కథ

వసంతంలో రాలిన ఆకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాధర్ మెలకువ వచ్చినా యింకా పక్కమీద దొర్లుతూ శరీరాయాసం తీర్చుకుంటున్నాడు. మనస్సు రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టులాడుతూ ఉంది. శరీరానికి మనస్సుకు సంయమనం తీసుకు రాగలగడం చేతకావడంలేదు.
కిటికీలోంచి సూర్యుడి కిరణాలు గదంతా వ్యాపిస్తూ వున్నాయి. ఈ దృశ్యం చూస్తే పూర్వకాలపు రచయిత ‘ఉదయభాస్కరుడు తన కాంతిపుంజాలను ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నాడు. విద్యాధరుడి గది ఇందుకు మినహాయింపు కాదు’ అని ప్రారంభించేవాడు, అనుకున్నాడు మనసులోనే బిగ్గరగా.
నిన్న సాయంత్రం జరిపిన విహార యాత్ర వివరాలు ఇంకా బుర్రలో కదలాడుతూనే ఉన్నాయి. ‘కనకవదన’తో ఎంతసేపయినా హాయిగా, మనస్సు నింపుకుని గడపవచ్చు. ఎన్నో కబుర్లు, ఎనె్నన్నో పుస్తకాలలో చదివిన ప్రకృతి వర్ణనలు చెబుతూ ఆమె. కాలేజిలో చదువుకున్నవి, యిప్పుడు ఉపన్యాసాలలో జోడిస్తున్నవి అనేక ఉటంకింపులు ఆమెకు అవలీలగా స్ఫురణకు వస్తాయి. ‘కనకవదన’ ఎంతయినా తెలివిగల పిల్ల. చదువు, పాండిత్యం మీద ఎంతయినా శ్రద్ధ ఉన్న మనిషి. కాకపోతే ఇక్కడో దక్షిణ దేశంలో వున్న కేరళ రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ఎందుకు వస్తుంది? పరిశోధన పత్రాలు శరపరంపరగా ఎందుకు జారీ చేస్తుంది?
ఆమె హాస్టల్‌కు వెళ్లిపోయిన తరువాత తను ఇంటికి వచ్చాడు విద్యాధర్. రాత్రి పనె్నండు గంటలయింది నిద్ర పట్టేసరికి. నిద్ర పట్టిందన్న మాటే గాని అన్నీ కనకవదన గురించిన కలలు, కాలక్షేపాలే. తన జీవితంలో అంతగా విస్తరించిపోయింది ఆ పిల్ల.
ఎవరో తలుపు తట్టి తన పేరు పిలుస్తున్నారు. పొద్దునే్న ఎవరయి ఉంటారు? లేవక తప్పదు గనుక పక్కమీద నుంచి కిందకు దూకాడు విద్యాధర్. దుస్తులు సరీగా వున్నాయా లేదా అని చూసుకుని తలుపు తెరిచాడు. పోస్ట్ బంట్రోతు ఎదురయ్యాడు. పొద్దునే్న ఉత్తరాల వ్యవహారం - అంత అందమయింది కాదు అని మనసులోనే విసుక్కున్నాడు.
‘టెలిగ్రాం సార్’ అన్నాడు అతను.
యాంత్రికంగా చేతిలోకి తీసుకుని, అతను అందించిన కాగితం చూసి సంతకం పెట్టేశాడు. అతను నమస్కారం చేసి మరీ వెళ్లిపోయాడు.
విద్యాధర్ వెంటనే టెలిగ్రాం విప్పి చూడలేదు.
ఎందుకంత తొందర. ఎలాగయినా కాగితం తన చేతిలోనే ఉంది. ఇది బయలుదేరి కొన్ని గంటలు, దాదాపు రెండు రోజులయినా అయి ఉంటుంది. అప్పటి నుంచి లేని తొందర, తీరా కాగితం చేతిలోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా దూకవలసిన అవసరం ఏముంది? దాన్ని బల్లమీద పడేసి, బాత్‌రూంలోనికి వెళ్లాడు, ముఖ ప్రక్షాళనం చేసుకోవాలని.
