కథ

దాగుడుమూతలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికి నేను నా ఉద్యోగరీత్యా హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా గూడూరుకు బదిలీ అయి ఒక ఏడాది అయ్యింది. గూడూరు నుంచి తిరుపతికి ట్రైన్‌లో రెండున్నర గంటల ప్రయాణం.
మా ఆవిడ ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న తిరుపతి వెంకన్న దర్శన భాగ్యం తనకు కలిగించి, మొక్కుబడులను ఈనాటికి తీర్పిస్తున్నాను అనుకుంటూ ‘పదండి పదండి ట్రైన్‌కు టైమవుతోంది’’ అంటూ ఆనందం, కంగారు, తొట్రుపాటు, హడావిడి అన్నీ కలిసి నన్ను ముందుకునెడుతుంటే నా భార్యను, పిల్లల్ని, మా నాన్నను నేను తొందర పెట్టసాగాను.
‘ఊఁ కదలండి తొందరగా.. వాకిట్లో ఆటో వచ్చి నిల్చుంది. పదరా బాబ్జీ ముందు నువు పద. ఆటో ఎక్కువ, నీవసలే నచ్చు వెధవ్వి’ అన్నాను మా ఆరేళ్ల పుత్రరత్నంతో.
‘పదవోయ్ నీవు కూడా చిట్టిని తీసుకొని’ అన్నాను నా భార్యామణి భారతితో. చిట్టి నా కూతురు. మూడేళ్ల పిల్ల. ‘నాన్నా! నీవు ముందు ఆటో ఎక్కు. నేను ఇల్లు తాళం వేసి వస్తాను’ అన్నాను మా నాన్నతో.
నేను ఇల్లు తాళం వేసే లోపల మా నాన్న, భారతి, బాబ్జీ, చిట్టి ఆటో ఎక్కేశారు. ఒక హోల్డాలు, రెండు సూట్‌కేసులు, రెండు వాటర్ బాటిల్స్, మా ఆవిడది, నాది కలిపి రెండు హ్యాండ్‌బాగ్‌లతో మొత్తం మీద ముగ్గురు పెద్దవాళ్లము, ఇద్దరు పిల్లలు, గాడిద బరువంత లగేజీ - అంతా కలిసి ఆటోలో కుక్కుకున్నాం కానె్వంటు పిల్లల స్కూల్‌బ్యాగ్‌లో పుస్తకాలలాగా. ఆటోలో ఒక సైడుకు కూర్చున్న నా మీద కొద్దిగా ఎండ పడుతోంది. అది మార్చి నెల మొదటి వారమేమో ఎండ చురుక్కు చురుక్కుమంటోంది. వెంటనే భారతం భీష్మపర్వంలోని ‘కృంతంతి మమ గాత్రాణి/ మాఘ మాసే గవా ఇవా - మాఘ మాసపు సూర్యకిరణాలలాగ అరివీరుని బాణాలు నా దేహాన్ని బాధిస్తున్నాయి’ అన్న శ్లోక పంక్తులు రెండు గుర్తు వచ్చాయి. అబ్బో నాకూ సంస్కృత సాహిత్యపు వాసన కొంచెం ఉన్నదే అనుకుంటూ నా మనసు తనకు తానే చక్కిలిగిలి పెట్టుకుంది.
ఆటో ఒక్క రెండడుగులు ముందుకు సాగిందో లేదో మా చిట్టి ‘నాన్నా! నేను లెత్లిన్‌కు పోవాలి. ఆతో ఆపన్ని’ అటూ ముద్దు మాటల్తో అన్నది.
‘హుఁ చచ్చాంరా దేవుడా! ఈపాడు పిల్ల ఎప్పుడూ ఇంతే. మొన్న సినిమాకు తీసుకువెళ్తే సరిగ్గా క్లైమాక్స్ సమయంలోనూ ఇలాగే దుంపతెంచింది. ఛీ పాడుసంతానం! ఆనంద వృష్టి కోసం పెళ్లి చేసుకుంటే అవస్థల సృష్టికి పిల్లలు పుడతారని ఒక సామెత ఎప్పుడూ చెప్తుండేవాడు మా తాతయ్య.
