కథ

యోగం-క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బజాజ్ షోరూమ్ ముందు నిలబడున్నాడు భాస్కర్. అక్కడున్న రకరకాల మోడల్ల వాహనాలపై అతడి దృష్టి లేదు. డిస్‌ప్లేలో ఉంచిన ‘బ్లాక్ అండ్ రెడ్ పల్సర్’ మీదే స్థిరంగా ఉన్నాయి అతడి చూపులు. అతడు దాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. అది అందంగా, స్మార్ట్‌గా మనసును ఆకట్టుకునే విధంగా ఉంది. అది అతడికి ఎంతగానో నచ్చిన బండి.
మూణ్ణెళ్ల క్రితం, ఒకరోజు అతడి క్లాస్‌మేట్ పవన్, కొత్తగా తాను కొన్న పల్సర్ బండిని కాలేజీకి తీసుకొచ్చాడు. అప్పుడే మొదటిసారిగా భాస్కర్ ఆ బండిని దగ్గనుండి చూశాడు. చూడముచ్చటగా ఉంది. నలుపూ ఎరుపూ రంగుల్లో మెరిసిపోతోంది. మిత్రులందరూ పవన్‌ను మెచ్చుకుని తమతమ అభినందనల్ని తెలిపారు. భాస్కర్ కూడా తన అభినందనల్ని తెలిపి, ఆ బండిని తానొకసారి నడుపుతానని అడిగితే కాదనకుండా వెంటనే ఇచ్చాడు పవన్. రోజు దాన్ని నడుపుతున్నప్పుడు భాస్కర్ పొందిన అనుభూతి వర్ణనాతీతం. దాన్ని నడుపుతుంటే మేఘాలలో తేలిపోతున్నట్టే అనిపించింది అతడికి. ఆ రోజు నుండి పల్సర్ బండి అంటే అతడికెంతో ఇష్టం ఏర్పడిపోయింది.
‘అబ్బా, ఎంత బాగుంటుంది బండి? బండి అంటే అదే! మిగతావన్నీ దాని ముందు దిగదుడుపే! కొంటే దానే్న కొనాలి. డ్రైవ్ చేస్తే దానే్న డ్రైవ్ చెయ్యాలి’. దాన్ని చూసిన ప్రతిసారీ అలా మనసులో అనుకోవటం అతడికి పరిపాటై పోయింది.
రోజూ కాలేజీకి వెళ్తున్నప్పుడూ, వస్తున్నప్పుడూ ఆ బండిని అతడెంతో ఆశగా, ఆసక్తిగా గమనిస్తుంటాడు. ఆ షోరూమ్ ముందు నిలబడి దాన్ని కళ్ళారా చూసి వెళితేనే కానీ అతడికి తృప్తిగా అనిపించదు.
కొంతసేపు అలా చూశాక నిట్టూరుస్తూ, నిరాశగా అక్కణ్ణించి కదిలి కాలేజీకి వెళతాడు. నిత్యం జరిగే తంతే ఇది!
భాస్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.కాం. సెకండియర్ చదువుతున్నాడు. రోజూ అతడు కాలేజీకి ఆ దారిలోనే వెళతాడు. ఆ షోరూమ్ దగ్గరికొచ్చేసరికి అతడి కాళ్లు ఆటోమేటిగ్గా ఆగిపోతాయి. అతడి కళ్లు ఆ పల్సర్ బండి మీదే నిలిచిపోతాయి.
మామూలుగా ఈ కాలపు యువకులు రకరకాల బండ్లను ఆసక్తిగా గమనించటం, తమకిష్టమైన బండిని డ్రైవ్ చేస్తున్నట్టుగా ఊహించుకోవటం పరిపాటే! కానీ భాస్కర్ ఆ పల్సర్ బండిని తప్ప ఇక దేని గురించీ ఆలోచించడు. దార్లో ఎక్కడైనా పల్సర్ బండి కనిపిస్తే చాలు.. అతడి కంట్లో మెరుపులు మెరుస్తాయి. బ్లాక్ అండ్ రెడ్ కలర్‌లో, జెంటిల్ హ్యాండిల్స్‌తో, డిస్క్ బ్రేకుల్తో, మంచి ఫినిషింగ్ టచ్‌తో, తుపాకీ గుండులా దూసుకెళ్లే ఆ బండి మీద వెళ్లే వాళ్లంతా ఎంతో అదృష్టవంతులని నిట్టూరుస్తూ ఉంటాడతడు.
అతడి నిట్టూర్పుకు అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితులే ప్రధానమైన కారణం.
