కథ

ఇంద్రధనుస్సు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్.కె.బి. గారికి పక్షవాతం వచ్చిందని తెలియగానే నా మనసెంతో బాధపడింది. ఏదో పని మీద మా ఊరొచ్చిన నాకు మమీ చెప్పిన ఆ వార్త విని మనసంతా ఏదోలా అయిపోయింది. ఆయన మా ఊర్లో ఎంతో పెద్ద పేరున్న సైన్స్ టీచర్. ఆయన పూర్తి పేరు ఎమ్.కృష్ణ్భగవాన్.
మా మమీ, డాడీ కూడా ఆయన దగ్గరే చదువుకున్నారు. ఆ రోజుల్లో ఇన్ని స్కూళ్లు లేవు. ఎవరు చదివినా ఊళ్లోని గవర్నమెంట్ హైస్కూల్లోనే చదవాలి. అందుకే మాస్టారికి లెక్కలేనంత మంది స్టూడెంట్స్. నేను చదివే సమయానికి మా ఊళ్లో కూడా కానె్వంట్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు పుట్టుకొచ్చాయి. నా చదువంతా అలాంటి స్కూళ్లలోనే జరిగింది. అయితే ఆ స్కూళ్లలో కానె్సప్ట్‌లు సరిగ్గా బోధించడం లేదని, వాటి కోసం మా మమీ, డాడీ మాస్టారిని బలవంతం మీద ఒప్పించి, సెలవు రోజుల్లో ఆయన చేత నాకు పాఠాలు చెప్పించేవారు. ఆయన కాదనలేక ఒప్పుకున్నా నా తెలివితేటలకు ముచ్చటపడి, కావలసిన దానికన్నా ఎక్కువగానే బోధించేవారు. నేను వేసే డౌట్‌లకు ఆయన ఆశ్చర్యంతో తలమునకలవుతూ ఉండేవారు. ఎంతో ఉత్సాహంతో నా డౌట్‌లన్నీ తీర్చేవారు. కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక, తమ స్కూలుకి తెలివైన విద్యార్థులు రావటం లేదని, ఇలా డౌట్స్ అడిగి చెప్పించుకొనేవారే కరువయ్యారని, నాలాంటి స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పడంవలన తనకు కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన నా తల్లిదండ్రులతో అంటూ ఉంటే మా ముగ్గురికీ ఎంతో ఆనందం వేసేది. అలాంటి అంకితభావంగల టీచర్ల అనుభవంగానీ, సర్వీస్‌గాని ఈనాటి విద్యార్థులకు ఉపయోగపడకుండా వృధా అయిపోతుందని మా మమీ, డాడీ బాధపడేవారు.
నేను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లో వస్తువులకుగల రంగుకు కారణం ఏమిటని ప్రశ్నించాను. గులాబి పువ్వు ఎరుపు రంగులో ఉంటే, దాని ఆకులు ఆకుపచ్చగా ఎందుకుంటున్నాయి? కొన్ని నల్లగానూ, మరికొన్ని తెల్లగానూ ఎందుకుంటున్నాయి? ఇలాంటివన్నమాట నా ప్రశ్నలు. ఆ సమయంలో నేను, మాస్టారు కాలవగట్టున షికారు చేస్తున్నాం. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, మాస్టారు మందహాసం చేసి, ఆకాశంలో కనిపిస్తున్న ఇంద్రధనుస్సును చూపించారు. దాన్ని చూసి ఎంతో ఆనందపడ్డాను కానీ, నా ప్రశ్నల గురించి అడగడం మానలేదు. ఇంద్రధనస్సులోని ఏడురంగులను వయొలెట్ నుంచి, రెడ్ వరకూ నాకు పరిచయం చేశారు. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అవన్నీ ఎందుకు చెపుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా ఆయన చెప్పేది శ్రద్ధగా వినసాగాను.
