కథ

సువర్ణ రేఖ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లారుతుండగానే వచ్చేసిన రాజీని చూసి కాస్త ఆశ్చర్యమే వేసింది. చీపురు తీసుకుని ‘ఈయేల ఇల్లు ఊడుస్తా. తుడ్వ’ అంది.
‘అంటే’ అన్నాను. ఈ ఊడవడం, తుడవడం అనే మాటలకున్న భేదం నాకు చాలా రోజులు అర్థమయ్యేది కాదు.
‘తడిగుడ్డేయనమ్మా - నేను జల్దీ పోవాల’ అంది రాజీ. ‘సర్లే’ అన్నాను. ఎందుకూ, ఏమిటీ అని నేడగలేదు.
పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ అంట్లు తోమేస్తోంది రాజీ. ఆ శబ్దాల మధ్యలో సన్నగా, పిట్ట కూసినట్టుగా ఏదో కూనిరాగం ఆమె కంఠంలోంచి బయటకొస్తోంది. అంటే రాజీ ఏదో హుషారులో వుందని అర్థం - నేను వేరే హడావిడిలో ఉండటంవల్ల బాతాఖానీ వేసి, విషయం రాబట్టే సమయం లేదు.
ఆరింటికే రేవతి ఫోను చేసింది. కాస్సేపు అవీ ఇవీ మాట్లాడి, సరిగ్గా పదకొండున్నరకల్లా తనిష్క దగ్గర వుండమని ఆర్డరు జారీ చేసింది. రేవతేదో పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేస్తోందని నాకర్థమైంది. ఆ విధంగా గంటలు గంటలు బంగారం కొట్లలో గడపడం నాకస్సలు యిష్టం ఉండదు. కానీ రేవతి ఒక్కతే నాకు మిగిలిన అత్యంత ప్రియ మిత్రురాలు. నిజానికి మేం నలుగురం ప్రాణ స్నేహితుల్లా తిరిగేవాళ్లం. ఒక్కొక్కళ్లు ఎవరి సంసారాల్లో, సంపాదనల్లో, సమస్యల్లో వారు కూరుకుపోయారు. అప్పుడప్పుడు హలో అంటే హలో అనడమే గానీ ఏం మిగల్లేదు. ఒకే ఊర్లో ఉండటం వల్ల, నేనూ, రేవతీ చిన్ననాటి మైత్రిని పొడిగిస్తూ వస్తున్నాం. తను నాకెంతో దగ్గరగా కష్టసుఖాలు చెప్తుంది. నాకెలాంటి అవసరం వచ్చినా రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతుంది. అందుకే దాని బంగారు నగల పిచ్చి భరిస్తూ, దానే్నమీ విమర్శించకుండా ఊరకుండి పోతాను.
శ్రీరాంకి వంట చేసి, క్యారేజి సర్ది ఇచ్చేశాను. అతనికి చెప్పాను రేవతి గురించి. ‘నువ్వూ ఒక వడ్డాణమో - కాసుల పేరో తగిలించుకురా’ అన్నాడు నవ్వుతూ.
‘అవేం వూరికే రావు. లక్షలు గుమ్మరిస్తే కానీ’
‘నువ్వు పెట్టుకుంటానని మాటివ్వు. నేను తల తాకట్టు పెట్టైనా నీకు చేయిస్తా’
‘నీ తల తాకట్టు పెట్టేందుకు ఇంకా చాలా విషయాలున్నాయి గానీ నడునడు’ అన్నాను.
కొంటెగా నవ్వుతూ- ‘అయినా నీ పేరులోనే బంగారముందిలే - ఇంక నగలెందుకు’ అని బండి ఎక్కి వెళ్లిపోయాడు.
అవును. నా పేరు సువర్ణ రేఖ. అయినా నేను సువర్ణ తీసేసి రేఖగానే ఉంటున్నా.
* * *
ఆ షాపులో అడుగుపెట్టగానే కళ్లు జిగేల్‌మన్నాయి - వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులు ఒకటేమిటి? అన్నీ కలిసిన బంగారం - ఎన్ని డిజైన్లో - ఎంత కళాత్మకమైన నగిషీలో - పైగా వున్నవి నాలుగింతలు చేసి చూపించే అద్దాలు చుట్టూ.
