కథ

సాలభంజికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండవ బహుమతి రు.5 వేలు పొందిన కథ
**
‘మనం షాపింగ్ చేయాలి. మర్చిపోయారా?’ అంది గీత.
ఆఫీస్ నించి రాగానే ఫ్రెషప్ అయి, ఉదయం సగం చదివి వదిలేసిన దినపత్రికని చేతిలోకి తీసుకుని, తను చేసిచ్చిన కాఫీని చప్పరిస్తూ కూచున్నా.
‘ఆడాళ్ల షాపింగ్‌కి నేనెందుకు? నువ్వెళ్లిరా. నా డెబిట్ కార్డ్ తీస్కెళ్లు’ అన్నాను పేపర్లోంచి తల యెత్తకుండానే.
‘షాపింగ్ నా కోసం కాదు. మీ కోసమే. ప్రసాద్ గారి కూతురి పెళ్లి రేపేగా. గిఫ్ట్ కొనొద్దా? ఉత్తచేతుల్తో వెళ్తే బావుంటుందా ఏమైనా’ అంది.
నిజమే. మర్చిపోయాను. వారం క్రితం బ్యాంక్‌కి వచ్చి అందరికీ శుభలేఖలు పంచి, తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వెళ్లారు ప్రసాద్‌గారు. ఈ ఊళ్లోకెల్లా పేరు మోసిన బిల్డర్ ఆయన. అవర్ హోం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఈ ఊళ్లో ఉన్న సగానికి పైగా అపార్ట్‌మెంట్లు వారు నిర్మించినవే. మా బ్యాంక్‌లోనే సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. కాబోయే అల్లుడు ఐయేయెస్‌కి సెలక్టయి ట్రెయినింగ్లో ఉన్నాడని చెప్పేటప్పుడు గర్వంతో ఆయన ఛాతీ పొంగడం నాతోపాటు మా బ్యాంక్ సిబ్బంది కూడా గమనించారు.
‘చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిపించాలని మా వియ్యంకుడి కోరిక. కనీసం మూడు వేల మంది వరకు రావొచ్చనుకుంటున్నాం. ముఖ్యమంత్రిగారు కూడా వస్తున్నారు. డైమండ్ ఫంక్షన్ హాల్లో పెళ్లి’ అని చెప్పారు.
పోయిన ఎలక్షన్లల్లో రూలింగ్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ కోసం పార్టీ ఫండ్ కింద భారీగానే ముట్టచెప్పారని ఆయన్ని ఎరిగిన వాళ్లు అనుకుంటూ వుంటారు. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయడం కోసం ఇప్పటి నుంచే ముఖ్యమంత్రిగారితో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం కాబట్టి వారిని పెళ్లి పెద్దగా ఆహ్వానించి ఉంటారు.
పేపర్ని పక్కన పడేసి, ఖాళీ కప్పుని టీపాయ్ మీద పెడ్తూ ‘ఏం కొంటే బావుంటుందంటావు?’ అన్నాను.
‘వెయ్యి రూపాయల లోపల మాంచి ఫొటోఫ్రేం కొని అందంగా ప్యాక్ చేయించి ఇద్దాం. పెళ్లి తర్వాత హనీమూన్‌కి ఏ ఊటికో డార్జిలింగ్‌కో వెళ్తారుగా. అందులోంచి మాంచి ఫొటో ఒకటి తీసి ఫ్రేంలో పెట్టుకుంటారు’ అంది ఉత్సాహంగా.
మా పెళ్లయి పాతికేళ్లు దాటిపోయాయి. ఇద్దరాడపిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఐనా పెళ్లయిన కొత్తలో గీత దుమికే జలపాతంలా ఎంత చలాకీగా ఉండేదో ఇప్పటికీ అలానే ఉంది. ఏమీ మారలేదు. తన ఊతపదం ‘మాంచి’తో సహా.
