కథ

ఆడ(ట)బొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బా.. పచ్చ సిగ్నల్ పడింది. ఓ నిముషం పాటు గాలి పీల్చుకోవచ్చు. ఆ.. ఏ గాల్లే! అంతా దుమ్ము, ధూళితో నిండిన గాలి. త్వరత్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వేగంగా వెళ్ళే బండ్లు. వెచ్చటి వాహనాల పొగతో కూడిన గాలి ముఖానికి తగులుతుంది. ముక్కు దగ్గర చేయి ఎంత అడ్డు పెట్టుకుని అటూ ఇటూ ఆడించినా, పొగ ముక్కులోకి పోతూనే వుంది. ఏమిటో నాకీ కష్టం? అనిపిస్తుంది. కానీ తప్పదు. నా రూపం నాకే అసహ్యంగా వుంది. ఇలాంటి దశ ఒకటి నా జీవితంలో ఉందని ముందే తెలిస్తే, కొడుకు పొలంలో పురుగు మందు తాగినప్పుడే తాగేదాన్ని. ఎందుకో అప్పుడు ధైర్యం చాల్లేదు. ధైర్యం వున్నవాళ్లు హాయిగా బ్రతగ్గలరు, కాదంటే సచ్చిపోనూగలరు. రెండూ చేయలేనిదాన్ని!
పరిస్థితులకనుగుణంగా జీవితం నడిసంద్రంలో కొట్టుకుపోతుంటే, ఏదో ఒకటని ఓ శవాన్ని పట్టుకుని బతుకీడుస్తున్నట్టుంది నా జీవితం. ఏవిటో ఈ బతుకు? నాపై నాకే జుగుప్సగా వుంది. ఆదెమ్మ ఇచ్చిన చిన్న అద్దంలో ముఖం చూసుకున్నా! అబ్బా.. ఎంత భయం వేసిందో! ముఖంపై నల్లని మసి పూసారు. తల విరబోసారు. నుదుటిపై ఓ బట్ట కట్టారు. పాత చీర వద్దని, ఓ మాసిన లంగా కట్టించారు. పైన ఓ చొక్కా తగిలించారు. ఊ.. వెళ్లి ఆగిన బండ్లవాళ్లని డబ్బులు అడుగు అంటూ లాగి చెంపై ఒక్కటేశారు. నాకు అలా చేయడం రాదన్నాను. ‘నీ మొగుడు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారే..’ అని రాగం తీసాడు సైదులు. పొద్దునుంచి ఏం తినలే. ఎర్ర సిగ్నల్ పడి బడికెళ్లే ప్లిలల ఆటో ఆగింది. ఆ పిల్లల అమ్మలు ఇచ్చిన బిస్కట్లు, చాక్‌లెట్లు తింటున్నారు. వెళ్లి ధర్మం అడిగా. ఓ పాప బిస్కెట్టు నా చేతిలో వేసింది. సైదులుగాడు నన్ను చూడడంలేదని గమనించా! దూరంగా ఓ పాన్ షాపుకాడ సిగరెట్ తాగుతున్నాడు. వెంటనే బిస్కెట్టు నోట్లో వేసుకున్నా! పాడు ఆకలి! పదకొండు గంటలకు ఆదెమ్మ రెండిడ్లీల పాకెట్టు ఇచ్చింది. ‘త్వరగా తినెయ్, ఆ.. సైదులుగాడు చూస్తున్నాడు. రెండు నిముషాల్లో మళ్లీ సిగ్నల్ కాడ నిలబడాలి.. అందామె!
నా ఇంటికొచ్చిన చాలామంది చుట్టాలకు వేడివేడి గారెలు, దోశెలు, ఇడ్లీలు చేసిపెట్టిన సంగతి గుర్తొచ్చింది. అందులోకి రకరకాల పచ్చళ్లు, పొడులు చేస్తే లొట్టలు వేసుకుని తినేవాళ్లు! నాలుగు తినే మనిషి ఎనిమిది దోశలు తినేవాడు. ఇపుడు ఇంత పెద్ద రహదారిలో ఎవరైనా చూస్తారేమోనని దొంగలా గబగబా తింటున్నా! కాల మహిమ! అంతా గందరగోళం! అదో వైభోగం!!
