కథ

మృత్యోర్మా అమృతంగమయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవరావు ఆ ఫ్లాట్‌లో కొత్తగా దిగాడు. ఆ రోజు కూడా తలుపు తెరచి ఆఫీసుకెళ్లే హడావిడిలో బయటకొచ్చిన ఆయనకి ఎదురింట్లోంచి కిలకిలా నవ్వులు, సంభాషణలు వినిపించాయి - ఎప్పటిలానే!
‘ఎంత అందమైన నవ్వు! ఆ నవ్వుల పువ్వును కట్టుకున్న అదృష్టవంతుడెవరో?’
మరికాసేపు ఆగి వినాలనిపించింది ఆ నవ్వును. అది సభ్యత కాదని తెలుసు. కానీ మది కోరింది ఆ నవ్వు మళ్లీమళ్లీ వినమని.
‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు.. చిన్నారి పాపల్లె నవ్వు. చిరకాలముండాలి నీ నవ్వు.. చిగురిస్తు వుండాలి నా నువ్వు...’ రాగయుక్తంగా అన్నాడాయన.
‘బాగుంది.. ఇది మరీ బాగుంది! ఇలానే నవ్వుతూ మీరు పాడుతూంటే మరి ఆఫీసుకెళ్ళేదేమయినా వుందా? లేదా?’ మంద్రస్థాయిలో ఆమె మందలింపు.
‘వుందా..? అంటే ఏం చెప్పను? అసలు వెళ్లాలనే లేదు.. తెలుసా?’
‘ఎందుకో?’
‘ఎందుకంటే ఏం చెప్పను? అందుకే... అని ఎలా చెప్పను?’
‘అబ్బబ్బ.. ఎందుకో.. ఆ రా..గా..లు’ కిలకిలా నవ్వు.
‘ఎదురుగా నువ్వుంటే.. ఎనె్నన్ని రాగాలో... చల్లనీ.. నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో?’ తిరిగి రాగయుక్తంగా.
‘మహానుభావా! మార్తాండతేజా! మిమ్మల్ని బాలుగారు కానీ ఆవహించలేదు కదా ఈ రోజు? మీరు ఆఫీసుకి వెళ్తేగానీ నాకు పని తెమల్దు బాబూ! ఇంకా పిల్లల్ని తయారుచెయ్యాలి. లెండి లెండి!’ మృదువుగా ఆమె అర్థింపు.
‘అంతేనంటావా డార్లింగ్?’
‘కాక? అంతే బాబూ.. అంతే! పిల్లలు బెడ్‌రూంలో పిల్లోల్తో కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. నే చెప్తే కానీ వాళ్లకి టైమ్ తెలీదు’
‘నాకూ తెలీదు సుమీ టైము! అది కాదు కమ్మూ! మనల్ని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేకే...’
‘అలాగేం? ఇంక లాభం లేదు? మీ వాలకం శృతిమించి రాగాన పడుతోంది. పదండి త్వరగా!’
‘అలాగే వెళ్తాను లేవోయ్! మరి నా మామూలు నాకివ్వాలిగా! అప్పుడు నీ పని నవ్వు చూసుకుందువుగాని!’
‘టేబిల్ కింద చెయ్యిపెట్టే ఉద్యోగం కాదే మీది. మరి మామూలేంటి బాబూ?’
‘్ఛ! ఛా... ఆ మామూలెవరిక్కావాలి? బోడి మామూలూ! టేబిల్ కింద చెయ్యి పెట్టే ఆ లక్షలెందుకోయ్ నాకు? లక్షణంగా నా డార్లింగ్ గెడ్డం కింద చెయ్యి పెట్టి పుచ్చుకునే మామూలే నాక్కావాలి!’
‘అలాగేం పాపం! అవునవును. అద్సరే గానీ అత్తగారి మందుల సంగతి మర్చిపోకండి!’
‘అలాగే లేవోయ్! మరిదో?’ ఆపై చిన్న చుంబన శబ్దం.
‘వెరీవెరీగుడ్! భార్యంతే...’
‘ఇలా వుండాలా?’ ఆపై మళ్లీ నవ్వులు.
