కథ

ఆపరేషన్ అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీ ముద్దుల కొడుకు నుంచి సమాధానం వచ్చిందా? ఏమిటీ అలా ఆముదం తాగిన మొహం పెట్టేవ్.. ఓహో... సమాధానం వచ్చిందన్నమాట. అదీ ‘ల’ కేత్వం, ‘ద’కి కొమ్ము.. అందుకా ఈ మొహం.. వాడు ఆ ముదనష్టపు దేశం వెళ్లేటప్పుడే చెప్పేను. వాడి మెడలు వంచి పెళ్లి చేసేసి పంపుదామే.. అంటే విన్నావూ.. వివాహం విద్యా నాశాయః.. దిబ్బ దిరుగుండం, ఉద్యోగం వచ్చేక చేద్దాం అన్నావ్.. సరే పోనీలే అనుకున్నాను. ఉద్యోగంలో చేరేక యేబ్రాసి గాడిదకి యిండిలో చదువుకున్న వారు వద్దట.. అక్కడ చదువుకున్న వాళ్లైతే వీసా గొడవలు ఉండవు అన్నాడు.. సరే అని అలాంటి సంబంధాలే చూసినా ఆరేళ్లలో ఒక్క పిల్లా నచ్చలేదూ.. పెంకితనం కాకపోతే.. అయినా వాడనే ప్రతీ మాటకీ గంగిరెద్దులా తలూపే నిన్ననాలే...’
భర్త ధోరణి ఇంతటితో ఆగేటట్లు లేదు. అడ్డుకోకపోతే అతనికి బీపీ పెరగడం, అతను వాడే పదజాలానికి తనకి బీపీ పెరగడం.. ఇద్దరి గోలకి పక్క ఫ్లాట్ల వాళ్లకి బీపీ పెరగడం ఖాయం. ఇవన్నీ తప్పించుకోవాలనుకుంటే అతని దృష్టి మరల్చాలి. అందుకే, చాలా శాంతంగా
‘ఏమిటీ ఇవాళ ఇక్కడే ఉన్నారు. మీ సీనియర్ సిటిజన్ల గెట్ టు గెదర్‌కి వెళ్లరా ఏమిటీ? నిన్న గుర్వీందర్‌సింగ్ ఇడ్లీ సాంబారు తెమ్మన్నాడు కదా. అదుగో ఆ హాట్‌పేక్‌లో చెరో రెండేసి చొప్పున మొత్తం నలభై పెట్టాను. ఇదిగో సాంబారు ఇందులో ఉంది. తొందరగా వెళ్లండి. లేకపోతే ఎదురింటి మిస్టర్ బజాజ్ తలుపు కొట్టేస్తాడు.’
‘నలభయ్యేనా? ఎవరి ముక్కులో పెట్టమన్నావ్? మూత తీసి ముందు పెడితే గురువిందగాడు అన్నీ లాగించేస్తాడు.’
ప్రతి వాళ్ల పేర్లని తనకు నచ్చినట్లుగా మార్చి భార్య ముందు వాడడం భగవతిరావుకి ఎప్పటి నుండో వున్న అలవాటు.
‘మిగతా వాళ్లు కూడా ఏవేవో తెస్తారు కదండీ. మీరు మాత్రం బజాజి పంపే ఛీలా, మిశ్రీ పంపే కచోడీలు తింటారు కదా?!’ సృజన గొంతులో కాస్త నిష్ఠూరం తొంగి చూసింది.
మిస్సెస్ అని అనకుండా ఇంటి పేరులోని ఆఖరు అక్షరానికి యికారం తగిలించి బజాజ్‌గారి భార్యని బజాజి అని మిశ్ర గారి భార్యని మిశ్రీ అని అనడం సృజనకి అలవాటు.
ఉద్యోగంలో వున్నంతకాలం ఏ కాలమైనా సూటూ బూటులో తిరగడం ఉద్యోగ విరమణానంతరం ఏ కాలమైనా టీ షర్టు, హాఫ్ పేంటుతో తిరగడం ఇవాళ్టి ఫ్యాషన్‌గా మారింది. భగవతిరావు కూడా ఈ ఫ్యాషన్‌కి అతీతుడు కాడు.
భర్తను బయటకి పంపి ఆలోచనల్లోకి జారిపోయింది.
