కథ

మనసుకు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
***
ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది అనిపిస్తుంది. కానీ మనసుకు మనసుకు మధ్య ఒక్కోసారి ఏదో వారథి ఏర్పడుతుందో ఏమో, ఒక మనసులో ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మరో మనసును చేరుతూనే ఉంటాయి. అదేనా మనసులు కలవడం అంటే?
* * *
‘ఏం లావుగా ఉంటే తప్పేంటీ?’ కీచుగా అరిచి ప్రశ్నించాడు ప్రకాష్, ఊబకాయం ఊపుకుంటూ పోతున్న మా డ్రాయింగు మేస్టార్ని చూస్తూ, మేం ఇష్టమొచ్చినట్టు జోకులేసుకుని నవ్వుకుంటుంటే, అప్పుడు మేం ఏడోతరగతి చదువుకుంటున్నాం. మాకు వాడి ప్రశ్న మరీ నవ్వు తెప్పించింది అప్పట్లో. ఇవాళ వాడి పెళ్లి జరుగుతుంటే నాకు ఆనాటి వాడి ప్రశే్న చెవుల్లో రింగుమంటోంది. ‘ఏం లావుగా ఉంటే తప్పేంటీ?’
* * *
పెళ్లి కూతురు లక్ష్మిని చూసి కళ్లు తిప్పేసుకున్నాను. అదో రకం బాధ తన్నుకొస్తోంది. చుట్టుపక్కల వాళ్ల మాటలు చెవిని పడుతున్నాయి.
‘అబ్బ! చీరంటే అదీ చీర. ఆ ఒక్క చీర కోసం పది లక్షలు పోసి స్పెషల్‌గా నేతగాళ్లని రప్పించి నేయించాట్ట పెళ్లికూతురి తండ్రి.’
‘పది లక్షలు! అవదూ మరీ. అది జరీ కాదు అచ్చమైన బంగారం. అవన్నీ రంగుపూసలు కాదు అసలుసిసలు రత్నాలు!’
‘ఓసోస్ ఆ మాత్రం మాకూ తెలుసులేవోయ్! పది రోజుల ముందునించీ మీడియాల నిండా ఈ విశేషాలే కదా. ఆ తండ్రికి ఉందీ ఖర్చూ పెడుతున్నాడు’
మహిళల గొంతులు ఆగకుండా ప్రత్యక్ష వ్యాఖ్యానాలిస్తూనే ఉన్నాయి.
నాకు బుర్ర తిరిగిపోతోంది. ఎందుకు చేసుకుంటున్నాడు ప్రకాష్ ఈ పెళ్లి?
కేవలం డబ్బు కోసమేనా?
వాడూ బాగా సంపాదించాడనే చెప్పుకుంటుంటారే అందరూ!
మరింకా ఏంటీ కక్కుర్తి?
లేచి చకచకా బైటకి వెళ్లిపోవాలనిపించింది. కొన్ని వేల మంది జనంతో నిండిపోయి ఉంది కళ్యాం మండపం. ఇప్పుడు బయటపడాలన్నా అసంభవం. కళ్లు పైకి తిప్పి పైన డెకరేషన్ కేసి చూస్తూ భారంగా నిట్టూర్చాను.
‘రవీ! కూల్ డౌన్’ అంది శశి.
‘ఎందుకంత ఇదైపోతావ్? ఎవరి ఇష్టం వాళ్లది. అతనికా అమ్మాయి నచ్చింది. చేసుకుంటున్నాడు. విష్ దెమ్ వెల్ అండ్ ఫర్గెట్’ నాకేదో సైకో థెరపీ ఇస్తున్నట్టు చెప్తోంది శశి.
‘సరేలే’ నేను గొణిగాను.
అందరూ లక్ష్మి చీర గురించి, నగల గురించి, హాలు అలంకరణ గురించి, తదితర ఏర్పాట్ల గురించి తమకు తెలిసిందంతా వాగుతూనే ఉన్నారు. ఎవరూ లక్ష్మి గురించి మాత్రం మాట్లాడట్లేదు. అంత డబ్బున్న తండ్రి ఉన్న అమ్మాయి గురించి ఏమన్నా మాట్లాడాలంటే చాలా దమ్ములుండాలి కదా!