అంతటితో ఆగలేదు. ఆ ప్రయత్నం స్నానం చేసేంతవరకు వ్యాపించింది. పొడి బట్టలు కట్టుకుని, ముఖానికి పౌడర్, స్నో వగయిరా అన్నీ పులిమాడు. పది గంటలకు కనకవదన వస్తానంది. ఆమె వచ్చేటప్పటికి తను శుభ్రంగా తయారయి ఉండనక్కరలేదా మరి? కనకవదన ఇప్పుడు తన గదిలోకి ప్రవేశించినా, అంతకు కొన్ని క్షణాల ముందే ఆమె అందం ప్రత్యక్షమవుతుంది. ఆమె ఆకర్షణ అతనికి ప్రత్యేక అంశం అయిపోతుంది ఇప్పటికి అప్పుడే. ఆమె రాకను ఊహించుకుంటూ ఆనంద వాయువులతో కలిసిపోయి తిరుగుతున్నాడు.
అర్ధనారీశ్వరుడు గదిలో ప్రవేశించి పలుకరించేంత వరకు విద్యాధర్ మళ్లీ ప్రస్తుత ప్రపంచంలోనికి రాలేదు.
‘నిన్న సాయంత్రం వచ్చాను. గది తాళం వేసి ఉంది. ఎక్కడికి చెక్కేశావు?’ అనడిగాడు అర్ధ.
‘షరా మామూలే. ఏమిటి కథ?’
‘నీకు ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కడంలేదు. ఇటువంటి ప్రణయాలు చివరిదాకా చక్కగా ప్రయాణం చేసి తగినంత ఫలితాలను తీసుకురావు’ అన్నాడు అర్ధ, తను పత్రికలో వ్రాసే భాషనే ఉపయోగిస్తూ.
‘నా దారిని నన్ను వెళ్లనీ. అడ్డంకులు రానంతవరకూ అనంతంలో ప్రయాణం చేస్తాను గాని మధ్యలో మానివేయను’ అన్నాడు విద్యాధర్, మళ్లీ తన పుస్తక భాషలోనే.
‘అయితే నీ కర్మ! నిన్ను ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. చెబుతున్నాను. గుర్తుంచుకో. స్నేహితుడినయి వుండి నీకు సరైన సలహా ఇవ్వలేదని నన్ను తరువాత నిందించి లాభం లేదు’ అని అర్ధనారీశ్వరుడు కుర్చీ బల్ల దగ్గరకు లాక్కుని కూలబడ్డాడు. బల్లమీద టెలిగ్రాం అతని కంటపడింది.
‘ఏమిటిది?’
‘నేనూ చూడలేదు. పొద్దునే్న వచ్చింది. నీ చేతులతోనే విప్పి చెప్ప ఏమిటో ఆ సమాచారం?’
అర్ధ కవరు చించి, టెలిగ్రాం కాగితం బయటకు తీశాడు.
‘హతవిధీ! ఎంత దారుణం?’ అన్నాడు వెంటనే.
‘ఏమిటా దారుణం..?’
‘మీ చెల్లెల్ని దగ్గర్నుంచీ.. మీ అన్నయ్య ఆత్మహత్య చేసుకుని, బతుకు చాలించాడట’
‘నిజంగా దారుణమే! ఈ వార్త మీ పేపర్లో వేస్తావా? ప్రొఫెసర్ విద్యాధర స్వామికి భాతృవియోగం’ అని హెడ్డింగ్ పెట్టు’
‘అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావో నాకు ఎంత మాత్రం అర్థంకాదు. మీ అన్న ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆ కథ ఏమిటో తెలిస్తే చెప్పు అని కూడా కథనంలో పూర్తిగా వ్రాస్తాను...’
‘ఏముంది? మామూలు వ్యవహారమే. ఫలించని ప్రేమ, పరుగులు తీసిన ప్రాణం’ అన్నాడు విద్యాధర్.
‘నేను చెబుతూనే వున్నాను గదా! ప్రేమలు ఫలించవు. నా మాట నమ్మకం లేకపోతే - జీవితాన్ని సూటిగా చూసైనా నేర్చుకో...’
‘సరే. ఆ విషయం వదిలెయ్యి. నాకంటె నీవే ఎక్కువ పరితాపం చెందుతున్నట్టున్నావే?’
‘సాటి మనిషి మరణానికి ఒక్క క్షణం అయినా చింతించవా? అందులోనూ నీకు స్వయంగా అన్న. నీకన్నా పెద్దవాడు’ అర్ధనారీశ్వరుడి గొంతు బొంగురు పోయి, కళ్లలోంచి కన్నీటి ధారలు రావటానికి సిద్ధంగా ఉన్నాయి.
విద్యాధర్ ఏమీ మాట్లాడలేదు చాలాసేపటి వరకు. మళ్లీ అర్ధనారీశ్వరుడే అతన్ని కదిలించాల్సి వచ్చింది.