ప్రయోజకుడై డాలర్లలో డబ్బులు లెక్కపెట్టే కొడుక్కి తగిన పిల్ల కోసం జరిపిన వేటలో బాగా నచ్చిన నాలుగు ఫొటోలతో సహా బయోడేటాలు పంపితే ఐదు నిమిషాల్లో ‘నచ్చలేదు’ అనే సమాధానం.
నచ్చకపోడానకి కారణం అడిగితే సమాధానం లేదు.
‘నీకు నచ్చిన పిల్లని నువ్వే చూసుకో’ అంటే ‘నాకు నచ్చే పిల్లని వెతకడం నీ బాధ్యత’ ఇదీ సమాధానం.
రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారాయి. కొడుకు సమాధానం మారలేదు.
కొడుకు కోరికలలో మార్పొచ్చింది. దాని ప్రకారం పిల్లని వెతకడం సృజన బాధ్యతగా మారింది. అమెరికాలో ఉద్యోగంలో వున్న అమ్మాయే కావాలి అనేది కొత్తగా కొడుకు లిస్టులో చేరిన కోరిక. ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి.
కొడుకు ఈ కొత్త కోరిక సృజనలో కొత్త ఆశలు నింపింది. అమ్మాయి అక్కడే ఉంటుంది కాబట్టి పిల్లని నేరుగా చూస్తేనన్నా కొడుకు మారతాడనే ఆశ.
అదీ అడియాస కావడానికి ఎంతోకాలం పట్టలేదు.
ఇక్కడో చిన్న సవరణ ఏమిటంటే - పిల్లా పిల్లాడు కూడా ‘మా ఇద్దరికీ కంపేటబిలిటీ లేదు. సో సారీ’ అనడం.
ఏ విషయంలో అన్న దానికి ‘అన్నింటిలో’ అనే సమాధానం.
ఇంకా గుచ్చిగుచ్చి అడిగితే ‘నేను తూర్పు అయితే ఆమె పడమర’
‘దిస్ మేచ్ హేజ్ నో ఫ్యూచర్’ అనే సమాధానం రాత్రంతా నిద్దరకి దూరం చేసింది.
మూడు నెలల్లో ముప్పైకి చేరుకోనున్న కొడుకుని ఎలాగైనా వొప్పించి ఈ ఏడాది ఓ ఇంటివాడిని చెయ్యాలనేది సృజన ఆలోచన. లేకపోతే ముదురు బ్రహ్మచారుల లిస్టులో పడేస్తారు.
నయానా భయానా చెప్పే కాలం కాదు కాబట్టి ఎమోషనల్ డ్రామా ఆడి, కొడుకు వేసిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలని, వాటికి అమ్మాయిలు ఇచ్చిన సమాధానాలని, సమాధానం వినగానే కొడుకులో కలిగిన రియాక్షన్‌ని, అమ్మాయి కొడుకుని వేసిన ప్రశ్నలను వాటికి అతను ఇచ్చిన సమాధానాలను కూడా తన మెయిల్‌కి పంపేటట్టు చెయ్యగలిగింది.
కొడుకు పంపిన మెయిల్ చదవగానే - అందులో ‘కంపేటబిలిటీ లేదు, ఇట్ వోంట్ వర్క్, షి ఈజ్ నాట్ మేడ్ ఫర్ మి’ లాంటి మాటలు వాడేంత మేటరు లేదని అనిపించింది.
కొడుకు పంపిన మెయిల్ కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి నాలుగుమార్లు చదివాక ఈ కాలం పిల్లల ప్రాబ్లం ఏమిటో అర్థమైంది.
గబగబా తనకు కోడలు కాగలిగే అర్హతలున్న మరో బయోడేటాని పరిశీలించింది. అమ్మాయి నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అమ్మాయి తల్లిదండ్రులు.. దేవుడి దయవల్ల ఈ ఊరే. సరే వెళ్లి ముఖాముఖి కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది.
ముందు అనుకున్నట్లుగానే మరునాడు పదకొండు గంటలకి అమ్మాయి తల్లిదండ్రులను కలవడానికి వెళ్లింది.
పిల్ల తల్లి వినయ చక్కగా నవ్వుతూ రిసీవ్ చేసుకోవడంతో తననుకున్నది అమలు జరుగుతుందని ఆశ కలిగింది.
