తెలంగాణ

గుడుంబా రహిత జిల్లాగా కరీంనగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకటించిన కలెక్టర్ నీతూప్రసాద్ * మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల తరువాత మూడోది

కరీంనగర్, డిసెంబర్ 3: సంపూర్ణ గుడుంబా నియంత్రణ జిల్లాలుగా ప్రకటించుకున్న మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల సరసన కరీంనగర్ జిల్లా కూడా తాజాగా చేరింది. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన గుడుంబాను నియంత్రించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలిచింది. జిల్లాలో ముమ్మరంగా దాడులు నిర్వహించడం, పిడి యాక్టు కేసులు నమోదు చేయడం, విస్తృతంగా బైండోవర్లు చేయడం లాంటి చర్యలతో సంపూర్ణ గుడుంబా నియంత్రణ దిశగా జిల్లా అడుగులేసింది. జిల్లాలో 57 మండలాలుంటే, 55 మండలాలు సంపూర్ణ గుడుంబా నియంత్రణ మండలాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి కరీంనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సంపూర్ణ గుడుంబా నియంత్రణ జిల్లాగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 57 మండలాలుంటే, అందరి సహకారంతో 5 మండలాలు సంపూర్ణ గుడుంబా నియంత్రణ మండలాలుగా మారాయని, మిగిలిన రెండు మండలాలను కూడా ఇదే స్ఫూర్తితో సంపూర్ణ గుడుంబా నియంత్రణ మండలాలుగా చేస్తామని అన్నారు. గుడుంబాను నియంత్రించాలని ప్రభుత్వం పదేపదే చెప్పడం, గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టిన గుడుంబా నియంత్రణపై మాట్లాడామని తెలిపారు. నాలుగు మాసాలుగా పోలీస్, ఆబ్కారీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా రేయింబవళ్లు శ్రమిస్తూ ముందుకుసాగడం, అందులో ముఖ్యంగా ప్రజలు సహకరించడం వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. మళ్లీ గ్రామాల్లోకి గుడుంబా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగమారుతి శర్మ మాట్లాడుతూ ఒకరకమైన మద్యపానాన్ని తీసివేశామని, మద్యం ఏ రకంగా ఉన్నా దానికి దూరంగా ఉండాలని సూచించారు. తాగుడు తప్పు కాదని, కానీ దానికి బానిస కావద్దని అన్నారు.
జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ సంపూర్ణ గుడుంబా నియంత్రణ జిల్లాగా ప్రకటించడం ఆనందంగా ఉందని, దీని ఫలితం రాబోయే పదేళ్లల్లో కన్పిస్తుందని అన్నారు. తన మొదటి పోస్టింగ్ జనగామలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో గుడుంబా అంటే తెలియదని, క్షేత్రస్థాయిలో తండాల్లో పర్యటించి ప్రత్యక్షంగా చూసానని అన్నారు. మళ్లీ ఎవరైనా గుడుంబాను తయారుచేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
కరీంనగర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ గుడుంబా నియంత్రణకు చేపట్టిన చర్యలపై వివరించారు.
డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ శ్రీనివాసులు, కరీంనగర్ డిఎస్పీ రామారావుతోపాటు పలువురు పోలీసు, ఎక్సైజ్ అధికారులు, ప్రజలు, మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.