కథ

సర్వాంతర్యామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏమిటండీ! మన అబ్బాయి ఆనంద్ సంగతి నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నా మాటంటే వాడికి లక్ష్యం లేదు. మీరో మారు వాడితో గట్టిగా చెప్పండి. వాడు మనతో మాట్లాడి సుమారు నెల రోజులైంది. మనం ఫోన్ చేద్దామంటే వాడి నెంబర్ మనకు కనెక్టవటం లేదు. ఇక కోడలు కావేరీ సంగతి సరేసరి. మీకు తెలుసు కదా! ఏ విషయం చెప్పదు. మనం ఏదైనా అడిగితే పొడిపొడిగా అవును కాదు అని జవాబులు చెపుతుంది. ఇంతవరకూ ఏనాడూ నాతో మనసు విప్పి మాట్లాడలేదు’
అసలు తప్పంతా నాదే! మీ మాట కాదని ప్రతి విషయంలోనూ అబ్బాయిని వెనకేసుకొని వచ్చాను. ఒక్కగానొక్క కొడుకని గారాబం చేశాను. వాడి ఆనందానికి మనం ఎందుకు అడ్డు తగలాలని వాడిని సమర్థించినందుకు నాకు తగిన శాస్తే జరిగింది..’ అని సావిత్రమ్మ కంటతడి పెట్టుకుంది.
‘చూడు సావిత్రీ! ఇప్పుడు ఏమైందని అంతలా వర్రీ అవుతున్నావ్?’ అన్నారు గోవిందశర్మగారు.
‘ఇంకా ఏమవ్వాలండీ! మనకి మనవడు పుట్టి తొమ్మిది నెలలు కావస్తోందా! ఇంతవరకూ మనం వాడి ముఖం చూడలేదు. వాడికి ఇంకా నామకరణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించలేదు. కుర్రాడికి ఏడాది వయసు నిండకుండా పుట్టుజుత్తులు ఏడుకొండల వాడి సమక్షంలో తీయించాలి. అది మన ఆచారం. ఈ విషయాలన్నీ ఆనందుకి, కోడలికీ ఎన్నోమార్లు చెప్పాను. అయితే వారు నా మాటలేవీ పట్టించుకున్నట్లు లేదు. వారు ఎప్పుడు వస్తున్నదీ చెప్పలేదు. ఏడుకొండల వాడి మొక్కు తీర్చక ఏదైనా జరగరాని అనర్థం జరిగితే నాకేదో భయంగా ఉందండీ!’ అంది.
‘నేను ఈ రాత్రి వాళ్లతో మాట్లాడతాను. ఉద్యోగం వద్దు వెంటనే రాజీనామా ఇచ్చి బయల్దేరి రమ్మనమని చెబుతాను. అంతగా అవసరమైతే నేనే వెళ్లి దగ్గరుండి వాళ్లచేత రాజీనామా ఇప్పించి వాళ్లను నాతో తీసుకొని వస్తాను’ అని భార్యకు భరోసా ఇచ్చారు గోవిందశర్మగారు.
గోపాలపురం అగ్రహారంలో గోవిందశర్మ గారిది జమీందారీ కుటుంబం. నాలుగైదు తరాల వారు కూర్చొని తిన్నా తరగని సిరిసంపదలు ఉన్నాయి. వారికి గోపాలపురంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ పంటపొలాలు, పండ్ల తోటలు ఉన్నాయి. గోవిందశర్మ ఎం.ఏ. పట్టా పుచ్చుకున్నా ఉద్యోగం మాట తలపెట్టక గ్రామంలోనే ఉండి వాళ్ల ఆస్తి వ్యవహారాలు చూసుకుంటున్నారు. వారి ధర్మపత్ని సావిత్రమ్మ. ఆమె ఇంగ్లీషు చదువులు చదవకపోయినా ఇంటి వద్దే తెలుగు, సంస్కృత భాషలు నేర్చుకొని పంచకావ్యాలు, రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదివారు.
వారి ఏకైక కుమారుడు ఆనంద్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆనంద్ చదువు పూర్తవగానే అతనికి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. కొడుకు ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లడం గోవిందశర్మ గారికి ఇష్టంలేదు. ఒకరి కింద ఉద్యోగం చెయ్యడం ఎందుకు మనకు సిరిసంపదలకు లోటు లేదు మన వద్దే వందలాది మంది పని చేస్తున్నారు. నీ చదువుకు తగినట్లు మన గ్రామంలోనే ఏదైనా ప్రాజెక్ట్ పెట్టి నీవే పదిమందికి పని కల్పించు అని అడ్డు చెప్పారు.
అయితే సావిత్రమ్మ కొడుకుని సమర్థించి భర్తను ఒప్పించింది. ఆనంద్ ఉద్యోగంలో చేరాడు. ఢిల్లీలో తన ఆఫీసులో జాబ్ చేస్తున్న కావేరీని ఇష్టపడి ఆమెను వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు తెలిపాడు.
