కథా సాగరం

మాట్లాడే పుర్రె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వేటగాడు అడవికి వెళ్లాడు. దారిలో ఒక చెట్టు కింద అతనికి ఒక పుర్రె కనిపించింది. బాగా ఎండగా వుండటంతో విశ్రాంతి కోసం అతను చెట్టు కింద కూచున్నాడు. పక్కనే కపాలముంది. అది అక్కడ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు.
అతను ఎంతో దూరం నడవడం వల్ల అలసిపోయాడు. నిర్జనమైన ఆ ప్రదేశంలో ఎవరూ పలకరించడానిక్కూడా లేరు. నిశ్శబ్దం. మాట్లాడ్డానికి ఎవరూ లేకపోవడంతో పక్కనున్న పుర్రెను చూసి అతను ‘హలో’ అన్నాడు.
అట్లా పుర్రెను పలకరించినందుకు తనలో తనే నవ్వుకున్నాడు. అంతలో ఎవరో తిరిగి ‘హలో’ అని పలకరించారు. ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరు. మళ్లీ ‘హలో’ అన్న మాట వినిపించింది. పుర్రెను చూశాడు. ఆ పుర్రె అతన్ని తిరిగి ‘హలో’ అంటోంది. అదిరిపోయాడు.
తనను తాను సంభాళించుకుని పుర్రెను చూసి ‘నువ్వు మాట్లాడుతావా?’ అన్నాడు.
పుర్రె ‘అవును. మాట్లాడుతాను’ అంది.
అప్పుడతను ‘నిన్నీ పరిస్థితిలో ఇక్కడికి తెచ్చిన వాళ్లెవరు?’ అని ప్రశ్నించాడు.
పుర్రె ‘మాట్లాడ్డం, విపరీతంగా మాట్లాడ్డం నన్నిక్కడకు తెచ్చింది’ అంది.
అతను వింతగా చూశాడు. భయపడ్డాడు.
అతను పరిగెత్తుకుంటూ అడవి దాటి నగరం చేరి చెమటలు కక్కుకుంటూ దేశాన్ని పాలించే రాజు దగ్గరికి వెళ్లి ‘రాజుగారూ! యిది ఎవరూ నమ్మలేని నిజం. ఒక పుర్రె మాట్లాడడం నేను చూశాను. నా చెవుల్తో విన్నాను. ఒక చెట్టు కింద ఆ పుర్రె పడి ఉంది. అది నన్ను చూసి ‘హలో’ అంది’ అన్నాడు.
రాజు వేటగాడి మాట నమ్మలేదు.
‘నువ్వు నవ్వులాటకు చెబుతున్నావేమో?’
‘రాజుగారూ! మీతో నవ్వులాటా?’
‘అయితే నేనూ వస్తాను. చూద్దాం’ అన్నాడు రాజు. రాజుతోబాటు పరివారమంతా కదిలింది.
వేటగాడు అందర్నీ అడవిలో వున్న చెట్టు కిందకు తీసుకెళ్లి పుర్రెను చూపించాడు. వేటగాడు ‘పుర్రెను పలకరించండి’ అన్నాడు రాజుతో. రాజు ‘హలో’ అన్నాడు. సమాధానం లేదు. రాజు మళ్లీ హలో హలో అన్నాడు. బదులు లేదు. వేటగాడు ‘హలో’ అన్నాడు. పుర్రె బదులివ్వలేదు. రాజు వేటగాడు తనని వెర్రివాణ్ణి చేశాడని ఆగ్రహించాడు. కోపం కట్టలు తెంచుకుంది.
‘నాకు ముందే తెలిసింది. నువ్వు పిచ్చివాడివి. లేదా నన్ను మోసం చేయాలని ఈ పని చేసావు’ అని వేటగాడి తలను ఖండించమని సైనికులను ఆజ్ఞాపించాడు.
సైనికులు వేటగాడి తలను ఖండించారు. అది పుర్రె పక్కన పడింది.
పుర్రె తలను చూసి ‘హలో’ అంది.
తల ఆశ్చర్యంతో ‘అప్పుడెందుకు మాట్లాడలేదు?’ అంది.
పుర్రె ‘ఎవరు తెచ్చారు నిన్నిక్కడికి?’ అని అడిగింది.
తల ‘అవసరానికి మించి మాట్లాడ్డం’ అంది.

- సౌభాగ్య, 9848157909