‘అంత పెద్దాయన కూతురి పెళ్లి కదా. దానికి తోడు ఓ ఐయేయస్ ఆఫీసర్కి కాబోయే భార్య. వాళ్ల తాహతుకి తగ్గట్టు ఇవ్వకపోతే ఏం బావుంటుంది చెప్పు. నేనేమైనా బ్యాంక్లో క్లర్క్‌ని అనుకుంటున్నావా? మేనేజర్ని. మనమిచ్చే గిఫ్ట్ నా హోదాకు తగ్గట్టుగా ఉండాలి కదా. లేకపోతే అది మనకే అవమానం’ అన్నాను.
‘మీరు మేనేజర్ అన్న విషయం మర్చిపోలేదు మహానుభావా. పొరపాటున నేను మర్చిపోయినా మీరు మర్చిపోనివ్వరుగా. గుర్తు చేయటంలో మాంచి దిట్ట’ అంది నవ్వుతూ.
తన విసురుని పట్టించుకోకుండా ‘వెండి వస్తువులు ఏమైనా ఇస్తే బావుంటుంది. వెండి కంచమో, నాలుగు వెండి క్లాసులో, పెద్దవి రెండు వెండి కుందులో.. రేపు ఎమ్మెల్లే అయితే దేనికైనా పనికొస్తాడు’ అన్నాను.
‘బంగారు నెక్లెస్ ఇస్తే ఇంకా బావుంటుంది కదండీ. ప్రసాద్ గారు కూడా సంతోషిస్తారు. ఐనా వారి తాహతుకి అది కూడా తక్కువనుకుంటారేమో. వజ్రాల నెక్లెస్ కొందామా? ఐనా ఇదేం చోద్యం... బహుమానం ఇచ్చేది ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమాభిమానాల్ని దృష్టిలో పెట్టుకుని కదా. మీరు చెప్పేది వ్యాపారం’
‘చాల్లే వెటకారం. ఇప్పటి లోకరీతి ఇదే. గిఫ్ట్ గురించి ఆలోచించు మొదట. కనీసం పాతిక ముప్పయ్ వేలయినా లేకపోతే ఎలా? మాంఛి గిఫ్ట్ కావాలంటే ఆ మాత్రం పెట్టాలి కదా’ తన ఊతపదాన్ని నొక్కి పలుకుతూ అన్నాను.
‘డబ్బున్న వాళ్ల దగ్గరకే మరింత డబ్బు చేరుతుంది గమనించారా? కానీ డబ్బు చేరాల్సింది అవసరమైన వాళ్ల వద్దకు కదా. అదే మీ బ్యాంక్‌లో ప్యూన్ పెళ్లికయితే ఏం చేస్తారు?’
‘వెయ్యి లోపలే కొంటాను. సహజమే కదా. ఎంత చెట్టుకు అంత గాలి. ఇంతకూ ఏం గిఫ్ట్ కొందామంటావు?’
తను సమాధానం చెప్పబోయి ఆగిపోయింది. ఎదురుగా మా పనిమనిషి ఐలమ్మ నిలబడి ఉంది. ఉదయం ఆరింటికొచ్చి అంట్లు తోమి ఇల్లంతా శుభ్రం చేసి, బట్టలుతికి వెళ్లిపోతుంది. మళ్లా సాయంత్రం వచ్చి పని చేసుకుంటుంది.
‘పనంతా సేశానమ్మా’ అని ఇంకా అక్కడే నిలబడింది.
‘ఏమైనా చెప్పాలా? ఏంటో చెప్పు? అడ్వాన్స్ ఏమైనా కావాలా?’ అంది గీత.
‘వద్దమ్మా. వచ్చే శనోరమే నా రెండో బిడ్డ లగ్గం. మీకు తోసిన ఇనాం ఇప్పించండమ్మా’
‘అంతే తప్ప మమ్మల్ని పెళ్లికి మాత్రం రమ్మని పిలవ్వు. ఏం మేము నీ కూతురి పెళ్లికి రాకూడదా?’ అంటూ నవ్వింది గీత.