‘మరి వెళ్లిరానా?’ కుడిచెయ్యి నాలుగు వేళ్లతో బుగ్గ దగ్గర నుండి మూతి వరకు తుడుచుకున్నాడు. ఇంక తలుపు తెరచుకుని ఆయన బైటకొస్తాడని గబగబా అడుగులు వేస్తూ మెట్లు దిగాడు మాధవరావు.
* * *
ఆఫీసుకి చేరి సీట్లో కూర్చున్నాడే కానీ ఎదురింటి సంభాషణలే మనసులో మెదల్తున్నాయి. ఏ పని చెయ్యాలన్నా బుర్ర సరిగ్గా లేదు. ‘ఎంత అందమైన జీవితం వాళ్లది! దేనికైనా పెట్టి పుట్టాలి?’ అనుకున్నాడు. బాయ్‌ని కేకేసి ఓ స్ట్రాంగ్ టీ తెప్పించుకుని తాగి పని ఆరంభిద్దామనుకున్నాడు. ఇంతలో బాస్ దగ్గర్నుంచి పిలుపు అర్జెంట్‌గా రమ్మని.
‘వీడొకడు ఏ పనీ సరిగ్గా చేసుకోనివ్వడు’ అని విసుక్కుంటూ వెళ్లాడు.
‘ఏం రావ్? ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదా?’ అన్నాడు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూనే.
‘ఇదిగో సార్ మరో టూ అవర్స్‌లో కంప్లీట్ అయిపోతుంది.’ అని సీట్లోకొచ్చి కూర్చున్నాడు. సాయంకాలం వరకు అన్యమనస్కంగానే పనిచేసి, ఆఫీసు అవర్సు అయ్యాక ఇంటి ముఖం పట్టాడు. భార్య చెప్పిన సరుకులు, తల్లికి మందులు అన్నీ కొని ఇంటికి చేరేసరికి ఆలస్యం అయిపోయింది. రెండ్రోజులు ఆఫీసుకి సెలవులు, ఇల్లు కదిలే అవసరం లేకపోయింది. ఎదురింటి వాళ్ల సంభాషణలే గుర్తుకొస్తున్నాయి. మళ్లీ మామూలుగా తెల్లవారింది ఆ రోజూనూ. ఆఫీసుకి బయల్దేరబోతున్న మాధవరావు అది సభ్యత కాదని తెలిసినా ఎదురింటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆ ఇంట్లోంచి వస్తున్న సంభాషణ ఆయన్ని కట్టిపడేసింది.
‘ఇదిగో కమలీ డియర్! ఈ రోజు ఇడ్లీ నీ బుగ్గల్లాగే మెత్తగా వున్నాయ్ సుమా! మరోటి వెయ్యవోయ్’
‘అలా స్తుతిస్తే కానీ వెయ్యనా? ఇదిగో పాప గులాబ్ జామూన్ చెయ్యమందని చేసేను. ఇందండి ఓ రెండు తినండి!’
‘ఓ యెస్... ఫెంటాస్టిక్! నీ బుగ్గల్లాగే వున్నాయ్! అందికేనా రెండన్నావ్!? ఆఁ’
‘అబ్బబ్బ! మీతో వేగలేక పోతున్నా! మీది బి.ఏలో స్పెషల్ తెలుగా మహానుభావా! ఏంటీ వర్ణన? తట్టుకోవడం మహా ఇబ్బందిగా ఉంది సుమండీ!’ పకపకా నవ్వుకున్నారు.
‘అవునూ! చెప్పడమే మర్చిపోయాను సుమీ! అమ్మ చిన్నని చూస్తానంటోంది. ఓ పది రోజులు వాడి దగ్గరుండి వస్తుందిట. ఏం? నీతో ఏం చెప్పలేదా?’
‘చెప్పలేదు కానీ అదేం కుదర్దు! చిన్ననే రమ్మనమనండి. ఓ పది రోజులు సెలవు పెట్టి. వాళ్ల ఆవిడకీ, పిల్లలకీ ఎలాగూ దసరా సెలవులిస్తారు కద! మనం కూడా వాళ్లని చూసి చాలా కాలమైంది! వస్తే అంతా కల్సి హేపీగా గడిపెయ్యవచ్చు! ఏం?’
‘నిజమే అనుకో!’