‘ఊరికి వెళతావా?’
‘అవసరం లేదు. అన్నీ అక్కడివాళ్లే చూసుకుంటారు. నేను వెళ్లి చేసేదేమీ లేదు’
విద్యాధర్ అంత నిర్లిప్తంగా ఉండడం, అర్ధకు కాస్త ఆశ్చర్యం అనిపించింది ముందు.
‘నువ్వు నీ ప్రేమకలాపంలో కూరుకుపోయావు. కుటుంబంలో ఇతరులు ఏమయిపోయినా నీకు పట్టదు’
‘నన్ను వదిలెయ్యి. నీ సంగతులేమయినా చెప్పు. శ్రద్ధగా వింటాను’
‘నాకు సంగతులు ఏమున్నాయి? పత్రికలో పని చేయడం నాకు విసుగు వస్తోంది కాని మరో దారిలేదు’
‘జీవితంతో రాజీ పడటంలో నీ తరువాతే ఎవరయినా?’
‘ఎదురు తిరగలేను. వొదిగి ఉంటాను. అది తప్పా?’
‘తప్పు - ఒప్పు అనేది ప్రశ్న కాదు. జీవితాన్ని నీకు కావాల్సినట్లుగా మలచుకోవడం అవసరం. అందుకేమీ ప్రయత్నం చేయడం లేదు నువ్వు. నిన్ను చూసి జాలిపడటం తప్ప ఇంకేం చేయలేను’ అన్నాడు విద్యాధర్.
‘బయటకు పోదాం, వస్తావా?’ అనడిగాడు అర్ధ.
‘రాను. ఇప్పుడు కనకవదన వస్తుంది’
‘అయితే నన్ను వెళ్లిపొమ్మంటావా?’
‘ఎందుకు? నీకు తెలిసిన అమ్మాయే కదా. నీకు తోచిన హితవచనాలు కూడా చెప్పు. నాతో ఎలాగూ ఓడిపోయావు. ఆమెనన్నా నీ మాటలతో ఆకట్టుకుని ప్రేమ పంజరం నుండి బయట పడవేస్తావేమో ప్రయత్నించు...’
‘అనవసర ప్రసంగాలు చేయడం నాకు ఇష్టంలేదు. ఇందాకా చెప్పాను కదా! ఎవరి కర్మకు ఎవరు కర్తలు? ఎవరు ఎవరిని శాసించగలరు?’
‘నిరాశ ముసుగులో దాక్కుంటావన్నమాట?’
‘దురాశ కంటే అదే నయం కదూ! సరే. నేను వెడతాను. మళ్లీ సాయంత్రం వస్తాను’ అని అర్ధనారీశ్వరుడు బయటకు వెళ్లిపోయాడు.
కనకవదన వచ్చిన తరువాత, తన అన్నగారి దుర్మరణం సంగతి చెప్పక తప్పలేదు విద్యాధర్‌కు. టెలిగ్రాం కాగితం ఇంకా బల్లమీదే పడి ఉంది!
‘ప్రేమ ఫలించదని ఇంతవరకు ఉపన్యాసం ఇచ్చి వెళ్లాడు అర్ధా. నీ అభిప్రాయం కూడా అదేనా?’
‘అర్ధ బొత్తిగా రోషదర్శి. వెలుగు చూడడం అతనికి ఇష్టం లేదు. చీకటిలోనే చిద్విలాసంగా బతుకు నడుపుకోవచ్చు అనుకుంటాడు’ అని మూడు ముక్కల్లో చెప్పేసింది కనకవదన.
‘నా దృష్టిలో అతనో పిరికివాడు. ఎదురుగా కనిపిస్తున్న యధార్థాన్ని కూడా గమనించలేనంత అవివేకి!’
‘అతన్ని మంచి మార్గంలోనికి మార్చడం నీ వల్లనే కావాలి. నీకు మంచి స్నేహితుడు గదా అతడు!’
‘నిజమే. అదే నా ప్రయత్నం’
‘నారాయణమూర్తి గారు నన్ను నిన్న పనివేళా పిలిచారు!’
‘ఎందుకు? కొంపదీసి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా?’
‘మీ భయం అదే. ఆయనకు అలాంటి అలవాట్లు లేవు’
‘మరేం చెప్పాడు?’
‘ఓడ్ టు నైటింగేల్ మీద నేను రాసిన వ్యాఖ్యాన వ్యాసం బాగుందని చెప్పటానికి!’
‘అంత బాగుందా?’
