ఈ వారం కథ

ఎంపిక (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందరాముడు లోపలికి వచ్చాడు హుషారుగా. ప్రిన్సిపల్ మల్లయ్యతో మాట్లాడుతున్న రవీంద్ర మాటలు ఆపి విషయం ఏమిటన్నట్లు అతని వంక చూశాడు. అతని చేతిలో ఒక కాగితం వుంది.
‘‘సార్! మీరు చెప్పినట్లుగా అన్ని పరీక్షలు చేసి క్యాంపస్ సెలక్షన్‌కు అర్హులైన అభ్యర్థులను తేల్చాము సార్!’’ చిన్నగా చెప్పాడు.
‘‘ఏదీ, మీ చేతిలో లిస్టు ఉందా?’’ అడిగాడు మల్లయ్య.
‘‘ఉంది సార్, ముందు ఇది మా బాస్ రవీంద్రగార్కి యిస్తాను’’ అంటూ ఆ కాగితాన్ని అందజేశాడు ఆనందరాముడు.
‘‘నో ప్రాబ్లెం, ముందు మన మల్లయ్యగారినే చూడనివ్వండి’’ అంటూ ఆ కాగితాన్ని తను మల్లయ్యకు అందించాడు. మల్లయ్య ఆ కాగితాన్ని ఆత్రంగా అందుకుని సెలెక్టు అయిన స్టూడెంట్ల పేర్లు చదువుకున్నాడు. ఆనందంగా తలూపాడు.
‘‘గుడ్! గుడ్! మావాళ్ళు మా కాలేజీ పేరు నిలబెట్టారు. అరవై మంది సెలక్టు అయ్యారు. మీరు సెలెక్టు చేసిన వాళ్ళంతా మంచి మెరిటోరియస్ కాండిడేట్లు. వాళ్ళ అకడమిక్ రికార్డు చాలా బాగుంది. తప్పకుండా మీ కంపెనీకి మంచి సేవలు అందిస్తారు’’ చెప్పాడు మల్లయ్య ఉబ్బితబ్బిబవుతూ.
రవీంద్ర భృకుటి ముడిపడింది. ఆలోచనలో పడ్డాడు. ఆనందరాముడి వంక ఒక చూపు విసిరి అడిగాడు. ‘‘అదేంటి ఆనందరామ్! మనకి కావలసింది నలభై మందే కదా! అరవై మందిని సెలెక్టు చేశావు?’’
‘‘అదే సార్! అది చెబుతామనే మీ దగ్గరికి వచ్చాను. ఒక ఇరవై మందిని వెయింటింగులో పెడితే బాగుంటుందనిపించింది’’ ఆనందరాముడు చెప్పాడు, కొంచెం కంగారు పడుతూ రవీంద్ర తీక్షణ చూపులకు.
‘‘ఎందుకలా అనిపించింది?’’ కటువుగా అడిగాడు రవీంద్ర.
‘‘పోనీలేండి సార్! నలభై కాకపోతే అరవై మందిని సెలెక్టు చేయండి, ఏం ఫర్వాలేదు. మీది విస్తరించే కంపెనీ! జెట్ స్పీడుతో పెరుగుతున్నది కదా!’’ మల్లయ్య రికమెండ్ చేశాడు.