అప్పుడు తెలీదు ఇలాంటి గతి పడుతుందని. ఎవరికి ఏ కీడు చేసానో? ఇపుడు ఇలా అయింది. గత నెల రోజులుగా ఇదే నిర్బంధ పనిచేస్తున్నా! వందలమంది రోజూ నా పక్కనుండే పోతారు. ఒక్కరితో కూడా నా గోడు చెప్పుకోలేను. అయినా ఎవరు వింటారు కనుక! రోడ్డుపై బండ్లు గుద్దుకుని మనిషి చచ్చినా ఆగి చూడలేరు. ఎవరికాళ్లు ఆఘమేఘాలమీద పరిగెత్తుతూనే ఉంటారు. రక్తం ఓడుతూ మనిషి రోడ్డుమీద కొట్టుకుంటున్నా.. పట్టించుకోరు. ఇక నా మాటలు వింటారా? ఏం మనుషులో.. ఏమో!
నెల రోజులనుండి ఈ పొగలతోనే సతమతం. అలవాటు లేని పని. అందుకేమో మరి.. దగ్గు ఆగి ఆగి వచ్చేది! సైదులుకు చెప్పా! ఏం కాదులే.. తగ్గిపోతుందన్నాడు. ఈ గాలి, దుమ్ము, ధూళిలో తిరుగుతుంటే ఏం తగ్గుతుంది? ఎర్రలైటు పడగానే, వచ్చి ఆగే బండ్లకాడికెళ్లి వీలయినంతగా దేబిరించి, హీనంగా ముఖంపెట్టి ఆకలవుతున్నట్టు నటిస్తూ డబ్బులడగాలి! కళ్లలో ప్రాణాలు నిలుపుకున్నట్లు కనిపించాలి. ఈ నటించుడు చాలా కష్టం. తొలినాళ్లలో శానా ఇబ్బందైంది.
సైదులు పెట్టే తిండికి నీరసించిన నేను, ఆ నటించడంలో జీవిస్తున్నా! చూసిన వాళ్లకు ‘పాపం’ అనేలా ఉన్నా! ప్రాణాలు కళ్లలోకి వచ్చాయి. నటించడం మానేసా. పళ్లు బయటికి కనిపించేలా దేబిరించి అడుక్కోవడం అలవాటయింది. కాలం, అవసరం అన్నీ నేర్పిస్తాయి అంటే ఇదేనేమో!
కొడుక్కి పెళ్లిచేసి నాలుగెకరాల పొలం అప్పగించాడు నా పెనిమిటి రంగనాధం. బాగా పండే చేలు మర్లబడ్డాయి. వానలెక్కడ ఉన్నాయి? చేనుకు మందులు వేస్తున్నా, తెగులు వస్తూనే వుంది. పంట పండక, తెచ్చిన అప్పులు ఎక్కువైనాయి. చేనుకేయాల్సిన మందు కొడుకు పుచ్చుకున్నాడు. పిచ్చిసన్నాసి! ఒక్కమాటైనా చెప్పలేదు. తనలో తానే మగ్గిపోయాడు. ముదిమిలో హాయిగా బతకాలనుకున్న ఆయనకు కష్టం తప్పిందికాదు. మొగుడు పోయాడు పోయాడన్న సాకుతో కోడలమ్మ వున్న నాలుగెకరాలు తన పేర రాయించుకుని పుట్టిల్లు చేరింది. ‘చంద్రమ్మా..’ అని ముద్దుగా పిలిచే ఆయన మాట పడిపోయింది. కొడుకు చేసిన అప్పులకు కుంగిపోయి కన్నుమూశాడు. ఇక మిగిలింది నేను!