భాస్కర్ వాళ్ల నాన్న, ఖాదీ కాలనీలో, రోడ్డు పక్కన ఒక అంగట్లో సెలూన్ నడుపుతున్నాడు. అంగట్లో ఆయనొక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకూ షేవింగులూ, కటింగ్‌లూ చేస్తూ తీరిక లేకుండా పని చేస్తుంటాడు. సెలూన్ బాగానే నడుస్తుంది. ఆదాయమూ బాగానే వస్తుంది. కానీ పని భారమంతా ఆయనొక్కడే మోయవలసి వస్తోంది. ‘తనతోపాటు తన కొడుకూ పనిలోకొస్తే నాలుగు కాసులు వెనకేసి కూతురి పెళ్లి చెయ్యొచ్చని’ ఆయన ఆశ. అందుకే తనతోపాటు భాస్కర్‌నూ పనిలోకి రమ్మని శత పోరుతుంటాడు.
కానీ, చదువుకోవాలనే నెపంతో భాస్కర్ డిగ్రీలో చేరిపోయి కన్నతండ్రి కోరికను నీరుగారుస్తూ, తనకున్న బండి ఆశను పెంచుకుంటూ.. అది తీరే మార్గంలేక.. సతమతమై పోతున్నాడు.
* * *
ఓ ఆదివారం సాయంత్రం భాస్కర్ తన మిత్రుడింటికి వెళ్లి తిరిగొస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడు ఊహించని సంఘటన ఒకటి అక్కడ క్షణాలలో జరిగిపోయింది.
రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న అతణ్ణి తప్పించబోయి, ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ను ఒక ఆటో గుద్దేసింది. ఢామ్.. అన్న శబ్దం వినిపించింది. ఏం జరిగిందో గ్రహించే లోపలే ఆటో డ్రైవర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు.
భాస్కర్ తేరుకుని చూసేసరికి బండి పక్కకు పడిపోయి ఉంది. దాన్ని నడుపుతున్న వ్యక్తి కాస్త పక్కగా క్రిందపడి ఉన్నాడు. పడిపోయిన బండికేసి చూసిన భాస్కర్‌కు కళ్లు జిగేల్‌మన్నాడు. కారణం, అది అతడికెంతో ఇష్టమైన పల్సర్ బండి! పడిన వేగం దాని అద్దం పగిలిపోయింది, బండి కూడా కాస్త నొక్కుకుపోయింది.
అది అలా నడిరోడ్డు మీద ఒక అనాథలా క్రింద పడిపోయి ఉండటాన్ని చూసి అతడు తట్టుకోలేక పోయాడు.
గబగబా వెళ్లి దాన్ని లేపి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంతకన్నా ముందు తనను పట్టించుకోమన్నట్లుగా ఆ వాహనదారుడి మూలుగు వినిపించింది. భాస్కర్ అప్పుడు అతణ్ణి గమనించాడు. ఆ వ్యక్తికి యాభై ఏళ్లకు పైగానే ఉంటుంది వయస్సు. కొద్దిగా లావుగా ఉన్నాడు. బిజినెస్‌మేన్‌లా ఉన్నాడు. నొప్పితో మూలుగుతున్నాడు. కుడికాలు వాచినట్టుంది. ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా అనిపిస్తోంది.
వెళ్లి ఆయన్ను లేపే ప్రయత్నం చేశాడు భాస్కర్. కానీ అతడి ఒక్కడి వల్లే అది వీలుకాకపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచించి అటుగా వెళుతున్న ఒక ఖాళీ ఆటోని ఆపి, డ్రైవర్ సాయంతో ఆయన్ను ఆటోలో కూర్చోబెట్టి, తనకు బాగా గుర్తున్న ఒక ఆర్థో హాస్పిటల్‌కి పదమన్నాడు. తర్వాత క్రిందపడున్న బైక్‌ను లేపి నిలబెట్టాడు. సీటు దుమ్ము దులిపి దాని మీద కూర్చున్నాడు. బండిని రయ్యిన ముందుకు నడుపుతూ ఆటోవాణ్ణి తన వెనకే రమ్మన్నట్టుగా సైగ చేశాడు.
పది నిమిషాలు ప్రయాణించి తనకు బాగా గుర్తున్న ఓ ప్రముఖ ఆర్థో హాస్పిటల్ ముందు బండిని ఆపాడు భాస్కర్. వెనకే వచ్చిన ఆటోలో నుండి ఆయన్ను మెల్లగా దించి, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాడు.
ప్రైవేట్ ఆస్పత్రి కనుక అడ్వాన్స్‌గా ఐదు వేల రూపాయలు కట్టమన్నారు వాళ్లు. భాస్కర్ దగ్గర అంత డబ్బెక్కడిది? ఆయన ప్యాంటు జేబులో డబ్బేమైనా ఉందేమోనని వెతికాడు. చేతికి పర్సు దొరికింది. తెరిచి చూస్తే అందులో చాలానే డబ్బుంది. అందులో నుంచి ఓ ఐదు వేలు తీసుకుని మిగతాదంతా పర్సులోనే పెట్టేసి మళ్లీ దాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఆ తర్వాత చకచకా అన్ని టెస్టులూ వేగంగా జరిగిపోయాయి.
