కథ

మారాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిశిర ఋతువు. ఉదయపు సూర్యుడు ‘రావాలా! వద్దా?’ అని తటపటాయిస్తున్నాడు కాబోలు; ఆకాశాన తూర్పు ఎర్రనైంది కాని సూర్యుడి జాడ లేదు.
బ్రాహ్మీ ముహూర్తానే్న లేచి, కాలకృత్యాలు తీర్చుకుని కొద్దిపాటి ‘యోగా’ చేసి, ‘వాకింగ్’కు బయలుదేరాడు నారాయణ. ఆయన అలా బయలుదేరి, దగ్గరే ఉన్న పార్కులో కొంచెంసేపు నడుస్తాడు. ఆ తరువాత. తనలాగే వచ్చే స్నేహితులతో కాసేపు, పార్కులోని బెంచీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటాడు. ఆయన తిరిగి ఇల్లు చేరేసరికి ఉదయం ఏడు అవుతుంది. ప్రొద్దున మిగిలిపోయిన ఆసనాలు ఏమయినా ఉంటే, అవి చేస్తూ టీవీలో వార్తలు వింటాడు. ఆయన ఉద్దేశంలో టీవీ వార్తలకు తప్ప మరొకందుకు పనికిరాదు. పైపెచ్చూ, అస్తమానం టీవీ చూస్తే కళ్లు పాడవుతాయి. ఏళ్లుగా సాగే సీరియల్స్ చూస్తే బుర్ర పాడవుతుంది. ఇలాంటి సిద్ధాంతాలు ఆయన జీవన సరళిలో కోకొల్లలు.
మధ్యాహ్న భోజనం తరువాత కాసేపు నిద్రపోతాడు. నిద్ర లేచాక కాసేపు భారతమో, భాగవతమో చదువుతాడు. రాత్రి పదింటికి ఠంచన్‌గా నిద్ర. ఆయన దినచర్య గమనించి గడియారంలో టైము సరిచేసుకోవచ్చు నంటారు ఆయన మిత్రులు.
నారాయణగారు ఉపాధ్యాయ వృత్తిలో ఈ మధ్యే రిటైరయ్యారు. గవర్నమెంటు వారిచ్చే పెన్షన్ డబ్బులతో జీవితం చీకూ చింతా లేకుండా గడిచిపోతోంది.
ఆయన పిల్లలిద్దరికీ, ఉత్తర భారతదేశంలో ఉద్యోగాలు. ఎప్పుడో కానీ రాలేరు. ఇంట్లో నారాయణ, వాళ్లావిడ ఇద్దరే ఉంటారు.
నారాయణ ముక్కుసూటి మనిషి. ఆయన సిద్ధాంతాలు, నమ్మకాలు తప్పు అని అనలేము. కాని జీవితం ఎప్పుడూ వంద శాతం సిద్ధాంతాలకు లోబడి నడవదు. కాస్త అటూ ఇటూగా మినహాయింపులు ఇస్తూ, నెట్టుకు పోవాలి. ఎవరైనా ఇదే విషయం నారాయణతో ప్రస్తావిస్తే, ఆయన ఒప్పుకోడు సరికదా - ఎదుటి వారిది ‘పలాయనవాదం’ అని కొట్టి పారేస్తాడు.
మసక చీకట్లో ఫుట్ మీద నడుస్తున్న నారాయణ పార్కును సమీపించాడు. పార్కు గేటుకు ఇవతలగా ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వెలిసిన ‘చాయ్’ దుకాణం అప్పుడే తెరుస్తున్నట్లుంది. చాయ్ దుకాణానికి కాస్త ఎడంగా రోడ్డు మీద, బిచ్చగాడు ‘మారాజు’ గుడ్డపరచుకుని కూర్చున్నాడు. ఏదో ప్రమాదంలో మారాజు రెండు కాళ్లూ మోకాళ్ల క్రింది వరకూ పోయాయి. వాడు ఎవర్నీ నోరు తెరిచి అడగడు. రోడ్డు మీద నడిచే వ్యక్తి సమీపించగానే దండం పెట్టి ‘అయ్యా!’ అంటాడు,. దోసిలి పడతాడు. అంతే! మరో మాట ఉండదు. దయతలిచిన వారు వాడి దోసిలిలో రూపాయో రెండో వేస్తారు. కొందరు చీదరించుకుంటూ దూరం జరిగి నడుస్తారు. నారాయణ లాంటి మరి కొందరు ‘రోడ్డును ఆక్రమించావు’ అంటూ ఆక్షేపిస్తారు. పైపెచ్చూ ‘ఏం పేరురా నీది - మారాజట.. మారాజు... ఏ దేశానికి నువ్వు మహారాజువి?’ అంటూ ఈసడిస్తారు. ‘ఏ జన్మలో చేసుకున్న పాపమో’ అంటూ సిద్ధాంతీకరిస్తాడు.