నా బాధ వివరించలేను.
కళ్యాణ మండపం మీద పీటల మీదున్న జంటకేసి చూశాను. ఇప్పుడు ఇద్దరూ పక్కపక్కన కూచోనున్నారు. ఇద్దరూ చిరునవ్వులు చిందించుకుంటూ ఒకరి చెవిలో ఒకరు ఏవేవో చెప్పుకుంటూనే ఉన్నారు, పురోహితులు చెప్తున్నవి చెప్తున్నట్టు యాంత్రికంగా చేస్తూనే.
ప్రకాష్ కళ్లల్లో లక్ష్మి పట్ల గొప్ప ఎడ్మిరేషన్ ఉట్టిపడుతోంది.
లక్ష్మి కళ్లు చెప్పనే అక్కర్లేదు. ప్రకాష్ తప్ప మరేదీ చుట్టుపక్కల లేనట్టే!
మా ప్రకాష్ అభినయంలో దిట్ట అని తెలుసు కానీ మరీ జీవితంలో కూడా అభినయం మీదే ఆధారపడతాడని అనుకోలేదు.
ప్రైమరీ స్కూల్ నించీ కాలేజీ చేరేవరకూ ఇద్దరం ఆప్తమిత్రులం. వాడు నడక నేర్చినప్పటి నించీ నాట్యం నేర్చాడు. భారతీయ శాస్ర్తియ నృత్యంతోపాటు పాశ్చాత్యం కూడా ఔపోసన పట్టేశాడు.
ఎప్పుడూ ఆ అందమైన శిల్పం లాంటి తన శరీరంలోకి ఒక్క ఔన్సు కొవ్వు కూడా చేరకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్ లెవెల్ కొచ్చేసరికి టీవీలో దాదాపు భారతీయ ఛానెల్స్ అన్నిటిలోనూ భాషా భేదం లేకుండా డాన్స్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకోవడం మొదలెట్టాడు. పేరు ప్రఖ్యాతులు సరే. డబ్బూ లోటు లేకుండా సంపాదిస్తూనే ఉండేవాడు.
నేను బిఎస్సీ చదివే రోజుల్లో వాడు ఈ పోటీ షోలలో పాల్గొంటూ ఊరూరూ తిరుగుతూ ముంబైలో స్థిరపడిపోయాడు. నెమ్మదిగా మా మధ్య కాంటాక్ట్స్ తగ్గిపోయాయి.
సినిమా రంగాన్నీ కొన్నాళ్లు నృత్య దర్శకుడిగా ఏలేశాడని విన్నాను.
నేను ఉద్యోగం, పెళ్లీ వీటితో సెటిలయిన పదేళ్ల తరువాత ఇదిగో ఇప్పుడు హఠాత్తుగా ‘మన ఊళ్లోనే నా పెళ్లి. మీరంతా రావాలి’ అంటూ వాడు పంపిన ‘వెండి ఆహ్వానపత్రిక’ అందుకుని ఆనాటి మిత్రులందరం ఫోను, వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా కలుసుకుని ఎవరెక్కడున్నా వాడి పెళ్లినాటికి వచ్చి తీరాలని ఒకళ్ల కొకళ్లం గట్టిగా చెప్పుకుని వచ్చాం అందరమూ.
‘కానీ ప్చ్! ఏంటో అందరికంటే ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటూ...’ నా నిట్టూర్పులు గట్టిగా వినపడ్డాయేమో, శశి నా వైపు మళ్లీ ఓదార్పుగా చూస్తూ, ‘వాట్ రవీ? మధ్యలో నీ నిట్టూర్పులేమిటి? అతను చూడు పెళ్లానె్నంత మురిపెంగా చూసుకుంటున్నాడో’ అంది.
నేను మళ్లీ మండపం వైపు చూశాను. లక్ష్మి ఒంటి రంగు తన మెడలో మెరుస్తున్న పసిడి నగలతో సమానంగా పచ్చగా మెరుస్తోంది.