‘ఇదిగో ఆటో అబ్బాయ్! కాస్త ఆగు నాయనా! పదమ్మ చిట్టెమ్మ మహాతల్లీ! ఆటో దిగు. నీపని అయినాకే మిగిలినవన్నీ’ అంటూ చిరాకుగా అన్నాను మా చిట్టితో.
‘ఏమిటండీ అలా విసుక్కుంటారు అభం శుభం తెలియని ఆడనలుసు మీద? ప్రశాంత శర్మ అని పేరు. అడుగడుగునా అనవసరపు చికాకు, అర్థం లేని విసుగుదల’ అంటూ మా శ్రీమతి సుతారంగా నా మీద వక్రోక్తులు.
‘అవునే్ల నీవు చాలా శాంతమూర్తివి. మనమూ మనమూ మన వ్యక్తిత్వాల సమీక్ష తర్వాత చేసుకుందాం గానీ ముందు చిట్టిని వెనక్కి తీసుకెళ్లి తాలం తీసి దాని సంగతేదో చూడు. తొందరగా వచ్చేసేయ్. మళ్లీ అవతల ట్రెయిన్ అందదు’ అన్నాను విసుగ్గాను, హడావిడి పెడుతూను.
‘హడావిడి మనిషితో ఆలయానికి పోతే శిఖరం చూపించి శివుడిని చూశాం, ధ్వజస్తంభం దగ్గరి దీపంలో హారతి చూడు అన్నాట్ట అన్నట్టుంది ఈయన వరస’ అని గొణుక్కుంటూ మా చిట్టిని తీసుకొని ఇంట్లోకి వెళ్లింది భారతి. ఆ వెళ్తున్న భారతి ముఖంలో చిట్లింపు చూశాను.
‘మొన్న రాత్రి నన్ను కౌగిలించుకుంటూ ‘మీరెంత మంచివారండీ! ఎన్నాళ్ల నుంచో నేను మిమ్మల్ని అడుగుతూ వచ్చిన తిరుపతి యాత్ర గురించి నిన్నటి వరకూ గూడా ఏవో మాటల్తో దాటవేస్తూ వచ్చిన మీరు ఒక గ్రేట్ సర్‌ప్రైజ్‌లాగా ఉన్నపళాన ఇలా తిరుపతి ప్రయాణం పెట్టటమేమిటి? ఏమిటి ఈ ఆకస్మిక పౌర్ణమి! అంతులేనంత సంతోషంగా ఉంది’ అంటూ నా పెదవుల మీద తన పెదవులు నొక్కి పెట్టిన నా భారతేనా ఇప్పుడిలా ముఖం చిట్లించుకుంటోంది! అసలు ఈ భారతి ఎప్పుడూ ఇంతే. అతివృష్టి - అనావృష్టి. అంతలోనే అభినందన - అంతలోనే అభిశంసన-
‘అందుకే అన్నాడు అల్లసాని పెద్దన తన ‘మనుచరిత్ర’లో ‘క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్’ అని అనుకున్నాను.
ఇంతలో భారతి, చిట్టి తిరిగి వచ్చి ఆటో ఎక్కారు. ‘తలుపు సరిగ్గా వేశావా? తాళం ఒకటికి రెండుసార్లు లాగి చూశావా? నీవసలే మతిమరుపు మనిషివి’ అన్నాను భారతితో. భార్యని గిల్లి ఏడిపించే కొందరు భర్తల అవలక్షణం కొంచెం నాలో గూడా నాకు తెలియకుండానే ఉండి ఉండాలి.