ఆ మాటా ఈ మాటా అయ్యాక మెల్లగా అసలు విషయం కదిపింది.
ప్రశ్న వినగానే వినయలో కాస్త టెన్షన్ కనిపించింది.
తను ఎదుర్కొంటున్న సమస్యే వినయ కూడా ఎదుర్కొంటున్నట్లుగా అనిపించింది.
ముసుగులో గుద్దులాటకన్నా నేరుగా విషయం మాట్లాడుకుంటే పరిష్కారం వెతుక్కోటం సులువు అనే సూక్ష్మం ఎరిగినది కావటంతో కొడుకు పంపిన మెయిల్ వినయ చేతిలో పెట్టి, ‘వినయా! మీరు కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నారని అర్థవౌతోంది. మీ అమ్మాయిని కూడా ఇలాంటిదే పంపమనండి..’ సృజన మాట పూర్తి కాకుండానే లోనికి వెళ్లిన వినయ చేత్తో కాయితాలతో తిరిగి వచ్చింది.
‘ఇవి ఓసారి చదవండి.. ఇంతేసి చదువులు చదివిన వీళ్లు ఇంతకన్నా ఆలోచించలేరా? అని ఆవేదన కలుగుతోంది’ చేతిలోని కాయితాలు సృజన చేతిలో పెడుతూ అంది వినయ.
వినయ ఇచ్చిన కాయితాలను పరిశీలించిన సృజన చాలా మటుకు ప్రశ్నలు వాటి జవాబులు వాటి మీద వారి స్పందన ఒకేలా ఉండడంతో ఆలోచనలో పడింది.
పరిష్కారం కనిపిస్తోంది. దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం అంత సులువు కాదని కూడా తెలుస్తోంది.
ముందుగా వినయ అభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘ఏ సినిమా హీరో అంటే ఇష్టం’ అన్న ప్రశ్నకి మావాడి స్వగతం ‘ఇక జన్మంతా మహేష్‌బాబుగాడి సినిమాలే చూడాలా?’ అలాగే మీ అమ్మాయి స్వగతం ‘ఓహో - వీడిని పెళ్లాడితే నన్ను నాకిష్టమైన సినిమాలు చూడనివకర్రా నాగలక్ష్మి 7387766655్వడా?’ ఇంత చిన్న విషయంలోనే అభిప్రాయాలు కలవనప్పుడు జీవితాంతం ఎలా కలిసి ఉండగలం. తరువాత.. ఇక్కడ మీకు ఏ రకమైన వంటకాలు ఇష్టం? అనే ప్రశ్నకి మా వాడి సమాధానం ‘మా అమ్మ వండిన వంటలు’ అని. అలాగే మీ అమ్మాయి ప్రశ్నపత్రంలో కూడా ఈ ప్రశ్న ఉంది. చిన్న మార్పు ఏంటంటే ఆ అబ్బాయి ‘ఇంటి ఫుడ్’ అని చెప్పాడు. దానికి మీ అమ్మాయి స్వగతం ‘వీడిని చేసుకుంటే ఉద్యోగం మాన్పించి వంటింట్లో కూచోపెట్టేట్టు ఉన్నాడు.’ అలాగే మీ అమ్మాయిని మరో అబ్బాయి ప్రశ్న ‘ఎందులో జాబ్ చేస్తున్నారు? మీ శాలరీ విధానం ఎలా ఉంటుంది?’ దానికి మీ అమ్మాయి స్వగతం ‘అమ్మో ఇప్పుడే నా జీతం లెక్కలడుగుతున్నాడు. పెళ్లైతే ఖర్చు పెట్టే ప్రతీ పైసాకీ లెక్క అడుగుతాడు. మరి నా ఆర్థిక స్వాతంత్య్రం మాటేమిటి?’ వినయగారూ చూశారా? ‘మీ అమ్మాయి హాబీ ఏమిటి?’ అని వేసిన ప్రశ్నకి సమాధానంగా ఓ అబ్బాయి ‘బాక్సింగ్’ అంటే మీ అమ్మాయి స్వగతం ‘అమ్మో కోపం వస్తే బాక్సింగ్ డమీని కొట్టినట్లు నన్ను కూడా కొడతాడేమో’- ఇవన్నీ చదువుతూ ఉంటే పిల్లల ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తోంది.