‘మీ అసుంటోల్లని పిలిసే పెల్లి కాదులెమ్మా. ఏదో నా తాహతుకి తగ్గట్టు తూతూ మంత్రంగా కానించేస్తున్న పెల్లి. మిమ్మల్ని పిలిసి కట్టపెట్టలేనమ్మా’ అందామె సిగ్గుపడిపోతూ.
‘సరదాగా అన్నాలే. దాని సంసారానికి పనికొచ్చేదేదైనా కొనిస్తాలే’ అంది గీత.
‘వద్దమ్మా. మీరెంత ఇయ్యాలనుకున్నారో అంత డబ్బులియ్యండమ్మా. మగదిక్కు లేని సంసారం. కర్సులకు పనికొస్తాయి’ అందామె.
‘సర్లే. అలాగే ఇస్తానే్ల. ఇంకో వారం టైం ఉందిగా’ అంది గీత.
ఐలమ్మ వెళ్లిపోయాక ‘ఏం చేద్దామంటారు?’ అన్నట్టు నా వైపు చూసింది.
‘ఇందాకే చెప్పాగా ప్యూన్ కయితే వెయ్యి రూపాయలకు మించకుండా ఇస్తానని. ఐలమ్మకు కూడా వెయ్యి రూపాయలిద్దాం’
‘అదేంటండీ. నాకు పెళ్లయి కాపురానికొచ్చినప్పటి నుండీ ఐలమ్మ మనింట్లో పని చేస్తుంది. ఏం చేసినా చాలా శుభ్రంగా చేస్తుంది. నమ్మకంగా ఉంటుంది. అసలే ఆడపిల్ల పెళ్లి. పాపం ఖర్చులుంటాయిగా’
‘అలాగని పెళ్లి ఖర్చంతా మనమే పెట్టుకుందామంటావా ఏమిటి? ఇక్కడేమీ డబ్బులు రాశులు పోసి లేవు. వెయ్యి రూపాయలు చాల్లే. ఇంతకూ రేపటి పెళ్లికి ఏం కొనాలో ఆలోచించు. షాపింగ్‌కి వెళ్దాం’ అన్నాను.
నా మాటల్లో పదును అర్థమై తను ఐలమ్మ విషయం ఎత్తకుండా ‘ప్రసాద్‌గారి కూతురి పెళ్లికి కొన్ని వేల మంది వస్తారు. ఎన్నో రకాల బహుమతులిస్తారు. అందులో చాలా గిఫ్ట్‌లు వాళ్లు వాడుకోను కూడా వాడుకోరు. ఇప్పుడంతా కవర్లలో డబ్బులు పెట్టి ఇస్తున్నారుగా. మనమూ అలానే చేద్దాం’ అంది.
‘పాతికవేల ఒక్క రూపాయి ఇద్దాం. గౌరవంగానూ, శుభప్రదంగానూ ఉంటుంది’ అన్నాను.
* * *
మరునాడు సాయంత్రం బ్యాంక్ నుంచి రాగానే ఇద్దరం ముస్తాబయి ఎనిమిదింటికి కల్యాణ మంటపానికి బయల్దేరాం. ఉదయం మూడు నలభై రెండు నిమిషాలకి ముహూర్తం. అందుకే మొదట రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మేము వెళ్లేప్పటికే ఫర్లాంగు దూరం వరకు కార్లు నిలబడి ఉన్నాయి. ఎటు చూసినా పోలీసులే... గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అడుగడుగునా పోస్టర్లు వేలాడదీసి ఉన్నాయి. తిరునాళ్లలోలా జనం... ఆ మానవ సముద్రాన్ని ఈదుకుంటూ లోపలికెళ్లాం. వెనక సీట్లు కొన్ని ఖాళీగా కన్పిస్తే వాటిలో కూచున్నాం.
