కథ

మళ్లీ మనిషిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో
సాధారణ ప్రచురణకు
ఎంపికైన రచన
****

ఈ పదేళ్లలో ఉద్యోగాల్లో, జీతాల్లో, వాటితోపాటు ఎగువ మధ్యతరగతి జీవితాల్లో వచ్చిన మార్పుల్ని ఎత్తి చూపిస్తున్నట్టుంది, హైటెక్ సిటీలో మెరిసిపోతున్న హోండా షోరూమ్. ఎదురొచ్చి నన్నూ, స్వాతినీ లోపలికి తీసుకెళ్లినతను కూడా అతికినట్టున్న నీలంరంగు సూట్లో హుందాగా మెరిసిపోతున్నాడు.
రమేష్ పేరూ నే వచ్చిన పనీ చెప్పి, ముకుంద్‌ని కలవాలన్నాను. తనే ముకుంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు.
లోపల గుండ్రటి టీ టేబుల్స్ చుట్టూ నాలుగేసి కుర్చీలు వేసి ఉన్నాయి. వచ్చిన కస్టమర్స్‌కి అతి శ్రద్ధగా మర్యాదలందిస్తున్నారు, ముకుంద్ లాంటి వాళ్లే మరికొందరు. అతను చూపించిన కుర్చీల్లో కూర్చుని, కొనదల్చిన కారు వివరాలు చెప్పాను. అవన్నీ అలవాటే అన్నట్టుగా స్పెసిఫికేషన్స్ తెలియజేసే పత్రాలు తెచ్చి, వివరాలన్నీ నింపమని ఇచ్చాడు. నేనవి ఒకటొకటిగా నింపుతుంటే, ఒళ్లో పాపాయికి షోరూమ్‌లో కార్లు చూపిస్తూ కూర్చుంది స్వాతి.
ముకుంద్ చెప్పిన వివరాలు శ్రద్ధగా వింటుంటే ఇన్నాళ్ల తర్వాత నేను కావాలనుకున్న ఒక లగ్జరీని పొందబోతున్న ఉత్సాహం ఒకవైపు, నే వేసుకున్న బడ్జెట్ సరిపోతుందా అన్న సందేహం ఒకవైపూ, నా ఎన్నిక సరైనదేనా అనే ఆందోళన మరోవైపూ పొట్టలో సీతాకోక చిలుకల్ని ఎగరేశాయి.
టెస్ట్ డ్రైవ్ కోసం కారు తెరిచి లోపల కూర్చోగానే శరీరమంతా ఒక ప్రకంపన... రోడ్డు మీద రివ్వున దూసుకుపోతున్న కార్లో ముందు ముందు మా ప్రయాణాల్ని తల్చుకుంటుంటే, కారు బేసిక్ మోడల్‌కీ, మిడ్ రేంజ్ వేరియంట్‌కీ మధ్య, ఖరీదులో ఉన్న తేడా మనసులోకి వచ్చి చికాకు పెట్టింది. ఈ కారే నా స్థోమతకి కొంచెం పైన ఉంది. చిన్నచిన్న అదనపు సౌకర్యాలకి ఇంకో యాభై వేలు, బేసిక్ మోడల్ చాలని స్వాతి వాదిస్తున్నా నా మనసు లోలోపలే లెక్కలు కట్టడం మొదలుపెట్టింది.
కష్టపడి పైకొచ్చిన నా బోటి వాళ్లంతా మొదట ఆల్టో లాంటి కారేదో కొంటారు. మెల్లిగా ఎప్పుడో కాస్త మెరుగైన కార్లలో ఏదో ఒకటి ఎంచుకుంటారు. కానీ నాకు అలా కొనాలనిపించలేదు. అఖిల్ పుట్టినపుడు స్వాతి చాలాసార్లు అంది, చిన్న కారొకటి కొనుక్కుందాం సెకండ్ హాండ్ దయినా సరే అని. అలా నాకు నచ్చలేదు. కొనేదేదో మనసుకి నచ్చిందే కొనాలని గట్టిగా అనుకున్నా. ఎలాగూ స్వాతి పసివాడితో తీరిక లేకుండా ఉంది. రెండేళ్లకే మళ్లీ ప్రెగ్నెన్సీ. తనెక్కువగా పుట్టింట్లోనే గడపాల్సి వస్తుందని తెలుసు కనుకా, అత్తగారిల్లు కూడా హైదరాబాదే గనకా ఇన్నాళ్లూ కారు కొనకుండానే గడిపేశాను.
