కథ

ఊదర దుత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో
ఎంపికైన రచన
**
వెంకటేశు ఊళ్లో బస్సు దిగే కొద్దికి ఉదయం పది గంటలైంది. బస్సు దిగి చుట్టూ చూశాడు. తాతలనాటి రావిచెట్టు ఆకుల చేతుల్ని ఊపి తనకు స్వాగతం చెబుతున్నట్లుంది. రావిచెట్లో చాలా కొమ్మలు ఎండిపోయి ఏ క్షణంలోనైనా విరిగి క్రింద పడడానికి సిద్ధంగా ఉన్నాయి. కంప పుల్లలతో కట్టిన కాకి గూళ్లలో పసిపిల్లలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ పొట్ట చేతబట్టుకొని ఎక్కడికో పోయినట్టున్నాయి. క్రింది కొమ్మల్లో ఒకటి రెంటిని నరికినట్టున్నారు. ఆ ఎండిన మోడులు దిగాలుగా ఉన్నాయి. మొత్తానికి రావిచెట్టు ఎన్నాళ్లుంటుందో ననుకొంటూ క్రిందికి చూశాడు. రచ్చ మీద మేకా పులి ఆడేవాళ్లు గాని, వానాగుంతలు ఆడేవాళ్లు గాని, పురాణం చదువుకొనే వాళ్లు గాని, ఆటలాడుకొనే పిల్లకాయలు గాని కనిపించలేదు. రచ్చనానుకొని నాలుగు సిమెంటు దిమ్మెలు, వాటి మధ్యలో నిలబెట్టిన జెండా పైపులు రంగులు రంగులుగా ముస్తాబై నిల్చుకొని ఉండాయి. కాకిరెట్టలు, కాకి గూళ్ల నుంచి రాలిన ముళ్లకంపలు, ఈకలు, కప్పల కళేబరాలు, ఎముకలు, ఎండుటాకులతో దుర్మార్గుని మనసులా రచ్చబండ వికృతంగా ఉంది.
వెంకటేశు ఒక నిట్టూర్పు విడిచి రామాలయం వైపు చూశాడు. ఇంతలో అక్కడున్న నలుగుర్ని ఎక్కించుకొని గడగడా శబ్దం చేసి వెనక్కు ముందుకు ఊగి బస్సు బయలుదేరింది. వెంకటేశు రుమాలు తీసి ముక్కుకు అడ్డం పెట్టుకొన్నాడు. రామాలయం ముందర రేకుల షెడ్డులో నాలుగు కుక్కలు అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నాయి. రామాలయానికి అవతల ఎండిపోయిన సర్కారు బావి అనాథలా ఉంది. బావిగోడకు కట్టిన కట్రాళ్లు గచ్చు ఊడిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఊరి చెత్తతో బావి పూడిపోయి పూలమ్మిన చోట కట్టెలమ్మేవాడిలా దీనంగా ఉంది.
ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తారేమోనని చూసిన వెంకటేశుకు నిరాశే మిగిలింది. ఇక లాభం లేదనుకొని చెరువుకట్ట వెంబడి నడక ప్రారంభించాడు. చెరువు మునుపటికంటే బాగా లోతైంది. పనికి ఆహార పథకం క్రింద పనిచేసేవాళ్లు చెర్లో దూరంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు గాని చెరువు నిండితే చానా నీళ్లు నిలుస్తాయనుకొంటూ వెంకటేశు నడక సాగించాడు. ఊరొదిలిన ఏడేండ్ల తర్వాత మళ్లీ ఊళ్లో అడుగుబెట్టిన వెంకటేశుకు అద్భుతాలేవీ కనిపించలేదు. కనుచూపు మేరలో ఎక్కడా పచ్చదనమన్నమాటే లేదు.