‘మనం చూసే సూర్యకాంతిలో ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు పూర్తిగా కలిసిపోయి, ఆ కాంతి తెల్లగా కనిపిస్తుంది. ఏ వస్తువునయినా మనం చూడాలంటే దాని మీద కాంతి పడి, పరావర్తనం చెందాలి. ఎంత తెల్లటి వస్తువునయినా మనం చీకట్లో చూడలేం కదా!’ అని ప్రశ్నించారు. అవునన్నట్లు తలూపాను. ‘ఒక వస్తువు మీద సూర్యకాంతి అంటే ఏడురంగుల మిశ్రమం పడి, మొత్తం అంతా దాని నుంచి పరావర్తనం చెందితే ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. లేదా తనపై పడిన ఏడురంగులనూ పూర్తిగా గ్రహించి, తిరిగి ఏ కాంతినీ ఇవ్వకపోతే...’ అంటూ ఆగి, ‘ఏ కాంతి విడుదల కాకపోతే చీకటే కదా? మరి చీకటి రంగేమిటి? నలుపు... అందుకే ఆ వస్తువు నల్లగా ఉంటుంది’ అని విడమర్చి చెప్పగానే ఒక గొప్ప కొత్త విషయం తెలుసుకున్నందుకు నాకెంతో సంతోషం కలిగింది. నేను అడక్కుండానే మిగిలిన రంగులను గురించి వివరించారు. ‘ఆకు తన మీద పడిన సూర్యకాంతిలో కేవలం ఎరుపు రంగును మాత్రమే స్వీకరించి, మిగిలిన ఆరు రంగులను విడుదల చేస్తుంది. ఇలా విడుదలయిన కాంతిలో ఆరు రంగులే ఉన్నాయి కాబట్టి అది తెల్లగా ఉండదు. అంటే ఏదో రంగులో ఉంటుంది. ఆ ఆరు రంగుల కలయిక వల్ల ఆకుపచ్చ రంగొస్తుంది కాబట్టి దానికి ఆకుపచ్చ రంగుంటుంది. అలాగే గులాబి పువ్వు తనపై పడిన సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగును తీసేసుకొని, మిగిలిన రంగులను విడిచిపెట్టేస్తుంది. ఆ మిగిలిన రంగులన్నీ కలిసి ఏర్పరిచిన ఎరుపురంగు కాంతి విడుదలవుతుంది కాబట్టి గులాబి పువ్వు ఎరుపు రంగులో కనిపిస్తుంది’ అన్నారు నవ్వుతూ. ఆయనిచ్చిన వివరణ అద్భుతంగా ఉన్నప్పటికీ నాకు మరో డౌట్ వచ్చింది.
‘గులాబి పువ్వు ఆకుపచ్చ రంగునే ఎందుకు తీసుకుంది. ఆకు ఎరుపు రంగునే ఎందుకు ఎంచుకుంది?’ అన్నది నా డౌట్.
మంచి ప్రశ్న వేశావంటూ నా భుజం తట్టి చెప్పడం మొదలు పెట్టారాయన.
‘ఏ వస్తువయినా కాంతిని శోషించుకుందంటే, కొంత శక్తిని గ్రహించిందన్న మాట. ఎందుకు తీసుకుంది? ఆ శక్తిని కాంతిరూపంలో? ఏం చేసి ఉంటుంది? ఆ శక్తి? వీటికి సమాధానాలు తెలిస్తే, నీ డౌట్ క్లియర్ అయిపోతుంది.
ఆ వస్తువులో ఉన్న ఎలక్ట్రాన్‌లు శక్తిని గ్రహించగానే ఎక్కువ శక్తి ఉన్న పైస్థాయికి మారతాయి. దిగువ స్థాయికి, ఎగువ స్థాయికి శక్తిలో తేడా ఎక్కువుంటే, అలా మారడానికి వయిలెట్, బ్లూ, గ్రీన్ లాంటి రంగుగల కాంతిని శోషించుకుంటాయి. శక్తి తేడా తక్కువగా ఉంటే ఆరెంజ్, రెడ్ లాంటి కాంతిని శోషించుకుంటాయి’ అంటూ అతి క్లిష్టమైన విషయాన్ని ఎంతో సరళంగా బోధించిన మాస్టారి వైపు ఆరాధనగా చూసాను.
వీలున్నపుడల్లా ఎన్నో సందేహాలను అడిగి తెలుసుకొనేవాణ్ని. కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యిలో మంట ఎరుపు రంగులో ఎందుకుంటుంది? గ్యాస్ స్టౌ మండేటప్పుడు నీలిరంగు మంటే ఎందుకొస్తుంది? పాలు తియ్యగా ఉండడానికి, మజ్జిగ పుల్లగానూ, పెరుగు కమ్మగానూ ఉండడానికి కారణాలు ఏమిటి? మొక్కజొన్నలు నిలవుంటే చప్పగా ఎందుకయిపోతాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆయన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉండేవి.