అప్పులిచ్చిన బసవరాజు ఇంటికొచ్చి బాకీ తీర్చమన్నాడు. కొడుకు, ఆయనా పోయినా అప్పు తోడుగా నిలిచి, పీడలా మిగిలింది. నాకాడ ఏమున్నదన్నా! బసవరాజు వదల్లేదు. పట్నంలో పనికి పెడతా పదమన్నాడు. నా అప్పు తీరుద్దన్నాడు. చుట్టపక్కాలు మొహం చాటేసినారు. ఇల్లు వాడు సొంతం చేసుకోగా మిగిలిన డబ్బు కోసం నన్ను వేధించసాగాడు. ఆ వేదన భరించలేకపోయా! అందుకే పదమన్నా! ఈ ముసలిదాన్ని పనిలో ఎవరు పెట్టుకుంటార్లే అనుకున్నా! మట్టిలో ఒలికిపోయిన నెయ్యిని గుప్పెడుతో పట్టి పిండిన కర్ణునికన్నా బలశాలులు ఉన్నారన్న విషయం సైదులును చూశాక తెలిసింది.
బసవరాజు రెండు సంవత్సరాలు పనిచేయాలన్నాడు. సైదులు కాడ ఎంత తీసుకున్నాడో తెలీదు. రెండేళ్ల తర్వాత వస్తా! నువ్వు బతికుంటే మరో పనిలో పెట్టి నా బాకీ తీర్చుకుంటా, దిగులుపడకమాక అంటూ నాకేదో మేలు చేస్తున్నోడిలా ఎల్లిపోయె!
పెనంపైనుండి పొయ్యిలో పడ్డట్టు అయింది నా పని. నా మొహాన్ని అంతా మార్చేసాడు సైదులు. కల్లకింద నల్లటి చారికలు అద్దాడు. చిరిగిపోయిన లంగా, ఓ చొక్కా వేసుకోమన్నాడు. సిగ్నల్ కాడ ఆగిన వాళ్లనుండి ఎలాగైనా చిల్లర వసూలు చేయగలగాలి. కుంటుకుంటూ శక్తి లేనట్టుగా ఆర్తిగా అడగాలి. భోజనం చేసి ఎన్నో రోజులైనట్లు గడగడా వణకాలి. ఇలాంటివెన్నో నేర్పాడు. నేనెటుపోతున్నారా.. దేవుడా! ఈ బతుకు నాదేనా? మన ఇష్టం వచ్చినట్టు బతకలేనప్పుడు, ఎదుటి ఇష్టానికి బతకాల్సినప్పుడు అది చావుతో సమానమే! ఆ చావు కోసమే నటిస్తున్నానా? చచ్చాక ఇక నటనేంటి? కానీ ఇక్కడ కావాలి!
రాత్రి పదకొండు గంటలకు సైదులు వస్తాడు. పోగుచేసిన డబ్బంతా గంటకోపాలి సైదులు దూత ఓబులేసుగాడికివ్వాలి. సిగ్నల్ కాడ కెమెరాలుంటాయట! వాడు మా కాడ డబ్బు తీసుకునేప్పుడు, ఆ కెమెరాలకు చిక్కకుండా వాటికింద కూర్చుంటాడు. మధ్యాహ్నం మూడు గంటలకు అన్నం ప్యాకెట్లు తెచ్చేవాడు. తాగడానికి గంటకోపాలి నీళ్లు ఇస్తాడు. ఓ రకంగా ఇదీ మా రాజభోగమేమో! మధ్యమధ్యలో సిగ్గువిడిచి రోడ్డు పక్కనే ‘ఒకటి’ కానిచ్చుకోవాలి. హూ...! తలకొట్టేసినట్టుండేది. కొంచెం దూరంగా పోతానని ఓబులేసుగాడితో తగాదాపడ్డా! ఆడు సైదులుకు చెప్పాడు. ‘నీకాడ పైసలు తక్కువొస్తున్నాయి. మల్లా నువ్ ఆ పనికి అనే వంకతో దూరంగా పోతానంటే కుదర్దు! ఏం ఆటగా ఉందా? నీతోటోళ్లందరూ రోడ్డుపక్కే పోతల్లేరా?.. అయినా నువ్వేమైనా కుర్రపిల్లవా! నినె్నవడూ సూడ్డులే’ అంటూ ఎగాదిగా చూశాడు. బాధతో ముక్కుపుటాలు చిగురుటాకుల్లా వణికాయి. ‘ముసలిదాన్నయితే మాత్రం.. నే రోడ్డుపక్క అలా చేస్తుంటే చూసేవాళ్లు తిట్టుకోరా’ అననుకున్నా. కానీ ఈ జనాలు సిగ్నల్ పడగానే ఎవర్ని పట్టించుకుంటార్లే అని నాకు నేనే చెప్పుకున్నా!