చెరువు కట్ట దిగగానే బండి బాట వస్తుంది. ఆ బాట కొండ కింది దాకా పోతుంది. మధ్యలో వచ్చేదే సంపంగి మిట్ట. సంపంగి మిట్టంటే ఇరవై ఇండ్లుండే చిన్న గ్రామం. బస్సు దిగిన చోటు నుండి సంపంగి మిట్ట ఒకటిన్నర మైలు. పశువులు మేతకై అడవికి వెళ్లే దారికి తూర్పున పదిండ్లు, పడమరో పది ఇంతే సంపంగి మిట్ట. పడమరిండ్లోల్లు రైతులు, తూరుపిండ్లోల్లు యానాదులు, కూలీలు, వెంకటేశు సొంతూరిదే. ముప్పైమూడేండ్ల వయసు దాకా ఊర్లోనే ఉండి ఏడేండ్లకు ముందే టౌను చేరుకున్నాడు. ఈ ఏడేండ్లల్లో ఎప్పుడూ ఊళ్లో అడుగుబెట్టలా! ఇప్పుడు రాక తప్పలా!
నర్శిగాడు ఎలుకలు పట్టడంలో ఎత్తినచెయ్యి. పాతాళంలో దాక్కోనున్న ఎలికైనా మంత్రమేసినట్టు బయట రావాల్సిందే. నర్శిగాని చేతిలో చావాల్సిందే. వరిమళ్లు నాటగానే నర్శిగాడు రామయ్య దగ్గరకు పోతాడు. రామయ్య ‘ఏరా! నరసిమ్ములు, చానాదూరం వచ్చినావే’ అంటాడు. ‘నీతో పనుంది మామ’ అంటారు. నర్సిగాడ్ని ఆ ఊళ్లో నరసిమ్ములు అని సక్కంగా పిల్చేది రామయ్య ఒకడే. మిగిల్నోలకు పేరు తెలవక కాదు, నోరు తిరక్కకాదు గాని ‘ఎలుకలు బట్టే యానాదోణ్ణి గూడా పేరుబెట్టి పిలవాల్నా?’ అనే ఈసడింపు. నర్శిగాడు చిన్నప్పుడే వాళ్ల నాయనతో వాని పేరు గురించి గొడవ పడినాడు. వాళ్లనాయిన ‘ఒరే అబ్బీ! నీకు బెట్టినపేరు అట్టా ఇట్టాంటిది కాదు. నరసిమ్మమూర్తి పేరది, నరసిమ్మ మూర్తంటే మన చెంచమ్మను కట్టుకున్నోడు గదా! ఆ సామి పేరు నీది’ అన్నాడు. ‘అంత మంచి పేరైతే ఊళ్లో ఈ నాయాళ్లంతా ‘నర్శిగా! నర్శిగా’ అంటారే’ అనేది నర్శిగాని మనసును పురుగులా తొలిచే బాధ.
‘మావాఁ! నార్లు పోసి, మళ్లు నాటేస్తా ఉండారు, అంతా పచ్చగా తిరిగిపోతా ఉండాయి. రెండువారాల కంతా మళ్లు ఎన్నుకొస్తాయి. ఆ వేళకు రెండు ఊదరదుత్తలు చేసీయాల మావా!’
‘పోయిన కారప్పుడు కూడా రెండు దుత్తలు చేసిస్తిని గదరా!’
ఒకటి నిలేసిన గడ్డపార పడి పగిలిపోయ, ఇంకోదానికి మా ఇంటిది బొక్కకు గుడ్డబెట్టి నీళ్లు తెచ్చుకుంటాండింది. కుక్కలు కొట్లాడుకోని దుత్తమీద పడితే అదిగూడ పోయ’
‘ఇప్పుడు నీళ్లెట్టా దెచ్చుకుంటా ఉండారు’
‘సంతలో బిందె దెచ్చిండ్లా’
‘ఊదర దుత్త దొరకలేదా?’
‘పోటు మాట్లెందుకు లే మావా, నాయాల్ది చెప్పిన మాటింటే గదా! లింగారెడ్డింట్లో బిందెలు జూసినప్పుట్నుంచి దీనికి చీర నిలవలా!’
