కథ

పారాహుషార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
*
చంటిపిల్ల గుక్కపెట్టి ఏడుస్తున్నట్టు పదేపదే అన్పించసాగింది పొలంలో కూలి పని చేస్తోన్న కాశమ్మకి.
మరి తల్లి మనసు నిలవలేకపోయింది.
‘పొద్దుటనగా పాలిచ్చాను. బిడ్డ ఆకలికి తాళలేదు. పాలిచ్చి ఇదిగో ఇక్కడున్నట్టుగా వచ్చేత్తా’ రైతుకి చెప్పి, అతడి అంగీకారం కోసం చూడకుండా, పొలాలకి అడ్డం పడింది.
పది నిమిషాల్లో గుడిసెకెళ్లి తలుపు తీసింది. పిల్ల నిజంగానే పొర్లిపొర్లి ఏడుస్తోంది.
గభాల్న పిల్లని ఒళ్లోకి తీసుకుంది. అంతే వేగంగా బిడ్డ నోటికి రొమ్ము అందించింది.
ఏడుపు మాని, ఆబగా పాలు త్రాగటంలో నిమగ్నమయ్యింది.
చంటిదాని కళ్లల్లోనూ చెంపల మీదా ఉన్న కన్నీటి చుక్కల్ని తుడిచి నుదుట ముద్దు పెట్టుకుంది.
అమృతం తాగుతున్నట్టుగా సగం కళ్లు మూసి తన్మయత్వంతో పాలు తాగుతోంది కూతురు. దాని వంక అపురూపంగా చూస్తూ ఆనందానుభూతిని గ్రోలుతూనే తల నిమరసాగింది కాశమ్మ.
* * *
బేబీ ప్రోడక్ట్స్ కంపెనీ యజమాని నీలకంఠ ముగ్గురు డాక్టర్లని తోడ్కొని వెళ్లి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రిని కలిశాడు.
‘బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు స్థాపన గురించి మాట్లాడాలని వచ్చామండి..’ వినయంగా చెప్పాడు నీలకంఠ.
‘మీ ప్రపోజల్ చూశాను. పైకి బాగానే ఉంది. ప్రతిపక్షమూ, మహిళా సంఘాలూ ఎలా తీసుకుంటాయోనని సందేహంగా ఉంది. సీఎం సంగతి తెలుసుగా. ఆయనకి ఇమేజ్ ముఖ్యం. దానికి డ్యామేజ్ జరిగితే అగ్గిరాముడై పోతాడు’ నవ్వారు మంత్రి.
‘దీన్ని మనమే కొత్తగా ప్రారంభించటం లేదండి. చాలా దేశాల్లో ఎప్పట్నుంచో ఉన్నాయి. మన దేశంలో ముంబైలో 1979లోనే మొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్‌ని ప్రారంభించారు. దేశం మొత్తం మీద 25 బ్యాంకులున్నాయి. నిన్నగాక మొన్న బెంగళూరులోని ప్రభుత్వానికి చెందిన వాణీ విలాస్ హాస్పిటల్‌లో రొమ్ము పాల బ్యాంక్‌ని స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్టు పేపర్లలో వార్తలొచ్చాయి. మీరు చూసే ఉంటారు.’
‘మీరన్న ఆ బ్యాంకుల్లో పాలని విక్రయిస్తున్నారా?’
‘అహహ. అత్యవసరమైన శిశువులకి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు’
‘అదీ అలా చెప్పు. అక్కడే వస్తుంది తిరకాసంతా. మీరు సమస్త బేబీ ప్రోడక్ట్స్‌నీ తయారు చేస్తున్నారని తెలుసు. ఈ పనిని లాభం, నష్టం రెండూ లేని విధంగా నడపాలనుకుంటున్నారనీ తెలుసు. దాని ద్వారా జనంలో మంచి పేరు కొట్టేసి, మీ ఉత్పత్తుల్ని మరింతగా అమ్ముకోవాలని చూస్తున్నారనీ తెలుసు. మిమ్మల్నేమీ తప్పు పట్టడంలేదు. మీరు చెయ్యాలనుకున్న పని భేషుగ్గా ఉంది. కానీ సీఎం దొంగరాముడు కరుస్తాడేమోనని..’ బుర్ర గోక్కున్నారు మంత్రి.
‘పోనీ విదేశీ సంస్థల వారిని పిలిచి సీఎం సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించమంటారా?’
