కథ

తాంబూల సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఉయ్యాల బల్లపై కూర్చుని మరుసటి రోజు ఉదయమే వెళ్లిపోబోతున్న మనవరాలితో పరంధామయ్యగారు కబుర్లాడుతున్నారు. ఇంతలో భార్య అనసూయమ్మ తాంబూలం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ముభావంగా లోపలకి వెళ్లిపోయింది.
పరంధామయ్యకు 5 ఆకులు, వక్క, కొంచెం సున్నం, ఏలకులు, కొంచెం పంచదార వేసుకుని తాంబూలం సేవించటం అలవాటు. రోజూ భార్య ఇచ్చిన తాంమూలం తెరచి అన్నీ ఉన్నాయో లేవోనని చూసుకుని నోట్లో వేసుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే తెరచి చూస్తే పిన్నులతో డిజైను వేసినట్లు కనిపించింది. ఏమిటి ఇలా వున్నాయి? అని అనుకుంటూ పూర్తిగా తెరచి చూస్తే పిన్నుతో అందంగా చెక్కినట్లు, దీర్ఘంగా పరిశీలిస్తే ఇంగ్లీషు అక్షరాల్లా గోచరించాయి. జాగ్రత్తగా అన్నీ పక్కకి తప్పించి ఒక్కొక్క ఆకును పరిశీలిస్తే మొదటి దానిపై ‘గో’ అని ఉంది. ఒకదాని తరువాత ఒకటి ‘టు లైక్’ ‘డోన్ట్’ ‘ఐ’ అని వున్నాయి. సరిగ్గా క్రమంలో అమరిస్తే ‘ఐ డోన్ట్ లైక్ టు గో’ అని వచ్చింది. అమ్మ అనసూయా నీ భాషా పరిజ్ఞానం నా మీద ప్రయోగిస్తున్నావా, నీకు బోల్డు ఇంగ్లీషు వచ్చేసిందిలే నాకు తెలుసు అనుకుంటూ నవ్వుకుంటూ తాంబూలం వేసుకున్నారు.
మనవరాలు రేణుకతో మాట్లాడుతూనే మనసు మాత్రం అనసూయమ్మ మీదికి మళ్లింది. ఎందుకు రాసి ఉంటుంది? ఇచ్చేటప్పుడు కూడా ముభావం ఇచ్చి వెళ్లింది. నిజంగానే వీళ్లతో వెళ్లడం ఇష్టం లేదా? ఎందుకు బాధపడుతోంది? ప్రయాణం దగ్గరికి వచ్చింది కూడా. తన నిర్ణయాన్ని, ఆమె అంగీకారాన్ని ఎవరూ కాదనరు. మరి ఇష్టంతో కోడలితో వెళ్లటానికి ఒప్పుకున్న తరువాతే కదా ఏర్పాట్లు చేసింది. రేణుని లోపలికి పంపించి ఉయ్యాల బల్ల మీదే ఒరిగి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మూడు నెలలు నన్ను వదిలి ఉండలేక, నాకు భోజన సౌకర్యం ఉండదని వెళ్లనంటోందా? లేదా నా ఆరోగ్యం మీద బెంగా లేదా తనకే ఇంకేదైనా సమస్య ఉందా? ఏమిటి ఎలా తెలుస్తుంది? అని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు పరంధామయ్యగారు. ఇంత మంది ఇంట్లో వుండగా విడిగా పిలిచి మాట్లాడితే అంత త్వరగా చెప్పదు. పరంధామయ్యగారి బంధువులు, అక్కచెల్లెళ్లు, బావమరుదులు అంతా రావటం వలన కూడా అనసూయతో మాట్లాడటం వీలు చిక్కటంలేదు. బయటికి వెళ్లి ఫోనులో మాట్లాడదామంటే అది ల్యాండు ఫోను హాలులో వుంది, మాట్లాడటం కుదరదు. అసలు కారణం తెలిస్తే ఉపాయం లేదా పరిష్కారం ఆలోచించవచ్చు. అన్నీ ఏర్పాట్లు చేశాక తన మీదకి సమస్య వదిలేసిందంటే కచ్చితంగా తన మనసు బాధపడే సంఘటన జరిగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచనలతో మనసు కొట్టుమిట్టాడుతోంది ఆయనకు.