ఓ వైపు డీ.జె.తో ఆర్కెస్ట్రా... హోరుమంటూ మ్యూజిక్.. ప్రముఖ సినీ గాయకులతో స్టేజీ మీద పాటలు.. ఎటు చూసినా కోలాహలమే. అందంగా అలంకరించుకున్న యువతీ యువకులు స్నాక్స్‌తో పాటు మంచినీళ్లు, శీతల పానీయాలు అందిస్తున్నారు. మరోవైపున్న విశాల మైదానంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. కొంతమంది వెళ్లి తినడంలో నిమగ్నమై ఉన్నారు.
ఈ లోపల గాల్లో గబ్బిలాల్లా ఎగురుతూ ఏవో వచ్చి కిందివరకూ దిగి మళ్లా ఎగిరి వెళ్తున్నాయి.
‘ఏంటవి? బుల్లి బుల్లి విమానాల్లా భలే తమాషాగా ఉన్నాయి’ అంది గీత.
‘వాటిని డ్రోన్లంటారు. సర్వేయలెన్స్‌కి వాడుతున్నారు. ముఖ్యమంత్రిగారు వచ్చే ముందు ఈ పరిసర ప్రాంతాలు సురక్షితమో కాదో డ్రోన్ల సాయంతో పరిశీలిస్తున్నారు’
వేదిక వరకూ వెళ్లే దోవలో ఇరువైపులా పొడవాటి నాలుగు స్కూళ్లని ఎడం ఎడంగా అటు రెండు ఇటు రెండు అమర్చి వెళ్లారు పనివాళ్లు. ఒక్కో స్టూల్ ఆరడుగుల ఎత్తులో, ఒక్క మనిషి నిలబడగలిగేంత వెడల్పుతో ఉంది.
‘ఎందుకండీ అవి?’ అని అడిగింది గీత.
‘ఏమో నాకేం తెలుసు? చూద్దాం ఏం చేస్తారో’ అన్నాను.
పాతికేళ్లలోపు వయసున్న నలుగురు అమ్మాయిలు.. వాళ్ల వెనక ఒకడు చిన్న అల్యూమినియం నిచ్చెన పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయిలు చాలా అందంగా, పొడవుగా, నాజూగ్గా ఉన్నారు. పొడవాటి తమ గౌన్లని ఎత్తి పట్టుకుని నిచ్చెన సాయంతో స్టూల్ మీద నిలబడి గౌన్‌ని కిందికి వదిలేశారు. ఇప్పుడు స్టూల్ కన్పించడం లేదు. దాదాపు పనె్నండడుగుల ఎత్తున్న అమ్మాయిలే కన్పిస్తున్నారు. వాళ్లు ముకుళిత హస్తాల్తో ఆ స్టూల్ మీద బ్యాలన్స్ చేసుకుని నిలబడ్డారు.
‘ఇదేమిటి? ఎప్పుడూ చూళ్లేదే... బ్యాలన్స్ తప్పితే పడిపోతారు కదా. ఇలా ఎందుకు నిలబెట్టారు? ఎంతసేపు నిలబెడ్తారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది గీత.
నాకూ ఇది కొత్తగానే ఉంది. ఇప్పటివరకు ఏ పెళ్లిలోనూ ఇలాంటిది చూసి ఉండకపోవటం వల్ల నేనూ ఆశ్చర్యపోతూ పొడవాటి సాలభంజికల్లా నిలబడి ఉన్న వాళ్ల వైపు చూశాను. వాళ్ల పెదవుల మీద చిర్నవ్వు. అంత కష్టంలోనూ ఎలా నవ్వగలుగుతున్నారో నాకర్థం కాలేదు. పడిపోతామేమోనన్న భయాన్ని లోపల దాచుకుని, కాళ్లు పీకుతున్నా కూచోడానికి అవకాశం లేనందువల్ల కలుగుతున్న బాధని కన్పించనీయకుండా నవ్వుని పెదవుల మీద లిప్‌స్టిక్‌లా అతికించుకున్నారేమో...