బాగా చీకటి పడిపోయింది. అప్పటికే భాస్కర్ ఆస్పత్రికొచ్చి రెండుమూడు గంటలకు పైగానే అయ్యుంటుంది.
‘ఇంకా తాను ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్లు తన కోసం కంగారుపడతారు. పైగా - పనీపాటా లేకుండా ఊరు తిరుగుతున్నానని నాన్నకు ఇప్పటికే తన మీద పట్టరాని కోపముంది. దాన్ని నిజం చెయ్యకూడదు’ అనుకున్నాడు భాస్కర్.
అంతే! ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా గబగబా ఆస్పత్రి బయటకొచ్చి, టౌన్ బస్సెక్కి ఇంటికి చేరుకున్నాడు.
* * *
మరుసటి రోజు ఉదయం భాస్కర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని.. విప్పేసిన ప్యాంటు జేబులో నుండి తన కాలేజీ ఐడి కార్డ్ కోసం చెయ్యి పెట్టినప్పుడు తగిలిందది! వేగంగా దాన్ని బయటకి తీశాడు. అది పల్సర్ బండి తాళాలు!
‘అరెరే! నిన్న తనున్న టెన్షన్‌లో బండి తాళాల్ని జేబులో పెట్టుకొని మర్చిపోయి వచ్చేసినట్టున్నాడు. అయ్యో, వీటి కోసం ఆయన ఎంతగా వెతికుంటాడో? ఔనూ, ఇంతకీ ఆయనకు ఇప్పుడెలా ఉందో, ఏమిటో? నిన్న ఆయన్ను తను వదిలి వచ్చేశాడు. ఏం ఇబ్బందులు పడుంటాడో? పర్లేదులే, ఈసరికే ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఉంటారు. అయినా బండి తాళాలు తన దగ్గరే ఉండిపోతే ఎలా? వెంటనే వెళ్లి దాన్ని ఆయనకు తిరిగిచ్చెయ్యాలి అనుకుంటూ గబగబా తయారై, టౌన్ బస్సెక్కి, ఆస్పత్రి ఉన్న బస్టాప్‌లో దిగి, వేగంగా అడుగులు ముందుకు వేశాడు భాస్కర్.
దూరం నుండే కనిపెట్టేశాడు తనకెంతో ఇష్టమైన పల్సర్ బండిని.
నిన్న తను నిలబెట్టిన చోట్లోనే ఉందది. పరుగెత్తి పరుగెత్తి బాగా అలసిపోయి సేద తీరుతున్నట్టుగా నిలబడి ఉంది.
బండి దగ్గరికెళ్లాడు. ఆప్యాయంగా దాన్ని ఓసారి చేత్తో తడిమాడు. ఏదో తెలియని ఆనందం కలిగింది భాస్కర్‌కు.
నిన్న సాయంత్రం తను దాన్ని డ్రైవ్ చేసినా తృప్తిగా అనిపించలేదు. ఏదో యాంత్రికంగా నడిపాడు. అంతే! సందర్భం అలాంటిది మరి! ఏం చేస్తాం?... నిట్టూరుస్తూ గబగబ రిసెప్షన్ దగ్గరికెళ్లి ఆయన ఏ వార్డులో వున్నాడో కనుక్కున్నాడు.
ఆయనున్న వార్డులోకి అడుగుపెట్టాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఉన్నాడాయన. కళ్లు మూతలు పడున్నాయి. ఆయన కుడికాలికి తెల్లటి పిండికట్టు వేయబడుంది. కాలికి ఆపరేషన్ అయినట్టుంది.
ఆయన సమీపానికి వెళ్లాడు. అలికిడికి కళ్లు తెరిచి భాస్కర్ వైపు చూశాడాయన. ఆయన ముఖంలో బేలతనం, దీనత్వం దోబూచులాడుతున్నాయి. ప్రశ్నార్థకంగా భాస్కర్ వంక చూశాడు. ఆయన తనను గుర్తుపట్టలేదని భాస్కర్‌కు అర్థమైంది.
‘అంకుల్, నా పేరు భాస్కర్! నిన్న హడావిడిలో మీ బైక్ తాళాల్ని మర్చిపోయి నేను తీసుకెళ్లిపోయాను’ అంటూ ప్యాంటు జేబులో నుండి బండి తాళాల్ని బయటకి తీశాడు.
అప్పటికి గానీ తనను ఈ ఆస్పత్రిలో చేర్పించింది భాస్కరేనని గ్రహించలేక పోయాడాయన.
‘ఓ.. ఆ వ్యక్తివి నువ్వేనా బాబూ? థాంక్స్! నీ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. నువ్వే కనక వెంటనే స్పందించకుండా ఉండుంటే నా గతి ఏమై ఉండేదో?’ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా.
‘దానిదేముంది అంకుల్. నేను కాకపోయినా మరెవరో మీకు సహాయపడే ఉంటారు. సాటిమనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు సాయపడ్డం మనిషి కనీస ధర్మం!’ అన్నాడు భాస్కర్.