ఇంతకీ అసలు సంగతేమిటంటే వాళ్లాయన నాలుగున్నర లక్షలిచ్చి రేవతిని నీ యిష్టం అన్నాట్ట. అది పెట్టి వెంటనే బంగారం కొనాలని బయలుదేరిన ఆమెకి నేను తోడు.
‘మా ప్రజ్ఞకి పెళ్లినాటికి బంగారం బాగా కూడబెట్టి ఇవ్వాలి కదా! అందుకే ఇప్పట్నించీ వీలయినంత కొని పడేస్తున్నా’ అంది.
‘పెళ్లికి బంగారమెందుకు?’ అన్నాను చటుక్కున.
అది ఫక్కున నవ్వి ‘నువ్వు మరీనూ’ అంది.
చివరికి రెండున్నర లక్షలు పెట్టి వజ్రాలు పొదిగిన ఒక హారం ఎంపిక చేసింది. ‘బాగుంది కదూ సింపుల్‌గా’ అంది.
ఏదో రేవతి చెప్తోంది గానీ నా నించి సమాధానం ఆశించే స్థితిలో లేదు.
మరో రెండు లక్షలు విలువచేసే వడ్డాణం తీసుకుంది. దాని మధ్యగా ఎర్రటి పచ్చటి రాళ్లు, మధ్యమధ్య ముత్యాలతో లక్ష్మీదేవి కూర్చునుంది.
ఇద్దరం హోటల్లో భోజనం చేసి బయలుదేరాం ఇంటికి - నన్ను ఆమె ఇంట్లో దింపేసరికి నాలుగైంది.
బట్టలు మార్చుకుని, ముఖం కడుక్కుని కాస్త కాఫీ కలుపుకొని తాగి మంచం మీద వాలి పుస్తకం తీసుకున్నా. కాస్సేపటికే చేతిలోంచి పుస్తకం జారిపోయింది. నిద్ర ముంచుకొచ్చేసింది.
మళ్లీ ఎవరో తలుపు కొడ్తుంటే మెలకువ వచ్చింది. చూస్తే రాజీ. ‘ఎంత తలుపు కొట్టినా తీయరేంటమ్మా - కరెంటు పోయింది’ అంటూ వచ్చి సోఫా దగ్గర చతికిలబడింది.
నేను బద్ధకంగా ఆమె వైపు చూశాను. మధ్యాహ్నం వస్తూనే చీపురు పట్టుకుని హాలు తుడిచినట్టు కాస్సేపు అభినయం చేసి, గినె్నర దగ్గరికి పోతుంది. అలాంటిది నేల మీద కూర్చుందీ అంటే ఏదో సమస్య ఉందని సూచన. నేను కళ్లు మూసుకుని పడుకున్నా ‘అమ్మా’ అంది. చూశాను. ఆమె ముఖంలో ఒక ఆనందం, కాస్తంత గర్వం కలగలిసి చిత్రమైన వెలుగు ముఖమంతా పరచుకుంది. రాజీ జాకెట్టులో దాచిన చిన్న సంచీ తీసి అందులోంచి గులాబీ రంగు పేపర్లో మెరుస్తున్న బంగారు వస్తువుని తీసింది. అవి మిలమిల లాడుతున్న చెవుల బుట్టలు. మధ్యలో ఎర్రరాళ్లు, పైన తెల్ల రాళ్లు కళ్లు మిరిమిట్లు గొలుపుతున్నాయి.
‘బాగున్నాయి రాజీ’ అన్నాను.
‘మా చిట్టికని తీసుకున్నానమ్మా - దానికి రెండు మూడేళ్లకి పెళ్లి చేస్తా గదా. బంగారం ఒక్కొక్కటే కూడబెట్టాలి కదమ్మా. మాటలో మనువంటే మాటలా’ అంది.
‘పెళ్లికి బంగారమెందుకు’ అన్నాను మళ్లీ. ఇదే మాట నేను రేవతి నడిగితే నవ్వేసిన సంగతి గుర్తొచ్చింది. కానీ చటుక్కున అనేశాను.
‘బాగుందమ్మా మీరనేది? బంగారం లేకపోతే ఇంక పెళ్లేంటమ్మా. అసలు ిల్ల పెళ్లి అనగానే ఎన్ని తులాలు బంగారం పెడతారూ అంటూ మొదలుపెడ్తారు’ అంటూ వాళ్ల పెళ్లిళ్లు బంగారాలు - గొడవలు చెప్పుకొచ్చింది.