పరంధామయ్యకి ఒక కూతురు. ఒక కొడుకు. కూతురు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్, అల్లుడు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్నారు. పెళ్లైన పదేళ్లలో 2 లేదా 4సార్లు మాత్రమే వచ్చి ఉంటాడు. అల్లుడు మొహమాటస్తుడు. మంచివాడు కూడా. కొడుకు మురళీధర్ బొంబాయిలో మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. మంచి స్థాయిలో ఉన్నాడు. వారానికి 2,3 సార్లు ఫోన్‌లో యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు. ఆరు నెలలకో, ఏడాదికో వస్తూంటాడు. అరుదుగా కోడలు కూడా వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతికి కుటుంబంతో వచ్చాడు. అందరూ సరదాగా గడిపారు. స్నేహితులను, బంధువులను కూడా కలిసి వచ్చాడు. కనుమ, ముక్కనుమ పండుగలలో ఎక్కడికీ వెళ్లకూడదు కాబట్టి తీరిగ్గా తండ్రితో గడిపాడు. త్వరలో ఆఫీసు పని మీద లండన్‌కి వెళ్లవలసి ఉంటుంది. కోడలు కుసుమ ఒక్కతే పిల్లతో ఉంటందని తల్లిదండ్రులను బొంబాయి వచ్చి ఉండమన్నాడు. పొలాలు పాడవుతాయి రావటానికి కుదరదంటే అమ్మనైనా పంపండి అని జాలిగా మాట్లాడాడు. అమ్మతో మాట్లాడు. తరువాత ఆలోచిద్దామన్నారు పరంధామయ్యగారు. కొడుకు పదేపదే బతిమాలేసరికి అనసూయమ్మ కాదనలేకపోయారు. ఆ తరువాతే సరేనన్నారు పరంధామయ్యగారు. మరుసటిరోజు ప్రయాణానికి టిక్కెట్లు కొన్నాడు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
నిన్నటి రోజు మధ్యాహ్న సమయంలో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో మనుమరాలు చేతిలో టాబ్ లాంటిది ఏదో తెచ్చి ఆడుకుంటూ బామ్మా నీకు వీడియో గేమ్ ఆడటం వచ్చా? అని అడిగింది. రాదు అంది. నీకు సెల్‌ఫోన్ ఉందా? మనుమరాలి ప్రశ్న. నాకు సెల్‌ఫోన్ అసరం లేదు. ల్యాండ్ ఫోను ఉంది బామ్మ సమాధానం. బామ్మా నేను నీకు వీడియో గేమ్ నేర్పిస్తాను అంటూ కొన్ని ఆటలు నేర్పింది. ఆ సందర్భంలో ఒకటి నొక్కబోయి మరొకటి నొక్కడంతో ఒక సమాచారం బయటపడింది. అది తెలుగులో వుండటంతో మనవరాలికి చదవటం రాదు. ఆ సమాచారం కోడలు తల్లి నుండి కోడలికి వచ్చింది. అందులో నీ భర్త లండన్ వెడుతున్నాడు కదా అందుకోసం ఇంట్లో వంట పని వగైరా సాయం చేయటానికి మీ అత్తగారిని తెచ్చుకో. ఆవిడ బలంగానే ఉంది. నీవు నీ బ్యూటీషియన్ కోర్సుని పూర్తి చేయవచ్చు. సమయాన్ని వృథా చేయనక్కరలేదు. అంతేకాకుండా వీలు చూసుకుని ఆవిడని మంచి చేసుకుని ఆవిడ పేరున ఉన్న అయిదు ఎకరాలు నీ కూతురు పేరు మీద మార్పించే ప్రయత్నం చేయి.
