం సీత.
ఆనాటి ఇందుమతి కన్నీళ్లతో నిలబడ్డ రూపం కళ్ల ముందు నిలిచింది మనోహర్‌కి. చేతుల వైపు చూసుకున్నాడు.

-బులుసు సరోజినీదేవి