కంపెనీ తరఫున ఎక్కడికి పంపితే అక్కడికి కాదనకుండా వెళ్లాను. అంకిత పుట్టేసరికి హోండా సిటీ కొనగలిగే స్థితి వచ్చింది. ఒక్కోసారి మనం చకచకా ఎదుగుతున్నామనుకుంటాం. కావాలనుకున్నది సొంతం చేసుకునే సమయం వచ్చిందనుకునేసరికి, ఆ ఎదుగుదల సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది! ప్చ్...
డ్రైవ్ పూరె్తై స్వాతిని ఇంట్లో దింపేసి ఆఫీస్‌కి వెళ్లిపోయాను. రమేష్ పుణ్యమా అని యాభై వేలకి పైగా తగ్గింపు దొరికింది. చిన్నచిన్న అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే ఇంకో యాభై వేలు సర్దాలి.
ఆఫీస్ పనిలో మునిగివున్నా ఆలోచనలు బడ్జెట్ చుట్టూ తిరుగుతున్నాయి. రమేష్‌కి ఒకసారి థాంక్స్ చెప్పాలని గుర్తొచ్చింది. వాడి సెల్‌కి ఫోన్ చేశాను. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు.
ఇంతలో ‘ఎవరో వెంకట్రామయ్య గార్ట. నీ కోసం వచ్చారు’ అంటూ స్వాతి ఫోన్ చేసింది.
‘వెంకట్రామయ్యగారా? ఎవరబ్బా... ఎక్కణ్ణించి వచ్చారు?’
‘గొల్లపల్లి నించి వచ్చార్ట... మనింటి కోసం తిరిగి తిరిగి వెతుక్కుంటూ వచ్చారు పాపం’ అంది.
రకరకాలుగా పరిభ్రమిస్తున్న ఆలోచనల్ని అదుపు చేస్తూ ‘గుర్తు రావట్లేదే... ఎలా ఉన్నాడాయన?’ అన్నాను.
‘అరవైపైనే ఉండొచ్చు వయసు. సన్నగా పొడుగ్గా ఉన్నారు... బతికి చెడ్డవాడిలా కనిపిస్తున్నారు. కూర్చోమని కాస్త మజ్జిగ ఇచ్చి నీకు ఫోన్ చేస్తున్నా’
స్వాతి మీద చాలా చిరాకూ, కోపం వచ్చాయి. ఎవర్ని పడితే వాళ్లని ఇలాగే లోపలికి రానిస్తుంది!
‘నీకేం పిచ్చా? ఏ దొంగ వెధవో అయినా ఇలాగే మజ్జిగా కాఫీ ఇస్తావా?’
‘అబ్బా అంత తెలీదా శశీ? మీ పాత ఇంట్లో అత్తయ్యా మామయ్యతో ఆయన కూడా ఉన్న ఫొటో చూపించారు. నీతో మాట్లాడాలని అడిగారు పాపం. మీరంతా గొల్లపల్లి వదిలేసి వచ్చేశాక మీ వివరాలు తెలియలేదనీ, పంటలన్నీ నష్టమై పరిస్థితి అంత బాగా లేదనీ అంటే బాధనిపించింది. కూతురి పెళ్లి కుదిరిందట. నువ్వేమైనా సాయం చేస్తావేమో అని వచ్చార్ట!’
మెరుపు మెరిసినట్టయింది. ఈయనకి నా అడ్రస్ ఎలా తెలిసిందీ?
ఇంతలో రమేష్ నించి ఫోన్, ఆఫీస్ లాండ్ లైన్‌కి, వాణ్ని హోల్డ్‌లో పెట్టి, ‘స్వాతీ ఆయనకో వెయ్యి రూపాయలిచ్చి పంపెయ్యి’ అన్నా, అటు వైపొక క్షణం వౌనం.