ఆ మాటలతో భాస్కర్ ముఖంలోకి అభిమానంగా చూశాడాయన. ‘బాబూ, అలా కూర్చో. నా పేరు వీరరాఘవులు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ బిజినెస్ చేస్తున్నాను...’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడాయన.
ఆయన చూస్తూండగా బైక్ తాళాల్ని మంచం పక్కనున్న షెల్ఫ్‌లో పెట్టాడు భాస్కర్.
భాస్కర్ ఏం చదువుతున్నాడూ, ఎక్కడుంటున్నాడూ మొదలైన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడాయన.
భాస్కర్ వచ్చి పదీ పదిహేను నిమిషాలవుతున్నా వీరరాఘవులు తాలూకూ మనుషులెవరూ అక్కడ కనిపించలేదు.
‘అంకుల్, ఆంటీకి మీ ఆక్సిడెంట్ విషయం తెలిపారా? ఎక్కడా కనిపించరేంటీ?’ అని అడిగాడు.
‘ఆంటీకి ఉదయమే ఫోన్ చేసి చెప్పాను. కానీ, మా ఆవిడ ఇక్కడికి రాలేనంత దూరంలో ఉంది!’ అన్నాడు వీరరాఘవులు.
విషయం అర్థంకాక ఆయన ముఖంలోకి చూశాడు భాస్కర్. ‘తమ కోడలు ప్రసవ సమయం దగ్గరపడ్డంతో తన భార్య పది రోజుల క్రితమే డెట్రాయిట్ వెళ్లిందనీ, ఇంకో మూడు నెలల వరకూ ఆమె భారతదేశానికి వచ్చే అవకాశమే లేదనీ...’ వివరణ ఇచ్చాడు వీరరాఘవులు.
‘అయ్యో! ఇప్పుడెలా? మీ బంధువుల్లో ఇంకెవరికైనా మీ విషయం చెప్పమంటారా?’ అడిగాడు భాస్కర్.
‘ప్చ్! అవసరం లేదు బాబూ.. ఎవరికీ ఇబ్బంది కలిగించటం నాకిష్టం లేదు! ఆస్పత్రి వాళ్లకే కొంత డబ్బు కడితే కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు’ నవ్వుతూ చెప్పారాయన. వౌనంగా ఉండిపోయాడు భాస్కర్.
ఉన్నట్టుండి ఆయన, ‘బాబూ నాకొక సహాయం చేస్తావా?’ అని అడిగాడు.
‘చెప్పండంకుల్’ వినయంగా అడిగాడు భాస్కర్.
‘ప్యాంటు జేబులో నా ఏటిఎం కార్డుంది. దాన్ని పట్టుకెళ్లి కొంత డబ్బు తీసుకొస్తావా?’ అన్నాడాయన.
డబ్బు ప్రసక్తి వచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా వౌనం వహించాడు భాస్కర్.
ఆయన తన పక్కన మడిచిపెట్టున్న ప్యాంటు జేబులో నుండి ఏటిఎం కార్డును బయటకి తీసి భాస్కర్‌కిస్తూ ‘ఈ హాస్పిటల్‌లో కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారట. కానీ, వాళ్లకు దీని పిన్ నెంబర్ చెప్పటం నాకిష్టం లేదు’ అంటూ భాస్కర్‌ను నోట్ చేసుకొమ్మని కార్డ్ పిన్ నంబర్ చెప్పాడాయన.
‘హాస్పిటల్ వాళ్లను నమ్మని అంకుల్, తనను నమ్ముతున్నారు? తన మీద ఆయనకు ఎందుకంత నమ్మకం?’
‘ప్రస్తుతానికి ఓ యాభై వేలు దగ్గరుంటే మంచిదేమో! కానీ, అంత డబ్బు విత్‌డ్రా చేయలేమేమో? అందుకే ప్రస్తుతం ఓ ఇరవై వేలు మాత్రం పట్టుకురా బాబూ’ అన్నాడాయన.
ఆయన వైపు పరీక్షగా చూశాడు భాస్కర్. ఆ కళ్లల్లో.. తన పట్ల సొంత మనిషి అన్న భావనా, అపారమైన నమ్మకమూ కనిపిస్తున్నాయే కానీ ఇసుమంతైనా అనుమానచ్ఛాయలేవీ కనిపించలేదు.
దాంతో ఇంకేమీ ఆలోచించకుండా ఏటిఎం కార్డును తీసుకుని బయటకి వెళ్లబోయాడు భాస్కర్.
‘బాబూ బైక్ కీస్ తీసుకెళ్లు...’ గుర్తు చేశాడు వీరరాఘవులు.
ఆ మాటతో అప్రయత్నంగా భాస్కర్ పెదాల మీద ఓ చిరునవ్వు మొలిచింది. కళ్లల్లో మెరుపూ కనిపించింది.