‘అబ్బో మీరు చాలా చురుకైనవారు! అందుకే మన పెళ్లిలో మిమ్మల్ని పెళ్లి కూతురు పేరు చెప్పమంటే భారతి అని గుర్తురాక అదేదో రతి అన్నారు అప్పటి మాసపత్రికల పేర్లను తలచుకుంటూ. అబ్బో వరుడు రసికుడే అనుకుంటూ అందరూ మీ గురించి వేళాకోళంగా మాట్లాడుకున్నారు. పోనీ అప్పుడైనా కనీసం నాలిక కరుచుకొని భారతి అన్నారా?’ అన్నది భారతి ఫ్లాష్‌బ్యాక్ అనుభూతితో.
‘ఊఁ? ఏమన్నానేమిటి?’ నా ప్రశ్న.
‘ఏమన్నారా? గుర్తుతెచ్చుకోండి మతిమరపు మహారాజా! భాగ్మతి అన్నారు హైద్రాబాద్‌లో పుట్టి పెరిగిన అభినవ కులీకుతుబ్‌షా గారూ!’ అన్నది భారతి పకపకా నవ్వుతూ.
‘సర్లే. అవన్నీ ఇప్పుడెందుకు? గతజల సేతుబంధనం’ అన్నాను. ‘అబ్బో నాకు సాహిత్యపు కొటేషనే్ల కాదు. చిన్నచిన్న సమాసాలు, పదబంధాలు కూడా దొర్లుకుంటూ వచ్చేస్తున్నాయే అప్రయత్నంగా! నాలో గూడా ఒక చిన్న భారవో, భవభూతో ఉన్నాడన్నమాట’ - నాకు నేనే యోగ్యతా పత్రం ఇచ్చుకొని మనసులో

మెలికలు తిరిగిపోయాను.
మా ఇద్దరి సంభాషణలు మా నాన్నకు పట్టనేలేదు. ఆయన ఎప్పుడూ మానసిక పూజలో ఉంటారు. చుట్టుపక్కల వాళ్లు మాట్లాడుకునే మాటలు ఆయన చెవికే ఎక్కవు. ఇక ఆటోవాడు తన ధోరణిలో తాను ఏదో కూనిరాగాలు తీసుకుంటూ తన డ్రైవింగ్ పని మీద ఏకాగ్రతతో ఆటో నడుపుకుంటూ పోతున్నాడు.
ఇంతలో రైల్వేస్టేషన్‌కు ఆటో చేరుకుంది.
గబగబా లగేజీతో సహా మేము ఆటో దిగి టికెట్ల కౌంటర్ దగ్గరకు చేరాం. అప్పటికే క్యూ చాలా పెరిగిపోయి ఉంది. మనసులో ఒకటే టెన్షన్. అసలు టికెట్ తీసుకోగలమా? రైలు అందుతుందా? అందకపోతే ఏం చేయాలి? మళ్లీ ఎండలో పడి ఆపసోపాలు పడుతూ ఇంత లగేజీతో ఇంటికి వెళ్లాలా? ‘ఎలారా భగవంతుడా? వెంకన్న తండ్రీ! నీదే బాధ్యత. మేము తిరుపతి చేరి నీ దర్శనం చేసుకోలేకపోతే ఆ పాపం నీదే’ అనుకున్నాను మనసులో.
‘అదేమిటి? నేనుగా మిమ్మల్ని రమ్మన్నానా? లౌకికమైన, సాంసారికమైన మీ సమస్యలకు, వైఫల్యాలకు నేను బాధ్యుడినా? ఇదేం న్యాయం?’ అని నా అంతరంగపు అడుగు పొరల్లోంచి ఆ పరమాత్ముడు నన్ను నిగ్గదీశాడు.
‘సరెలే. ఇప్పుడు ఈ చిరాకు పరిస్థితిలో నీతో నాకు వాదన ఎందుకులే!’ అన్నాను పరమాత్ముడితో. పరమాత్ముడు నవ్వుకున్నట్లనిపించింది నా మాటలకు.