‘అనుకోకాదు! రోజూ అత్తగారి యోగ క్షేమం కనుక్కోడానికి ఫోను చేస్తాడుగా! ఈ రోజు నేనే చెప్తా! అయినా అక్కడ అత్తగారికేం తోస్తుందండీ? మీ మరదలు, పిల్లలు అంతా స్కూలుకి వెళ్లిపోతారు. మళ్లీ సాయంకాలం వస్తారంతా! అంతవరకూ ఈమెకేం తోస్తుందో? అయినా అత్తగారు మన దగ్గరే వుండాలి. ఉంటున్నారు. అంతే! ఏం వినపడుతోందా?’
‘ఓ! విన్నాను! వింటున్నాను! వింటాను! సరేనా?’
పకపకా నవ్వులు. ‘మరి బయల్దేరడం వుందా?’
‘ఎందుకు బయల్దేరనూ? అయినా నీది మరీ స్టోను హార్టు కమ్మూ!’
‘ఏం? ఎందుకట?’
‘ఎందుకేంటోయ్! ఇరవై కిలోమీటర్ల దూరంలో సాయంకాలం వరకూ నిన్నొదిలి వుండాలంటే మాటలా? నీకేమయినా అనిపిస్తోందా? ఆఁ అనిపిస్తోందాని?’
‘ఎందుకనిపించదు? దూరం మనిషికే గానీ, మనసుకి కాదు మహానుభావా!’
‘అవునవును! అందికేనేమో అన్నాడో కవి!’
‘ఏవన్నాట్టా?’
‘కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలదీ పెరుగును అనురాగం!’ అని అతననగానే-
‘విరహములోనే ఉన్నది అనుబంధం’ అన్నదామె.
ఇద్దరూ పకపకా నవ్వులు.
‘ఓహో మహానుభావా! అందికేనా మీ వాళ్లు మీకు ‘సూర్యచంద్రరావు’ అని పేరు పెట్టిందీ!’
‘అవునవును! మరందుకేనేమో! మీ వాళ్లూ నీకు ‘కమలిని’ అన్న పేరు పెట్టేరు. భగవంతుడికి తెలుసోయ్ మనం భార్యాభర్తలమవుతామనీ!’
‘అనకేం? ఇప్పుడర్థమైంది లెండి పూర్తిగా! అయితే మీరింక!’
‘బయల్దేరండి అంటావ్. అంతేనా?’
‘అంతేగా మరి!’
‘మరి?’
‘నా మామూలు అంటారు! అంతేనా?’ మళ్లీ అదే శబ్దం! తరవాత నవ్వులు.
గబగబా మెట్లు దిగి వీధిలోకొచ్చాడు మాధవరావు. అతను నడుస్తున్నాడు. అతని ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి.
అవును అతను సూర్యచంద్రరావు. చాలా డిగ్రీలున్నాయి. బోలెడు అర్హతలు. దానికి తగ్గ ఉద్యోగం. దాన్ని మించి ఆనందమైన, ఆరోగ్యకరమైన సంసారం. ఎందరు పొందగలరు ఇలాంటి అదృష్టం? అంతలో భార్య మాటలు గుర్తుకొచ్చాయి. మొన్న తల్లికి మందులు కొన్నప్పుడు అన్నదామె ‘మీ అమ్మ మిమ్మల్నే కందా? మీ తమ్ముడు మాత్రం ఆమె కొడుక్కాదా? కొన్నాళ్లు తల్లిని తీసుకుని వెళ్లమనండి అతన్ని. మన దగ్గరే ఎల్లకాలం ఉండిపోవాలా? అంటూ నానా రభస చేసింది. ఈ సంగతి తమ్ముడికి ఎలా చెప్పడం? సూర్యచంద్రరావుతో తన జీవితం బేరీజు వేసుకున్నాడు మాధవరావు. దేనికైనా పెట్టి పుట్టాలి అనుకున్నాడు. ఆఫీసు పనిలో పడి కాస్త డైవర్ట్ అయ్యాడు.