‘ఎంత బాగుందనుకుంటే, ఆయన శిలా హృదయం కరిగి ఉంటుంది! ఇంతకూ - నా వ్యాసంలో అన్ని కొత్త విషయాలు మీ దగ్గర నుంచే సేకరించానని నేను చెప్పలేదు!’
‘నువ్వు చెప్పనక్కర్లేదు. ఆ సంగతి ప్రపంచంలో అందరికీ బాగా తెలుసు!’
‘అబ్బ! ఏం స్వాతిశయం!’
‘అంతే కాదు. నీవు స్వంతంగా ఏమన్నా కొత్త ఆలోచన ప్రవేశపెట్టినా, ఎవరూ అది నీ స్వంతం అని ఒక పట్టాన అంగీకరించరు. ఆ విషయం తెలుసుకో’
‘అయితే ఏం చేయాలంటారు?’
‘కొన్నాళ్ల నీ నీడలోంచి దూరంగా తొలుగు. నీ స్వబుద్ధికి పదును పెట్టుకునే ప్రయత్నం చేయి’
‘మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్లడం నాకు ఆలోచనకే అందకుండా ఉంది. పోనీండి. మీ నీడలోనే నేను పెరుగుతున్నానని అందరూ అనుకున్నా అందుకు అభ్యంతరం ఎందుకు చెప్పాలి నేను? నిజం అదే కదా!’
‘ప్రస్తుతానికి అదే నిజం కావచ్చు. కాని నీవు నీ స్వతంత్ర ప్రతిపత్తి సంపాదించుకోవాలి గదా! రచయితలయినా, ఆలోచనా పరులయినా ముందు ఒక ప్రామాణికునికి నమూనాగానే ఉంటారు. క్రమంగా ఆ ముద్ద నుంచి బయటపడి, తను స్వంత దస్తూరి తయారుచేసుకుంటారు. అర్ధకు కూడా నేను చెప్పేది ఇదే. స్వంతంగా ఆలోచించడం చేతకాకపోతే ఇంక ఒకడు మనిషి ఎట్లా అవుతాడు? వార్తలు తిరగరాస్తూ వున్నా, ప్రతి అక్షరంలోనూ నూతనత్వం తీసుకురావటానికి అవకాశం ఉంది. అందుకు ప్రయత్నం చేయడం లేదు అతను. ఎంతసేపూ న్యూనతలో చిక్కుకుపోతున్నాడు!’
‘మీ సిద్ధాంతాలు నాకూ త్వరగా అర్థంకావు. కాస్త ప్రయత్నం చేసిన మీదట వాటిలో వున్న యధార్థత తెలిసి వస్తోంది’
‘దటీజ్ గుడ్! నీ ప్రయత్నం ఫలించుగాక!’ అన్నాడు విద్యాధర్.
తరువాత వాళ్లు సాయంత్రం ఏం చేయాలి? ఎక్కడ గడపాలి అని ప్రణాళిక వేసుకోవడంలో మునిగిపోయారు.
రెండు రోజుల తర్వాత అర్ధనారీశ్వరుడు అకస్మాత్తుగా ఊడిపడ్డాడు.
‘నిన్న సాయంత్రం ఎక్కడికి పోయావు? నీ కోసం వెదకలేక చచ్చిపోయాం...’ అన్నాడు ప్రారంభ వాక్యంలోనే.
‘బహువచనం వాడుతున్నావు. ఏమిటి విషయం?’
‘నేనూ, కనకవదన నీ కోసం గంటసేపు ఊరంతా గాలించాం..’
‘కనకవదన ఎక్కడ? కనిపించదేం? నీవు ఒక్కడివే వచ్చావేం?’
‘ఆమెకు అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసిన అవసరం వచ్చింది. ఆ సంగతి నీతో చెప్పి నీ దగ్గర సెలవు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలోనే నిన్నంతా సమయం వృథా చేసుకున్నాం మేమిద్దరం’
‘ఏమిటంత అకస్మాత్తు?’
‘వాళ్ల ఊరు నుంచి కబురు వచ్చింది. ఆమె తల్లిగారికి సుస్తీగా వుందనీ, కనకవదనను తక్షణమే ఇంటికి రమ్మనీని!’
‘అయితే వెళ్లిపోయిందా?’
‘ఆ! సాయంత్రం ఎనిమిది గంటల ఫ్లయిట్‌లో నేనే ఆమెను పంపివేశాను. నీ కోసం వెదికితే నీ జాడే దొరకలేదు. నీకు ప్రత్యేకంగా చెప్పమని కనక నాకు పురమాయింపు వేసింది. అదీ సంగతి!’