‘అది తిరుగులేని ఆలోచన. రామ బాణమే. అది బెటరు. అసలు మీరేం చేస్తారో ఎలా చేస్తారో ముందు నాకు అర్థమయ్యేట్లు చెప్పండి. సీఎం బండరాముడి అనుమానాలన్నీ తీర్చాలిగా!’
డాక్టర్ శశి ముందుకొచ్చింది. ‘పసి పిల్లలకు తల్లిపాలు మించిన పోషకాహారం లేదు సార్. ఆప్టిమమ్ న్యూట్రిషన్ వ్యాల్యూ ఉంటుంది. తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా ఎదుగుతారు. వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఒక్కో తల్లి దగ్గరా సాధారణంగా ఇద్దరు పిల్లలకు సరిపడా పాలు ఉంటాయి. తమ బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను వారి నుంచి మేం ఉచితంగా సేకరిస్తాం. అలాగే పురుట్లోనే బిడ్డ చనిపోయిన తల్లుల్నుంచీ సేకరిస్తాం. ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్స్‌లోని తల్లులు మా ప్రథమ టార్గెట్ సార్. వాటిని పాలివ్వలేని తల్లుల బిడ్డలకు, రోగగ్రస్థ తల్లుల పిల్లలకు, తల్లి పాలు చాలని పిల్లలకు, తక్కువ బరువున్న శిశువులకు, నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు ఉచితంగా అందిస్తాం. ఒక రకంగా ఇది క్రాస్ సబ్సిడీ అన్నమాట. అవసరాన్ని మించి ఉన్న వారి నుంచి సేకరించి, అవసరమైన వారికి అందించడం ద్వారా పసిపిల్లలందరికీ తల్లిపాలు అందుతాయి. దానివల్ల రాష్ట్రంలోని పిల్లలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే అవకాశం కలుగుతుంది సార్’
ఆవిడ మాటలకి సంతృప్తులయ్యారు. అయినా ఏదో సందేహం పీకుతోంటే అడిగారు ‘ఇందులో ఖర్చేగాని మీకు ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది?’
నీలకంఠ కొంచెం ముందుకు వంగి చెప్పాడు. ‘మా కంపెనీ గుడ్‌విల్ పెరుగుతుంది. అదీగాక ఆయా ఆసుపత్రులలోని పిల్లలకు అందివ్వగా మిగిలిపోయిన పాలను మా ఫార్మా కంపెనీలో పాశ్చరైజ్ చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తాం. బెంగళూరు సంస్థ 15 ఎమ్మెల్ 300 రూపాయల చొప్పున అమ్ముతామని వాణీ విలాస్ ఆసుపత్రి వారికి ప్రపోజల్ ఇచ్చింది. మేమూ అలాగే అదే ధరకి అమ్ముతాం. ఆ రకంగా రాష్ట్రంలోని పిల్లలందరికీ సంపూర్ణ పౌష్టికాహారం లభిస్తుంది. ఆ సొమ్ము మా ఖర్చులకు సరిపోతుందని మా అంచనా’
మంత్రి పెదవుల మీద చిత్రమైన మందహాసం కదలగా తల పంకించారు.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శిశు మరణాల్లో 80% కేవలం తల్లి పాలు లభించనందునే జరుగుతున్నాయిట సార్. బిడ్డ ఆరోగ్యానికీ ఎదుగుదలకీ తల్లి పాలు ది బెస్ట్ సార్’ అన్నారింకో డాక్టర్ సుబ్రహ్మణ్యం.
‘మన దేశంలో ప్రతీ ఏడాది రెండు కోట్ల యాభై లక్షల మంది శిశువులు జన్మిస్తుంటే వారిలో ముప్పై లక్షల యాభై వేల మంది ప్రీమెచ్యూర్ బేబీలే. వీరిలో పది శాతం మంది వివిధ సమస్యలతో చనిపోతున్నారు. తల్లిపాలు సరైన సమయంలో ఇవ్వగలిగితే శిశు మరణాల సంఖ్యను సగానికి పైగా తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నార్సార్. మన సిటీలోని ప్రముఖ మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో మాట్లాడాం. ఏడాదికి 4వేల మంది రోగగ్రస్త శిశువుల మంచీ చెడూ చూడాల్సి వస్తోందనీ, తల్లి పాల లేమి పెద్ద అవరోధంగా ఉందనీ చెప్పారు సార్’ అంది డా.గీత.