సరే ఎలాగోలా టిక్కెట్లు తీసుకొని రైలెక్కాం. రైలు చాలా క్రిక్కిరిసి ఉంది. కాలుతీసి కాలుపెట్టే చోటు లేదు.
‘ఒక కాలుగానీ.. దాని తాలూకు బొటనవేలు గానీ నేల మీద నిలిపి, రెండో కాలును ఇతర ప్రయాణీకుల కాళ్లకు చెట్లకల్లుకున్న ‘దొండ తీగ’లాగానో, ‘దోసపాదు’లాగానో మెలిక వేసి నిలదొక్కుకోవాల్సిందే. ఎవరో ఒకరు దిగాల్సి వస్తే తప్ప ‘తాళ్ల’లా పేనుకుపోయిన మన, అవతల వాళ్ల కాళ్లు విడివడవు.
‘మధ్యమధ్య పర్సు చూసుకోవడానికో... వీపు గోక్కోడానికో చెయ్యిని పక్కవాడి డొక్కలో పొడిచి, కిందికి తెచ్చి, మళ్లీ పైకి తీసుకెళ్లేటప్పటికి నటరాజుకు కూడా తెలియని నాట్యభంగిమలు అప్పనంగా అబ్బుతాయి మనకు. ఇంత కష్టపడ్డా ఆ రష్‌లో మన జేబులోనే మనం చెయ్యి పెట్టామనీ, మన వీపే మనం గోక్కున్నామనీ ఖాయంగా చెప్పలేం. పొరపాటున మరొకటి జేబులో చెయ్యి పెట్టిన సంగతి మటుకు మనని దొంగగా భావించి పక్కవాడు మన పళ్లూడగొట్టడంతో భళ్లున తెలిసి రావచ్చేమోగాని.. అవతలి వాడి వీపు గోకిన సంగతి మాత్రం మనకి ససేమిరా తెలియదు. గోకించుకున్నవాడు చెప్పడు కదా! చెప్పి, వాడి ఆనందంలో వాడే నిప్పులు పోసుకుంటాడా’ అంటూ ప్రఖ్యాత హాస్యరచయిత దర్భా బాబూరావు రాసిన ‘కదిలే రైల్లో కథాకళి’ అన్న హాస్యకథలోని కొన్ని పంక్తులు గుర్తొచ్చాయి.
ఈసారి నిజంగా నాకు నాకే ఆశ్చర్యం వేసింది. మెదడుకు దగ్గరగా ఉండే నెమరు కణతలను గిల్లుకొని చూసుకున్నాను. ‘ఏమిటి ఇవాళ ఇలా వరుసపెట్టి కవులు, రచయితల కొటేషన్లు క్యూ కట్టి మరీ గుర్తుకొస్తున్నాయి! అసలు నేను నేనేనా? ఏ ఆరుద్ర ప్రేతాత్మో నన్ను ఆవేశించిందా?’ అనుకున్నాను.
ఎలాగోలా చచ్చీచెడి, నలిగి నలిగి నానా అవస్థలు పడి తిరుపతి, ఆపైన తిరుమల చేరుకున్నాం.
* * *
మర్నాడు క్యూ కాంప్లెక్స్‌లో మా వంతు దర్శనభాగ్యం కోసం వేచి కూర్చొని అప్పటికి కొన్ని గంటల సమయం గడిచింది. పిల్లలు ఆకలితో నకనక లాడిపోతున్నారు. వృద్ధాప్య కారణపు నిస్సత్తువ చేత మా నాన్న చాలా నీరసపడిపోతున్నారు. అక్కడికీ క్యూ కాంప్లెక్స్‌కు దగ్గరకు వచ్చే తినుబండారాలు, పానీయాల వెండర్ బాయ్స్ ద్వారా బిస్కెట్లు, అరటిపండ్లు, బిస్లరీ వాటరూ తెప్పించి ఇచ్చాను వాళ్లందరికీ. అయినా ఆరోగ్యం దృష్ట్యా ఆ అల్పాహారాలు కొంచెం స్వల్పంగానే తీసుకోవడం వల్ల కాబోలు అందరికీ నిస్త్రాణ, అలసత్వం వచ్చేస్తున్నాయి.