ఆడపిల్లలందరూ కలలుగనే పసిమి రంగు ఆమె చర్మానిది. లక్ష్మి కనీసం ఐదడుగుల ఆరంగుళాల పొడవు ఉంటుంది - మోడలింగ్‌కి పనికొస్తుంది ఆ హైటు - హైటు మాత్రమే. వెయిట్ సంగతికొస్తే, అడక్కండి. నా కనీసపు అంచనా రెండొందల కేజీలు. మా రాజారావు ‘ఇంకో యాభై వేస్కో’ అంటాడు.
అర్థమైందిగా. ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మిది ఊబకాయం. అదే నా బాధ. నిపుణుడైన శిల్పి చెక్కిన అందగాడైన పురుషుని శిల్పం లాంటి ఆకృతి గల తన అథ్లెటిక్ బాడీని ఇప్పటికీ ప్రకాష్ మెయింటెయిన్ చేస్తున్నాడు.
నడి వయసు దాటిన ఆడవాళ్లు కూడా వాడిని చూస్తే కళ్లు తిప్పుకోలేక పోవడం గమనిస్తూనే ఉన్నాను. వాడి ముఖ సౌందర్యం ముందు సినీ నక్షత్రాలు దిగదుడుపేనని చెప్పుకోవాలి. మరేమిటిది? ఎంత మల్టీబిలియనీర్ కూతురైతే మాత్రం.. ఆమె తండ్రికి దేశవిదేశాల్లో పెద్దపెద్ద వ్యాపారాలూ అంతులేని సంపదా ఉంటే మాత్రం వాడెందుకీ పెళ్లి చేసుకుంటున్నాడో?
కేవలం డబ్బొక్కటేనా కారణం?
‘రవీ, చూడు నీ ఫ్రెండ్ ఎంత ప్రేమగా చూస్తున్నాడో పెళ్లాం వైపు!’ మెచ్చుకోలుగా అంది శశి.
నన్ను చీరఫ్ చెయ్యడానికి తంటాలు గాబోలు! మొత్తానికి పెళ్లై పోయింది. భోజనాల సంగతి చెప్పక్కర్లేదు. తిన్న వాళ్లకి తిన్నన్ని రకాలు! నాకస్సలేం తినాలనిపించలేదు.
‘వెళ్లొస్తాంరా ప్రకాష్! హేపీ మేరీడ్ లైఫ్’ మొత్తానికి శశి చెయ్యిపట్టి, బరబరా లాక్కుంటూ తీసుకుపోయి బయటపడ్డాను.
తర్వాత్తర్వాత వాడి గురించి మీడియా ద్వారానూ మిత్రుల ద్వారానూ చాలానే విన్నాను.
ఎక్కువ కలుసుకునే ఛాన్స్ రాలేదు గానీ మామగారి వ్యాపార బాధ్యతలన్నీ తన భుజాల మీదే వేసుకుని చాలా నైపుణ్యంగా నిర్వహించుకొస్తున్నాడనీ, కార్పొరేట్ రంగంలో మహా సమర్థుడై పోయాడనీ. సంతోషం. మూడేళ్ల తరవాతనుకుంటా ఉన్నట్టుండి వాడి దగ్గర్నుంచి ఫోనొచ్చింది.
‘మీ ఇంటికి కారు పంపిస్తా. నువ్వూ శ్రీమతీ సాయంత్రం మా ఫామ్‌హౌస్‌కి రావాలి’ అన్నాడు.
స్నేహం అన్నాక తప్పదు కదా. నేనూ, శ్రీమతి పిల్లలతో పాటు ఆ విలాసాల కార్లో వాడి ‘్ఫమ్‌హౌస్’ అనబడే భవనానికి వెళ్లాం. కారు దిగుతుండగానే ఏదో పులకింత మనసంతా కమ్మేసింది. మనిషికే కాదు మనిషి నిర్మించిన కొన్ని భవనాలకూ ఆత్మ ఉంటుందని ఎక్కడో చదివాను.
ఇప్పుడీ ఇల్లు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. ‘్భవనం’ చుట్టూఉన్న ‘వనం’ ఆ భవన సౌందర్యాన్ని పెంచింది.
‘రండి రండి! లక్ష్మీ! రవీ వాళ్లొచ్చారు’ కేక పెట్టాడు ప్రకాష్. మెత్తని చీర కట్టి చల్లగా నవ్వుతూ వచ్చింది లక్ష్మి.