‘‘చూడండి, మల్లయ్యగారూ! మా కంపెనీకి కొన్ని ప్రిన్సిపల్సు ఉన్నాయి. ఒక లక్ష్యం ఉంది. మా యండిలకు ఒక విజన్ వుంది. అలాగే మాకు కావలసిన సరుకునంతా కేవలం ఒక్క మీ కాలేజీ నుంచే తీసుకుంటే మమ్మల్ని నమ్ముకున్న యింకొన్ని కాలేజీలు దెబ్బతింటాయి. మీరు మీ కాలేజీ నుండి ఎక్కువ క్యాంపస్ సెలక్షనులు వస్తే భవిష్యత్తులో మీ కాలేజీ సీట్లకు బాగా డిమాండ్ పెరుగుతుందనే ఆలోచిస్తున్నారు. కాని మాకు వివిధ రకాల కాలేజీలనుండి విభిన్నమైన వ్యక్తులు కావాలి! అప్పుడు వాళ్ళను కంట్రోలు చేయడం ఈజీ! వాళ్ళలోని జీల్‌ను పెంపొందించడం ఈజీ! అదీగాక అందరిని యిక్కడ నుండే సెలెక్టు చేస్తే మా యండిలకు మల్లయ్యగారు ఏం మాయ చేశాడో మా రవీంద్రను అన్న ఫీలింగు కలుగకూడదు. కాబట్టి యిటువంటి విషయాల్లో దయుంచి మమ్మల్ని ఇన్‌ఫ్లుయన్సు చేయకండి’’ చిన్న క్లాసు పీకాడు మల్లయ్యను చూస్తూ. అది ఆనందరాముడికి కూడా వర్తిస్తుందని అతనికి తెలుసు.
‘‘సారీ! నేను ఆ యాంగిలులో ఆలోచించలేదు’’ మల్లయ్య గ్లాసు అందుకుని నీళ్ళు తాగుతూ మొహం చిన్నబుచ్చుకుని చెప్పాడు.
‘‘చూడు ఆనందరామ్! ఆ లిస్టును మెరిట్ ఆర్డర్ ప్రకారం నలభైకి కుదించి తీసుకురా!’’ ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు రవీంద్ర.
ఆనందరాముడు నీళ్లు నములుతూ నిల్చున్నాడు.
‘‘సార్! నాలుగు రకాల టెస్టులు, గ్రూపు డిస్కషన్సు అయ్యాయి సార్! దాని ప్రకారం పాల్గొన్న ఐదొందల పైచిలుకు క్యాండిడేట్ల నుండి అరవై మందిని మాత్రం ఎంపిక చేశాను’’ చెప్పాడు.
‘‘అస్సలు నీ మైండులో అరవై అని ఎందుకు పడింది, మనకి కావలసింది నలభై మాత్రమే!’’ రవీంద్ర చెప్పాడు దృఢంగా.
‘‘నిజమే సార్! కాని వీళ్ళల్లో ముప్ఫై మందికి కటఫ్ మార్కులు సమంగా వచ్చాయి. ముప్ఫైమందిలో పదిమందిని తీసుకుని ఇరవై మందిని వదిలెయ్యాలి. అప్పుడు ఎవరిని తీసుకోవాలి, ఎవరిని వదిలివెయ్యాలి అని తేల్చుకోవడం కష్టమైపోతున్నది. ర్యాంకర్లకు ద్రోహం చేస్తున్నానేమోనని నా మనసు పీకుతున్నది’’ ఆనందరాముడు విషాదంగా చెప్పాడు బాధపడిపోతూ.
‘‘ఓకే! మల్లయ్యగారు, ఈ లిస్టులోంచి ఒక ఇరవై మందిని మీరు తీసివేస్తారా? ఎందుకంటే మీకు వారి క్యారెక్టర్లు, బ్యాక్‌గ్రౌండులు బాగా తెలిసి ఉంటాయి కదా!’’ రవీంద్ర ఆ బాధ్యతను ప్రిన్సిపల్ మీదకు తోశాడు.
మల్లయ్య నీళ్లు నమిలాడు. సందిగ్ధంలో పడ్డాడు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొందరికి తను దెబ్బకొట్టాల్సి వస్తుంది. రేపొద్దున్న ఈ న్యూస్ బయటపడితే తల్లిదండ్రులు తన పట్ల ద్వేషం పెంచుకుంటారు. తనకెందుకు ఆ పాపం.
‘‘చూడండి రవీంద్రగారు మీరు హెచ్.ఆర్.డిలో తలపండినవారు. సెలక్షన్‌లో మిమ్మల్ని మించిన వారుండరు. ఆ పని ఏదో మీరే కానివ్వండి’’- మల్లయ్య కూడా ఆ బాధ్యతనుండి తప్పుకున్నాడు.