‘మన వైపు మొహం తిప్పి నిలబడిన ఆ అమ్మాయిని చూశారా? నాకు తెల్సిన మొహంలా ఉంది. బాగా పరిచయమున్న మొసమే. ఎక్కడ చూశానో గుర్తుకు రావడంలేదు’ అంది గీత.
కొద్దిసేపటి తర్వాత ‘గుర్తొచ్చింది. మన రెండో అమ్మాయి మధూకి ఇంటర్లో క్లాస్‌మేట్. మనింటికి రెండు మూడుసార్లు వచ్చింది. కానీ చదువు మధ్యలోనే మానేసిందని మధు చెప్పినట్టు గుర్తు. చూసి చాలా ఏళ్లయిందిగా. అందుకే వెంటనే గుర్తుకు రాలేదు. రండి. మాట్లాడి వద్దాం’ అంటూ ముందుకు నడిచింది. నాకు తనని అనుసరించక తప్పలేదు.
పైకి తలయెత్తి ఆ అమ్మాయికి విన్పించేలా ‘నీ పేరు భావన కదూ’ అంది. అన్ని రకాల ధ్వనుల మధ్య గీత గొంతు ఆ అమ్మాయికి విన్పించలేదు. చేతులు జోడించి చిర్నవ్వుతో మైనపు బొమ్మలా నిలబడి ఉంది. చూపు సమాంతరంగా ఉంది. కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయని కాబోలు చూపుని కిందికి మరల్చటంలేదు. ఒకేసారి పదీ పనె్నండు మంది గుంపు వేదిక వైపు వెళ్తూ ఉండటంతో నేనూ గీతా పక్కకు జరిగాం. వాళ్లలో ఒకడి కాలు స్టూల్‌ని కప్పేసి ఉన్న ఆమె గౌనుకు తగిలి అతను పడబోయి నిలదొక్కుకున్నాడు. ఆ ఊపునకు స్టూల్ కదిలి ఆ అమ్మాయి కూడా పడబోయింది. భయంతో కేక పెడ్తూ ‘ఏయ్.. చూస్కొని నడువ్’ అంటూ కిందకి చూసింది.
ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ‘నువ్వు భావన కదూ. నేను ఇంటర్లో నీ క్లాస్‌మేట్ మధూ వాళ్లమ్మని. నా పేరు గీత. గుర్తున్నానా?’ అంది గీత.
ఆ అమ్మాయి కదలకుండానే చూపుని కిందకి దించి గీతని కొన్ని క్షణాలసేపు చూసి ‘ఆ గుర్తొచ్చారు ఆంటీ. సారీ.. వెంటనే గుర్తుపట్టలేక పోయాను’ అంది. తనున్న పరిస్థితుల్లో తన క్లాస్‌మేట్ వాళ్లమ్మనంటూ ఎవరో పల్కరించడం ఆ అమ్మాయికి నచ్చలేదని ఇబ్బందిగా నవ్విన నవ్వు చూస్తే అర్థమైంది.
‘నువ్వు కిందికొచ్చి ఓ రెణ్నిమిషాలు మాట్లాడటానికి లేదా?’ అని అడిగింది గీత.
‘ముఖ్యమంత్రిగారు వచ్చి వెళ్లేవరకు కిందికి దిగడానికి వీల్లేదు ఆంటీ’ అంది భావన.
‘ఆయనగారు వస్తారని గ్యారంటీ ఏముంది? ఆయనకు సవాలక్ష పన్లుంటాయి కదా. అప్పుడేంటి మీ పరిస్థితి?’
‘తప్పదు. ఎన్ని గంటలైనా ఇలా నిలబడాల్సిందే’ భావన గౌన్ని సవరించుకుని స్టూల్ మీదే మునిగాళ్ల మీద కూచుని మాట్లాడింది.
‘ఎందుకిలాంటి పనికి ఒప్పుకున్నావు? అందరూ నీ వైపు వింతగా చూస్తున్నారు గమనించావా? దానికి తోడు ఇలా కదలకుండా బొమ్మలా నిలబడటం ఎంత కష్టం?’