‘ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నారు’
‘ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను స్వాతీ... తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి పంపెయ్. ఫోన్ నెంబర్ తీసుకో’
‘పెళ్లి ఈ శనివారమే శశీ. మీ ఊరివాడు. బతికిచెడ్డ రైతు’ స్వాతి ఫోన్ మధ్యలోనే కట్ చేసి, రమేష్‌తో ‘ఎక్కడున్నావురా?’ అన్నా.
‘శశీ! సతీష్ ఇంక లేడురా’ రమేష్ గొంతు దుఃఖంతో బరువుగా వినపడింది.
అవాక్కయ్యాను. ఎక్కడో గొల్లపల్లి నించి ఈ వెంకట్రామయ్య, ఇంతటి మహా నగరంలో నా ఇల్లు కనుక్కుని రావడమేమిటి? ఇటుచూస్తే, పూనా నించి స్నేహితుడి గృహప్రవేశం కోసం వచ్చిన రమేష్ తమ్ముడు ఈ ఊళ్లో చనిపోవడమేమిటి?
‘అదేమిట్రా? ఎలా?’ గొంతు పెగుల్చుకుంటూ అడిగాను.
‘నిన్న వాడి ఫ్రెండ్ గృహ ప్రవేశానికి వెళ్లారు కదా వాడూ అనితా. సిటీకి దూరంగా ఎక్కడో మారుమూల కాలనీ కదా అని నా కారు తీసుకెళ్లమన్నాను. నేను కాబ్‌లో వెళ్లిపోయా. అక్కణ్ణించి వెనక్కి వస్తూ ఛాతీలో నెప్పి అన్నాట్ట. మరీ ఎక్కువయ్యేసరికి రోడ్ పక్కన కారాపి, లిఫ్ట్ కోసం ప్రయత్నించార్ట. అక్కడంతా నిర్మానుష్యంగా ఉండడం, ఫోన్ ఛార్జ్ అయిపోవడంతో అనిత చాలా భయపడింది. చాలాసేపు లిఫ్ట్ దొరకలేదుట. చివరికి ఏదో బస్సెక్కి సిటీకొస్తూ బస్సులో ఎవరిదో ఫోన్ తీసుకుని, నాకు ఫోన్ చేసింది. కొలీగ్ కారు తీసుకెళ్లి మధ్యదారిలో వాళ్లని కలుసుకుని కేర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. కారు కీస్ ఇచ్చి ఇద్దరు కుర్రాళ్లని పంపి కారు తెప్పించాను. రాత్రంతా జాగారమే. పొద్దున్న పదింటికి... బాడీ తీసుకెళ్లమని ఇచ్చేశారు’
వెంటనే బయల్దేరి రమేష్ ఇంటికి వెళ్లాను. అప్పటిదాకా ఏ అనారోగ్యమూ లేకుండా వయసులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఈ లోకాన్ని వదిలిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో రమేష్ ఇంట్లో ఎదురుగా కనిపించింది. అనిత, ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులు, రమేష్ కుటుంబం... అంతా శోకసముద్రంలో కొట్టుకుపోతూ కనిపిస్తున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి.
హాల్లో ఒక పక్కగా సోఫాలో కూర్చున్న రమేష్ వాళ్ల నాన్నగార్ని చూస్తే మనసు ద్రవించిపోయింది. వయసు మీద పడి వంగిపోయిన నడుము, బూడిద రంగులోకి తిరిగిన కనుపాపలు, పిడుగులా నెత్తిన పడ్డ కొడుకు మరణ వార్త. షాక్‌లో ఉన్న ఆయన వాలకం చూస్తూ అప్రయత్నంగా అటు వైపు అడుగులేశాను.
హఠాత్తుగా ఆయన దృష్టి నా మీద పడింది. ఒక్క క్షణంలో ఆ ముఖ కవళికలు మారిపోయాయి. ఆవేశంగా లేచి తూలుతూ వచ్చి నా కాలర్ పట్టుకుని ఊపేస్తూ, ‘దుర్మార్గుడా! నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదరా రాక్షసుడా!’ అంటూ అరిచాడాయన.
నిర్ఘాంతపోయాను.
‘అంకుల్! నేను... శశిధర్‌ని’ అంటూ చెప్పబోయాను.