కులం, గోత్రం, జాతకాలు అన్నీ నప్పడంవల్ల కొడుకు మాట కాదనలేకపోయారు గోవిందశర్మ దంపతులు. ఆనంద్‌కు వివాహమైన నెలరోజులకే అతనికి అమెరికాలో మంచి జాబ్ వచ్చింది. అయితే కొడుకుని అమెరికా పంపడం గోవిందశర్మగారికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఆనంద్ తన తల్లిని కాకా పట్టి ఆమెను ముందుగా ఒప్పించాడు. సావిత్రమ్మ భర్తతో పోట్లాడి కొడుకు కోడలు అమెరికా వెళ్లడానికి ఒప్పించింది. అయితే సావిత్రమ్మ కొడుకు, కోడలి వద్ద నుండీ తాము రమ్మనగానే తిరిగి వచ్చేస్తామని హామీ తీసుకుంది. అమెరికాలో కావేరీకి భర్త చేస్తున్న ఆఫీసులోనే మంచి జాబ్ దొరికింది. భార్యాభర్తలిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తుండటం వల్ల వారికి ఎంతో సౌకర్యం ఉంది. వారిద్దరూ వారం వారం ఫోన్‌లో తమ క్షేమ సమాచారాలు తల్లిదండ్రులకు తెలియజేస్తూండేవారు.
కోడలు నెలతప్పిన వార్త విని సావిత్రమ్మ ఎంతో సంతోషించింది. కోడల్ని డెలివరీకి తీసుకొని వచ్చి ఘనంగా సీమంతం జరిపించాలనుకుంది. అయితే తాము ప్రస్తుతం రావడానికి వీలుపడదు అందుకే మా అమ్మానాన్నగారు మాకు తోడుగా ఉండడానికి అమెరికా వచ్చారు మీరేమీ దిగులు పడకండి. మాకు అతి దగ్గరలోనే మంచి నర్సింగ్‌హోం ఉంది. అందులోని లేడీ డాక్టర్ నన్ను మొదటి నుంచీ చూస్తోంది. డెలివరీ అయిన తరువాత అందరమూ అక్కడికి వచ్చేస్తాము అని చెప్పింది కావేరీ అత్తగారితో.
మనవడు పుట్టిన వార్త విని గోవిందశర్మ దంపతులు ఎంతో ఆనందించారు. సావిత్రమ్మకు మనవడిని చూడాలని ఎంతో ఆరాటంగా ఉంది. కొడుకుని కోడలిని మనవడిని తీసుకొని రమ్మనమని వారికి ఎన్నిమార్లు ఫోన్‌లో చెప్పినా వారు ఏదో సాకుతో వాయిదా వేస్తున్నారు. వీరి నస భరించలేక వారు ఈ మధ్య ఫోను కూడా చేయడం లేదు.
సావిత్రమ్మ కన్నవారింటి ఆంక్షల ప్రకారం విదేశీ గెడ్డ మీద కాలుమోపకూడదనే ప్రతిజ్ఞ ఉండటంవల్ల తాను అమెరికా వెళ్లలేకపోయింది కాని లేంటే ఈపాటికి మనవణ్ణి చూడ్డానికి అమెరికా వెళ్లేదే.
గోవిందశర్మగారు ఆ రోజు రాత్రి ఆనందుకు ఫోన్ చేద్దామనుకునేసరికి ఆనందే ఫోన్ చేశాడు.
‘గత నెల రోజుల నుండీ ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నందువల్ల తాము ఫోన్ చేయలేక పోయామని, అందుకు ఎంతగానో విచారిస్తున్నామని, అమ్మ తమకు పదేపదే గుర్తు చేస్తున్న విషయం నా కుమారుడి నామకరణం, పుట్టుజుత్తుల గురించి. నా చిన్నతనంలో అమ్మ నాకు ‘్భగవంతుడు సర్వాంతర్యామి ఇందుకలడు అందులేడు అను సందేహము వలదు’ అని అందుకు సంబంధించిన ఎన్నో పురాణ కథలు చెప్పింది. అవన్నీ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏడుకొండల వేంకటేశ్వరుని ప్రతిరూపం ప్రతిమను అమెరికాలో శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఆ ఏడుకొండలవాని సన్నిధిలోనే నా కుమారునికి మన కుటుంబ ఆచారం ప్రకారంగానే అమ్మ చెప్పిన విధంగానే పుట్టుజుత్తులు తీయించాము. అంతేకాదు నామకరణ మహోత్సవం ఘనంగా జరిపించి వానికి వాడి తాతగారి పేరు ‘గోవిందశర్మ’ అని పెట్టాము. ప్రస్తుతం మేం చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ పూర్తయితే కాని మేం రావడం కుదరదు. అది పూర్తవడానికి రెండు సంవత్సరాలు పట్టొచ్చు. ఈ విషయం అమ్మతో చెప్పండి’ అన్న ఆనంద్ మాటలకు మూర్ఛపోయారు గోవిందశర్మ దంపతులు.
*

రావి ఎన్ అవధాని
25/12/6/1, ఎల్‌కె గార్డెన్స్
సరస్వతీ నిలయం
దాసన్నపేట, విజయనగరం-535 002
9440 58 477

- రావి-ఎన్-అవధాని