ఇదేమంత కొత్త విషయం కాదు. ఇప్పుడు జనాలకి డబ్బు, బంగారం, స్థలాలు కొనడం ప్రధాన ఆరాటాలుగా మారాయి. మధ్యతరగతి వాళ్లకి పిల్లల్ని విదేశాలకి పంపడం, వాళ్లక్కడే ఉండిపోవాలనీ, డబ్బు పంపాలనీ, ఆ డబ్బుతో ఇక్కడ ఆస్తులు పోగెయ్యాలనీ ఒకటే ఆశ. కోరికల్లో వర్గ వర్గానికీ స్థారుూ భేదాలు, చిన్నచిన్న సవరింపులు, సడలింపులు తప్పిస్తే మూలాలు ఒకటే. ఆశలు ముదిరి అత్యాశలై బాధిస్తున్నాయి.
అట్టడుగు వారు కష్టపడి ఇళ్లల్లో పాచిపనులు చేసి, చీట్లు కట్టి కూడబెట్టి తులమనీ అర తులమనీ బంగారం కొంటూంటారు. రేవతి లాంటి శ్రీమంతులు డబ్బేం చెయ్యాలో తెలీక కిలోల లెక్కన బంగారం కొని దాస్తూంటారు. ఇంకా కొందరు బంగారం మోజు వదులుకోలేక తమ కోరికల మేరకు కొనుక్కోలేక, నగల సరదా తీర్చుకునేందుకు వన్‌గ్రాం గోల్డ్ నగలు పెట్టుకుని తృప్తి పడుతూంటారు. కానీ బంగారం ఆస్తి కదా. ఏ అవసరం వచ్చినా అక్కరకొస్తుంది అని ఆశతో వాయిదాల పద్ధతిలో, చీట్లు కట్టి, ఒక గొలుసనీ, ఒక గాజుల జతనీ సమకూర్చుకుంటారు. దానికి వివరణ ‘రేపు పిల్ల పెళ్లి చెయ్యాలంటే బంగారం కావాలి కదా. ఒక్కసారి రమ్మంటే ఎలా వస్తుంది. కొంచెం కొంచెం కొని పడేస్తే గానీ. ఎలా?’ అని చెప్తుంటారు.
ఆలోచనల్లోంచి బయటపడి ‘జాగ్రత్తగా దాచి పెట్టుకో’ అన్నాను రాజీతో.
‘ఏం లేదమ్మా సెరుూ్య కాలూ సర్లేనోళ్లకి డబ్బులిచ్చారుగా - అయి మూడునెల్ల డబ్బు వచ్చింది మా మావకి. ఆయన్ని పదేళ్లుగా నేను సూస్తున్నాగా నాకే యిచ్చాడు తెచ్చి. సర్లే కదాని ఆడికో అయిదొందలు చేతి ఖర్చులకిచ్చి మిగిలిందెట్టి యియికొన్నా’ అంది.
‘సర్లే!’ అన్నాను. రాజీ పొట్లం జాగ్రత్తగా దాచుకుని పనిలో పడింది.
* * *
పాత సినిమా నాగయ్యగారి ‘త్యాగయ్య’ డివిడి పెట్టుకుని చూస్తున్నా. అందులో లీనమై పోయాను. శరభోజి మహారాజు బంగారు నగలు - పట్టు పీతాంబరాలు - ధన రాసుల కానుకలు పంపించాడు. ఇంట్లో అందరూ అవి చూసి బ్రహ్మానందపడిపోయారు. వాళ్ల దరిద్రం తీరిందని మురిసిపోతున్నారు. కానీ త్యాగయ్య వాటిని తిరస్కరించాడు. అంత బంగారం వద్దని తృణీకరించటమా - అందరికీ కోపమొచ్చింది.
‘త్యాగూ! ఒక్కసారి ఆలోచించు’ అంటాడు అన్నగారు.
త్యాగయ్య చిరునవ్వు నవ్వి - ‘ఆలోచించవలసిందేమీ లేదని తేలుస్తాడు. తిరస్కరించాడనే కోపాన్ని మూటగట్టుకుని బంగారం వెళ్లిపోయింది.