ఆయన ఎడం చేత్తో నా కాలర్‌ని అలాగే గుంజి పట్టుకుని, కుడిచేత్తో నా చెంప ఛెళ్లుమనేలా ఒక్కటిచ్చాడు. అంత శక్తి ఎలా వచ్చిందో. ఒక్క క్షణం నా కళ్లు బైర్లు కమ్మాయి. చెంప భగ్గున మండిపోయింది. శరీరంలోని రక్తమంతా మొహంలోకి వచ్చేసినట్టనిపించింది.
హాల్లో అంతా మావైపు తిరిగారు. లోపల్నించి రమేష్ పరిగెత్తుకు వచ్చాడు. నా కాలర్ విడిపించడానికి ప్రయత్నిస్తూ ‘నాన్నా! వీడు శశి... మర్చిపోయారా?’ అని నాతో ‘సారీరా శశీ. ఎక్స్‌ట్రీలీ సారీ! నాన్నగారు.. తెలుసు కదా అల్జీమర్స్ అడ్వాన్స్ అవుతోందని... ఇంతలో ఈ షాక్’ అన్నాడు.
‘శశా? ఎవడా శశి? మూర్ఖుడా? మర్చిపోయావా వీడు ఏలూరు నించీ కార్లో వస్తుంటే మన కారాపి నన్ను కత్తితో పొడిచి మీ అమ్మ మెళ్లో నగలు దోచుకుపోయిన దొంగ వెధవ... గుర్తు లేదా?... నీ పెళ్లాం ఏదిరా త్రాష్టుడా! దొంగ పురిటి నెప్పులు నటించి, మానవత్వంతో కారాపినందుకు ఇద్దరూ కలిసి నిలువుదోపిడీ చేశారు? సిగ్గులేదురా?’ అష్టవంకర్లు తిరిగిన ఆయన మొహంలో క్రోధం, అసహ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే దిగ్భ్రాంతితో నిలబడిపోయాను.
‘అంకుల్! మీరు పొరబడుతున్నారు. నేను శశిధర్ని... రమేష్ స్నేహితుణ్ని...’ తడబడుతూ చెప్పేంతలో ‘నోర్ముయ్ త్రాష్టుడా... నీలాంటి వెధవలవల్లే మనిషి మీద మనిషికి నమ్మకం పోయింది. మానత్వం మంటగలిసింది. క్షేమంగా ఉండాలంటే ఎవడికీ సాయం చెయ్యకూడదనే ఆలోచన కలుగుతోంది’ అన్నారు రొప్పుతూ.
ఆయన అరుపులకి అంతా గుమిగూడుతుంటే, నా కాలర్ విడిపించుకుని షర్ట్ సరిచేసుకున్నాను. మనసంతా అవమానభారంతో భగభగలాడింది. రమేష్ నా చెయ్యి పట్టుకుని పక్కనున్న గ్రిల్డ్ వరండాలోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. మాటల్లో చెప్పలేని భావాన్ని కళ్లతో పలికిస్తూ నా చేతులు పట్టుకుని క్షమాపణగా చూశాడు.
నన్ను నేను సంబాళించుకుంటూ ‘ఏం పర్వాలేదులేరా.. అంత అర్థం చేసుకోలేనా... నువ్వెళ్లు’ అని వాణ్ణి లోపలికి పంపించాను. గుమ్మంలోంచి సతీష్ శవం కనిపిస్తోంది. సన్న సన్నగా ఏడుపులూ పరామర్శలూ మధ్య రమేష్ వాళ్ల నాన్నగారి మాటలు కూడా ఆగి ఆగి వినిపిస్తున్నాయి.
‘దొంగ వెధవల్లారా! మీకు దోచుకోవాలనుకుంటే దోచుకోండిరా! సినిమాకొచ్చిన వాళ్ల పర్సులు కొట్టేయండి. ఎవడూ సినిమా చూడ్డం మానడు. రోడ్డు మీద నడిచే ఆడవాళ్ల గొలుసులు లాగేయండి. ఎవడూ రోడ్డు మీద నడవడం ఆపేయడు.. రైలుస్టేషన్‌లో పెట్టెలు కొట్టెయ్యండి... ఎవ్వడూ ప్రయాణాలు ఆపెయ్యడు...