‘సరేలే మబ్బులు మోడాలుగా ఉంది. పద్దినాలు పట్టచ్చు. మళ్లీ నన్ను నిష్ఠూరం చెయ్యద్దు’
‘నువ్వే అట్లంటే ఎట్టమావా’
‘మనిషి ప్రాణానికి మట్టి కుండకి మాటియ్యలేము నరసిమ్ములు’
‘సరేలే మావా! దుత్తకు మూతి చిన్నదిగా ఉండాల, పిడికిలి పట్టితే చాలు, గొంతు అరడుగుండాల, కడుపు కొంచెం ఉబ్బుగానే ఉండాల’
‘నువ్వు పదరబ్బా, ఇన్ని వైనాలు మీ నాయిన గూడా జెప్పలా! ఆవం కాల్చినప్పుడు చెప్పి పంపతా, వొచ్చి తీసుకోనిబో’
‘ఏమియ్యాల్లో చెప్పలేదు గద మావా’
‘ఇద్దువుపో నరసిమ్ములు. నువ్వు దెచ్చుకొన్న వడ్లగింజల్లో నాక్కొన్నిస్తావు అంతేగదా, ఇంకేం కాసులిస్తావా, కాంచనమిస్తావా?’
‘నేను మారాజైతే నీ పనితనానికి కాంచనమే ఇచ్చేవోణ్ణి మావాఁ’
‘ఒరే! అది తింటే అరగదు గాని, మీయక్క రాత్రి ఉప్పిడిబియ్యం కూడు జేసింది. కూట్నీల్లు కమ్మగా ఉండాయి. నువ్వు గూడా ఒక గుండు చెంబు తాగిపో’
‘ఇంటికొస్తే కూట్నీల్లో, సద్దో తాగంది పోనీవు గదా’
‘ఉండేటప్పుడే నరసిమ్ములు ఈ బడాయి. లేనప్పుడు నేను మాత్రం ఏం జేస్తాను జెప్పు’
‘నీ మాటలు మాయక్క ఇనేసింది మావా, ఇద్దో కూట్నీల్లొచ్చేసినాయి’
‘ఏమబ్బా! అంతా బాగుండారా!’
‘బాగుండాం కా, చాన్నాల్లయిందికా మా ఇండ్లకల్ల రాలేదే’
‘కుండల్లేవు. సరేగాని మీ ఇంటామె నీళ్లుబోసుకోనుందా!’
‘అవునుకా, ఐదోనెల. మా నాయన పుడతా డనుకొంటాండాంకా’
‘మంచిదబ్బా బద్రంగా చూస్కో’
‘సరేకా! వస్తాను మావాఁ, నాకత మర్సిపోవు గదా, ఉందునా’
* * *
నర్శిగా లింగారెడ్డి మడి గెనుమీద నిల్చుకొన్నాడు. భుజమీద గడ్డపార మొన మెరస్తా ఉంది. మొన్ననే కొలిమి కాడికిపోయి గడ్డపారకు మొనవేయించుకొని వచ్చినాడు. దాని మొన జూస్తాంటే నర్శిగాడు పాతాళానికైనా బిలం తవ్వగల డనిపిస్తా ఉంది. మోకాలి పైకి ఎగగట్టుకొన్న పంచ, భుజంపైనొక తుండుగుడ్డ, దానిపైన గడ్డపార, చేతిలో ఊదరదుత్త, దుత్తలో కాసింత వరిగడ్డి, రెండు ఎండు పిడకలు ఉన్నాయి. నర్శిగాడు గడ్డపార గెనుమీద నిలేసి దుత్త కిందబెట్టి గెనుమంతా ఇట్లా అట్లా తిరిగాడు. నడిగెనుములో మంటి దిబ్బ కనిపించింది. నర్శిగాడు మట్టిదిబ్బను జాగ్రత్తగా గమనించాడు. పైవరుస మట్టి నల్లగా తేమగా ఉంది. కింది వరుసల్లో ఎండిపోయి తెల్లగా కనిపిస్తా ఉంది. అక్కడక్కడా ఆ మట్టిలో వరి ఎన్నులు కనిపిస్తా ఉండాయి. మట్టిలో తేమనిబట్టి ఎలుక దాంట్లో ఉందని నర్శిగాడు నిర్ధారించుకొన్నాడు. గెనుములో గరిక జడలు జడలుగా అల్లుకొని పొయ్యుండాది. తుంగ ఏపుగా పెరిగిపొయ్యుండాది. గెనుములో ఎవురూ గడ్డి కోసినట్లు లేరు. నర్శిగానికి సందేహం కలిగిన చోట గడ్డిపీకి చూశాడు. ఒక చోట మట్టిదిబ్బలేని బొరియ కనిపించింది. మడికయ్య దాటిపోయి ఒక రాయిని తెచ్చి ఆ బొరియలో వేసి గడ్డపారతో కొట్టి గట్టిగా బిగించాడు.