‘ఏం చేయమంటారు? ఇంటర్లో నాన్నగారు గుండెనొప్పితో హఠాత్తుగా చనిపోయారు. ఇంటర్ పూర్తి చేయకుండానే చదువాగిపోయింది. ఆ చదువుకి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? బట్టల షాపుల్లో సేల్స్ గర్ల్‌గా కొన్నాళ్లు పని చేశాను. ఏడాది నుంచి ఈ పని చేస్తున్నా. దీనికి క్వాలిఫికేషన్ అందంగా ఉండటమే. దేవుడిచ్చిన అందం ఈ రకంగానైనా మా ఇంటిల్లిపాది కడుపు నింపుతోంది. ఇక అభిమానం, సిగ్గు, లజ్జా అంటారా? ఆకలి ముందు అవేవీ గుర్తుకు రావు ఆంటీ’ అంటూ బాధగా నవ్వింది.
ఎవరో మినిస్టర్ వస్తున్నాడని పోలీసులు హడావిడి చేస్తుండటంతో భావన లేచి నిలబడబోతూ ‘మధు ఎలా ఉంది ఆంటీ’ అంది.
‘అది అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తోంది. పెళ్లయింది. ఏడాది బాబున్నాడు’ అంది గీత. ఆ అమ్మాయి కళ్లలో చప్పున దిగులేదో తొంగి చూసింది.
తిరిగి మా సీట్ల వైపు వెళ్లబోతూ చాలామంది ఒకచోట గుమిగూడి ఉండటంతో ‘ఆ వింతేదో చూద్దాం రండి’ అంది గీత.
అక్కడ ఒక పాలరాతి దిమ్మ మీద అందమైన అమ్మాయి పాలరాతి శిల్పంలానే నిలబడి ఉంది. ఆమె చేతివేళ్లలోంచి నీళ్లు ఫౌంటెన్లా చిమ్ముతున్నాయి. ‘మానవ ఫౌంటేన్’ అంటున్నారెవరో. చుట్టూ చేరిన వారు తమ ఫోన్లకు పని చెప్తున్నారు. ఆమెకు సమీపంగా నిలబడి రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగుతున్నారు.
‘ఇదేం చోద్యమండీ. మనుషుల్ని రాతి బొమ్మల్లా నిలబెట్టడం ఏమిటి? కావాలంటే నిజమైన ఫౌంటెనే పెట్టుకోవచ్చుగా’ అంది గీత.
పెళ్లికొడుకు వస్తున్నాడనీ దార్లో నిలబడి ఉండకూడదని మైక్‌లో ఎనౌన్స్ చేయటంతో మేమిద్దరం వెళ్లి మా కుర్చీల్లో కూచున్నాం. ఓ పెద్ద గాజు గోళంలాంటి దాన్లో ఉన్నాడు పెళ్లికొడుకు. అతను నడుస్తుంటే అది ముందుకు దొర్లుకుంటూ వస్తోంది. అలా వింత గ్రహం నించి వచ్చిన వ్యోమగామిలా పెళ్లికొడుకు వేదిక మీద ఉన్న ఉచితాసనం మీద కూచున్నాడు. పెళ్లికూతుర్ని తీసుకొచ్చి అతని పక్కనున్న ఆసనం మీద కూచోబెట్టారు.
వాళ్లకి అక్షింతలు వేయడానికి ఒక్కసారిగా మనుషులు తోసుకున్నారు. ఎలా జరిగిందో ఏమో పెద్దగా అరుస్తూ భావన ఓ టవర్ కూలినట్టు కింద పడిపోయింది. నేనూ గీతా మరి కొంతమందితో కలిసి ఆ అమ్మాయి దగ్గరకి పరుగెత్తాం. కాలు బెణికినట్టుంది. నొప్పితో మెలికలు తిరుగుతోంది. కళ్లనుంచి నీళ్లు బొటబొటా కారుతున్నాయి.