రవీంద్ర తల అడ్డంగా ఊపాడు. ఆ లిస్టును పైనుంచి కిందదాకా ఆసాంతం చదివాడు. ర్యాండమ్‌గా కొన్ని పేర్లు కొట్టివేయవచ్చు. లేదా పేర్లను బట్టి వాళ్ళ కులాన్ని, మతాన్ని గ్రహించి తనకిష్టం లేని కొన్ని పేర్లను తొలగించవచ్చు. కాని అలా చేయడం యిష్టం లేదు.
ఒక్కొక్కరిని పిల్చి ఇంటర్వ్యూ కండక్టు చేయవచ్చు. కాని అది చాలా టైము కన్స్యూమింగ్ ప్రాసెస్. రేపు తను అత్యంత ముఖ్యమైన పనిపైన ముంబయికి ఫ్లైట్ ఎక్కాలి. మళ్లీ యింకోసారి ఈ కాలేజీకే క్యాంపస్ సెలక్షనుకు రావడం అసంభవం. ఇంకా కొన్ని కాలేజీల్లో చేయాలి.
రవీంద్ర బుర్రలో ఒక ఫ్లాష్ వెలిగింది.
‘‘చూడండి మల్లయ్యగారు, ఈ అరవై మందిని ఒక రూములో కూర్చోమనండి. ఒక పేపరు సెట్ చేసి యిస్తాను. ఒక గంట టైములో వాళ్లు ఆన్సర్ చేయాలి’’ అని మల్లయ్యను బయటకు పంపించివేశాడు.
‘‘ఏంటి సార్! మనం మూడు రోజులుగా రకరకాల పరీక్షలు పెట్టాం గదా. మళ్లీ యింకొకటా? మనకి అంత టైము ఎక్కడుంది?’’ ఆనందరాముడు అసంతృప్తిని వ్యక్తపరిచాడు.
‘‘ఆనందరామ్ కంగారుపడకు. నేను చెప్పింది చెయ్యి చాలు. ఓ పది నిమిషాలు నువ్వు బయట వేచి ఉండు. నేను ప్రశ్నాపత్రం సిద్ధం చేస్తాను. ఈలోగా వాళ్ళకు ఆన్సర్ షీట్లను సిద్ధం చెయ్యి’’ అని చెప్పి అతన్ని కూడా బయటకు పంపించివేశాడు.
ఒక కాగితం, పెన్ను తీసుకుని చకచకా కొన్ని ప్రశ్నలు రాశాడు. పది నిమిషాల తర్వాత వచ్చిన ఆనందరాముడికి కాగితం అందించాడు.
‘‘దీన్ని జిరాక్సు చేయించి అరవై మందికి ఇవ్వండి. వారికి గంట టైమిద్దాం! గంట అయిన తరువాత ఆన్సరు షీట్లు కలెక్టు చేసి తీసుకురండి’’.
‘‘కాని సార్! ఈ అరవై షీట్లను ఎవల్యుయేట్ చేయాలంటే మస్తు టైము పడుతుంది కదా!’’ కంగారు పడుతూ అడిగాడు ఆనందరాముడు.
‘‘్ఫర్లేదు. మనం వాళ్ళ ఆన్సర్లకు మెచ్చి మేకతోలు కప్పడం లేదు. మనది ఎలిమినేటింగ్ ప్రాసెస్. ఎవరు ఎక్కువ తప్పులు చేస్తారో వాళ్ళని తీసేద్దాం. జస్టు ఇరవై మందిని ఫెయిలు చేస్తే చాలు’’ అంటూ కాగితం యిచ్చాడు రవీంద్ర.
కాగితం చదివిన ఆనందరాముడు ఉలిక్కిపడ్డాడు. తన బాసుకు నిజంగా మెంటల్ ఎక్కిందని నిశ్చయించుకున్నాడు. కాని అతడిని ఖండిస్తే తన ఉద్యోగానికే ఎసరు పెడతాడని భయపడ్డాడు. ప్రయివేటు కంపెనీలో ‘బాసు ఈజ్ ఆల్వేస్ రైట్’ అందుకని మిగతా కార్యక్రమంలో పడ్డాడు.