ఎండ, గాలి, వానా, చలి.. ఎప్పుడైనా ఒక్కటే, సిగ్నల్‌కు కాపలా ఉండాల్సిందే! రోజూ చూసేవాళ్లు నన్ను చూసి మూతి ముడుచుకునేవాళ్లు. ‘వచ్చింది దయ్యం’ అని పైకి కొందరు అనేవాళ్లు! మనసు విలవిలలాడిపోయేది. నిన్న దీని మొకం జూసా.. పనే కాలేదని దెప్పిపొడిచేవాళ్లూ ఉన్నారు. ఏం చేస్తాం? ఈ బజారుకు పెట్టిన దిష్టిబొమ్మను నేను. అసహ్యానికి ఆకారంవస్తే అది నేనేనేమో అనిపించింది. ఛీ.. ఎందుకీ బతుకు? ఎవరికోసం? నాకంటూ ఎవరూ లేరు కదా! అప్పుడప్పుడు నా సుట్టాలు ఆటోల్లో, బండ్లపై పోతా కనిపిస్తారు. ఎక్కడో చూసినట్టు నన్ను చూస్తారు. మొకాన ఉన్న ఆ నల్లమసే నన్ను కాపాడేది. నీచముకన్నా మరణము మేలని గుళ్లో పంతులోరు చెప్పినట్టు, ఈ బతుకొద్దనిపిస్తది. చావాలా? ఎలా? ఎక్కడికైనా పోవాలా? ఓబులేసు సి.సి కెమెరా కన్ను కప్పేదెలా? కాలం కలిసి వస్తుందా? ఏమో?!
రోజురోజుకు సైదులు గోల ఎక్కువైంది. నా పాయింట్‌లో పైసలు తక్కువొస్తున్నాయని వాడి గోల. బాగా అడుగు.. నమ్మేలా బాధపడు.. కన్నీళ్ళు కారతానే ఉండాల.. కళ్లలో వున్న పుసులు కడుక్కోకు..! ఇన్ని రూళ్లు విధించాడు. అలా జనాలకాడికెళితే.. చీదరించుకుంటున్నారు. దేవుడా ఏమిటీ శిక్ష? అసహ్యంపై ఆర్థిక సూత్రాలు కనిపెట్టినవాడిపై ఉమ్మాలన్నంత కోపం వచ్చింది. ఇంతకన్నా గొప్ప ఆర్థిక సూత్రాలు వాడికాడ ఉన్నాయని నాకు తెలీదు. తర్వాత తెలిసింది.
రాత్రి పనె్నండు దాటింది. బండ్లు అప్పుడొకటి అప్పుడొకటి కనిపిస్తున్నాయి. ఎప్పట్లాగే సైదులు పైసలు తక్కువొస్తున్నాయని గోలచేశాడు. తాగొచ్చాడు.. నాడి చేతికున్న ఉంగరాలతో నెత్తిపై మొట్టికాయ పెట్టాడు. ఒడిలో పడుకుని పాలు తాగే బిడ్డడు కాలుతో తన్నినట్టుగా వుంది. ఓబులేసు అక్కడే కొరివిదెయ్యంలా నిలబడ్డాడు. ‘నిదరొస్తుందయ్యా.. పడుకుంటాం’ అన్నాం మేం! అంత ఒంటరితనంలో కుంటిదైన ఆదెమ్మే నాకు తోడు. నీపై పెట్టుబడి రావడం లేదని మళ్లీ నసిగాడు.