ఇంకెక్కడ కలుగులు లేవని నిర్ధారించుకొన్న తర్వాత మట్టి దిబ్బను పక్కకుబెట్టి బొరియ మూతిని గడ్డపారతో తవ్వి ఊదరదుత్త మూతి పట్టేటట్టు తయారుచేశాడు. కంచెలో నుంచి నాలుగు పుల్లలు దెచ్చి మంట రగిలించాడు. మంటపైన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పిడకలు ఒక పక్కగాబెట్టాడు. అవి ఒక పక్కన అంటుకోగానే పక్కకు దీసి దుత్తలో వేసి వరిగడ్డి అడ్డం పెట్టాడు. దుత్తమూతిని కలుగు మూతిలోబెట్టి బోర్లించాడు. బురద మన్నుతో దుత్త మూతికి నేలకు పొగ రాకుండా మెత్తు వేశాడు. దుత్త అడుగున రంధ్రంలో నుంచి పొగ బయటకు వస్తా ఉంది. అలా బయటకు రాకుండా ఊదడం మొదలుబెట్టాడు. మధ్యమధ్యలో తలపైకెత్తి ఇట్లాఅట్లా చూశాడు. నాలుగడుగుల కాపక్క పొగ గెనుములో నుంచి బయటికొస్తా ఉంది. నర్శిగాడు అక్కడికిపోయి చూశాడు. దట్టంగా అల్లుకుపోయిన గరిక కింద బొరియ కనిపించింది. గబగబా ఒక రాయి దెచ్చి కలుగులో వేసి గడ్డపారతో బొరియ పొగ రాకుండా బిగించాడు.
నర్శిగాడు మళ్లీ ఊదడం మొదలుపెట్టాడు. ఊదగా ఊదగా కొంతసేపటికి ఊదడం కష్టమైంది. పొగ వెనక్కి రావడం మొదలైంది. అంటే కలుగంతా పొగతో నిండిపోయినట్లు నర్శిగాడు నిర్ధారించుకొన్నాడు. ఊదడం ఆపి గెనుమీద ఒకసారి అటూ ఇటూ తిరిగాడు. ఊదరదుత్త రంధ్రంలో నుంచి పొగ, చినీలోనుంచి ఎగజిమ్మినట్లు చిమ్ముతూ ఉంది. అంత దూరంలో లింగారెడ్డి సేద్దిగాణ్ణి వెంటబెట్టుకొని వస్తా ఉండాడు. లింగారెడ్డి వచ్చేపాటికి నర్శిగాడు దుత్తదీసి ఎనిమిదెలుకల్ని కొట్టి సోలుపుగా పెట్టాడు. లింకారెడ్డి చూసి ‘నేను పిల్చే పని పెట్టుకోవద్దు నర్శిగా! అక్కరగా వచ్చి చూసుకుంటా ఉండు, నీకష్టం ఊరికేబోదులే, కోతలప్పుడు చూసుకొంటాలె’ అన్నాడు.
నర్శిగాడు తలూపి ఊదర దుత్త ఖాళీచేసి ఎలుకల్ని దీసుకొని ఇంటిముఖం పట్టినాడు.
* * *
వెంకటేశు సంపంగిమిట్ట సమీపించే కొద్దీ పాతజ్ఞాపకాలు తేనెటీగల్లా చుట్టుముడుతున్నాయి. నర్శిగాని కొడుకు చంద్రప్ప. వాడు బెంగుళూరులో టైలరు. నాలుగేళ్లకు ముందు టైలరు పని తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బెంగుళూరు చేరిపోయినాడు. నాలుగు చేతుల సంపాదన, పచ్చగానే ఉండారని, వాళ్లక్కూడా ఒక కొడుకు పుట్టినాడని ఎవరో అంటే వెంకటేసుకు తెలిసింది. చంద్రప్ప ఏడుదాకా చదువుకొన్నాడు. దానిక్కూడా చానా కష్టపడాల్సి వచ్చింది. వాడు ఐదులో ఉండగా ఒకనాడు పెద్ద గొడవ జరిగింది. సందకాడ వెంకటేసు వాళ్ల నాయన రామయ్య దగ్గరికి నర్శిగాడు వచ్చినాడు. చంద్రప్ప వీపు చూపించి ‘ఈ అనే్నయం చూడు మావాఁ’ అన్నాడు.