* * *
రాత్రి భోజనం చేసి పడుకోడానికి ఉపక్రమించాడు. భార్య మళ్లా అదే గొడవ. ఇంట్లో ప్రశాంతత లేదు. ఆఫీసులో పని వున్నా అక్కడే నయం అనుకున్నాడు. ఆలోచనల్లో సూర్యచంద్రరావు మళ్లీ తళుక్కుమన్నాడు. అంత ఆనందంగా, హాయిగా ఎలా ఉండగలుగుతున్నాడు? చల్లని సంసారం, చక్కని సంతానం. అలాంటి వారితో మైత్రి చేస్తే ఎంత బాగుంటుంది? సూర్యచంద్రరావు నిజంగా చాలా అదృష్టవంతుడు. రేపోసారి ఆయన్ని కలవాలి. అలాంటి కుటుంబంతో స్నేహం చేసుకోవాలి. ఎస్. అలాగే రేపు వాళ్లింటికి వెళ్తాను. రేపు హాలీడే కదా? తెల్లవారి కాలకృత్యాలు తీర్చుకుని పేపర్ చూస్తున్నాడు. భార్య కాఫీ అంది. బజారుకెళ్లి కూరలు తెమ్మంది. కాఫీ తాగి తెమిలి బయల్దేరాడు. సూర్యచంద్రరావు ఇంట్లో వున్నట్టే ఉంది. హాలీడే అయినా ఈ రోజు ఎక్కడికీ ఫేమిలీతో వెళ్లరేమో? ఇదీ మంచిదే. ఓసారి వాళ్ల ఇంటికెళ్దాం. ఆయన మంచి పొజిషన్‌లో వున్నవాడు. ఎలా రిసీవ్ చేసుకుంటాడో? అని ఆలోచిస్తూనే కాలింగ్ బెల్ నొక్కాడు మాధవరావు. రెండు నిమిషాల తరువాత తలుపు తెరచుకుంది. తెల్లని రామరాజ్ పంచ తెల్లని బనీను, పై మీద తువ్వాలు, తెల్లని అందమైన నిలువెత్తు విగ్రహం. చూపరులను ఆకట్టుకుంటుందా రూపం.
మాధవరావుని చూస్తూనే
‘ఓ! మీరా! రండి రండి లోపలికి’ అంటూ సాదరంగా, మర్యాదగా ఇంట్లోకి ఆహ్వానించాడు.
‘నా పేరు మాధవరావు. పై ఫ్లాట్‌లో వుంటున్నా’ అంటూ తన్ను తాను పరిచయం చేసుకున్నాడు మాధవరావు నమస్కరిస్తూ.
‘ఓ! గ్లాట్ టు మీట్ యూ! అలా కూర్చోండి’ అన్నాడు సూర్యచంద్రరావు ప్రతి నమస్కారం చేస్తూ సోఫా చూపించి.
‘మిమ్మల్ని రోజూ చూస్తూ ఉంటాను. ఎందుకో మిమ్మల్ని పరిచయం చేసుకోవాలనిపించి ఇలా వచ్చాను’ అన్నాడు కూర్చుంటూ.
‘మంచి పని చేశారు. నేనూ మిమ్మల్ని చూస్తూ వుంటాను. అప్పుడప్పుడు. కానీ పరిచయం చేసుకోలేదు. వచ్చినందుకు చాలా థాంక్స్! ఈ కాంక్రీట్ అరణ్యాలు మైత్రీ వనాలవ్వాలంటే విడివిడి పువ్వుల్లా దూరమై పోతున్న మనుషుల్ని దగ్గరకు చేర్చి, ఒకటిగా కలిపి మానవత్వపు పూలగుచ్ఛంలా మార్చడానికి, ఆ పువ్వులన్నిటినీ కలిపి కట్టి ముడి వేసే స్నేహమనే సాటిన్ రిబ్బన్ ఒకటి అవసరం కదా? అలాంటి రిబ్బన్ మనమే ఎందుకు కాకూడదు?’
పకపకా నవ్వాడు మాధవరావు. ‘అవునండీ మీరన్నది నిజం! స్నేహంలో వున్న మాధుర్యం మరెందులోనూ లేదు!’
‘జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలూ, బాధ్యతలూ కాదు. చిన్నచిన్న ఆనందాలూ, మనల్ని ఇష్టపడే వారి పట్ల ప్రేమ, సాటివారి పట్ల కాస్త దయ, ఎవరికీ హాని చెయ్యని మనస్తత్వం నిరంతరం మన పెదాలపై ఓ చిరునవ్వు, అంతకు మించిన ఆనందం, అదృష్టం, తృప్తి ఏం ఉంటాయి చెప్పండి?’ సూర్యచంద్రరావు పెదాలపై చిరునవ్వు.