‘ఎగ్జాక్ట్‌లీ సార్. ఇందులో బలవంతం ఏమీ ఉండదు. స్వచ్ఛందంగా పాలు ఇచ్చిన తల్లుల దగ్గర్నుంచే సేకరిస్తాం. ఒక తల్లి ప్రతిరోజూ ఆరు వందల మిల్లీలీటర్ల పాలను ఉత్పత్తి చేయగలదు. కాని బిడ్డ కడుపు నిండడానికి అందులో సగం చాలు. ఆ మిగిలిన పాలను తల్లి పాలు దొరకని శిశువులకి అందించాలనే ఆలోచనలోంచి పుట్టినవే హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్’ డాక్టర్ శశి వివరించారు.
‘ఇలాగ అనుకునే ఇది వరకు వాలంటరీ బ్లడ్ బ్యాంకులు ప్రారంభించాం. ఇప్పుడవి ఫక్తు వ్యాపార సంస్థలై కూర్చున్నాయి!’
‘ఇక్కడలా జరిగే అవకాశం లేదు. ఇది లిమిటెడ్ ఏరియా. తల్లులకీ, పసిపిల్లలకీ సంబంధించింది. ప్రసవం జరిగిన ఆర్నెల్లు లేదా పది నెలలు దాకానే సాధారణంగా పాలు తయారవుతాయి. ఆ తర్వాత ఉండవు. అంచేత ఇది వ్యాపారంగా మారే ప్రసక్తే ఉండదు. మేం మా కంపెనీ ఇమేజ్ పెంచుకోడానికీ, మా ప్రోడక్ట్స్ జనంలోకి వెళ్లడానికీ ఈ రొమ్ము పాల బ్యాంక్‌ని ఉపయోగించుకుంటామని మనవి చేస్తున్నాను’ అన్నాడు నీలకంఠ అతి వినయంగా.
ఆ వెంటనే తిరిగి తనే అన్నాడు. ‘ఆ పాలను ఎవరికి బడితే వారికి అమ్మం. ప్రసవం చేసిన డాక్టర్ లేదా పిల్లల డాక్టర్ లేదా గైనకాలజిస్ట్‌ల అభ్యర్థన మేరకే అమ్ముతాం. పాలను కూడా చక్కగా ప్రోసెస్ చేసి, రోగాల్లేవని నిర్ధారించుకున్నాకే నిల్వ చేస్తాం. డోనార్ ఆరోగ్య చరిత్రా చూస్తాం. అనేక ఇతర ప్రమాణాలు తు.చ తప్పక పాటిస్తామని హామీ ఇస్తున్నాం’
‘వినడానికి బాగానే ఉందనుకో. సీఎం సంగతి తెలుసుగా. తిక్క రాముడు...’
‘ఇది ఒక విప్లవాత్మక పథకం సార్. పసిపిల్లల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రారంభిస్తోన్న ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకువల్ల మీకూ మీ ప్రభుత్వానికీ బోల్డంత కీర్తి ప్రతిష్ఠా లభిస్తాయి. విదేశీ సంస్థలు ఎన్నో కితాబులిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మెచ్చుకుంటుంది...’ డాక్టర్ గీత చెప్పారు.
మంత్రి కళ్లు మెరిశాయి. ‘ఈ పాయింటు బావుంది. సీఎం గొప్పల రాముడు బుర్ర ఊపేస్తాడు. ఆయన చెవిలో ఒక మాట ఊది అనుమతి తీసుకుంటా. ఈలోగా మీరు మీ ఏర్పాట్లలో ఉండండి’
‘మీకు రుణపడి ఉంటాం’ అని చెప్పి, నర్మగర్భంగా నవ్వి, షేక్ హ్యాండిచ్చి, సెలవు తీసుకున్నాడు నీలకంఠ.
* * *
బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్‌ని ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు.
ఇది గొప్ప ముందడుగుగా, పసిపాపల ఆరోగ్య జ్యోతిగా అభివర్ణించారు.