మల్లయ్య కృష్ణారెడ్డి స్వీట్లు పట్టుకుని వచ్చాడు. ‘‘రవీంద్రగారు, ఇవి చాలా వెరైటీ స్వీట్లు! బాగా తాజాగా ఉన్నాయి. మంచి స్వచ్ఛమైన కల్తీ లేని నెయ్యితో చేస్తారు. రుచి చూడండి’’ అంటూ ఒక స్వీటు బాక్సు అతనికిచ్చాడు. దాదాపు కిలోపైగా ఉన్నాయి రకరకాల స్వీట్లు.
రవీంద్ర చిరునవ్వు నవ్వాడు అతని కంగారు చూసి. ‘‘మల్లయ్యగారు! మీరు సామాన్యులు కారు. తప్పకుండా ఈ స్వీట్లను ఉపయోగిద్దాం! సెలెక్టు అయిన క్యాండిడేట్లకు యిద్దాం! మీరు ఇక్కడే ఉండండి. నేనొకసారి ఎగ్జాము హాలుకుపోయి వస్తాను’’ రవీంద్ర లేచి నిల్చుని స్వీటు బాక్సును క్లోజ్ చేసి అతని ముందుంచి వెళ్లిపోయాడు.
‘‘మొండివెధవ! దేనికీ లొంగడు. ఒక యిరవై మందిని వెయిటింగ్ లిస్టులో పెడితే వీడి సొమ్మేం పోతుంది. నందోరాజా భవిష్యతి! ఆ తరువాత వేకెన్సీలు క్రియేట్ కాలేదని చెబితే సరిపోతుంది కదా! తను ఎంత కష్టపడి వెంటపడితే ఆ ఆనందరాముడు అరవై మందిని సెలెక్టు చేశాడు! ప్చ్! వీడి మూలంగా తన కాలేజీ పేరు పడిపోతుంది’’ తనలో తాను గొణుక్కున్నాడు నిస్పృహతో మల్లయ్య ప్రిన్సిపల్.
ఒక గంటంబావు తర్వాత రవీంద్ర చేతిలో ఒక పార్సిలుతో ప్రిన్సిపలు రూముకు వచ్చాడు. అతని వెంట పిల్లిలాగా ఆనందరాముడు వచ్చాడు చేతులు నలుపుకుంటూ.
‘‘ఆనందరామ్, వీటన్నింటిని వాల్యూ చేయాలి! చేస్తావా?’’ రవీంద్ర అడిగాడు.
‘‘నేనా సార్! నాకసలే తెలుగు అంతగా రాదు’’.
‘‘మరి ఎలా! ఇక్కడ తెలుగు టీచరు ఉన్నాడా?’’’ అడిగాడు మల్లయ్యను.
అదేదో వినకూడదిన మాట విన్నట్లు అతను ఉలిక్కిపడ్డాడు.
‘‘సార్! ఈకాలం తెలుగు టీచర్లు మా హైటెక్ కాలేజీల్లో ఎందుకుంటారు సార్! కానె్వంటు స్కూళ్లలో కూడా దొరకరు. మీకు కావాలంటే తెలుగు సబ్జెక్టు చెప్పేవాళ్ళని గాలించి రేపు తీసుకువస్తాను’’ మల్లయ్య నిష్కర్షగా చెప్పి తప్పుకున్నాడు.
రవీంద్ర టైము చూసుకున్నాడు. బయలుదేరటానికి ఇంకో ఐదు గంటల టైముంది. వీళ్ళని నమ్ముకుంటే పని కాదు అనుకున్నాడు. తనకి ఈ ఉద్యోగంలో రాకముందు తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసిన అనుభవం వుంది.
‘‘సరే! అయితే నన్ను ఒంటరిగా ఓ రెండు గంటలు వదిలిపెట్టండి. నేనే వీటి పని పడతాను’’ అంటూ పేపర్లు చూడటంలో నిమగ్నమైపోయాడు.