రామయ్య కడుపు ఆవం కాలినట్లు కాలింది. చంద్రప్ప వీపు మీద వాతలు నెత్తురు చిమ్మతా ఉండాయి. వెంకటేసు ఇంట్లో నుంచి బయటకొచ్చి ‘వాణ్ణి సిద్దారెడ్డి ఐవోరు కొట్నాడు’ అన్నాడు.
‘ఎందుకు?’ రామయ్య అడిగాడు.
అయివోరు ఒకోకర్నే లేపి ‘మీ నాయినోల్లు ఏం పని జేస్తారో సెప్పండ్రా’ అనే్నడు మేమందురు చెప్పినాక ‘గొరిగేవాని కొడుకు గొరగాల, ఉతికేవాని కొడుకు ఉతకాల, కుండలు చేసేవాని కొడుకు కుండలు చేయాల, ఎలుకలుబట్టే వాని కొడుకు ఎలుకలు బట్టాల, మీరంతా సదివి ఏదేశానే్నలాల్రా?’ అనే్నడు.
‘సూస్తివా మావాఁ అయివోరు గాని పొగురు’ అన్నాడు నరసిమ్ములు.
‘నువ్వుండ్రా వాడు సెప్పనీ, మల్లేమైందిరా?’ అన్నాడు రామయ్య కొడుకు వైపు తిరిగి.
చంద్రప్ప లేచి ‘మీ నాయన మడకదున్ని సేద్దెం జేస్తాండ్లా సా, నువ్వెందుకు అయివోరైతివి, నువ్వు గూడా మడకదున్నాల గదా’ అన్నాడు, ఇంగంతే, అయివోరు గంగమ్మ పూన్నోడు మాదిరి ఊగూగి కొట్నాడు’
‘వాని తాడుదెగ. సూడు మావాఁ లేదర బిడ్డని గూడా సూడకుండా ఎట్టగొట్నాడో, మా ఆడది సూడలా ఇంకా, సూసుంటే అల్లకల్లోలం చేసింటాది. ఏం జేద్దాం సెప్పు వీడు ఇస్కూలుకు పోనంటాండాడు’
‘పోకుండా అయివోరు సెప్పినట్టు ఎలుకలు పట్టుకొంటాడా? ఈ దరిద్రాలన్నీ మనతోనే పోవాల. వాల్లంటే అట్నే అంటారు. పంచాయితికి పోతే అయివోరికి ఎదురుచెప్పిన వీనిదే తప్పంటారు. వాల్లకుండే బలము సదువే. అది మనకు రావాలంటే కొన్ని తిట్లు తినాల్సిందే. కొన్ని దెబ్బలు భరించాల్సిందే. కొన్ని కష్టాలు నిబ్బరించుకోవాల్సిందే. మీయక్క నడిగి ఎన్నపూస తీసుకోని బొయ్యి పిలగానికి పుయ్యి. రెండు దినాలాగి బడికి పంపు. గొడవ మంచిదిగాదు పోండి’ అన్నాడు రామయ్య.
మిగిలిన రెండేండ్లు సిద్దారెడ్డి చంద్రప్పకు నరకం చూపించాడు. ఏడు తర్వాత ఎవరెన్ని చెప్పినా చంద్రప్ప చదువుకు పోనన్నాడు. నర్శిమ్ములు నలిగి నలిగి టైలరు పనికి వదిలినాడు. చంద్రప్ప పని బాగా నేర్చుకోని బెంగుళూరు చేరిపోయినాడు. నర్శిమ్ములు ఊరు వదల్లేదు. వృత్తి వదల్లేదు. బావులెండిపోయి బోర్లు వచ్చినాయి. సేద్యాలు పలచబడినాయి. రామయ్య చనిపోయినప్పుడు నర్శిమ్ములు ఎదకొట్టుకోని ఏడ్చినాడు. నా దేవుడు నాకు దూరమైపోయినాడే అని దిగులుపడిపోయినాడు. రామయ్య చేసిచ్చిన ఊదర దుత్తల్ని చూసినప్పుడంతా కళ్లల్లో నీళ్లు పెట్టుకునేవాడు.