‘మానవత్వాన్ని పాతరేసే పన్లు మాత్రం చెయ్యకండిరా నాయనల్లారా! ప్రాణాపాయంలో ఉన్నట్టు నటించి, సాయానికొచ్చిన వాళ్లని పొడిచి మరీ దోచుకోకండిరా! మీవల్ల ఎవ్వరూ ఎవ్వరికీ సాయం చెయ్యడానికి రాకుండా పోతార్రా. ఎంత అవసరమైనా ఎవడి చావు వాడిని చావమని వదిలేస్తార్రా కిరాతకుల్లారా’
దిమ్మెక్కిన తలలోకి ఆ మాటల అంతరార్థం దిగుతుంటే, జరగవలసిన పనుల గురించి కనుక్కుంటూ, నాకు తోచిన పనులు అందుకుంటూ గడిపాను. చూస్తూండగానే అంతిమ యాత్రకి అంతా సిద్ధమైంది. తండ్రి ఉన్న వాళ్లు స్మశానానికి వెళ్లకూడదన్నారు. ఇక అక్కడుండి చేసేదేం లేదని ఇంటికి బయల్దేరాను.
మోటార్ సైకిలెక్కుతుంటే రమేష్ వచ్చాడు. చెమ్మగిల్లిన కళ్లతో వాడివైపు చూశాను.
‘దూర ప్రయాణాలు కార్లో వెళ్తుంటే నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఎవరన్నా లిఫ్ట్ అడిగితే కారాపకండిరా అంటూ. నిండుచూలాలిలా, రోడ్డు మధ్య నెప్పులు పడుతున్నట్టు హెల్ప్‌లెస్‌గా కనపడ్డ స్ర్తి మోసం చేస్తుందనుకోలేదేమో, ఆ దారిదోపిడీ... దోపిడీని మించి తన భుజమీద కత్తితో పొడిచి, అమ్మనీ నాన్నగార్నీ భయభ్రాంతుల్ని చేసి దోచుకోవడం.. ఆ సంఘటన ఆయన మీద అలా ప్రభావం చూపించింది. ‘మంచికి పోయి ప్రాణాపాయం తెచ్చుకోవద్దు నాన్నా’ అంటూ ఒకటికి నాలుగుసార్లు చెప్పేవారు. ఇప్పుడు సతీష్...’ గద్గదమయిన గొంతుని కంట్రోల్ చేసుకుంటూ ‘టైంకి సహాయం దొరికుంటే వాడు బతికేవాడు. అనిత చెప్పింది.. దాదాపు గంటసేపు... అయిదారు కార్లు అటునించి వచ్చినా ఎవరూ ఆపలేదుట. వాణ్ని పోగొట్టుకున్న బాధలో నాన్నగారు...’ బరువుగా అన్నాడు.
‘అదేం పర్లేదురా.. మీ మీద వచ్చి పడ్డ కష్టంతో పోలిస్తే ఇదెంత చిన్న విషయం!’ వాడి భుజం మీద చెయ్యేస్తూ ‘నన్ను చూసి అలా ఎందుకు రియాక్ట్ అయ్యారో, అది మాత్రం అర్థం కాలేదు’ అన్నాను వద్దనుకుంటూనే.
‘నీ షర్ట్ చూసి అనుకుంటా! ‘అదే గళ్ల షర్ట్’ అంటున్నారు వినలేదా. ఉంగరాల జుట్టో, కళ్లో, ముక్కో ఇంకా ఎక్కడో ఏదో పోలిక కనిపించి ఉండచ్చు కూడా...’ సాలోచనగా అన్నాడు.
లోపల్నించి ఎవరో రమేష్‌ని పిలిచారు. ‘శశీ... ఇదంతా మనసులో పెట్టుకోకు.. ప్లీజ్’ అనేసి లోపలికి వెళ్లిపోయాడు.
ఇల్లు చేరేసరికి స్వాతి ఎదురొచ్చింది దిగులు మొహంతో. ‘గీజర్లో వేణ్నీళ్లున్నాయి. ఏవీ ముట్టుకోకుండా స్నానం చేసి రా’ అంది క్లుప్తంగా. తలారా స్నానం చేసి, ఏదో తిన్నాననిపించి మంచం మీద వాలాను. లోపలేదో అశాంతి, ఆ గినె్నలవీ సర్దేసి వచ్చి పక్క మీద కూర్చుంది స్వాతి. అటు జరిగి, తన ఒళ్లో తల పెట్టుకున్నా.