ఇకపై రాష్ట్రంలోని ఏ పసిబిడ్డకూ పోషకాహార లోపం ఉండనే ఉండదని ఢంకా బజాయించారు. శిశువులకు తల్లి పాలలో లభించే విటమిన్లు మరెక్కడా లభించవన్నారు. తల్లులు ఉదారంగా వ్యవహరించి, అదనపు పాలను పేదపిల్లలకు అందించేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
సదరు బ్యాంకును స్థాపించిన నీలకంఠనీ, అతడి కంపెనీనీ వేనోళ్ల అభినందించారు. వ్యాపార దృక్పథం లేకుండా శిశువుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కృషి చేయమని హితవు చెప్పారు. వారికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులేవీ చెయ్యవద్దని హెచ్చరికా చేశారు. ఈ బ్యాంకు కార్యకలాపాల మీద సామాజిక కార్యకర్తలు ఓ కన్ను వేసి ఉంచాలనీ సూచించారు.
* * *
కాశమ్మ పిల్లకి పాలిస్తుంటే పరుగు పరుగున వచ్చాడు దాని మొగుడు కాశయ్య. బలవంతంగా పిల్లని లాగేశాడు.
‘అయ్యయ్యో నీకేం పోయేకాలం వచ్చిందయ్యా. బిడ్డ పాలు తాగుతోంటే ఇదేం పాడు పని?’ కస్సుమంది కాశమ్మ.
‘ఒసే పిచ్చిదాన్ని. ఇక నీ పాలు మన పాలిట బంగారవేఁ. నీ పాలకి భలే గిరాకీ వచ్చిందే’ సంబరంగా చెప్పాడు.
‘ఏవొచ్చిందీ!’ వెర్రిగా చూసింది.
‘తల్లుల పాలు కొంటున్నారే. ఇన్నాళ్లూ ఇది తాగిన పాలు చాలు. ఇయాల్నుంచి దానిక్కూడా మనతోబాటే గంజినీళ్లు పోసెయ్. నీ పాలు అమ్మేత్తాను. ఇంద ఈ సీసాలోకి పిండెయ్...’
బుగ్గలు నొక్కుకుంది. ‘ఇదేం పిదప బుద్ధి? ఈ భూపెపంచం మొత్తం మీద కొనకుండా దొరికేవి తల్లి పాలేనయ్యా. వాటిని అమ్మేసి పిల్లదాని నోటికాడి కూడు లాగేస్తావా, నీ జిమ్మడిపోను! నువ్వసలు మనిసివేనా? నీకు సీమూ నెత్తురూ లేవా?’
‘అయి లేకపోతే ఏవే, నీ కాడ పాలున్నాయి. అయి శాన...’
‘పిల్లదాని పొట్ట కొట్టి దాని ఉసురు పోసుకోమాకయ్యా..’ బ్రతిమాలింది.
‘ఆడపిల్లే కదా! మగబిడ్డని కన్నట్టు ఇదైపోతావేంటి. దానికేం కాదులేగాని నువ్వు ముందు పాలు పిండి ఇయ్యవే..’ గదమాయించాడు.
కాస్సేపు మొగుడితో పోట్లాడి ఓడిపోయింది కాశమ్మ.
మరి నెల తిరక్కుండానే కాశమ్మ కూతురు ఈనుప్పుల్లలా అయిపోయింది.
నెత్తీ నోరూ కొట్టుకుంటూ ఆసుపత్రికి పరుగెత్తారు కాశమ్మా కాశయ్యా.
బిడ్డని పరీక్షించి అన్నాడు డాక్టర్.. ‘మాల్ న్యూట్రిషన్! పౌష్టికాహార లోపం వల్ల ఇలా అయ్యింది. తల్లిపాలు పట్టిస్తేగాని కోలుకోవడం కష్టం...’
‘నేనేటి సేద్దునయ్యా నా పాలు ఎండిపోయినాయ్’ గుండెలు బాదుకుంది కాశమ్మ.
‘ఇవాళ రేపు తల్లిపాలు అమ్ముతున్నారు. బాగా డిమాండ్ ఉంది. బ్లాక్‌లో అమ్ముతున్నారు. కొనుక్కోగలమంటే చెప్పండి చీటీ రాసిస్తాను...’
తల కొట్టుకుంటూ కూలబడింది కాశమ్మ.
బిడ్డకి ద్రోహం చేశాడో, లేక దోపిడీకే గురయ్యాడో తేల్చుకోలేక కళ్లనీళ్లు కుక్కుకుని దిక్కులు చూడసాగాడు కాశయ్య.
తల్లి పాలకు కూడా ఖరీదు కట్టే నయా షరాబులు తయారయ్యారని తెలీని చిన్నారి గొంతెత్తి ఏడ్వసాగింది!
కాదు, ఏడుపు ద్వారా తన నిరసనని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది!

-సింహప్రసాద్.. 9849061668