కథ

స్వయంకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కలడందురు దీనులయెడ కలడందురు పరమయోగి గుణముల పాలన్
కలడందురన్ని దిశలను కలడు కలండనెడి వాడు కలడో లేడో!’
నిట్టూరుస్తూ గుర్తు తెచ్చుకుంది నీరజ గజేంద్ర మోక్షంలో తాను చదువుకున్న తనకిష్టమైన పద్యాన్ని.
ఆమె మనోవేదనకు కారణమైన పెద్దకూతురు మనోజ్ఞ మాట్లాడి మూడు సంవత్సరాలు దాటిపోయింది. తాను పెరిగిన వాతావరణం సుతరామూ ఇష్టం లేక అనురాగానికి అద్దంపట్టే మనుషులతో బతకడానికి అమ్మానాన్నలకు దూరంగా వెళ్లిపోయింది. మన యాంత్రిక జీవితానికి స్వస్తి చెప్పి తాను కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అత్తగారింట్లో వెతుక్కుంది. భర్త ప్రేమానురాగాలు, అత్తమామగార్ల ఆదరాభిమానాలు పుట్టింటి వారి తిరస్కార వైఖరిని ఎదిరించేలా చేశాయి. పుట్టింటి గడప దాటి వెళ్లిన మనోజ్ఞ మళ్లీ తల్లిదండ్రులను పలకరించలేదు. తన సంసారం సాఫీగా సాగాలంటే అత్తవారింట్లోనే సర్దుకుపోవాలని నిర్ణయించుకుంది.
మనోజ్ఞ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమె మనసు దెబ్బ తినడానికి కారణమైన నీరజ ఉపేంద్రలు ఉద్యోగరీత్యా నగరానికి వచ్చిన జంట. కొంతకాలానికి ఉద్యోగాలకు రాజీనామా చేసి రియల్ ఎస్టేట్‌లో స్థిరపడ్డారు. అందులో భాగంగానే వారి స్నేహితులకూ, బంధువులకూ అనేకానేక వ్యవహారాల్లో సాయం చేస్తూ, సంఘసేవ చేస్తున్నట్లుగా ఫీలవుతూ, ధనార్జనే ధ్యేయంగా క్షణం తీరిక లేకుండా బతకడం అలవాటు చేసుకున్నారు. అందరూ కన్నట్లే తామూ ఇద్దర్ని కని పెంచారు. కానీ పెంచే తీరులోనే పెద్ద పొరపాటు చేశారు. ఇద్దరు ఆడపిల్లలికి కట్నాలు పోసి పంపించాలనే తాపత్రయంతో అతి జాగ్రత్తగా, పొదుపుగా, కొన్ని సందర్భాల్లో కటువుగా పెంచారే తప్ప వారిని దగ్గరికి తీసి ప్రేమతో వారి మనోభావాలను గుర్తించిన రోజు లేదు. వంట చేసి లంచ్‌బాక్స్‌లు సర్దడానికే తప్ప వారిని ఏ రోజూ లాలించి దగ్గరికి తీసుకునేందుకు సమయం కేటాయించలేక పోయారు. కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించగలిగారే గానీ వారి గుండెలకు చేరువ కాలేకపోయారు. పెద్ద సంబంధాల గురించి ఆలోచించారే గానీ ప్రేమను పంచలేక పొయ్యారు. ఇద్దరూ బయటికి వెళ్లి సంపాదిస్తేగానీ పిల్లలకి మంచి భవిష్యత్తు నివ్వలేమనుకున్నారు. కానీ, పిల్లలు కోల్పోయిన తమ సాహచర్యాన్ని తిరిగి వారు పొందలేరని తెలుసుకునే సరికే సమయం మించిపోయింది. ఒక్కరోజు ఇంట్లోనే ఉండిపోతే ఎంత నష్టమో లెక్క వేసుకుని మరీ కష్టపడి సంపాదించిన డబ్బుతో అవసరం లేకుండానే మనోజ్ఞ తన గమ్యం చేరుకుంది.
బంధువుల ఇంట్లో పరిచయమయిన శశాంక వృత్తిరీత్యా సేల్స్‌మన్. అతని మంచితనం, నలుగురినీ కలుపుకుని పోయే స్వభావం మనోజ్ఞకెంతో నచ్చి ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుంది. వారింట్లోని వారందరూ డబ్బు కోసం కాక ఒకరికోసం మరొకరు బతుకుతున్నట్లుగా గమనించింది. ఉన్నదానితోనే తృప్తిగా ఉంటూ ఆప్యాయతానురాగాలే తరగని ఆస్తులుగా తలచి ఆనందంగా జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబంలో ఒకదానిగా కలిసిపోవాలన్న మనోజ్ఞ నిర్ణయం నీరజ ఉపేంద్రలకే మాత్రం నచ్చలేదు.
తల్లి అహంభావం, తండ్రి దుర్భాషలు, ఆమె మనసును తీవ్రంగా గాయపరచడంతో ఆమెను మనసారా దగ్గరకు తీసిన వారి సాన్నిధ్యానే్న కోరుకుంది. పర్యవసనాన్ని ఊహించని ఉపేంద్ర, నీరజ బాధ చూడలేక మనోజ్ఞను శత్రువులా చూడసాగాడు. జీవితంలో ఎన్నో కోల్పోయి అహర్నిశలూ కష్టపడి ఒక హోదా కల్పించుకున్న తమకు తగిన సంబంధం కాదనే దుగ్ధతో నీరజ అనరాని మాటలతో మనోజ్ఞ కోరుకున్న శశాంకను దూషించింది. అతని కుటుంబాన్ని అతిహీనంగా పరిగణించి మనోజ్ఞ హృదయ పంజరాన్ని ముక్కలు చేయడంతో రెక్కలు వచ్చిన పక్షిలా శశాంక గుండెనే తన గూడుగా తలచి వారి ముంగిట్లో వాలింది. మనోజ్ఞ అత్తవారి సహకారంతో శశాంకను గుడిలో పెళ్లి చేసుకుని వారింట్లోకి అడుగుపెట్టింది. ఆ ప్రేమాలయమే దేవాలయమనుకుంది.