చిన్నగా నవ్వుకున్నాడు వీరరాఘవులు.
ఉత్సాహంగా బైక్ తాళాలు తీసుకుని బయటకి దారితీశాడు భాస్కర్. అతనిలోని ఉత్సాహాన్ని చూస్తూ బెడ్ మీద వెనక్కు వాలాడు వీరరాఘవులు.
* * *
విత్‌డ్రా చేసిన డబ్బుతో ఏటిఎం కార్డును కూడా జతకలిపి వీరరాఘవులు చేతికిచ్చాడు భాస్కర్.
‘్థంక్స్ బాబూ..’ అంటూ వాటిని బెడ్ కింద దాచాడు వీరరాఘవులు.
‘లెక్క పెట్టుకోండి అంకుల్...’ ఆశ్చర్యంగా అన్నాడు భాస్కర్.
‘కరెక్ట్‌గానే ఉంటుందిలే..’ అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా అతని వైపు చూసి నవ్వాడాయన.
బైక్ తాళాలు అక్కడ పెట్టేసి కాలేజీకి వెళ్లిపోయాడు భాస్కర్.
మరుసటిరోజు కాలేజీకి వెళుతూ ఆయన్నొకసారి పలకరించి వెళదామని ఆస్పత్రికి వెళ్లాడు భాస్కర్.
అతడు వెళ్లే సమయానికి కళ్లు మూసుకుని వెనక్కు వాలి పడుకుని ఉన్నాడాయన. జుత్తు చెదిరిపోయి ఉంది. గడ్డం బాగా పెరిగి ఉంది. కళ్లు లోతుకు పోయి ఉన్నాయి. బట్టలు నలిగిపోయి, మాసిపోయి ఉన్నాయి.
అక్కడున్న కుర్చీలో శబ్దం కాకుండా కూర్చున్నాడు భాస్కర్.
కానీ ఆ కాస్త అలికిడికే ఆయన కళ్లు తెరిచి భాస్కర్‌కేసి చూశాడు. చిన్నగా నవ్వుతూ ‘ఎప్పుడొచ్చావు బాబూ?’ అని అడిగాడు.
‘ఇప్పుడే అంకుల్! ఎలా ఉంది మీకు?’ అని ప్రశ్నించాడు భాస్కర్.
‘పర్వాలేదు!’ అని క్షణమాగి, ‘బాబూ... నీకు ఖాదీకాలనీ తెలుసుగా! ఆ కాలనీలోని మూడో లైన్‌లో 59వ ఇల్లే మాది. నువ్వు మా ఇంటికెళ్లి రెండు జతల బట్టలు పట్టుకొస్తావా? బెడ్‌రూమ్‌లో అల్మైరాలోనే ఉతికిన బట్టలు మడిచిపెట్టి ఉంటాయి. ఇవిగో ఇంటి తాళాలు?’ అంటూ తలగడ క్రింద పెట్టున్న ఇంటి తాళాల్ని తీసి భాస్కర్ చేతికి ఇవ్వబోయాడాయన.
‘అయ్యబాబోయ్, ఏమిటీయన ఉద్దేశం? ఏకంగా ఇంటి తాళాల్నే తన చేతికి ఇచ్చేస్తున్నాడు. ఒక అపరిచిత వ్యక్తిని నమ్మి ఎవరైనా ఇంటి తాళాల్ని ఇచ్చేస్తారా? తన మీద ఆయనకు ఎందుకింత గట్టి నమ్మకం? ఊహూ... తను వాటిని తీసుకుంటే తొందరపాటే అవుతుంది. అందుకని ఆయన బాగా ఆలోచించుకోవటానికీ, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవటానికీ కొంత సమయం ఇవ్వాలి? అనుకుని... భాస్కర్ వాటిని తీసుకునేందుకు వెనకాడాడు.
అతని సంశయాన్ని పసిగట్టి.. ‘ఏం పర్వాలేదు తీసుకో బాబూ! నువ్వూ నాకిప్పుడు కావలసిన వాడివేగా..’ అన్నాడాయన.
అప్పటికీ జంకుతూ.. ‘సాయంత్రం కాలేజీ నుండి వెళుతూ వచ్చి తీసుకుంటాలే అంకుల్...’ అన్నాడు భాస్కర్.
‘మళ్లీ ఇక్కడిదాకా ఎందుకూ అనవసరంగా? కాలేజీ నుండి అటే మా ఇంటికెళ్లి బట్టలు తీసేసుకో. రేపు ఉదయం కాలేజీకి వెళుతూ బట్టలు తెచ్చిస్తే చాలు!’ అని తమ ఇంటి తాళం చెవుల్ని బలవంతంగా అతని చేతిలో పెట్టాడు వీరరాఘవులు.
తీసుకోక తప్పలేదు భాస్కర్‌కు. దాంతో సంతృప్తిగా నవ్వాడాయన.