ఆమెతో టెలిఫోన్‌లో మాట్లాడాడు విద్యాధర్.
ఆమె గబగబ తన వృత్తాంతం చెప్పుకుపోయింది. ‘విద్యా... నన్ను మోసం చేస్తున్నారు మా వాళ్లు. మా అమ్మకు ఏమీ సుస్తీ లేదు. నవరత్నఖచితంగా నడయాడుతూనే ఉంది. నాకో పెళ్లి సంబంధం స్థిరం చేశారు. నన్ను అంగీకరించమని బలవంతం చేస్తున్నారు. నా ప్రాణం ఉండగా ఇందుకు వొప్పుకోనని చెబుతున్నా వినడం లేదు. వాళ్ల బలవంతం ఇంకా కొనసాగితే నాకు మీ అన్నగారు చూపిన మార్గం ఒక్కటే శరణ్యం. వివరంగా ఉత్తరం రాస్తాను. నన్ను ఎట్లా రక్షించుకుంటావో నీదే భారం!’
విద్యాధర్ కుంగిపోయాడు.
కనకవదన ఇలాంటి విపత్కర స్థితిలో ఇరుక్కుపోతుందనే ఆలోచనే అతనికి మింగుడు పడటం లేదు. అంత స్థిరచిత్తం వున్న మనిషి!
అర్ధ తన మామూలు పాడే పాడుతున్నాడు.
‘నేను చెబుతూనే ఉన్నాను గదా! విన్నావా? ప్రేమలు ఫలించవు గాక ఫలించవు. కనకవదన నీకు దక్కదని నేను ముందు నించీ చెబుతూనే వున్నాను గదా..’
అతని నోరు మూయించడం ఎలాగో తెలియక విద్యాధర్ తనే బయటకు వెళ్లిపోయాడు.
కనకవదనకు ఎన్నిసార్లు సెల్‌ఫోన్‌లో కలుసుకుందామని ప్రయత్నించినా, ‘అన్ రీచబుల్’ అనే వర్తమానమే వస్తోంది.
విద్యాధర్ ఏం చేయాలో ఆలోచించేలోపుగానే, ఆమె ఊరి నుంచీ ఉత్తరం వచ్చింది.
‘సర్! నేను కనకవదన స్నేహితురాలిని! మీకో విషాద వార్త చెప్పడం నా పాలిట పడటం నా దురదృష్టం. కనకవదనను కాళ్లు చేతులు కట్టివేసి అయినా తాము ఏర్పాటు చేసిన పెళ్లి జరిపించాలని మూర్ఖులయిన తలిదండ్రులు నిశ్చయించుకున్నారు. ఆమెకు మరింకో మార్గంలేక ఆత్మహత్యనే ఆహ్వానించవలసి వచ్చింది. పోయేటప్పుడు మిమ్మల్ని గురించే తలుచుకుంటూ ఉండింది. మీకు క్షమాపణలు విన్నవించుకుంది. ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఇప్పుడు మనం ఇంకేమీ చేయలేం...’ అని వ్రాసింది ఆమెకు ప్రాణ స్నేహితురాలుగా పరిచయం చేసుకున్న మనిషి.
విద్యాధర్‌ను ఆస్పత్రిలో చేర్పించడం, తగిన సంరక్షణ కూర్చడం, మూడు రోజుల విశ్రాంతి తరువాత తిరిగి ఇంటికి తీసుకు రావడం అర్ధనారీశ్వరుడి పని అయింది.
‘ప్రేమ ఫలించదని నేను చెబుతూనే ఉన్నాను గదా!’ అనేది అర్ధ తరచుగా చెప్పే వాక్యం.
‘ఎందుకు ఫలించకపోవాలి?’ అంటే, అది నిజమైన ప్రేమ కాదు. కృతకంగా తెచ్చిపెట్టుకున్నదే అయి ఉండాలి.
‘ప్రేమించిన వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవడం ఒక్కటే మార్గం...’ అని అర్ధ అంటే ‘వాళ్ల ప్రాణాలు కలకాలం వసంతంలో కలుస్తాయి’ అంటాడు విద్యాధర్.
సూర్యాస్తమయం అయింది. చీకటి పొరలు బాగా కమ్ముకున్నాయి. అయినా అతని ఇంట్లో దీపం వెలిగించే వాళ్లు ఎవరూ లేరు.
*

- శ్రీవిరించి

- శ్రీవిరించి