ఇలాంటి దూషణలూ, తిరస్కారాలూ మారాజుకు మామూలే! ‘తల్లిదండ్రులు చిన్ననాడే పెట్టిన పేరు బాబయ్యా! ఆనాడు వాళ్లు ఏం ఆశించి ఈ పేరు పెట్టారో కాని, ఇవ్వేళ, నా కర్మకొద్దీ మీ ముందు ఇలా చేతులు సాచి అడుక్కోవాల్సి వచ్చింది’ అంటూ వాపోతాడు.
వాడిది ఓ దయనీయ గాథ. వాడి కాళ్లుపోక ముందు, వాడూ భార్యా, ఇద్దరు కొడుకులూ, కోడళ్లూ రాజాల్లాగానే బతికారు. కాళ్లు పోయాక కొడుకులిద్దరూ పోరి, ఉంటున్న ఇల్లు తమ పేరున వ్రాయించుకుని, తల్లిదండ్రుల్ని తరిమేశారు. ఓ పూట తిని, మరో పూట పస్తుండాల్సిన కష్టం వాడిది.
అంతటి కష్టంలోనూ, వాడికి ఒకే ఒక ఓదార్పు వాడి భార్య.
‘ఎందుకే! ఈ అవిటివాడ్ని పట్టుకుని ఉంటావు! ఉన్నదంతా కొడుకులకు దోచి పెట్టిన. నా దగ్గర ఇంకా ఏముంది? ఏ వల్లకాట్లోనో వదిలేస్తే, నాలుగు రోజులు బాధపడి కన్నుమూస్తాను. కొడుకులకు మోయాల్సిన బాధ కూడా ఉండదు’ అని వాపోతే...
‘అందేంటయ్యా! అలా అంటావు. ఈ అవిటితనం నాకు వస్తే వల్లకాట్లో విడిచి వస్తావేంటి? దేవుడిచ్చిన జన్మ ఇది. ఆయన బతకమన్నాళ్లూ బతుకుదాం. ఏదీ మన చేతిలో లేదు’ అంటూ అనునయం పలికేది.
‘ఏ జన్మలో చేసుకున్న పాపమో...’ అన్న నారాయణ లాంటి వాళ్ల మాటలకు ఆమె మాటలకు ఎంత తేడా!
పైగా విడిచిపెట్టటాలూ, మారుమనువులు వాళ్ల కులాల్లో మామూలే! కొడుకులూ, కోడళ్లు ఆస్తి రాయించుకుని నిరాదరణకు గురిచేసి, ఇంట్లోంచి తరిమివేయబడ్డ మారాజు పట్ల ఆమెకు జాలి మరింత ఎక్కువయింది.
ప్రొద్దునే్న వాడ్ని తీసుకువచ్చి పార్కు ముందు కూర్చోబెట్టి, తాను కూలీ పనికి వెళ్తుంది. దొరికిన పనిని బట్టి మధ్యాహ్నమో లేదా సాయంకాలమో తిరిగి వస్తుంది. ఇంటికి తీసుకువెళ్తుంది.
అందాకా మారాజుకు ఆ పార్కు ముందరి రోడ్డే అడ్డా! అన్నపానీయాలూ అక్కడే! ఏం తింటాడో, ఎలా బతుకుతాడో ఎవరికీ తెలియదు.
నారాయణ దృష్టిలో బిచ్చగాళ్లందరూ బద్ధకస్తులు. వీరు దేశానికి పట్టిన చీడ. పరుల సంపాదన మీద బ్రతికే పరాన్నజీవులు.
ఆయనకే అధికారం ఉంటే, సమాజానికి ఏ ఉపయోగం లేని వీళ్లందరినీ ఆనాటి
హిట్లర్‌లా కాన్సన్‌ట్రేషన్ క్యాంపులకు తరలించేవాడు.
రాష్ట్రంలో సుమారు పది లక్షల బిచ్చగాళ్లున్నారని, వీళ్లలో చాలామంది నేరప్రవృత్తి కలవారని, అవకాశం దొరికితే ఏ మాత్రమూ దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తారని ఆయన అభిప్రాయం.
పార్కును సమీపిస్తున్నాడు నారాయణ.
ఫుట్‌పాత్‌ను ఆక్రమించి, అప్పుడే తెరవబోతూన్న చాయ్ దుకాణాన్ని, దానికి కాస్త ఎడంగా, రోడ్డు మీద గుడ్డ పరిచి కూర్చున్న మారాజును చూశాడు. విసుక్కున్నాడు. ‘వీళ్లకు అప్పుడే తెల్లారింది’ అనుకున్నాడు.