‘చక్కగా చెప్పారు! మీరన్నది నిజం’ అన్నాడు మాధవరావు.
‘అయితే ఈ రోజు నుండి మనం మంచి మిత్రులం! ఈ శుభ సమయంలో ఏం తీసుకుంటారు? హాట్ ఆర్ కోల్డ్? అదే సుమండీ! కూల్‌డ్రింక్? ఆర్ కాఫీ?’
‘ఆహా! ఏం వద్దండీ! మనం కల్సుకున్నాం. మంచి మిత్రులమయ్యాం. అది చాలదూ?’ అన్నాడు మాధవరావు కాస్త మొహమాటంగా.
‘అదేం కుదర్దు! మా ఇంటికి మొదటిసారిగా వచ్చిన మిత్రులు - కమ్ అతిథి మీరు. ఏమైనా తీసుకోవాలి. తప్పదు’
‘సరే! అలాగే కానీండి’ అన్నాడు మాధవరావు.
‘జస్ట్ ఫైవ్ మినిట్స్!’ అంటూ లోపలికెళ్లాడు సూర్యచంద్రరావు.
చుట్టూ పరికించి చూశాడు మాధవరావు. హాల్లో పొందికగా ఎక్కడివక్కడ అందంగా అమర్చబడి ఉన్నాయి వస్తువులు. గోడకి, అందమైన టీవీ టేబుల్ మీద టేప్‌రికార్డర్! గోడకి లామినేట్ చెయ్యబడ్డ ఫొటోలో తెల్లని దుస్తుల్లో బ్యాట్ చేతపట్టుకుని ముద్దులు మూటకట్టే చిన్న అమ్మాయి. మరో ఫొటోలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్న చిన్నబాబు. టేబిల్ మీద అందమైన ఫ్రేములో బిగించి వున్న ఫొటోలో వీణ చేత పట్టుకుని అపర సరస్వతి లాంటి అందమైన ఓ అమ్మాయి. అదీ అక్కడి వాతావరణం. అది చూసిన మాధవరావు మనసు ఆనందంతో, ఆహ్లాదంతో పరవశించింది.
రెండు గ్లాసులతో పైనాపిల్ జ్యూస్ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు సూర్యచంద్రరావు.
తలతిప్పి చూశాడు మాధవరావు. ‘తీసుకోండి మాధవరావుగారూ!’ అన్నాడు గ్లాసు అందిస్తూ.
‘ఎందుకండీ మీకీ శ్రమ?’ అన్నాడు మాధవరావు చిన్నగా నవ్వుతూ గ్లాసు పుచ్చుకుని.
‘భలేవారే. ఇందులో శ్రమేముందీ?’
‘ఇంట్లో ఎవరూ లేరా?’ కాస్త మొహమాటపడుతూనే అన్నాడు జ్యూస్ సిప్ చేస్తూ నాలుగు వైపులా చూస్తూ.
‘లేరండీ! అంతా ఒక్కసారే వెళ్లిపోయారు’
‘అదేంటీ? అంతా వెళ్లిపోవడం ఏంటి? మరి మీరు?’
‘అవునండీ రావుగారూ! ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. నేనుండిపోయాను’ శూన్యంలోకి చూస్తూ అన్నాడాయన.
‘అదేంటీ? అంత అనుకూలవతైన భార్య, పిల్లల్ని తీసుకు వెళ్లిపోవడం ఏంటి? ఇతను ఒంటరిగా ఉండడం ఏంటి?’ ఇది నమ్మశక్యం కాలేదు మాధవరావుకి. అదే అడిగాడు.
‘వెళ్లిపోడం ఏంటండీ? నాకేం అర్థం కావడంలేదు. ఇది నమ్మేలా లేదు’ అయోమయంగా చూస్తూ అన్నాడు మాధవరావు.
‘నాకూ నమ్మశక్యం కావడంలేదు! కానీ ఇది నిజం. వారి ప్రయాణం అయిపోయింది. నా ప్రయాణం ఇంకా మిగిలుంది’
‘అంటే?’ అవాక్కయ్యాడతను.