తెలిసీ తెలియని మనసుతో మనవరాలు చేసిన పనివల్ల అసలు విషయం బయటపడింది. అంటే ఇంతకాలం కోడలువి నక్క వినయాలన్నమాట. వాళ్లకి సేవలు చేయించుకోవటానికి మాత్రమే తన అవసరం పడింది. మనిషి వ్యక్తిత్వం వారి సందేశాలను బట్టి అంచనా వేయవచ్చును. ఏమైతేనేం మనసు బాధపెట్టే నగ్న సత్యం, కోడలు ప్రదర్శించే హావభావాల పరంపర వెనుక ఆవిడ తల్లి దర్శకత్వ పటిమ కనిపిస్తోంది. కాని కొడుకు కూడా తన భార్య విషయం, ఆమె మనసులో భావం కనిపెట్టలేదా లేక వాడు కూడా ఆమెకే వత్తాసు పలుకుతున్నాడా అన్న విషయం తెలీక మనసు మధనపడసాగింది. అనసూయమ్మగారు కూడా అన్ని కోణాలలో ఆలోచించగలదు. పోనీలే తన బిడ్డే కదా అని సరిపెట్టుకుందామనుకుంటే, తను తెలుసుకున్న నిజాలు మనసుని ముల్లులా గుచ్చుకుంటున్నాయి. మనసు అల్లకల్లోలమై పోయింది.
అప్పటి నుండి ఈ విషయం తన భర్తకి ఎలా తెలియజేయాలాని ఆలోచించి, తన బుద్ధికి తోచిన విధంగా తెలియజేసింది తన అయిష్టతను. తన భర్త నిర్ణయం ఏ విధంగా ఉంటుందా అని ఆలోచించటం మొదలుపెట్టింది అనసూయమ్మ.
సాయంత్రం ల్యాండ్ ఫోను వచ్చింది. పరంధామయ్యగారు ఇంట్లో లేకపోవటం వలన కొడుకు ఫోను మాట్లాడాడు. ఊరిలోని సూర్యదేవాలయ కమిటీ వారి ఫోను. రాబోయే మాఘమాసంలో సూర్యరథాన్ని పరంధామయ్యగారి దంపతులచే మంగళాశాసనం ద్వారా లాగించాలని కళ్యాణ ఘట్టం కూడా పరంధామయ్యగారి దంపతులచే చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించినట్లు కూడా తెలియజేశారు ఆలయ కమిటీవారు. కొడుకే ఫోనులో మాట్లాడటం వల్ల తనే తల్లికి చెప్పాడు. ఆ శుభ కార్యక్రమానికి స్వల్ప వ్యవధే ఉండటం వల్ల తను ప్రయాణానికి వెళ్లనక్కరలేదని సంతోషించింది అనసూయమ్మ. అనుకోకుండా వచ్చిన పుణ్య కార్యక్రమానికి తల్లిదండ్రులను దూరం చేయటం మంచిది కాదని తల్లిని తమతో తీసుకెళ్లే కార్యక్రమాన్ని విరమించుకున్నాడు కొడుకు.
పరంధామయ్యగారు కొంతసేపటికి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అనసూయమ్మ సంతోషంతో చెప్పడం చూసి పరంధామయ్యగారు చిరునవ్వు నవ్వారు. ఏమయితేనేం నీవు కోరుకున్నది జరిగింది కదా బాధపడకు అన్నారు. కనీసం తన సమస్యను ఏమిటి అని కూడా అడగకుండా ఎవరినీ నొప్పించకుండా పనులు చక్కబెట్టే భర్త దొరకటం తన అదృష్టం అనుకుని మురిసిపోయింది. మనసులోనే పదేపదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భర్త తెలివితేటలకు మురిసిపోతూ సంతోషంగా తన పనిలో నిమగ్నమై పోయింది అనసూయమ్మ.

*

-డా.దేవులపల్లి పద్మజ.. 9849692414