మల్లయ్య, ఆనందరాముడు బయటికి వచ్చారు. దూరంగా యింకో రూముకు పోయి కూర్చున్నారు. అటెండరును పిలిపించి కాఫీలు ఆర్డరిచ్చాడు.
‘‘వీడెవడండి బాబు! ఈ రోజుల్లో తెలుగు పరీక్ష ఎవరైనా పెడతారా? అప్పాయింటుమెంటు యిచ్చేది సాఫ్టువేరు ఇంజనీరుగా, చేసేది సాఫ్టువేరు జాబు. దానికి తెలుగుకు సంబంధం ఏంటిట! అయినా రాము! ఈ తలతిక్క వెధవతో ఎలా వేగుతున్నావయ్యా!’’ తన కోపం అంతా వెళ్ళగక్కాడు ఆనందరాముడితో తనకున్న చనువుకొద్దీ.
‘‘అవును సార్! ఒక్కోప్పుడు అమావాస్యకు, పున్నమికి యిలా ప్రవర్తిస్తూ వుంటాడు. భలే మూడీ ఫెలో! మాకు తప్పదు కాబట్టి భరించాలి! అయినా అస్సలు ఈ ప్రశ్నాపత్రం చూశారా సార్!’’ అంటూ నవ్వసాగాడు ఆనందరాముడు.
మల్లయ్య అతని చేతుల్లోంచి ఆ పేపరు తీసుకుని చదివాడు. ప్రశ్నాపత్రం ఇలా వుంది.
1.బాల్యంలో మీరు అనుభవించిన మధుర అనుభూతుల గురించి ఒక వ్యాసం వెయ్యి పదాలలోపు రాయండి.
2.మీ తాతయ్య బామ్మలపైన కాని, తాతయ్య అమ్మమ్మలపైన కాని మీకున్న ప్రేమానుబంధాన్ని వివరించండి వెయ్యి పదాలలోపున.
3.మీ జన్మభూమి ప్రత్యేకత గురించి ఒక పుట లిఖించండి.
4.మీరు హాస్టలులో అనుభవిస్తున్న జీవితం గురించి మీ అమ్మా నాన్నలకు తెలియజేస్తూ ఒక ఉత్తరం రాయండి.
5.చరవాణి యొక్క దుష్ప్రభావంపైన మీ స్నేహితుడికి ఉత్తరం రాయండి.
ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయి. కాని ‘ఐదు’ చదివేసరికే ‘ఓ మై గాడ్!’ అంటూ మల్లయ్య పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వసాగాడు.
‘‘అస్సలు ఇతగాడికి ఈ ఉద్యోగం యిచ్చింది ఎవరయ్యా?’’ మల్లయ్యకు అనుమానం వచ్చింది.
‘‘అవును సార్! సుడిగాడు కాబట్టి ఉద్యోగం సంపాదించి పైపైకి ఎగబాకాడు. ఇప్పుడు మా ప్రాణం తీస్తున్నాడు’’ ఆనందరాముడు నవ్వుతూ చెప్పాడు.
ఈలోగా అటెండరు కాఫీలు అందించాడు. కాఫీతోపాటు వేడి వేడి మిరపకాయ బజ్జీలు కూడా తీసుకువచ్చాడు.
‘‘ఇంతకీ లోపల సారుకు యిచ్చావా?’’ మిరపకాయ బజ్జీ నములుతూ అడిగాడు మల్లయ్య.
‘‘పోయాను సార్! కాని ఆ సారు కసరుకున్నాడు, డ్యూటీలో వున్నపుడు తను అడ్డమైన గడ్డి తినడట’’ వినయంగా చెప్పాడు అటెండరు. ఇద్దరూ పడి పడి నవ్వుకున్నారు.
‘‘ఓ గాడ్! నిజంగా వీడు మెంటల్‌గాడే!’’ మల్లయ్య ముక్తాయించాడు.
వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలం గురించి మరిచిపోయారు. అకస్మాత్తుగా రవీంద్ర వాళ్ళ ముందుకు రావడం గమనించి లేచి నిలబడ్డారు.