‘నాకు శోభన్‌బాబు అంటే ఇష్టం. మావారికి రాజేష్‌ఖన్నా అంటే ఇష్టం. నా కోసం మా వారు శోభన్‌బాబు సినిమాలు చూసేవారు. నేను భాష రాకపోయినా రాజేష్‌ఖన్నా సినిమాలు చూసేదాన్ని. సినిమాల వల్లే కదా నేను హిందీ నేర్చుకున్నది. మీరిద్దరూ కూడా అంతే అనుకుంటా? ఇకపోతే తిండి విషయం ‘బైట తిండి ఇష్టం’ అంటే అమ్మాయి వంటపొయ్యి దగ్గరకు వెళ్లదేమో అని అబ్బాయి, ఉద్యోగం మానిపించి వంటింట్లో కూర్చోబెడతాడేమో అని అమ్మాయిల భయం. ఈ భయాలకు అర్థం లేదని, ఇద్దరూ కలిసి జీవించాలంటే ఇద్దరి మధ్యా అవగాహన ఉండాలిగాని అపోహలు, అనుమానాలూ కాదు.
జీవితాన్ని పంచుకోబోయే వాళ్లు తమ బలహీనతలను, ఉద్యోగంలో వుండే ఒత్తిడులను, తమ కుటుంబ పరిస్థితులను కదా మాట్లాడుకోవాలి. మరి వీళ్లేంటి సినిమాలు, తిండి గురించి చర్చించుకుని అభిప్రాయాలు కలవలేదు అనడం ఎంతవరకు సబబు?
పెళ్లి అంటే సహజీవనమని - ఆధిపత్యం కాదనీ, సహజీవనంలో కొద్దో గొప్పో భేదాభిప్రాయాలు ఉంటాయనీ, సామరస్యంతో సర్దుకుపోతూ సంసారం సాగించాలనీ, పెళ్లంటే లాభం మాత్రమే వచ్చే వ్యాపారం కాదని, ప్రేమ అంటే ఇచ్చి పుచ్చుకునేదని, సర్దుబాటు బానిసత్వానికి ప్రతీక కాదని, గెలుపునకు చిహ్నమని ఏ చదువులూ నేర్పవు. మనమే వారికి అవగాహన కలిగించాలి. కాలేజీ చదువులు తప్ప జీవితాన్ని చదవని ఈ పిల్లలకు అమ్మలుగా ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. మన ఇంటి విషయాలనే ఉదాహరణలుగా ఇస్తూ వారిలో మార్పు తేగలగాలి.
అప్పుడు కూడా వారు ‘కంపేటబిలిటీ’ లేదని అంటే ఇద్దరికీ రాసి లేదనుకుందాం.
అర్థం చేసుకొనే వయసు వచ్చిననాటి నుండి హాస్టల్ బతుకులు పుస్తకాల చదువులు అయిపోవడంతో వీరికి జీవితం గురించి అవగాహన లేకుండా పోయినట్లుంది.
సో.. ఇప్పుడు మనం ఇద్దరం పిల్లలకి జీవితాన్ని పరిచయం చేద్దాం. నేను చెప్పింది మీకు సమ్మతమైతే ఇద్దరం ఓ ప్రణాళిక తయారుచేసి ముందడుగు వేద్దాం’ అంటూ తన చేతిని వినయ వైపు సాచింది.
గత కొంతకాలంగా ఇదే విషయం గురించి ఆలోచిస్తున్న వినయ నిస్సంకోచంగా తన చేతులను సృజన చేతిలో ఉంచింది.
సృజన వినయలు దీనికి ‘ఆపరేషన్ అమ్మ’ అని పేరు పెట్టుకున్నారు.
ఆరునెలల తరువాత తలంబ్రాలు పోసుకుంటున్న కొడుకు కోడలుని కళ్ల నిండుగా చూసుకుంటూ సృజన, కూతురుని అల్లుడిని చూసుకుంటూ వినయ ఇద్దరూ చేతులు కలుపుకొని ‘ఆపరేషన్ అమ్మ సక్సెస్’ అని ఒకరినొకరు అభినందించుకున్నారు.

(సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

కర్రా నాగలక్ష్మి 7387766655