నాలో అసహనం ఎక్కువైంది.
‘ఏమిటి స్వామీ వెంకన్న దేవరా? ఎందుకు మాకీ కష్టం? నీలో నిజంగా సత్యము, భక్త వాత్సల్యము ఉంటే ఏదో మాయ చేసో మాహాత్మ్యం చూపో మాకు నీ దర్శనం వెంటనే కలుగజేసి మమ్మల్ని సంతృప్తి పరచరాదా?’ అడిగాను ఆపద మొక్కులవాడు అనబడేవాడిని.
‘అదిగో మళ్లీ మొదలెట్టావా వాదన! నీ వొక్కడివేనా భక్తుడివి? నీవొక్కడివే కష్టపడుతున్నావా? ఈ కాంప్లెక్స్‌లో ఉన్న వాళ్లందరూ నీలాంటి వాళ్లే కదా! ఇందులో నేను ఎవర్ని ముందుకు తీసుకెళ్లాలి? నేను ఎవరి పక్షపాతిని కావాలి నీవే చెప్పు’ అన్నాడు నా అంతరాంతరాల లోతుల నుంచి ఆ అలమేలు మంగపతి.
‘నా హృదయ స్వచ్ఛతను గమనించలేవా?’ అడిగాను దేవుడిని.
‘హుఁ! హృదయ స్వచ్ఛత! దానిని గమనింపగలనో లేదో నీవే తర్కించుకో’ అన్నాడు వెంకన్న.
‘తర్కానికి ఇదా సమయం?’ అన్నాను.
‘కాదు, ఇది నీ సహనానికి సమయోచిత పరీక్ష’ అన్నాడు దేవుడు.
నాకు కొంచెం చిరాకేసింది. దేవుడి మీద కొంచెం కోపం కూడా వచ్చింది. అప్పటికి మా నాన్న ఇంకా నీరసపడిపోయి ఉన్నారు. దైవంలాంటి మా నాన్నను వెంటనే కాటేజీకి తీసుకెళ్లి పడుకోబెట్టాలనిపించింది - దైవదర్శనం చేసుకోకుండా అర్థాంతరంగా క్యూలో నుంచి మా నాన్న, నేను బయటకు వెళ్లటం అపచారమేమో అనిపించి కూడా.
‘నేనిక ఈ క్యూలో వెయిట్చేయలేను. పెద్దాయన మా నాన్నను తీసుకొని నేను కాటేజీకి వెళ్లిపోతున్నాను. నీవు, పిల్లలు కూడా నాతో వచ్చేయండి. ఏమైనా సరే నీకు ఇవ్వాళే దర్శనం కావాలనుకుంటే నీవు, పిల్లలు దర్శనం చేసుకనే రండి ఇంకా కొన్ని గంటలు ఇక్కడే పడిగాపులు పడి’ అంటూ గబగబ మా నాన్నను తీసుకొని బయటకు వచ్చేశాను. ‘కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా మనకు కొద్ది సేపట్లో స్వామి దర్శనం అవుతుంది’ అంటున్న నా భార్య మాటలను ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా.
* * *
మా నాన్నని తీసుకొని నేను కాటేజీకి చేరిన ఒక అరగంటకు ఆరు తిరుపతి ప్రసాదపు లడ్డూలు, నాలుగు పులిహోర పొట్లాలు తీసుకుని భారతి కాలేజీకి వచ్చింది పిల్లల్ని వెంటబెట్టుకొని.
‘కాస్త ఓపిక పట్టలేకపోయారు. మీరు వెళ్లిన ఒక్క పది నిమిషాలలోనే క్యూ ముందుకు కదిలి నాకు, పిల్లలకు స్వామి దర్శనం అయింది. మీకు అన్నింటికీ తొందరే’ అన్నది భారతి నాలో ఏదో ఆత్మవిమర్శ రగిలించాలనే ఉద్దేశంతో.