కాలేజీకి వెళ్లడానికి భాస్కర్ లేచి నిలబడగానే.. ‘బాబూ.. మా ఇంటికి ఎలా వెళతావ్? అదిగో, ఆ బైక్ తాళాల్ని తీసుకొని నీ దగ్గరే ఉంచు!’ అన్నాడాయన.
ఆ మాటలతో భాస్కర్‌లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆనందంగా బయటకి దారితీశాడు.
మొదటిసారి తనకిష్టమైన బైక్ మీద కాలేజీకి వెళుతుండటం అతనికెంతో హుషారునిచ్చింది.
ఎవరూ గమనించలేదనుకొని స్టైల్‌గా తాళాల్ని ఒకసారి గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాడు భాస్కర్.
* * *
మరుసటిరోజు వీరరాఘవులు ఇంటి నుండి ఉతికిన బట్టలతోపాటు మొబైల్ ఛార్జర్, పాటలు వినడానికి ఇయర్ ఫోన్స్ కూడా పట్టుకొచ్చాడు భాస్కర్.
తనకు కావలసిన వస్తువుల్ని అతడు గుర్తుపెట్టుకొని తీసుకురావటం ఎంతో సంతోషాన్ని కలిగించిందాయనకు.
* * *
పదిరోజులు గడిచాయి. వీరరాఘవులు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి దగ్గర ఆయన్ను వాకర్ సహాయంతో మెల్లగా నడిచే ప్రయత్నం చెయ్యమన్నాడు డాక్టర్.
ఆస్పత్రి నుండి వస్తున్నప్పుడే వాకర్‌ను కూడా కొనుక్కొచ్చుకున్నాడు ఆయన. భాస్కర్ అప్పుడప్పుడూ వెళ్లి ఆయన్ను కలిసి వస్తున్నాడు.
ఆ రోజు ఆదివారం కావటంతో పొద్దునే్న అంకుల్ ఇంటికెళ్లాడు భాస్కర్. అప్పటికే ఆయన నిద్ర లేచి మంచం మీద కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు. ‘గుడ్‌మార్నింగ్ అంకుల్!’ నవ్వుతూ విష్ చేశాడు భాస్కర్.
‘వెరీ గుడ్‌మార్నింగ్ భాస్కర్. కూర్చో!’ అంటూ పేపర్ మడిచి పక్కన పెట్టాడాయన.
‘నేను కూర్చోవటం కాదు, మీరు వెంటనే పైకి లేవాలి’ అంటూ ఆయన్ను పట్టుకుని పైకి లేపి నిలబెట్టి వాకర్ సాయంతో మెల్లగా నడిపించుకుంటూ వెళ్లి కారిడార్‌లో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు.
ఇక్కడెందుకు కూర్చోబెట్టాడా అని ఆలోచిస్తూ ఆయన భాస్కర్‌కేసి చూస్తుంటే ‘మీకు ఈ గడ్డం ఏమీ బాగోలేదు అంకుల్. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా, విషాదంగా మీ ముఖం ఉండటం నేను చూడలేక పోతున్నాను. అందుకే ఇప్పుడు మిమ్మల్నేం చేస్తానో చూడండి’ అంటూ ఆయన మెడ చుట్టూ ఒక తువ్వాలు వేసి, తన జేబులో నుండి ఒక కవర్‌ను బయటికి తీశాడు. అందులో నుండి బయటపెట్టిన సరంజామాను చూసి ఆశ్చర్యపోయాడాయన.
నవ్వుతూ ఆయన గడ్డానికి షేవింగ్ క్రీమ్‌ను పట్టించి జాగ్రత్తగా షేవింగ్ చేశాడు భాస్కర్. తృప్తిగా ఆయన్ను చూసి హాల్లోని చేతి అద్దం తెచ్చి ఆయన ముందు పెట్టి ఆయన ముఖం కనిపించేలా పట్టుకున్నాడు.
‘ఇప్పుడు చూడండి మీ ముఖాన్ని, ఎంత బావున్నారో!’ అంటూ కళ్లెగరేశాడు భాస్కర్.
ఆయన అద్దంలోకి చూడకుండా భాస్కర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ ‘్భస్కర్ నీకు షేవింగ్ చెయ్యటం వచ్చా?’ అన్నాడు.
‘వచ్చు సార్. మేము ఈ వృత్తివాళ్లమే! కానీ ఇన్నాళ్లూ మీకు ఆ విషయం చెప్పలేకపోయాను. తెలిస్తే మీరు నన్ను దూరం పెడతారేమోనని భయపడ్డాను. కానీ బాగా పెరిగిన గడ్డంతో ఉన్న మీ ముఖాన్ని చూడలేక ఏమైనా కానీ అనుకుని, ఈ నిర్ణయం తీసుకున్నాను’ ఆత్మన్యూనతా భావంతో ఆయన ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు భాస్కర్.
‘ఎంత పొరబడ్డావ్ భాస్కర్... నాది ఏ కులమో తెలిశా నువ్వు నాకు సాయం చేశావ్? కాదుగా! మానవత్వంతో చేశావ్! మనిషికి కావలసింది అదే! అదే మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది. జాతి, మతం, కులం, వర్గం వీటిమీదంతా నాకు పట్టింపుల్లేవు. ఇవే ప్రస్తుతం మనుషుల్ని నాశనం చేస్తున్నాయి. చదువుకున్న వాళ్లు కూడా వీటిని పట్టించుక్కూర్చుంటే మనమెప్పటికీ ఎదగలేం! నాలో ఆ పట్టింపు లేదు కనకనే మనమిద్దరూ దగ్గర కాగలిగాం. ఔనా! అందుకే, ఇక మీద ఎప్పుడూ మన మధ్య ఈ కులాల ప్రసక్తి తీసుకురాకు భాస్కర్...’ స్థిరమైన కంఠంతో అన్నాడాయన. ‘అలాగే అంకుల్! మీతో ఇంకెప్పుడూ అలాంటి విషయాల గురించి మాట్లాడను!’ అన్నాడు.
‘వెరీగుడ్...’ నవ్వుతూ అద్దంలో తన నున్నటి గడ్డాన్ని తడుముకుంటూ తనను తాను చూసుకుంటూంటే ఏదో కొత్తగా అనిపించింది వీరరాఘవులుకు.
ఇంతలో ఆయన స్మార్ట్ఫోన్ మోగింది. రోజూ నిద్ర లేవగానే భార్యతో మాట్లాడ్డానికి నెట్ ఆన్ చేసి పెడతారాయన. వీడియో కాల్ అది. ఆన్ చెయ్యగానే తెర మీద కనిపించిన ఆయన భార్య ‘ఏమండీ! ఇప్పుడెలా ఉంది మీకు? నొప్పి బాగా తగ్గిందా? నడవగలుగుతున్నారా?’ అంటూ ప్రశ్నించింది.
‘ఊ... నొప్పి బాగానే తగ్గింది. మెల్లగా నడవగలుగుతున్నాను. అదలా ఉంచు జానకీ... ఇప్పుడు నేనెలా ఉన్నానో నా ముఖం చూసి చెప్పవోయ్! హీరోలా లేనూ? నన్నిలా మార్చింది ఎవరో తెలుసా? మన భాస్కరే!...’ అంటూ భాస్కర్‌ను తన పక్కకు పిలిచి అతను స్క్రీన్‌లో పడేటట్టుగా నిలబెట్టి.. ‘నువ్వు భాస్కర్‌ను ఇప్పటిదాకా చూళ్లేదు కదూ, ఇదిగో ఇప్పుడు చూడు...!’ అన్నాడు సంతృప్తిగా.
‘బాబూ, నీకు మేమెంతో రుణపడి ఉన్నాం. నువ్వు చేసిన మేలు మా జీవితాంతం గుర్తుంచుకుంటాం!’ అంది మనస్ఫూర్తిగా. ఆమె మాటలకు భాస్కర్‌కు ఏం చెప్పాలో తెలియక వౌనం వహించాడు.
‘ఏమండీ, మీ పరిస్థితి చూశాక నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. వెంటనే బయలుదేరి ఇండియాకు వచ్చేద్దామనుకుంటున్నాను’ అంది ఆతృతగా.
‘వొద్దొద్దు జానకీ! నువ్వక్కడే ఉండు. ఇప్పుడే కోడలికి నీ సాయం ఎంతో అవసరం. నాకిక్కడ ఏమీ ఇబ్బంది లేదు. నాకు భాస్కర్ తోడుగా ఉన్నాడు. నువ్విక్కడున్నా అతను చూసుకున్నంత బాగా నన్ను చూసుకోలేవేమో అనిపిస్తోంది నాకు...’ అంటున్న ఆయన వంక పరిశీలనగా చూశాడు భాస్కర్.
ఆయన మాటల్లోని నిజాయితీకి భాస్కర్ మనసు ఉప్పొంగింది.
ఆ రోజు ఆదివారం కావటంతో ఓ రెండు మూడు గంటలు అక్కడే గడిపాడు భాస్కర్.
ఇక ఇంటికి వెళదామని ఆయన నుండి సెలవు తీసుకుంటుంటే... ‘్భస్కర్ బండి తాళాలు ఇచ్చి వెళ్లు! ఈ రోజు నువ్వు బస్సులో వెళ్లవలసిందే!’ భాస్కర్‌కేసి చూసి నవ్వుతూ అన్నాడు వీరరాఘవులు.
చివ్వున తలతిప్పి ఆయన వంక చూశాడు భాస్కర్. ఆ మాటతో ఏదో తెలియని నిరుత్సాహం అతణ్ణి చుట్టుముట్టింది.