నేను బాగా చదువుకొని సైంటిస్ట్ అవడానికి కారణం మాస్టారే. ఆయనే నాకు స్ఫూర్తి, ప్రేరణ... అన్నీను. నేను రెండోతరగతి చదువుతున్నప్పుడు ఆయన్ని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పటికి ఆయనకు ముప్పై ఏళ్లుంటాయేమో! మంచి వయసులో ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఇంద్రధనుస్సులో వయొలెట్‌లాగ. ఆ తర్వాత నుంచి దఫదఫాలుగా ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఆయనలో మార్పుని గమనిస్తూనే ఉన్నాను. వయొలెట్ నుంచి రంగులు మారుతున్నట్లు ఆయనలో కూడా కాలక్రమేణా మార్పులు కనిపిస్తూ వచ్చాయి. ఆయనలో శక్తి, ఉత్సాహం క్రమక్రమంగా తగ్గడం గమనించాను. అందుకు సరైన కారణాలు మాత్రం నాకు తెలియలేదు. నేను ఎనె్నన్ని చదువులు చదివినా, ఎక్కడెక్కడికి వెళ్లినా, ఏ ఉద్యోగం చేస్తున్నా, మా ఊరు వచ్చినపుడు తప్పకుండా మాస్టారిని కలవటం, ఆయనలో వస్తున్న మార్పులకు బాధపడటం జరుగుతూనే ఉంది. ఆయన రిటైర్‌మెంట్ ఫంక్షన్‌కి వచ్చినపుడు ఏభై ఎనిమిదేళ్లొచ్చిన మాస్టారింకా ఎరుపురంగుకు రాలేదు. పచ్చదనం పోయి పసుపురంగులోనికి మారినట్లనిపించింది. కానీ ఇప్పుడు పక్షవాతం వార్త విన్నాక ఎరుపురంగుకు చేరారేమోనన్న భయం వేసింది.
నేను, మమీ ఆయన్ని చూడ్డానికి వెళ్లాం. వాలుకుర్చీలో మాసిన తెల్లని గెడ్డంతో చిక్కి సగమై ఉన్న మాస్టారిని చూడగానే మాకు కన్నీళ్లు ఆగలేదు. మేమెప్పుడూ ఆయన్ని అలా చూడలేదు. చాలాసేపు దిగాలుగా ఆయన దగ్గర కూర్చున్నాం. ‘్ఫర్వాలేదు. తగ్గిపోతుందన్నారు డాక్టర్లు. మళ్లీ నన్ను చూడ్డానికి నువ్వొచ్చేసరికి నడుస్తూ నీకెదురవుతాను చూడు’ అన్నారు లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ. నాకైతే నమ్మకం కలగలేదు, ఆయన పరిస్థితి చూస్తుంటే. అక్కడి పరిస్థితులు చూస్తే కుటుంబ సభ్యులు ఆయన్ని అంతగా పట్టించుకుంటున్నట్లు కనిపించలేదు మాకు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. పిల్లలుగానీ, భార్యగానీ ఆయన బాగోగులు సరిగ్గా చూస్తున్నారా? అన్నది సందేహాస్పదమే. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి, బరువైన హృదయాలతో బయటపడ్డాం.
ఇంటికొచ్చాక నేను ఆయన గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆయనెందుకలా అయిపోయారో మమీ చెప్పలేకపోయింది. డాడీ వచ్చేవరకూ వేచి ఉండి, రాగానే అడిగాను. డాడీ బట్టలయినా మార్చుకోకుండా నా ప్రక్కన కూర్చుని చెప్పడం మొదలు పెట్టారు.
‘కర్ణుడి చావుకి ఆరు కారణాలంటారు. అలాగే మాస్టారి పరిస్థితికి ఏడు కారణాలు. పెద్దకొడుకు ఇంజనీరింగ్ చదవడానికి అనంతపూర్ వెళ్లి, అక్కడొక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని, చదువు పూర్తి కాకుండానే పెళ్లాంతో సహా మాస్టారి ఇంటికొచ్చి పడ్డాడు. ఆ అమ్మాయి ‘కుమారపురం సంస్థానం’ వారసురాలని, ఆమె తల్లిదండ్రుల వల్ల వారికి ప్రాణాపాయం ఉందని భావించిన మాస్టారి కొడుకు, కోడలు మన ఊరొచ్చి పడ్డారు. ఆ విషయం మాస్టారు ఎంత గోప్యంగా దాచి ఉంచినా, నలుగురికీ తెలిసిపోయింది. ఆ విషయం తెలుసుకున్న మాస్టారి భార్య, ఇక దాయటం దేనికని ఆలోచించి, కోడలి గొప్ప కుటుంబం గురించి, ఆ సంస్థానం గురించి, వారి హోదా గురించి డబ్బా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత తమ కూతుర్ని, అల్లుడిని తీసుకెళ్తారని, ఆ తర్వాత వారికి రాజభోగమేనని ఊర్లో వాళ్లందరూ అనుకోసాగారు. ఇవన్నీ వింటున్న