ఏంజేయమంటావ్? అన్నానే్నను. ‘నే జెప్పినట్టు వింటే సాలు.. నా డబ్బు నాకొస్తది.. సరేనా..?’ అటూ వెళ్లాడు. ‘హమ్మయ్యా ఎల్లిండు’ అందాదెమ్మ. ఆకలి లేకున్నా, ఏదో ఇంత దిన్నా! నిద్ర మాత్రం కన్నుదీరా పొమ్మని ఒంట్లో ఒకటే సొద. కళ్లు కూరుకుపోతున్నాయి. రోడ్డుపక్కన పెద్దస్తంభాల పక్కే నిద్ర. మంచి నిద్రలో వున్నపుడు కొన్ని బండ్ల అరుపులు నిద్రలేపుతాయి. అసలు మనమెక్కడ ఉన్నామనిపిస్తుంది. నా ఇంట్లో మంచంపై పడుకున్న సంగతులు గుర్తొస్తాయి. మళ్లీ అలా హాయిగా పడుకోగలనా? అయినా కొడుకు, మొగుడు లేని నాకు అంత భోగం అవసరమా? ఎవరున్నారని ఆనందంగా బతకాలి?
భోగం.. భోగం.. నాకు అవసరమనుకున్నాడో ఏమో, ఆ సైదులుగాడు! ఆ రోజు నన్ను ఎగాదిగా తేరిపార జూసినప్పుడే అనుమానం రాలేదు. మంచి నిద్రలో ఉన్న నన్ను లేపాడు వాడు. చలికాలం కావడంతో మంచు బాగా పట్టి ఉంది. రోడ్డుపై దూరంగా వస్తున్న బండ్ల శబ్దం వినిపిస్తుంది. తెల్లారుజాము మూడు గంటలై ఉండొచ్చు. కళ్లు నలుపుకుంటూ చూసా! ‘ఇదో ఈడు కాసేపు నీ కాడ పడుకుంటాడంటా.. పడుకో’ అన్నాడు వాడు. పక్కన తాగి ఊగుతున్న ఓ లావుపాటి మనిషి. వయసు ముప్ఫై ఐదు దాటి ఉంటాయి! గుండెల్లో బాంబు పేలినట్లయింది నాకు! ఏంటీ.. వీడేమంటున్నాడు? నన్ను నేను ప్రశ్నించుకున్నా. ‘ఏమంటున్నావ్.. సైదులూ’ అంటూ కళ్లు ఉరిమా! ‘ఆడు బాగా తాగి ఉన్నాడు.. కాసేపు ఏదో.. అట్లా అడుగుతున్నాళ్లే.. చంద్రమ్మా!’ నింపాదిగా చెప్పాడాతడు.
‘ఏంటయ్యా.. నువ్వు జెప్పేది! ఈ పాడు పని.. నన్ను జెయ్యమంటావా? నీకా పాడుబుద్ధి ఎట్లా వచ్చిందని అడిగా. ‘ఆడు పైసలిస్తానన్నాడ్లే’ చెప్పాడు. ‘అయితే మాత్రం నేనే కనిపించానా.. నా వయసేమిటి? నేనేంటి?’ రెట్టించిన కోపంతో అరిచా. ‘వయసెంత ఉంటే ఏంటీ? ఆడికి నువ్ చాలు’ చెప్పాడాడు. ‘్ఛ.. నీకు సిగ్గయినా లేదా? నన్నిట్టా కష్టపెడుతున్నావ్’ అంటూ కన్నీరు కార్చా! నువ్.. సరిగ్గా అడుక్కోలేకపోతున్నావ్.. నీకాడ వచ్చే ఆదాయం తక్కువ. ఇలాగైనా నా పైసలు జమ చేసుకోవాలి గదా’ అంటూ లెక్కలు వేసాడాడు. ‘నువ్.. మనిషివి కాదురా.. నాలాంటి తల్లి నీకు లేదురా’ అరిచా! మనిషిని కాబట్టే.. ముసల్దానివని వేరే పనులకు పంపడంలేదు. ఇదేముంది? గమ్మున పడుకో.. ఆడి పని ఆడు చేసుకుపోతాడు.. మత్తులో వున్నాడు.. నిద్రపోయినా పోతాడు.. చూస్కో’ అంటూ సిగరెట్ వెలిగించాడు.