‘ఆస్పత్రికెళ్దాం పద’ అంది గీత. పొడవాటి గౌన్ని సవరించి ఆ అమ్మాయి నుజాల చుట్టూ చేతులేసి లేపి నిల్చోబెట్టింది.
‘పర్లేదాంటి. నిలబడగలను’ అంది భావన.
‘ఇంత నొప్పితో ఎంతసేపని నిలబడ్తావు?’ అంది గీత.
‘మధ్యలో ఆపి వెళ్లిపోతే డబ్బులివ్వరు ఆంటీ’ అంటూ కన్నీళ్లు తుడుచుకుని, స్టూల్ని నిల్చోబెట్టాక నిచ్చెన సాయంతో మళ్లా దాని మీద నిలబడింది. మా కుర్చీల్లో కెళ్లి కూచున్నాక కూడా గీత భావన వైపు పదేపదే చూస్తూనే ఉంది. పళ్ల బిగువున బాధను భరిస్తూ చేతులు జోడించి చిర్నవ్వుని అద్దుకుని నిలబడిన ఆ అమ్మాయిని గమనించి గీత చాలా బాధపడింది.
ఒక్కొక్కరూ వేదిక మీదికెళ్లి అక్షింతలు చల్లి గిఫ్ట్‌లు ఇచ్చి వాళ్లతో ఓ ఫొటో దిగుతున్నారు. పది నిముషాల్లోనే వేదిక ముందు చాంతాడంత క్యూ ఏర్పడింది.
‘మనమూ వెళ్లి నిలబడ్దాం పద. లేకపోతే రాత్రి పనె్నండయినా మన వంతు రాదు’ అన్నాను లేచి నిలబడ్తూ.
‘నేను రాను. ఆ పెళ్లికొడుకు మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది’ అంది.
నేను వేదిక వైపు తలతిప్పి పెళ్లికొడుకు వైపు చూసి ‘తెల్లగా పొడవుగా బాగానే ఉన్నాడే. మహేష్‌బాబులా ఉన్న పెళ్లికొడుకు మొహం చూడాలంటే అసహ్యం అన్నావంటే కళ్లకేమైనా జబ్బొచ్చిందేమో అనుకుంటారు’
‘జబ్బు నా కళ్లకు కాదు. వాడి బుద్ధికి. రేపు ఏ జిల్లాకో కలెక్టర్‌గా పేదల సంక్షేమం కోసం పాటు పడాల్సిన వాడు, అక్రమ సంపాదనలకు అడ్డుకట్ట వేసి స్వచ్ఛ భారత్ నినాదంతో దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన వాడు తన పెళ్లిని ఇంత ఆర్భాటంగా చేసుకుంటున్నందుకు అతనంటే అసహ్యం వేస్తోంది. అతనికి అభినందనలు తెల్పను. నేనక్కడికి రాను’ అంది.
కొన్ని క్షణాల విరామం తర్వాత ‘ఇదంతా నా సెల్‌ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. ఇన్‌కంటాక్స్ వాళ్లకూ, మన ప్రధానమంత్రి మోదీగారికి పంపిస్తా. నోట్ల రద్దు తర్వాత ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అవి తెలుపో నలుపో వాళ్లే తేల్చుకుంటారు’ అంది.
గీత ఎంత మొండిదో నాకు తెలుసు. తనకు నచ్చని పని దేవుడు దిగొచ్చి చెప్పినా చేయదు. అందుకే బతిమాలడం వృధా ప్రయాస అనుకుని ‘సరే. నువ్వు కూచుని ఉండు. నేను వెళ్లి క్యూలో నిలబడ్తాను’ అన్నాను.
‘ఇక్కడ ఇంకో క్షణం కూడా కూచోలేను. అందమైన ఆడపిల్లల్ని మైనపు బొమ్మల్లా నిలబెట్టినందుకు సాటి మనిషిగా సిగ్గుతో తలదించుకుంటున్నా. మనుషుల్ని మనుషుల్లా కాకుండా రాతి విగ్రహాల్లా, నీళ్లు చిమ్మే ఫౌంటెన్లలా మారుస్తున్న ఈ వ్యవస్థను అసహ్యించుకుంటున్నా. నేను వెళ్తున్నా. మీరు ఉంటారో వస్తారో మీ ఇష్టం’ విసురుగా లేచి నిలబడ్తూ అంది గీత.