మాస్టారు మాత్రం ఊళ్లో తలెత్తుకోలేనంత అవమానం జరిగినట్లు బాధపడ్డారు. ఆ తర్వాత మూడు, నాలుగుసార్లు ఇంట్లో ఏవో వస్తువులు పోతూ ఉండటంతో, పోయిన వాటిలో బంగారు వస్తువులు కూడా ఉండటంతో మాస్టారి భార్య, కొత్తగా చేరిన పనిమనిషి మీద అనుమానంతో, మాస్టారికి తెలియకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు చేపట్టాక, కేసు కీలకమయిన మలుపు తిరిగింది. ఎంక్వైరీలో పోలీసుల దృష్టి మాస్టారి కోడలిపైన పడింది. ఇన్‌స్పెక్టర్ ఆ విషయం బయటపెట్టకుండా, మాస్టారి కోడలి గురించి, పెళ్లి, ప్రేమ గురించి కాజువల్‌గా వివరాలు సేకరించాడు. అంతేకాకుండా కోడలి తల్లిదండ్రుల గురించి కూడా పూర్తి వివరాలు సేకరించాడు. తన మనుషులను ఆమె తల్లిదండ్రులున్న చోటికి పంపితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఆమె వాస్తవానికి కుమారపురం సంస్థానానికి చెందినదే గానీ, వాళ్లెప్పుడో ఆర్థికంగా చితికిపోయారని, ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు సాధారణమైన జీవితం గడుపుతున్నారని, ఆమె సంపన్న కుటుంబం నుంచి రాలేదని తెలిసింది. అంతేకాకుండా ఇంట్లో జరుగుతున్న దొంగతనాలకు ఆమే కారణమని రుజువయింది. విచారణలో తన నేరాన్ని కూడా ఒప్పుకుంది. ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే తన పరువు పోతుందని, మాస్టారు పోలీసులతో సెటిల్ చేసుకోవలసి వచ్చింది. అలా ఆ సంఘటన, ఆయన ఆరోగ్యం దిగజారడానికి మొదటి కారణం అయింది.
రెండో కొడుకు, మాస్టారిలాగే చదువులో జెమ్. వాడు సి.ఏ. చేసి బెంగుళూరులో ఒక పెద్ద కంపెనీలో స్థిరపడ్డాడు. నెలకు రెండు లక్షలు జీతం. వాడి విషయంలో మాస్టారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ‘ఇస్కాన్’ పట్ల ఆకర్షింపబడి, అందులో చేరిపోయి, ఉద్యోగం వదిలేసి సన్యాసిగా మారిపోయాడు వాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఎంత బోధ చేసినా వాడు మారలేదు. ఇది రెండో దెబ్బ.
కూతురు ఎవడినో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుర్రాడు మంచివాడే కానీ, అతని తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు గయ్యాళి మనుషులు. వారు కోరే కోరికలను తీర్చలలేక, కూతురి కాపురాన్ని చక్కదిద్దలేక మూడో దెబ్బ తిన్నారు మాస్టారు.
నాల్గవ సమస్య ఆయన భార్యతో వచ్చింది. ఓపిక ఉన్న రోజుల్లో మాస్టారు విపరీతంగా ట్యూషన్లు చెప్పి బోల్డంత డబ్బు, పేరు సంపాదించారు. ఆ రోజుల్లో తెలివయిన స్టూడెంట్స్ ట్యూషన్‌కి వచ్చేవారు కాబట్టి, వాళ్లకు పాఠాలు చెప్పడానికి ఆయనకు ఎంతో ఉత్సాహం ఉండేది. ఆయనకు శ్రమ అనిపించేది కాదు. రానురాను కార్పొరేట్ స్కూళ్లు రావటంతో మంచి స్టూడెంట్స్ ఆయన దగ్గరకు రావడం తగ్గిపోయింది. చదువు పట్ల ఆసక్తి లేనివారు, తల్లిదండ్రుల బలవంతం మీద ట్యూషన్‌కి వచ్చేవారు, పాస్ మార్కులొస్తే చాలుననుకొనేవారు ఆయన దగ్గరకు వస్తూ ఉండటంతో ఆయనకు విముఖత కలిగింది. రిటైర్ అయిన తర్వాత అన్నీ మానేసి ఆధ్యాత్మిక చింతనలో పడాలని మాస్టారు భావిస్తే, ఆయన భార్య వ్యతిరేకించింది. డబ్బు కోసం భార్యచేసే వత్తిడికి ఆయన తలవంచాల్సి వచ్చింది. చదువుపై ధ్యాస లేకుండా, పరస్పరం పరిచయాలు పెంచుకొనే ధోరణిలో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను సరైన దారిలో పెట్టలేక, వారికి చదువు చెప్పలేక ఆయనెంతో సతమతమవుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారు.