‘ఇది ఘోరంరా సైదులూ’ అంటూ రెండు చేతులెత్తి మొక్కా. ‘అవన్నీ నాకు తెలవ్వు.. నోర్మూసుకుని పడుకో’ అంటూ వచ్చినవాణ్ణి భుజంపై తట్టి పక్కకెళ్లిపోయాడు. ఈ గోలంతా విన్న ఆదెమ్మ అప్పటికే అక్కడినుంచి వెళ్ల్లిపోయింది.
ఊగుతూ వాడొచ్చి నామీద పడి కింద పడేసాడు. భీకరమైన వాడి బలం ముందు, ముసల్దాన్ని ఏడ నెగ్గుతా! ‘ఒరేయ్.. పాపం రా’ అరుస్తున్నా! మత్తులో వున్నా.. వాడికి బలం తగ్గలేదు. నన్ను స్వాధీనం చేసుకోవడానికి పోరుతున్నాడు. రోజంతా సరిగ్గా తిండి లేక, శక్తి చాలక వాడికి దాసోహం అవుతున్నా! నా నోరు వాడి నోటితో నొక్కి పట్టేసాడు. పెనుగులాడుతున్నా! ఈ ముసలి శరీరంతోనే ఆడుతున్నాడు, మత్తులో జోగుతున్నాడు, పెనుగులాడుతున్నాడు వాడు. వాడిక్కావాల్సింది వెతుక్కుంటున్నాడు. వాడి శరీరం మీద పడడంతో ఊపిరాడడంలేదు. ఇంతకన్నా నరకడంలో పడ్డా బావుండేది. ఏంచేస్తాను. ఇలా మనిషిలాంటి మృగాలకు చిక్కిపోయాను. బాధతో గుండె బరువెక్కి బావురంటోంది. ఒక్కసారిగా పక్కన పడిపోయేలా దొర్లించా వాణ్ణి! మత్తులో వాడి శరీరం దేనికోసమో వెంపర్లాడుతోంది. ఛీ.. ఇలా చెప్పడం కూడా సిగ్గుగా వుంది.
ఒళ్లంతా తడిమేస్తున్నాడు. నా కొడుకు గుర్తొచ్చాడు. వాడికి చిన్నప్పుడు ‘లాల’ పోస్తుంటే ఎలా ఉన్నాడో.. వీడు అలానే కనిపించాడు.
ఇపుడు జరుగుతున్న తప్పును ఎలా ఆపాలి? వాడు పక్కకు ఇలా జరగ్గానే చయ్యన లేచి పరుగందుకున్నా! నా వెంట బడ్డాడు. రోడ్డంతా శ్మశానంలా నిర్జీవంగా పడి ఉంది. బండ్ల కదలిక లేదు. వగరుస్తూ వచ్చి ఓ స్తంభం చాటున నక్కాను. వాడు మత్తు వదలినట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నాపై నాకే జాలేసింది. ఏంటీ పరిస్థితి? వాడు దగ్గరకొచ్చాడంటే.. ఛ.. అలా ఆలోచించడానికే బాధగా ఉంది. దగ్గరకొస్తున్నాడు. దూరం నుండి ఏదో లారీ వస్తున్న చప్పుడు. వాడొచ్చేసాడు.. స్తంభం చాటునే చుట్టూ తిరిగి దొరక్కుండా తప్పించుకున్నా! వాడు నవ్వుతూ దగ్గరకు వస్తున్నాడు. లారీ దగ్గరకు వచ్చేసింది. ఈ పాపం చేయడానికేనా నేనింకా బతికే ఉన్నాను. చూడకూడదు.. ఈ పాపం ... అనుకుంటూ ఒక్క ఉదుటున వేగంగా వెళ్తున్న లారీ కింద పడ్డా!
కుడి తొడమీదుగా లారీ వెళ్లిపోయింది. వెనుక వస్తున్నవాడు ఆగిపోయాడు. నా మనసులో సంతోషం మొదలైంది, అవాక్కైనవాణ్ణి చూసి, గెలిచాను.. వాడి కోరిక నరకంలో పడేకన్నా, ఇలా గిలగిలకొట్టుకునే స్వర్గంలోనే సుఖం ఉంది! అనుకుంటూ తృప్తిగా నా కనులు మూతపడ్డాయ.
===================================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-సరయు శేఖర్, 9676247000