‘క్యాష్ గిఫ్ట్ పెట్టిన కవరు నీ దగ్గరే ఉందిగా. నాకివ్వు. వెళ్లి నాలుగక్షింతలు వేసి, కవర్ ఇచ్చేసి వస్తాను’ అన్నాను.
‘ఇవ్వను. ఈ పెళ్లి చేయడానికి కోట్లు ఖర్చు చేసిన ప్రసాద్‌గారికి మన పాతిక వేలు పంటికిందికి కూడా ఆనవు. సముద్రంలో పడిన నీటిబొట్టులా నిరర్థకమై పోతాయి. ఈ డబ్బుల్ని ఐలమ్మ కూతురి పెళ్లికి బహుమతిగా ఇస్తా. చాలా సంతోషపడ్తుంది. మన డబ్బుకి ఓ గౌరవం దక్కుతుంది. మన బహుమతికి ఓ సార్థకత ఏర్పడుతుంది’ అంది.
నాకూ గీత ఆవేదనలో ఆలోచనలో అర్థముందనిపించింది.
గీత వెనకే బైటికి వెళ్తూ వెనక్కి తిరిగి ఓసారి చూశా. పనె్నండడుగుల పాలరాతి శిల్పాల్లా ఆ నలుగురూ కదలకుండా నిలబడి ఉన్నారు. వాళ్లను వినోద వస్తువుల్లా చూస్తున్న వేలాది మందికి మానవ ఫౌంటెన్ వేళ్లలోంచి ధారాపాతంగా చిమ్ముతోన్న నీరు కన్పిస్తోంది కానీ ఆ ఐదుగురి కళ్లలోంచి చిమ్ముతున్న కన్నీరు మాత్రం కన్పించడం లేదు... ఎవరు రాతి విగ్రహాలు?
*
కథా రచనే ఇష్టం
నేనిప్పటి వరకు పదహారు నవలలు రాసినా నాకు కథల్రాయడమంటేనే ఇష్టం. నాలుగు వందల పేజీల నవల రాయడంకన్నా నాలుగు పేజీల్లో ఒదిగేలా చిక్కని కథ అల్లడం కష్టం. అందుకే కథల పోటీల్లో నా కథకు బహుమతి వచ్చినపుడల్లా ఆనందం అర్థవౌతుంది. నేను రాసిన రెండు వందలకు పైగా కథలు తొమ్మిది కథా సంపుటాలుగా వెలువడ్డాయి. మూస కథలు రాయకూడదనీ, చర్విత చర్వణమైన విషయాల జోలికి వెళ్లకూడదనీ, కొత్త వస్తువుల్ని, సరికొత్త సమస్యల్ని తీసుకుని వైవిధ్యభరితమైన కథలు రాయాలనీ తాపత్రయపడ్తూ ఉంటాను. ఈ మధ్య ఒక ట్రెయినీ ఐయేయస్ ఆఫీసర్ పెళ్లికి వెళ్లినపుడు ఎదురైన అనుభవాల్ని, నాలో అలజడి రేపిన ఆలోచనల్ని కథగా మలిచాను. కొన్ని కోట్లు ఖర్చు చేసి పెళ్లిళ్లు ఘనంగా చేయడం ఇప్పటి సమాజ రుగ్మత. ఆ వేడుకలో సాలభంజికల్లా అందమైన యువతుల్ని నిల్చోబెట్టడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న మరో రుగ్మత. కథల పోటీలు, నవలల పోటీలు నిర్వహించడం ద్వారా పాఠకులకు ఉత్తమ సాహిత్యాన్ని అందించడం ప్రశంసనీయం.
-సలీం
7588630243