నిధి చాల సుఖమా - రాముని స
న్నిధి చాల సుఖమా - అంటూ కీర్తన ఆలపిస్తున్నాడు త్యాగయ్య.
నాగయ్య నటన గానం చూస్తూ, వింటూ మైమరచి ఉన్నాను. బెల్ మోగింది. ఈ లోకంలో చాలా చిరాకైన విషయాలు రెండు. ఒకటి కాలింగ్ బెల్ - రెండోది టెలిఫోన్ - మహా చిరాకొచ్చేసింది. తలుపు తీస్తే ఎదురుగా రాజీ - ఎండ మండిపోతోంది.
‘ఏమిటీ? అప్పుడే పనికా’ అన్నాను విసుగ్గా.
‘లేదమ్మా’ అంటూ లోపలికొచ్చి, కింద కూర్చుంది. మళ్లీ ఆ బుట్టలు తీసింది.
‘అమ్మా - ఇయి నీకాడెట్టుకుని వెయ్యి రూపాయలివ్వు’ అంది.
నాకు సర్రుమని కోపమొచ్చింది. ‘ఏమిటీ కొత్తగా - నేనెప్పుడైనా బంగారం పెట్టుకుని డబ్బులిచ్చానా?’ అన్నా కోపంగా.
‘లేదమ్మా అలాగని కాదు. మా చిట్టికి స్కూల్లో జీతం కట్టమని మా తమ్ముడికి డబ్బులిచ్చా. ఆడు కట్టలేదు. కర్చెట్టేసుకున్నాడు. మూడు నెలలు కట్టాలంట. పిల్లనింటికంపేశారు - నాకాడ డబ్బుల్లేవు’
‘అయితే...’ అన్నా తీవ్రంగా.
‘ఈ బంగారం అవసరానికే కదమ్మా’
‘చాల్లే తెలివి. నాలుగు డబ్బులు కనపడగానే బంగారం బంగారం అంటూ బయలుదేరుతారు. ఆ డబ్బే దాచుకోవచ్చు కదా!’
రాజీ ఏం మాట్లాడలేదు. వెయ్యి రూపాయలు రాజీకిచ్చి, ఆ బంగారం ఆమె చేతిలో పెట్టాను - ‘తీసుకుపో - ఇంకెప్పుడూ బంగారం నా దగ్గరకు తేకు’ అన్నాను విసురుగా.
‘అమ్మాఅమ్మా నా తల్లివి - నీ దగ్గర దాచిపెట్టు. నా మొగుడుగానీ చూశాడంటే అమ్మి తాగేస్తాడు’ అంటూ బయటకెళ్లిపోయింది.
ఈ మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సినిమా సాగుతోంది. మళ్లీ దానివైపు మనసు పోలేదు - కట్టేసి పడుకుని కళ్లు మూసుకున్నా.
షిర్డీ సాయిబాబాకి మహారాణిగారు బోలెడు బంగారం బహుమతిగా తెచ్చి ఇచ్చిందట. ఆయన ‘ఏమిటది’ అన్నార్ట. ‘బంగారం’ అంటూ మహల్సాపతి మెరిసే కళ్లతో చెప్పారట.
‘బంగారమా?’ అన్నార్ట బాబా.
‘అవును. బంగారం గురించి నీకు తెలుసు - నాకు తెలుసా’ అన్నాడాయన.
తను స్వర్ణకారుడు కావడంవల్ల బంగారాన్ని గుర్తించటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
బాబా తన గుండెల మీద చెయ్యి చూపిస్తూ ‘ఇది బంగారమా? అది బంగారమా?’ అన్నారు.
అతను మారుమాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుని వెళ్లిపోయార్ట. ఎంతటి వారికైనా బంగారం కనిపిస్తే మనసు వశం తప్పుతుంది కాబోలు.
* * *
రాత్రి పదకొండు గంటలకి ఫోన్ మోగింది. శ్రీరాం ఊరెళ్లాడు. ఎలా ఉన్నాడో? ఈ టైములో ఫోనేమిటి? గబగబ వెళ్లి ఎత్తాను.
‘నేను రేవతిని - ఇప్పుడొస్తున్నా -చిన్న పని’
‘అంతా క్షేమమేనా?’ అన్నాను కంగారుగా.