నేను ఆ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
* * *
ఆ మర్నాడు పెట్టె-బేడా సద్దుకొని తిరుగు ప్రయాణానికి సన్నద్ధులమైనాం.
ఆ రోజు తిరుమల నుండి కొండ కిందకు - అంటే తిరుపతికి వెళ్లే బస్సులు నడిపే సిబ్బందికి తిరుమలలోని స్థానిక వర్తకులకు ఏదో గొడవ జరిగింది. ఆగ్రహోదగ్రులైన డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె చేశారు. బస్సులన్నీ బంద్.
నేనేమో మరుసటి రోజే నా ఉద్యోగ విధుల్లో చేరాలి. మా ఆఫీసులోని పరిస్థితులను బట్టి నాకు సెలవు పొడిగింపు మంజూరు అయ్యే అవకాశమే లేదు.
బస్సు రవాణా వ్యవస్థ - పరిస్థితి చూడబోతే ఇలా ఉన్నాయి. చాలా మంది జీపులు, కార్ల లాంటి ఏవో కొన్ని ప్రైవేటు వాహనాలు పట్టుకొని ఎలాగోలా వెళ్లిపోతున్నారు.
* * *
అదృష్టవశాత్తూ మాకు ఒక జీపు దొరికింది. ఎక్కి కూర్చున్నాం. ‘ఏం దేవుడివయ్యా వెంకటేశ్వర స్వామి! నీ కోసం వస్తే ఇలా చేస్తావా?’ అనుకున్నాను మనసులో.
జీపు కొండ దిగుతోంది. కొంత దూరం పోయాక ఒక ఏడెనిమిదేళ్ల పిల్లవాడు హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా పరిగెడుతూ జీపుకు అడ్డం వచ్చాడు. డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఒక అడుగు ముందుకు పోయి జీపు ఆగింది. ఆ పిల్లవాడిని పట్టుకొని కోప్పడదామని డ్రైవర్ జీపు దిగాడు. అప్పటికే ఆ పిల్లవాడు ఒక యాభై గజాలు దూరంగా వెళ్లిపోయి నిల్చున్నాడు.
‘పోనీలే అన్నా! పోనీ. ఇప్పుడా అబ్బాయిని పట్టుకొని ఏం జాడిస్తావులే’ అన్నది నా భార్య భారతి.
ఏమనుకున్నాడో ఏమో డ్రైవరు జీపు ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు సాగాడు. ఒక ఇరవై గజాలు జీపు ముందుకు పోయిందో లేదో జీపు ఎడమవైపు ముందు చక్రం ఊడిపోయి పక్కనున్న లోయలోకి దొర్లుకుంటూ పోయింది. జీపు ఒక్క ఉదుటున పక్కకు వాలి ఆ పక్కన ఉన్న ఒక బండరాయికి తట్టుకొని ఆగిపోయింది. ఆ రాయే లేకుంటే పక్కన ఉన్న అఘాతం లాంటి లోయలో జీపు పడిపోయి ఉండేది. మాకు వైకుంఠం కనిపించేది.
వెంటనే అంతకు ముందు మా జీపుకు అడ్డం వచ్చిన పిల్లవాడు గుర్తుకొచ్చాడు. అతని కోసం చూస్తే ఆ పిల్లవాడు ఎటో వెళ్లిపోయాడు అప్పటికే. ఎటువైపు చూసినా ఆ అబ్బాయి మాకు కనిపించలేదు. జీపును ఆపిన బండరాయి మీద పెయింట్ చేయబడి ఉన్న మూడు నామాలు మాత్రం మాకు కనిపించాయి.

శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
2-10-78, ఫేజ్-2, ఇ.సి.నగర్, హెచ్.సి.ఎల్. పోస్ట్
హైదరాబాద్-500 051.. 9849779290.. 040-27260022

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం