రివ్యూ

వైభోగంగా ముగిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** కళ్యాణ వైభోగమే (ఫర్వాలేదు)

తారాగణం:
నాగశౌర్య, మాళవికా నాయర్, ఆనంద్, రాశి, రాజ్‌మాదిరాజ్, ఐశ్వర్య, ప్రగతి, తా.రమేష్ తదితరులు.
సంగీతం: కళ్యాణ్ కోడూరి
సినిమాటోగ్రఫీ:
సచిన్ కృష్ణ
దర్శకత్వం:
బివి నందిని రెడ్డి
** కళ్యాణ వైభోగమే

ప్రేమంటే -బతుకంతా సాగే స్నేహం. నేటి యువత స్నేహానికి ఓటు వేస్తున్నారు కానీ ప్రేమ ద్వారా వచ్చే పెళ్లికి పెడముఖం పెడుతున్నారు. పెళ్లిచేసుకుని, పిల్లల్నికని, వాళ్లని పెంచి పెద్ద చేసి, పెళ్లిళ్లు చేసి, మళ్లీ వాళ్ల పిల్లల్ని పెంచి.. ఇంత జంఝాటం అవసరమా! ఇదంతా లేకుండా హాయిగా తూనిగల్లా ఎగురుతూ స్వేచ్ఛగా బతికేస్తే చాలదా అన్నట్టుగా వారి ఆలోచనలు సాగుతున్నాయి. జీవితమంటే రోజుకో థ్రిల్ ఉండాలి. గంటకో షాక్ వుండాలనే ఆలోచనలతో సాగేవారు -పెళ్లి అనేది జీవిత సాగరాన్ని దాటడానికి నావ లాంటిదన్న మాటల్ని పట్టించుకోవడం లేదు. అటువంటి ఓ జంటకి అందంగా బుద్ధిచెప్పిన చిత్రం కళ్యాణ వైభోగమే.
కథేంటి:
కంప్యూటర్ ప్రోగ్రామర్ శౌర్య (నాగశౌర్య) తల్లిదండ్రులకు గారాల పుత్రుడు. డాక్టర్‌గా ఎత్తులకెదిగి విదేశాలకు ఎగిరిపోవాలనే తపనతో ఉన్న దివ్య (మాళవికా నాయర్). ఆమె కూడా తల్లిదండ్రులకు గారాలపట్టి. వీళ్లిద్దరికీ పెళ్లి ప్రయత్నాలు జరుగుతుంటాయి. శౌర్య, దివ్యలకు పెళ్లంటే ఇష్టం లేకున్నా, పెద్దలమాట కాదనలేక సరే అంటారు. ఇద్దరికీ పెళ్లిచూపులు జరుగుతాయి. ఇద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో -పరస్పర సహకారంతో పెద్దల్ని మోసం చేసి తరువాత విడిపోదాం అన్న నిర్ణయానికి వస్తారు. పిల్లల సంప్రదాయరహిత ఆలోచనలు పసిగట్టలేని అమాయకపు తల్లిదండ్రులు వారిరువురికి పెళ్లి చేసేస్తారు. విడాకుల ప్రయత్నం చేసినా తప్పక ఒకేచోట ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే శౌర్య వైదేహి ప్రేమలో పడతాడు. తనతో ఉంటూ మరొకరిని ప్రేమిస్తున్న శౌర్య ప్రవర్తన దివ్యకు నచ్చదు. కారణం -శౌర్య అంటే ఎక్కడో ప్రేమ ఉందన్నమాటే! వైదేహితో ప్రేమలో మునిగి తేలుతున్నా శౌర్య పరిస్థితీ అంతే. ఒప్పందానికి విరుద్ధమైన పరిస్థితులు రావడంతో -ప్రేమను వ్యక్తం చేయనూలేరు. కలిసి ఉండనూ లేరు. ఇటువంటి జంటకు సినిమాటిక్ ముగింపు ఏమిటన్నదే మిగతా కథ.
ఎలా ఉంది?
పాత్రల మధ్య సంక్లిష్టతను చక్కగా పేర్చుకుంటూ వచ్చారు. ఆలోచనా దృక్పథాల నేపథ్యంలో జీవితాలు సాగాలన్న ఆలోచనకు సరైన దృక్కోణాలు చూపగలిగారు. పెళ్లి, తర్వాత వచ్చే సన్నివేశాలూ కొత్తగానే ఉన్నా, ప్రధాన పాత్రల మధ్య ప్రేమతో కూడిన అసూయ సన్నివేశాలు గతంలో వచ్చిన అంశాలే కావడంతో కొంచెం సాగదీత అనిపిస్తుంది. దివ్యలేకుండా తాను బతకలేనన్న నిజాన్ని గ్రహించిన శౌర్య, ఆమెకు విషయం చెప్పడానికి వచ్చే సమయంలో దివ్య తండ్రి అల్లుడిపై దాడిచేసే సన్నివేశం నుంచి సినిమా స్పీడందుకుంది. ఇన్ని పాత్రలున్నా ఒకరికొకరు ఏమీ సహకరించుకోలేనివే. చివరికి విడాకులు మంజూరయ్యాక దివ్య తండ్రి ఆమెకు మరో పెళ్లి చేస్తున్నాడని తెలిసి, శౌర్య తాను ఏం పోగొట్టుకున్నాడో అర్థంచేసుకునే సన్నివేశాల్లాంటివి కొన్ని బావున్నాయి. చివర్లో తాగుబోతు రమేష్ పాత్రతో ఆత్మహత్య సన్నివేశం బాగున్నా, కథానాయకుడే కిందకు పడటం అనేది సినిమాటిక్ ముగింపే. నాగశౌర్య మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మాళవికా నాయర్ తనదైన ముద్ర వేయగలిగింది. ఆనంద్, ఐశ్వర్య, రాశి పరిధిమేరకు నటించారు. పెళ్లి సంబంధాల కామెడీ కాస్త నవ్వించింది. ఆకట్టుకునే పాత్ర ఐపాడ్ అమ్మక్క (ప్రగతి)ది. తనలోని హాస్యకోణాన్ని మరోసారి ఆవిష్కరించింది ప్రగతి. -మగాడన్నాక అన్నీ భరించాలి.. పెళ్లాన్ని కూడా. స్వేచ్ఛ ఎక్కువై సంస్కారం తక్కువైన రోజులివి, పెళ్లంటే సంప్రదాయం ఆడంబరం కాదు, నాలుగు కాగితాలు, రెండు సంతకాలు ఇదేనా విడాకుల జీవితం, మాకోసం పెళ్లి చేసుకుని- మీకోసం విడిపోతారా?, ఏదైనా మానొచ్చుగానీ స్నేహం మానొద్దులాంటి సంభాషణలు ఆలోచింపచేస్తాయి. మనసంతా మేఘమై తేలిపోదా అన్న ఒక్కపాటే సంగీత పరంగా బావుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగిన విధంగావుంది. కళ్లకి ఇబ్బంది లేకుండా మంచి ఫ్రేములతో సాగిన కెమెరా పనితనం సినిమాకు హైలెట్. నిర్మాణ విలువలు కథనానికి తగినట్టు ఉన్నాయి. దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రంతో మరో మెట్టు ఎక్కినట్టే. ఎక్కడా తొట్రుపాటు లేకుండా సినిమాను ‘అలా’ తీసుకెళ్లింది.

-సరయు