‘అంతా నిక్షేపంలా క్షేమం - వస్తున్నా’
నేను మరో మాట మాట్లాడేలోపు ఫోన్ కట్ అయింది. కూర్చున్న పావుగంటలో ఇంటి ముందు కారాగిన శబ్దం.
తలుపు తీయంగానే అడుగు పొడుగు, అరడుగు వెడల్పు వున్న దంతప్పెట్టె నాకిచ్చి ‘ఇది గోల్డ్ నీ దగ్గర దాచిపెట్టు’ అంది - అదేమిటీ అన్నట్టు చూశా - ‘చిన్న ప్రాబ్లెం. మా ఇంటికి వియ్యాలవారొస్తారని వార్త’ అంది నవ్వుతూ. ఆ నవ్వులో జీవం లేదు. నాకర్థమైంది. నేను మళ్లీ మాట్లాడేలోపు ‘ప్లీజ్. నేనే వచ్చి రెండు మూడు రోజుల్లో తీసుకుంటా’ అంది. అవును. ఇన్‌కంటాక్స్ వాళ్లు వియ్యాల వారి కంటే ఎక్కువే మరి.
‘మొన్న కొన్నదా?’
‘అదే కాదు ఇంకా చాలా ఉంది’
అయిదు నిమిషాల్లో రేవతి వెళ్లిపోయింది. బరువైన ఆ దంతప్పెట్టె ఎక్కడ పెట్టాలా అనే భయం మొదలైంది. నా మనసు బరువెక్కింది. అన్ని లోహాల కంటే బంగారం బరువైంది. కానీ మనుషులకున్న అత్యాశ బరువు ముందు బంగారం తేలికై పోతోంది. ఆ పెట్టె దీవాన్ లోపల దాచిపెట్టి పరుపు సర్ది దాని మీదే పడుకున్నాను. అది నాకు ముళ్ల పానుపులా అనిపించింది. అసలు నాకేమిటీ కాపలా! మధ్యాహ్నం రాజీ - ఇప్పుడు రేవతీ - రాత్రంతా నిద్ర లేకుండా కాపలా కాయాలన్నమాట. తెల్లారుతుండగా కాస్త కునుకు పట్టింది. కలత నిద్ర - కలలు.
‘తొంభై ఏడు కిలోల బంగారం ఏర్‌పోర్టులో పట్టివేత’
‘అనుమానించి వెంబడిస్తే నల్లకారులో సుమారు నాలుగు కోట్ల విలువచేసే బంగారం’
ఒకే రోజున ఎనిమిది చోట్ల సిటీలో చైన్ స్నాచింగ్.
అశోక్ నగర్‌లో పాల కోసం వెళ్తున్న మహిళ మెడలో మూడు తులాల గొలుసు ఎవరో దుండగులు లాక్కుపోయారు.
పిల్లల్ని స్కూల్లో వదిలి వస్తున్న ఆమె మెడలోంచి వెనుక నుంచి బండి మీద వచ్చి గొలుసు లాక్కుపోయారు. ఆమె రాళ్ల మీద పడటంతో గాయాలయ్యాయి. ఇలా ఏవేవో వివరాలతో- మెళ్లో గొలుసులు పోగొట్టుకున్న వివరాలు గజిబిజిగా - చిరాకుగా లేచాను.
‘ఆక్కూరలమ్మా’
‘వద్దు’
‘గోంగూరు’
‘వద్దు’
‘బంగారం లాంటి కూరమ్మా’
‘అందుకే వద్దు’ గట్టిగా అరిచాను. ఆమె జడిసి వెళ్లిపోయింది.
బంగారం ఆస్తి. అవసరానికి ఆదుకుంటుంది - నిజమా!! కానీ అదే ఒక్కొక్కసారి ప్రాణాలలు తీస్తుంది - నిజమే.
పక్క ఫ్లాట్‌లోంచి పద్మ వచ్చి ‘మా ఆయన బ్రహ్మోత్సవాలు పెట్టమంటే ఆ దిక్కుమాలిన క్రికెట్ పెట్టుక్కూర్చున్నారు. మీరు కాస్త పెడతారా’ అంది.
టీవీ తెర ధగధగ మెరిసిపోతోంది. స్వామివారి ఆభరణాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. పద్మ తన్మయంగా చూస్తోంది.