రామయ్య చనిపోవడంతో జరుగుబాటు కష్టమై వెంకటేశు పట్నం చేరుకొన్నాడు. పెళ్లి జేసుకొన్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్‌గా చేస్తున్నాడు. ఆ రోజు పొద్దునే్న లేవగానే చంద్రప్ప దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. ‘మావాఁ మా నాయనకు ఒల్లు బాగలేదు. నిన్ను కలవరిస్తా ఉండాడు. నువ్వు బయల్దేరి రా’ అన్నాడు.
‘నువ్వు బెంగుళూరి నుంచి ఎప్పుడొస్తివి. ఇంతకీ మావకేమైంది’ అడిగాడు వెంకటేశు.
‘అన్నీ మళ్లీ మాట్లాడుకుందాం నువ్వు ఎలబారి రా మావాఁ’ అన్నాడు.
‘అద్సరే సెంద్రా! మామకేమయింది?’
‘నువ్వే సూద్దువుగాని రా!’
వెంకటేశుకు అంతా అయోమయంగా ఉంది. ఏమయ్యుంటుందో ఊహించడానికి ధైర్యం చాలట్లేదు. చంద్రప్పేమో చెప్పడు, టౌనులో నుంచి ఇప్పటి దాకా వెంటాడుతున్న ఉత్కంఠత తొలగలేదు. ఇద్దరూ ఊళ్లోకి అడుగుపెట్టారు. ఏదో శబ్దం వెంకటేశు చెవులను తాకింది. స్పష్టత లేదు కాని ఎవరో ఉపన్యాసమిస్తున్నట్లు ఉంది. చంద్రప్ప అదేమి పట్టనట్లు వడివడిగా నడుస్తున్నాడు.
‘ఏంది గలాట సెంద్రా?’
చంద్రప్ప వెనక్కి తిరిగి రెండు క్షణాలు ఆగాడు. నడకలో వెనకబడిన వెంకటేశు చంద్రప్పతో కలుసుకొన్నాడు.
‘బడిమూసేస్తాండారు, ఆ పంచాయితి జరగతా ఉంది’
‘అదేంది సెంద్రా! మనమంతా చదువుకొన్న బడి గదా! ఎందుకు మూసేస్తాండారు’
‘పిల్లకాయిల్లేరు, అంతా కానె్వంటుకు పోతాండారు. ఐవోర్లేమో ఇంటింటికీ వచ్చి, మీ పిలకాయిలకు చదువు బాగా చెబుతామని అంటుండారు. బళ్లోకి వచ్చేదాక అదే మాట. ఆపైన ఏరుదాట్నాక బోడిమల్లన్న కథే. ఈసారి బడి మూతబడేది ఖాయం’ కసిగా అన్నాడు చంద్రప్ప.
వెంకటేశు నిరుత్తరుడయ్యాడు. బడి మూతపడటం అతనికి మింగుడు పడట్లేదు. చంద్రప్పకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఊర్లో బడుండబట్టే గదా వాడు ఏడు దాక సదువుకొనింది. ఆలోచిస్తా ఉండగానే చంద్రప్ప ఇల్లు వచ్చేసింది. ఊరినిండా ఉన్న గుడిసెల మధ్యలో ఒకటి అరా మిద్దిండ్లు కనిపిస్తా ఉండాయి. చంద్రప్ప టైలరైనంక సిమెంటు రేకులు కప్పినట్టుండాడు. ఇంటి ముందర టెంకాయ కీతుల పందిరి కింద గోగునార దారాలతో అల్లిన మంచం మీద నర్శిమ్ములు పడుకోనుండాడు.
చంద్రప్ప పెండ్లాం వెంకటేశుకు నీళ్లిచ్చి ‘అంతా బాగుండారాన్నా?’ అనింది. వెంకటేశు తలూపి మంచం కాడికి పొయ్యినాడు. చంద్రప్ప, వాని పెండ్లాం కూడా మంచం కాడికి వచ్చినారు.