‘అవును మాధవరావుగారూ! మాదో అందమైన జీవిత ప్రయాణం. కానీ ఇది ఇంక ఆఖరి ప్రయాణం అని మాకూ తెలీదు. ఆ రోజు అంతా కల్సి - అదే నా భార్య, ఇద్దరు పిల్లలు అంతా కారులో ప్రయాణమయ్యాం. ప్రయాణం సరదాగా గడిచిపోయింది. తిరిగి ఇంటికి బయల్దేరాం. అనుకోకుండా దుర్ఘటన జరిగి నా భార్యా పిల్లలు అకాల మరణం పొందారు. స్వల్ప గాయాలతో నేను బ్రతికి బయటపడ్డాను. అంతా దైవేచ్ఛ!’
‘హతవిధీ! ఎంత దారుణం! మరి రోజూ వినపడే ఆ సంభాషణ?’ అడగలేక అడగలేక అడిగాడు మాధవరావు.
‘ఓ అదా? మా ఆవిడ రోజూ ఉదయానే్న అలా టేప్‌రికార్డర్ ఇన్ చేసి పన్లు చేసుకోవడం అలవాటు. నా ఆబ్సెన్స్‌లో అది వింటూ నేను తనతో వున్నట్టే అనుభూతి పొందేది. ఆమె వెళ్లిపోయాక అది రోజూ నేను విని ఆఫీసుకి వెళ్తాను. అలా వింటూ వాళ్లు వున్నారన్న భ్రమలోనే నేను దినం గడుపుతాను’ అతని కళ్లు చెమ్మగిల్లాయి.
‘ఇంత బడబాగ్నిని కడుపులో దాచుకుని మీరింత సంతోషంగా బ్రతుకుతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. నిజంగా మిమ్మల్ని అభినందించాలి సార్’ అతని గొంతు బొంగురుపోయింది.
‘తప్పదండీ రావుగారూ! తప్పదు. ఆయువున్నంత వరకూ ఈ ప్రయాణం సాగాలి మరి. చూడండీ మనం ప్రయాణానికి చక్కని ఏ.సిలో బెర్తులు కొనుక్కుని ప్రయాణం చేస్తాం. హాయిగా ప్రయాణం సాగిపోతున్నదని గమ్యం దాటినా ప్రయాణం చేయగలమా? లేదు కదా? గమ్యం చేరగానే దిగేస్తాం. హాయిగా వుందని ఇంకా రైల్లో కూర్చోలేం. అలాగే ఒకోసారి ఇరుకిరుగ్గా, బాధ పడుతూ ప్రయాణం చేస్తాం. అప్పుడు బండి దిగిపోలేం గమ్యం రాకుండా! ఇదీ అంతే సర్! మన జీవితం ఓ రైలుబండి! అంతే!’
‘ఎంత చక్కగా చెప్పారండీ జీవిత సత్యం! మీ వద్ద నేర్చుకోవలసింది చాలా ఉంది. దీనికి సాధన చాలా కావాలి’
‘జీవితమే నేర్పుతుందండీ పాఠం మనకి! మనం ఏడిస్తే మనతో ఎవ్వరూ ఏడవరు. కానీ మనం నవ్వితే నలుగురూ కల్సి మనతో నవ్వుతారు. గడిచిపోయిన, అందమైన జీవితాన్ని నెమరువేసుకుంటూ, బ్రతికినంత కాలం ఆనందంగా, సంతోషంగా బ్రతికెయ్యడమే! అదే నా జీవితాశయం!’
‘అవును మీరన్నది నిజం!’
‘రావుగారూ! బాహ్యంగా నా కుటుంబం నాతో లేకపోయినా నా మనసులో వాళ్లెప్పుడూ చిరంజీవులే! ఇదే నేను నా జీవితంలో నేర్చుకున్నది!’
‘మీతో మాట్లాడుతుంటే సమయం తెలీడంలేదు’ అన్నాడు మాధవరావు.
‘అప్పుడప్పుడు వస్తూ వుండండి!’ అన్నాడు సూర్యచంద్రరావు లేచి నిల్చున్న మాధవరావుతో.
‘తప్పకుండా..’
లోపల ఎన్ని భయంకరమైన జీవరాసులున్నా పైకి అందంగా కనిపించే సముద్రం లాంటి సూర్యచంద్రరావుకి మనసులోనే అంజలి ఘటించాడు మాధవరావు వౌనంగా.
అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా.. ఆనంద నిలయా వేదాంత హృదయా.. దూరంగా మధురంగా వినిపిస్తోందా పాట. *

శివాని.. 08912725940.. 9642045940