‘అబ్బ! ఎంత కన్నుల పండుగగా ఉందో - బంగారం లేనివాళ్లు అదెందుకు పిచ్చీ అదీ ఇదీ
అంటారు గానీ - బంగారానికున్న విలువ దేనికుంది చెప్పండి. మన జీవితాలతో ముడిపడిపోయింది. అంతే!’ తేల్చి చెప్పింది పద్మ.
నేనేం మాట్లాడలేదు. ‘పిల్లాడికి వడుగు అంటే బంగారం భటువు - పిల్లకి పెళ్లి అంటే సూత్రాలు - బంగారం - అంతెందుకు మా చిన్నప్పుడు బోసిమెడతో వున్న కూతుర్ని తండ్రి చూడకూడదని శాస్త్రం - మేం ముగ్గురం - మా అమ్మ ‘కంటె’ చెరిపించి మాకు తలో గొలుసు చేయించి వేస్తే గానీ మా నాన్నకి దోషం పోలేదు. పోనీలే బాల తొడుగ్గా ఉంటుందని అమ్మ సరిపెట్టుకుంది. నాన్న మళ్లీ అమ్మకి చేయిస్తానన్నాడు. కానీ ఎక్కడండీ - పెద్దపెద్ద సంసారాల్లో బంగారం కొనడం సామాన్యమా- పద్మ వాక్ ప్రవాహానికి వాళ్లబ్బాయి వచ్చి బ్రేక్ వేశాడు ‘అమ్మా! నాన్న పిలుస్తున్నాడు’ అని.
బీరువాలో ఏం తీసుకుందామన్నా రాజీ బుట్టలు అడ్డు తగులుతున్నాయి.
మూడు రోజుల్లో వస్తానన్న రేవతి ఇంకా రాలేదు.
* * *
ఆ మీటింగ్ హాల్లో అడుగుపెడుతుంటేనే నా ఫ్రెండ్ సుహాసిని పరుగెట్టుకొచ్చింది. ఆమె పక్కనే ఓ అమ్మాయి. తెల్లగా, అందగా, హుందాగా, తెలివితో మెరిసే కళ్లతో-
‘ఈమె శాఫాలిక - చికాగోలో పిహెచ్‌డి చేస్తోంది. సబ్జెక్ట్ ఏమిటో తెలుసా? ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాల మీద ఎలా ఉంటుంది - నీకు ఆసక్తిగల విషయం కదా! ఇదిగో - కె.ఎస్.రేఖ! అంటూ పరిచయం చేసి సుహాసిని వేగంగా వెళ్లిపోయింది. శాఫాలిక నావైపు చూసి స్నేహంగా నవ్వింది.
శాఫాలిక వైపు పరీక్షగా చూశాను. ఆమె రంగు రూపురేఖలు అనవసరం కానీ మనిషికి కావల్సిందేమిటి? అంటే ఇదే కదా అనిపించింది. ఆమె చెవులకేమీ లేవు. మెడ బోసిగా ఉంది. గొలుసులు, నెక్లెస్ ఏమీ లేవు. చేతులకి కంకణాలు, గాజులు వగైరా అసలే లేవు. ఇంక ముక్కు, కాళ్ల గురించి ప్రసక్తే లేదు. తెలివి, చదువు, సంస్కారం, సభ్యత కలబోసి పోత పోసినట్లుంది. మనిషి హాయిగా, నిశ్చింతగా, ఆనందంగా బతకడానికి ఏం కావాలి? నాలో ఆలోచనలు కలగాపులగంగా-
మీటింగ్‌లో జరుగుతున్న విషయానికి అతీతంగా నేను అన్యమనస్కంగా ఉన్నాననిపించింది.
మళ్లీ సుహాసిని పరుగెట్టుకొచ్చింది - నా దగ్గరగా వంగి ఆ అమ్మాయిని చూపించి ‘షి రుూజ్ రియల్ గోల్డ్’ అంది.
నేను ఉలిక్కిపడ్డాను.
*

ఇంద్రగంటి జానకీబాల
104, సాహితీ రెసిడెన్సీ
ప్రేమ్‌నగర్, జి.కె.కాలనీ, సైనిక్‌పురి పోస్ట్
సికిందరాబాద్-500 094.
9640052509

ఇంద్రగంటి జానకీబాల