ఇక ఐదో సమస్యకు కారణం మాస్టారి వీధిలోనే నివాసమున్న రామబ్రహ్మం మాస్టారు. ఆయన కూడా మాస్టారితోపాటు ట్యూషన్లు చెప్పేవారు. కానీ ఆయనకంత పేరు లేదు ఆయన దగ్గరికొచ్చే వారి సంఖ్య కూడా తక్కువే. అయినా బాగా గడించేయాలని తాపత్రయం. తెలిసిన పిల్లలెవరయినా తన దగ్గర ట్యూషన్ చదవకపోతే వారి పనైపోయేది. ఆయన పెట్టే శాపనార్థాలకు భయపడి కొందరు, ఇష్టం లేకపోయినా తమ పిల్లలను పంపేవారు. మాస్టారు ఎప్పుడు పోతారా? అని ఎదురుచూసేవాడు. ఆయన రిటైర్ అయిన తర్వాతయినా తను పుంజుకోవచ్చునని ఆశపడిన, రామబ్రహ్మం మాస్టారు అలా జరగకపోయేసరికి గింజుకుపోయాడు. ‘ఎంకెబికి డబ్బు యావ. చచ్చేదాకా సంపాదించాలని అతని కోరిక’ అని అందరి దగ్గరా ఏడ్చేవాడు. అవన్నీ మాస్టారి చెవిన పడుతూ ఉండేవి. ఒక్కోసారి రామబ్రహ్మంగారు మాస్టారికెదురుపడి, ఆయన ముఖం మీదే అన్ని మాటలూ అనేసి తన అక్కసు తీర్చుకొనేవాడు. సున్నిత మనస్కులయిన మాస్టారి మనసు చాలా గాయపడేది.
ఇవి చాలవన్నట్లు మాస్టారికి ఆరో సమస్య తయారయింది. మాస్టారి తమ్ముడు గవర్నమెంటు ఉద్యోగం చేస్తూ, లంచాల కేసులో దొరికిపోయి, ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మాస్టారి తండ్రి చనిపోతూ మాస్టారికన్నా పదేళ్లు చిన్నవాడయిన తమ్ముడి బాధ్యత ఆయన చేతిలో పెట్టి కన్నుమూశాడు. తండ్రి ఆఖరి కోరిక తీర్చే నిమిత్తం తమ్ముడిని ఉద్ధరిద్దామని, పెట్టుబడి అంతా తనే పెట్టి మన ఊర్లోనే వ్యాపారం పెట్టించారు. ఇది మాస్టారి భార్యకు అస్సలు ఇష్టంలేదు. ఆమె పోరు భరించడం ఆయన తరం కాలేదు. పుండు మీద కారం జల్లినట్లు, ఆయన తమ్ముడు బాధ్యత లేకుండా ప్రవర్తించడంతో వ్యాపారంలో నష్టం రావటం ఆయన్ని మరింత కృంగదీసింది.
తండ్రి చనిపోతూ తగిలించిన బాధ్యత అలా దెబ్బకొడితే, తండ్రి ద్వారా సంక్రమించిన షుగర్ వ్యాధి ఏదో కారణంగా ఆయన పరిస్థితి మరింత అధ్వాన్నం కావటానికి దోహదపడింది. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధిని ఆహార నియమాలతోనూ, ఆరోగ్య సూత్రాలతోనూ అదుపులో పెట్టగలిగినా, ఒకదాని వెంట మరొకటిగా వచ్చిన సమస్యలన్నీ ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసి, ఆయన ఆరోగ్యాన్ని తునాతునకలు చేయడం జరిగింది’ అంటూ డాడీ ఇలా చెప్పడం ముగించారో లేదో మాకు మాస్టారి మరణవార్త వినిపించింది. దాంతో ముగ్గురం గొల్లుమని ఏడ్చాం. ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయినంతగా విలపించాం.
అప్పటి నుంచి ఇంద్రధనుస్సు చూడ్డానికి నాకెందుకో బెరుకుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మాస్టారు తప్పకుండా గుర్తొస్తారు. మనసు బాధతో మూలుగుతుంది.
*
కొయిలాడ రామ్మోహన్‌రావు
హెచ్.ఓ.డి. (కెమిస్ట్రీ) (రిటైర్డ్), డోర్‌నెం.3-6-22, సాక్షి ఆఫీస్ దగ్గర
నరసింగరావుపేట, అనకాపల్లి-531 001.
98493 45060

-కొయిలాడ రామ్మోహన్‌రావు