‘వారమైంది నా తాత అన్నందిని, మేము బెంగుళూరు నుంచి వచ్చిన్నాడు అరముద్ద సంగటి దినే్నడు. రెండ్రాత్రుల నుంచి సరిగ్గా మాట్లాడలా, మాట్లాడితే ఒకే మాట ‘వెంకటేసొచ్చినాడా’ అని.. బాగున్నాడునా.. జరమన్నా, అంతే ఇట్లైపోయింది..’
చంద్రప్ప పెండ్లాం చెబుతూ ఉంది.
నర్శిమ్ములు కదిలాడు. కళ్లు దెరిచాడు. వెంకటేశు పలకరించాడు.
‘వస్తివారబ్బా, నిన్ను సూడకుండానే పోతాననుకొంటి, మీ నాయన లేని ఊర్లో నేను బతకలేకుండా ఉండా, మీ నాయిన దగ్గిరికి పోతాండా’
‘అదేం మాట మావాఁ, మేమంతా లేమా, నిన్ను పెద్దాస్పత్రికి పిల్చుకోనిబోతా. లెయ్, లేచి నాలుక్కడులు సంగటిదిను’ అన్నాడు వెంకటేశు.
చంద్రప్ప కంట్లో నీళ్లు ధారగా కారతా ఉండాయి. చంద్రప్ప పెళ్లాం నోటికి కొంగు అడ్డం పెట్టుకొని ఏడస్తా ఉంది. వెంకటేశు కూడా బలవంతంగా కన్నీళ్లు ఆపుకొంటున్నాడు. చంద్రప్ప కొడుకొచ్చి ‘తాతా! నీ ఊదర దుత్తలో చాకిలెట్టుంటే ఈవా’ అని అడిగాడు.
వెంకటేశు అయోమయంగా చంద్రప్ప వైపు చూశాడు.
‘ఎవురేమిచ్చినా ఊదరదుత్తలో పెట్టి కొమ్ముకు తగిలించుకొంటాడు మావా, పెట్లో పెట్టుకోమంటే ఇనడు. ఆ ఊదర దుత్తను అపురూపంగా చూసుకొంటాండాడు’ అన్నాడు.
నర్శిమ్ములు మనవడి నెత్తిన చెయ్యిబెట్టి నిమిరాడు. వాణ్ణి గట్టిగా హత్తుకోవాలనుంది కాబోలు - నీరసం - చేతకాలేదు. చంద్రప్ప వైపు చేయి విసిరాడు. చంద్రప్ప దగ్గరికి వెళ్లాడు. గోడకొమ్ముకు తగిలించిన దుత్త వైపు చేయి చూపించాడు నర్శిమ్ములు. చంద్రప్ప జాగ్రత్తగా ఊదర దుత్తను తీసుకొచ్చాడు. ఆ దుత్తను పొట్ట మీద పెట్టుకొని నర్శిమ్ములు దానిలోకి చేతులు పెట్టి బిస్కెట్ పాకెట్ తీసి మనవడికిచ్చాడు. కోడల్ని రమ్మని సైగ చేశాడు. దుత్తలో నుంచి ఒక మూటదీసి ఆమెకిచ్చాడు. మరొక మూట దీసి వెంకటేశు చేతిలో పెట్టాడు. అందులో డబ్బున్నట్టనిపించింది. ఊదర దుత్తను ప్రేమగా నిమురుతూ నర్శిమ్ములు ‘నాయనా ఎంకటేసూ! ఈ దుడ్డు తీసుకో. వీడు కోపగాడు, వీంతోపనే్ల, ఊర్లో నుంచి బడి బైటపోకూడదు. పేదోల్లు బైట పోలేరు, పేదోల్లు సదువుకోకపోతే ఎట్లా? తీసుకో’ అన్నాడు.
చంద్రప్ప ఊదర దుత్తను తీశాడు కొమ్ముకు తగిలించడానికి. దుత్త ఖాళీగా, తేలిగ్గా ఉంది. నర్శిమ్ములు ఊపిరి ఎగబీలుస్తున్నాడు. వెంకటేశు ఆందోళనతో ‘మావాఁ మావాఁ’ అన్నాడు. చంద్రప్ప వెనక్కి తిరిగాడు. ఊదర దుత్త చెయి జారింది.
*

- ఆముదాల మురళి amudalamurali1975@gmail.com