‘‘సార్! అప్పుడే మీ వాల్యుయేషన్ అయిపోయిందా?’’ ఆనందరాముడు అడిగాడు కొంచెం ఆశ్చర్యం నటిస్తూ.
‘‘సార్! ఆ ఇరవై మంది దురదృష్టవంతుల్ని తీసి పడేశారా?’’ మల్లయ్య వ్యంగ్యం అడిగాడు.
‘‘ఐయామ్ సారీ! తీసేసింది యిరవై మందిని కాదు’’ రవీంద్ర గంభీరంగా చెప్పాడు.
‘‘ఏంటి సార్ మనసు మార్చుకున్నారా? ఓ పదిమందిని ఎత్తేశారా!’’
‘‘కాదు, అరవైమందిని ఫెయిల్ చేశాను. నోబడి ఈజ్ సెలెక్టెడ్!’’ రవీంద్ర మల్లయ్యను చూస్తూ చెప్పాడు.
‘‘సార్! ఆర్ యూ జోకింగ్!’’ ఆనందరాముడు నవ్వుతూ అడిగాడు.
‘‘డ్యూటీలో ఉన్నప్పుడు జోకులు వేసే అలవాటు నాకు లేదు’’ రవీంద్ర సీరియస్‌గా చెప్పాడు.
‘‘అంటే.. ఈ క్యాంపస్ సెలెక్షన్‌లో ఎవరినీ సెలెక్టు చేయలేదా?’’ మల్లయ్య అదిరిపోతూ అడిగాడు. అతని మొహాన చెమటలు పట్టాయి.
‘‘ఏదీ రెండుసార్లు చెప్పే అలవాటు నాకు లేదు’’ రవీంద్ర చెప్పాడు.
‘‘కాని సార్, మనకు నలభై మంది కావాలి గదా!’’ ఆనందరాముడు అడ్డుపడ్డాడు ధైర్యం చేసి.
‘‘కావాలి కాని, కనీస అర్హతలు లేనివాళ్ళను ఎలా ఎంపిక చేస్తాం!’’
‘‘సార్! వాళ్ళు అందరూ మనం పెట్టిన అన్ని పరీక్షలలో మంచిగా స్కోరు చేశారు’’ ఆనందరాముడు.
‘‘ఎంతో ప్రాసెస్ అయిన తరువాతే జల్లెడపట్టి ఐదువందల నుండి అరవై మందిని వెలికితీశారు’’ మల్లయ్య.
‘‘నిజమే కాని చివరి పరీక్షలో వారు కనీస ప్రమాణాలను సాధించలేదు’’ రవీంద్ర చెప్పాడు.
మల్లయ్యకు ఒళ్ళు మండిపోయింది. ఆవేశం తన్నుకొచ్చింది. ‘‘ఏంటి సార్ మీరనేది? మీరో బోడి పరీక్ష పెట్టారు తెలుగు పేపరిచ్చి. దాన్ని మీరే యిచ్చారు, మీరే ఫెయిలు చేశారు. అయినా బోడి తెలుగులో పాసయితే ఎంత ఫెయిలైతే ఎంత? వాళ్ళ కెరియరుకు అది ఏ రకంగా పనికివస్తుంది? ఇష్టం లేకపోతే యిష్టం లేదని చెప్పండి కాని మా బంగారం లాంటి విద్యార్థులను సబ్‌స్టాండర్డు అని కించపరిస్తే ఊరుకోను’’.
‘‘మిష్టర్ మల్లయ్య హోల్డు యువర్ టంగ్! బోడి తెలుగు అని అన్నారే ఆ పదాన్ని విత్‌డ్రా చేసుకోండి ముందు. తెలుగులో పరీక్ష ఎందుకు పెట్టానంటే అది వారి మాతృభాష కాబట్టి.
ఈ పేపర్లు చూసిన తరువాత మన తెలుగు భాషకు పట్టిన తెగులు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. రానున్న కాలంలో తెలుగు మృతభాషగా మారబోతున్నదని నిపుణుల హెచ్చరిక నిజమనిపించింది. తెలుగులో అందరూ అదరకొడతారనుకున్నాను, కాని ఆశ్చర్యంగా వీరిలో పదిమంది బ్లాంకు పేపర్సు వెనక్కి యిచ్చారు. ఇరవై మంది భయంకరమైన తప్పులతో తెలుగు రాశారు. ఒక ఏడుమంది హిందీ లిపిలో, అంటే దేవనాగరి లిపిలో రాశారు.