‘చిక్కడు వ్రతముల క్రతువుల జిక్కడు దానముల సౌచ శీల తపములన్
జిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియనచ్యుతుండు సిద్ధము సుండీ’
ప్రహ్లాదుడు తండ్రి నెదిరించి ఎంచుకున్న భక్తి మార్గమే ముక్తికి సోపానమని గ్రహించే సమయంలో నీరజకు రెండవ దెబ్బ...
‘అమ్మా! అక్కా వాళ్ల ఊర్లో నాకు టీచర్ పోస్టింగ్ వచ్చింది. నేను వెళ్లిపోదామనుకుంటున్నాను. నేనిక జీవితంలో పెళ్లి చేసుకోను’ మానస నిర్ణయానికి నిశే్చష్టురాలయిన నీరజ ‘అదేమిటమ్మా! నీకిక్కడ ఉద్యోగమే దొరకనట్లు ఆ పల్లెటూరికి వెళ్లిపోతానంటావు? ఎన్నో విడాకులవుతున్నాయి. అందరూ అలాగే ఉండిపోతున్నారా?’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
‘మీ మాట విని పెద్దింటి సంబంధం చేసుకుని అనుభవిస్తున్నాను గదా? ఇంకా మీ అడుగుజాడల్లోనే నడవమంటావా? నాకు కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే ఒక అవకాశం ఇవ్వండమ్మా!’
‘అయితే విడాకులకు కారణం మేమేమంటావా?’ ఉపేంద్ర కల్పించుకున్నాడు.
‘డబ్బే ప్రధానంగా రియల్ ఎస్టేటులో తిరిగిన మీరు మమతను పెంచే మనసు కూడా ఉండాలనే రియాల్టీని మర్చిపోయి చాలా కాలమైంది నాన్నా! అక్క మిమ్మల్ని లెక్కచేయక వదిలి వెళ్లిందనే బాధను తీర్చి మీకు తోడుగా ఉందామనుకుని మీరు చెప్పినట్లే విని గొప్పింటికి వెళ్లి చాలా ఘోరంగా మోసపోయాను నాన్నా! ఆ ఇంట్లో మనుషులు మీకంటే ఎక్కువ అశాంతిని పోగు చేసుకుని ప్రశాంతంగా పడుకోలేక మత్తు పదార్థాల కలవాటు పడ్డారు. నాది అనుకుని వెళ్లిన ఇంట్లో మనుషులను మద్యం సీసాలు స్ర్తి పురుష పక్షపాతం లేకుండా మత్తెక్కిస్తున్నాయి. ఆ మత్తులో బయటపడిన నిజాల్లో నా స్థానమేమిటో తెలిసింది. ఇప్పుడు చెప్పండి నాన్నా! మీరు కట్టిన సంబంధమే శాశ్వత బంధమనుకుని నా జీవితాన్ని కూడా మత్తులోనే గడిపేయమంటారా? ఇకనైనా నా స్వంత నిర్ణయాలకు కొంత విలువనివ్వండి. ఈ రోజు వరకు మీ ఆవేదన గురించి మధనపడ్డాను. కానీ, నాకూ కొంత స్వాంతన కావాలి కదా? నన్ను వెళ్లనివ్వండి. నాకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌లో స్థిరపడనివ్వండి. ఆ పల్లెటూరి పిల్లల సాంగత్యంలో నా గతంలోని చేదు అనుభవాలను మర్చిపోవడానికి ప్రయత్నించనివ్వండి’
మానస తన మనోవ్యధను వ్యక్తపరిచింది.
మనోజ్ఞతో మాట్లాడి అవకాశం పోగొట్టుకుని మానసికంగా కుంగిపోయిన వాళ్లకు మానసను కూడా దూరం చేసుకునే ధైర్యం లేక ఆమె నిర్ణయానికి అడ్డు చెప్పలేకపోయారు. చిన్న వృత్తుల్లోనే కొంత మిగుల్చుకుని ఎంతో తృప్తిగా, కన్నవాళ్లను కడుపులో పెట్టుకుని, పెంచిన ప్రేమను కలకాలం నిలుపుకున్న కుటుంబాలతో తమ కుటుంబాన్ని పోల్చుకుని కుమిలిపోయారు. ఈ రకమైన డిష్ఫంక్షనల్ ఫ్యామిలీకి కారణమైన తమ ప్రవర్తను నిందించుకున్నారు. కుటుంబ వ్యవస్థనే ప్రామాణికంగా తీసుకుని, పిల్లలు కేవలం వంశాంకురాలేననుకుని వారి సౌకర్యాల కోసం తమ సౌఖ్యాన్ని త్యాగం చేస్తున్నామనే అపోహలో ధనార్జనే ధ్యేయంగా బతికే మధ్యతరగతి మనుషులకు ఈ స్థితి ఒక గుణపాఠంగా మిగిలిపోతుందని ఆశించారు.
===================================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఎం.చియాదేవి.. 93910 11891