ఏమీ మాట్లాడకుండా జేబులో నుండి బండి తాళాల్ని తీసి ఇస్తుంటే... తన ఒంట్లోని ముఖ్యమైన భాగమేదో తన నుండి దూరమవుతున్నట్టుగా బాధ కలిగింది అతనికి. అయినా బండిని ఇవ్వక తప్పదు. దాన్ని తన దగ్గరే ఉంచుకోవటానికి అది తన సొంత ఆస్తి కాదుగా! ఎప్పటికైనా అది అంకుల్‌కు తిరిగి ఇచ్చేయవలసిందే. తప్పదు! ఇంతకాలమూ తనకెంతో ఆనందాన్ని పంచిన బండి తన నుండి దూరమై పోతోంది. రేపటి నుండి తను కాలేజీకి మళ్లీ టౌన్ బస్సులో వెళ్లవలసిందే!
గుండెను నిబ్బరం చేసుకుని బయటకి దారితీశాడు భాస్కర్. మనసు బాగోలేక ఎక్కడెక్కడో తిరిగి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టబోతూ వాకిట్లో నిలబెట్టున్న కొత్త బ్లాక్ అండ్ రెడ్ పల్సర్ బండిని చూసి ఆశ్చర్యపోతూ గబగబ ఇంట్లోపలికి వెళ్లి.. ‘అమ్మా.. బయట ఎవరిదీ కొత్త బండి?’ అంటూ ఆతృతగా అడిగాడు.
‘షోరూమ్ నుండి ఎవరో కుర్రాడొచ్చి నీకివ్వమని చెప్పి ఈ తాళాలిచ్చి వెళ్లాడ్రా!’ ఆమెకూ అర్థంకాక బదులిచ్చింది.
‘రసీదులో తన పేరే ఉంది. తమ ఇంటి చిరునామానే ఉంది. అయితే ఎవరు బుక్ చేసుంటారబ్బా? నాన్న అయ్యుంటాడా? ఊహూ... కానేకాదు. ఇంకెవరై ఉంటారు?’ వెంటనే ఊహించలేక పోయాడు భస్కార్.
అనుమానం వచ్చి అంకుల్‌కు ఫోన్ చేశాడు భాస్కర్. అది ఎంగేజ్ శబ్దం వస్తోంది. బండిని స్టార్ట్ చేసి అంకుల్ ఇంటికి పోనిచ్చాడు. వెళ్లేసరికి ఏదో శుభకార్యానికి వెళ్లేవాడిలా శుభ్రంగా తయారై ఉన్నాడాయన. పక్కన పూజాసామాగ్రి ఉంది.
భాస్కర్‌ను చూసి ‘ఏం భాస్కర్, బైక్ నచ్చిందా?’ అన్నాడు నవ్వుతూ.
‘అంకుల్, అది... నాకు.. కొత్త బైక్?’ అంటూ ఆ పైన ఏం చెప్పాలో తెలియక మాటలు తడబడ్డాయి భాస్కర్‌కు.
‘ఔను. నీకే.. దాన్ని నీ కోసమే కొన్నాను. బావుందా?’
‘అంకుల్, ఎందుకంత డబ్బు ఖర్చు పెట్టి...?’
‘నీకు పల్సర్ బైక్ మీదున్న అభిమానాన్ని చూశాను భాస్కర్. అదంటే నీకెంత ఇష్టమో కూడా గ్రహించాను. కానీ, నాకు ఆక్సిడెంట్ అయిన బైక్‌ను నువ్వు నడపటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో పాతది మార్పించి కొత్తది కొన్నాను. బాగుందా, నీకు నచ్చిన బైకే, నువ్వు మెచ్చిన కలరే. నీకే సొంతం అది’
‘అది కాదంకుల్...’ అంటూ ఇంకేదో చెప్పబోయాడు భాస్కర్.
‘ఇంకేం మాట్లాడకు. వెంటనే బయలుదేరు. ఆంజనేయస్వామి గుడి దగ్గర బండికి పూజ చేసుకుని, అటు నుండి అటే మున్సిపల్ పార్కుకు వెళదాం. ఇవ్వాల్టి నుండి పార్క్‌లో కాసేపు వాకింగ్ మొదలెడదాం’ హుషారుగా అన్నాడు వీరరాఘవులు.
చాలారోజుల తర్వాత మొదటిసారిగా ఆయన బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
వాకర్ కోసం అటుఇటు చూశాడు. దూరంగా గోడ దగ్గర ఉందది. దాన్ని తెచ్చివ్వమన్నట్టుగా భాస్కర్‌కేసి చూశాడాయన.
భాస్కర్ లేచి నిలబడి.. ఇక దాంతో అవసరం లేదన్నట్టుగా.. ఆయనకు ఆసరాగా తన చేతిని అందించాడు.
మరో మూడు నిమిషాల్లో ఆయన్ను ఎక్కించుకొని బజాజ్ పల్సర్ రోడ్డు మీద.. రయ్యిమని ముందుకు దూసుకెళ్లింది.
=================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-జిల్లేళ్ల బాలాజీ.. 9866628639