కొంతసేపటి నిశ్శబ్దం.. కొంత ఓదార్పు.
‘వెంకట్రామయ్యగారి విషయం ఏమయింది స్వాతీ? ఏం చేశావు ఇందాక?’ అడిగాను.
‘్ఫన్ నెంబర్ తీసుకోమన్నావుగా.. తీసుకున్నా... మాట్లాడతావా?’ ఆత్రంగా అడిగింది.
‘ఆయన మా ఊరి మోతుబరి రైతు స్వాతీ. చిన్నపుడు మేమంతా చిన్నాచితకా సాయాలు ఆయన్నించి అందుకున్న జ్ఞాపకాలున్నాయి. ఆయనా తన పిల్లల చదువు విషయంలో ఏవైనా అనుమానాలొస్తే నాన్న దగ్గరకి వచ్చేవారు. నేను పై చదువుకి వెళ్లిపోయాక అప్పటి జ్ఞాపకాలన్నీ మరుగున పడిపోయాయి. అలా ఎలా మర్చిపోయానో... అప్ వార్డ్లీ మొబైల్ అంటారే, ఆ బాపతు మనుషుల్లో ఒకణ్ని నేను. చకచకా ఎదగాలనే తాపత్రయంలో నేనెక్కి వచ్చిన మెట్లనే మర్చిపోయాను!
‘ఆయన నీతో చెప్పని విషయం ఒకటుంది.. చదువుకోసం హైదరాబాద్‌కి వస్తున్నపుడు ప్రయాణానికీ, హాస్టల్ ఫీజులకీ ఆయన దగ్గర నేను కొంత డబ్బు తీసుకున్నాను. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో వచ్చిన ఉద్యోగం వదిలేసి, పీజీలో చేరడం నాన్నకి ఇష్టం లేకపోయింది. అందుకని నాన్న నడక్కుండా వెంకట్రామయ్య గార్నడిగి అవసరమైన మొత్తం తీసుకున్నాను. ఎంత తీసుకున్నానో కూడా గుర్తులేదు. ఆయన అప్పట్లో... చిన్న మొత్తాలే అనుకో. చదువుకునే కుర్రాళ్లకి లేదనకుండా సాయం చేసేవాడు. తిరిగిస్తానని ఆయనా అనుకుని ఉండడు. తీసుకున్నపుడు వడ్డీతోసహా తిరిగి ఇవ్వాలనే అనుకున్నాను గాని తర్వాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను!’
నా తల నిమురుతూ నిశ్శబ్దంగా కూర్చుంది స్వాతి. రమేష్ ఇంట్లో జరిగిందంతా చెప్పి, ‘పెద్దాయన తిట్టిన తిట్లకీ, కొట్టిన చెంప దెబ్బకీ, వెంకట్రామయ్యగారి విషయంలో పొద్దున నేను ప్రవర్తించిన తీరు జ్ఞాపకం వచ్చింది స్వాతీ! ఒక వ్యక్తి ప్రతిఫలం ఆశించకుండా మనకి సాయం చేస్తే అతనికి అవసరం వచ్చినపుడు అడక్కుండానే మనమూ సాయం చెయ్యాలి. అడిగినా మొహం చాటేసే వాళ్లకి ఇలాంటి చెంపదెబ్బ అవసరమే’ అన్నాను. స్వాతి ఆ చెంప మీద మృదువుగా రాసింది.
కాసేపటి వౌనం తర్వాత ‘వాళ్లమ్మాయి పెళ్లి ఎప్పుట్ట?’ అడిగాను.
‘ఈ శనివారమే’ అంది.
లోపలి బాధ నించి ఉపశమనం కోసం ప్రయత్నిస్తూ స్వాతి నడిగాను, నా ఫోన్ పట్టుకురమ్మని.
***

వారణాసి నాగలక్ష్మి
85, ప్రైమ్‌రోజ్, ఎల్ అండ్ టి సెరెన్ కౌంటీ, గచ్చిబౌలి, హైదరాబాద్-32
9490751575

-వారణాసి నాగలక్ష్మి