ఇరవై మూడు మంది ఇంగ్లీషు అక్షరాలలో తెలుగు రాశారు. కాని విచిత్రం ఏమిటంటే తెలుగు మాతృభాష విద్యార్థులకంటే ముస్లిం విద్యార్థులు కొంచెం బాగా రాశారు. తరువాత మాతృభాష ప్రాముఖ్యత తెలుసుకోలేని కాలేజీలు, స్కూళ్ళు, ప్రభుత్వం ఉండటం మన దురదృష్టం! మాతృభాష రాయలేనివాడు, చదవలేనివాడు అన్య భాషల్లో రాణించలేడు! మాతృభాషను ప్రేమించనివాడు యింకెవరిని ప్రేమించలేడు! మాతృభాష నేర్పిన తల్లిని తండ్రిని కూడా గౌరవించలేడు! అతని అనుబంధాలను కూడా అనుమానించాల్సి వస్తుంది. లేటెస్టు రీసెర్చి మాతృభాషకే ఎక్కువ విలువిస్తున్నది. మాతృభాష తెలిసినవాడికే మనోవికాసం కలుగుతుందని, అన్ని రంగాల్లో రాణిస్తాడని నిపుణులు చెబుతున్నారు. అందుకని తెలుగు భాష రాని తెలుగు విద్యార్థులను నేను సెలెక్టు చేయడం లేదు’’ రవీంద్ర తన అభిప్రాయం తెలిపాడు.
‘‘సార్ ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి. అందరిని మీరు ఫెయిలు చేస్తే నా పరువు పోతుంది. నా కాలేజీ పరువు పోతుంది. వచ్చే సంవత్సరం అడ్మిషన్లు పడిపోతాయి. దయుంచి మీరు నలభై మందినన్నా పాసు చేయండి’’ మల్లయ్య కాళ్లు పట్టుకోవడం ఒకటే తక్కువ.
కాసేపు వారి ముగ్గురి మధ్య సంభాషణ సాగింది వేడివేడిగా. చివరికి రవీంద్ర చెప్పాడు నిష్కర్షగా.
‘‘ఓకే! మీ ఇద్దరి ప్రార్థనలను మన్నిస్తున్నాను ఒక కండిషన్‌మీద. మీ విద్యార్థులకు ఆరు నెలల టైము యిస్తున్నాను. ఈ ఆరునెలల తర్వాత తెలుగులో పరీక్ష పెడతాను. ఈలోపు వారిని రాయడం, చదవడం బాగా నేర్చుకోమనండి. ఆ పరీక్షలో కనుక వారు కనీసం యాభై శాతం మార్కులు తెచ్చుకుంటే సెలెక్షన్ యిస్తాను. జాబ్ గ్యారంటీ లేదు. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు’’.
‘‘చాలు సార్! ఆ మాటన్నారు చాలు సార్! నేనే కాలేజీలో ఒక తెలుగు టీచర్‌ను పెట్టి వారికి తెలుగు నేర్పిస్తాను. వారికే కాదు సార్, ఆసక్తి వున్న మిగతా విద్యార్థులకు కూడా తెలుగు నేర్పిస్తాను’’ అంటూ ఏడ్పు మొహం పెట్టుకుని నవ్వాడు మల్లయ్య.
‘‘గుడ్! మీ కాలేజీని ఆదర్శంగా పెట్టుకుని మిగతా కాలేజీలు కూడా తెలుగు నేర్పుతాయి’’ రవీంద్ర తృప్తిగా చెప్పాడు. మాతృభాష రుణం కొంచెం తీర్చుకున్నట్లు సంతోషపడి పోయాడు రవీంద్ర.

రచయిత సెల్ నెం:9963926610

-వియోగి