ఫుట్‌పాత్ దిగి రెండడుగులు వేసి మారాజుకు కాస్త దూరంగా నడవబోయాడు.
‘బాబయ్యా! దూరం... దూరం’ అన్న మారాజు కేక.
ఎడమవేపు క్షణంపాటు తలత్రిప్పి మారాజు వేపు చూడబోయాడు.
లైటు లేకుండా, ఇంకా పూర్తిగా వీడని చీకట్లలో వస్తున్న పాల వ్యాను చప్పుడును కూడా మించిన కేక అది!
నడుస్తున్న నారాయణ లాల్చీ ఎడమ కొస పట్టుకుని లాగిన ఊపునకు తూలి మారాజు మీద పడ్డాడు.
అప్పటికే ఆ పాల వ్యాను నారాయణ కుడివైపును రాచుకుంటూ వెళ్లింది.
అలా ఆ పాల వ్యాను నారాయణను గుద్దగానే, వ్యాను డ్రైవరు తన తప్పును గ్రహించినట్లుంది. ఏక్సిలరేటర్ మీది కాలును మరింత బలంగా నొక్కి మరుక్షణం మాయమయ్యాడు.
ఏం జరిగిందో తెలిసేంతలోపలే, నారాయణ మారాజు మీదకు వొరిగిపోయాడు. ఆయన కళ్లకు నక్షత్రాలు కనిపించాయి.
మారాజు వొళ్లో వొదిగిపోయిన నారాయణకు తన పరిస్థితి మీద అవగాహన కలిగింది. కాస్త తమాయించుకుని లేవబోయాడు. నడుముకు ఏమయిందో కాని లేవలేక పోయాడు. నిస్సహాయత వల్ల ఆవహించిన దీనత్వంతో చుట్టూ చూశాడు.
‘ఏక్సిడెంటు.. పోలీసులు.. కేసు.. వగైరా మాకెందుకులే’ అనుకున్నారేమో, రోడ్డు మీద నడిచేవారు ఎవ్వరూ ఆయనకు సాయం రాలేదు. పైపెచ్చూ నడక వేగం కాస్త పెంచారు.
నారాయణ వెనకగా కూర్చున్న మారాజు నారాయణను తన వొళ్లోకి తీసుకున్నాడు.
నారాయణ అప్పుడప్పుడు పలికే ఈసడింపు మాటలు మారాజు మనసులో మెదలలేదు. వాడి దృష్టంతా నారాయణను ప్రాణాపాయం నుండి తప్పించాలనే ఉంది.
అలా పొదుముకున్న మారాజు, నారాయణ వొళ్లంతా తడిమి చూశాడు. కుడివేపు నడుం భాగం గీరుకుపోయింది. లాల్చీ పైజామా కుడివేపు చిరిగి పోయాయి. వొళ్లు మట్టి కొట్టుకుపోయింది.
మారాజు వొళ్లో వాలిపోయిన నారాయణకు నోరెండుకుపోతోంది. ఆయన కళ్లు తిరుగుతున్నాయి. ఆయనకు తెలీకుండానే గుడ్లు తేలేసి ‘దాహం.. దాహం’ అంటున్నాడు.
తన నీళ్ల బాటిల్ మూత తిప్పి నారాయణ నోటికందించాడు మారాజు. సగం బాటిల్ ఖాళీ అయింది. ఆయన ప్రాణం కాస్త తేరుకున్నట్లయింది. లేవాలన్న ప్రయత్నం చేశాడు. నడుం సహకరించటం లేదు.
దారివెంట పోతోన్న ఆటోని పిలిచి చాయ్‌వాలా సాయంతో నారాయణను ఆటోలో కూర్చోబెట్టాడు మారాజు. అనునయ వాక్యాలు పలికాడు.
ఆటోలో మారాజు మీదకు ఒదిగి కూర్చున్న నారాయణకు ఇప్పుడు మారాజువి మాసిన గుడ్డల్లా అనిపించటం లేదు. చెమట కంపు వేయటం లేదు. రేగిన జుట్టు, బవిరి గడ్డమూ లేవు. వాడో చీడపురుగులా సంఘానికి పట్టిన వేరుపురుగులా కనిపించటంలేదు.
తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా లాగి రక్షించిన ఆపద్బాంధవుడు. మనసున్న మారాజు. మకుటం లేని ‘మహారాజు’.
చీకట్లు పూర్తిగా విచ్చుకున్నాయి. తేలికపడ్డ మనసుని మోసుకుంటూ, ఆటో నారాయణ ఇంటి వేపు నడుస్తోంది.
*

- కూర చిదంబరం, 8639338675