‘బాగున్నారా?’ ఆప్యాయంగా అడుగుతూ చల్లటి పానీయం అందించింది. ‘మా తోట దానిమ్మ రసం’ చెప్పింది.
‘వీడే లక్ష్మీ! నేను చెప్తుంటానే బోటనీతో బిఎస్సీ చదివి, బ్యాంక్ ఉద్యోగంలో ఇరుక్కుపోయినా మొక్కల మీద మక్కువతో బతికేస్తూ మంచి నర్సరీ మెయింటెయిన్ చేస్తున్నాడు. వీక్లీల్లో మొక్కల పెంపకాల గురించి వీడు రాసే రకరకాల కాలమ్స్ చదువుతుంటావుగా నువ్వు. అవి రాసే మొక్కల మేధావి మా రవే! ఒరే రవీ, మా లక్ష్మిక్కూడా మొక్కలంటే పిచ్చి ప్రేమరా. నువ్వు రాసే సలహాలు చదివి తు.చ తప్పకుండా ఫాలో అయిపోతుంటుంది. నేనే సరదాగా ఈ మహా నిపుణుడు నా ఫ్రెండే అని తనకి చెప్పలా. పెళ్లిరోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నా. ఆ రోజు హడావిడిలో వీలు కాలేదు. మొన్న హనీమూన్‌లో ఎక్కడికెడితే అక్కడ బొటానికల్ గార్డెన్స్ తిరిగాం. ఆ సందర్భంలో చెప్పా. ఎంత మురిసిపోయిందో! నువ్వు నా ఫ్రెండువని ముందే చెప్పలేదని ఎంత కోపం వచ్చిందో! చూస్తున్నావుగా తను పెంచుతున్న తోటని. మేం ఊళ్లన్నీ తిరిగి వచ్చేసరికి ఈ మధ్య చెట్లు పాడైపోయాయని తను ఒకటే ఇదైపోతుంటే నిన్ను మించిన ఎక్స్‌పర్ట్ లేడని చెప్పి నీకు ఫోన్ కొట్టానన్నమాట. నువ్వొస్తున్నావంటే పొంగిపోయి గురువుగారి ఉపదేశం కోసం ఎదురుచూస్తున్న శిష్య భక్తురాలిలా ఇందాకటి నించీ ఎదురుచూస్తోంది’
నేను ఉప్పొంగిపోయాను. అందరం తోటలోకి నడిచాం. తోటంతా తిప్పి సమస్యను చక్కగా వివరిస్తున్న లక్ష్మిని చూస్తే ముచ్చటేసింది. చెట్లు, మొక్కల పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధకు ముగ్ధుణ్ణయ్యాను.
పెళ్లినాడు గజలక్ష్మిలా కనపడిన లక్ష్మి ఆకారం అలాగే ఉన్నా, ఇప్పుడు
మాత్రం వనలక్ష్మిలా కనపడుతోంది!
ఇద్దరం వివరంగా అన్నీ చర్చించాం. తరువాత ప్రకాష్ చెప్పిన సంగతులు వింటూంటే, నాకూ శశికీ లక్ష్మి గొప్పదనం ఏమిటో తెలిసొచ్చింది.
‘ఈ తోటలో పూలన్నీ చుట్టుపక్కల దేవాలయాలకు పంపుతుందిరా మా ఆవిడ! పళ్లు కూడా సగం దేవాలయాలకు, సగం నిరుపేదలకు, అనాథ శరణాలయాలకు వెడుతుంటాయి. ఇంక తోటలో పనిచేసే పనివాళ్లకు ఏ లోటూ చెయ్యదు. ఈ తోట మీద వ్యాపారం చేసే ఉద్దేశం లేదసలు లక్ష్మికి.
‘అవును మరి! వాళ్లకున్న సముద్రమంత సంపదలో దీని మీద రాబడి చిన్ని బిందువే అవుతుంది. దానధర్మాలకు, దైవకార్యాలకు వినియోగించడమే సరి. సాయంకాలం దాకా వాళ్లింట్లోనే గడిపామా రోజు. లక్ష్మి చక్కగా వంటచేసి ప్రేమగా వడ్డించగలదని కూడా తెలిసింది.
ఇప్పుడామె ఊబకాయం నాకు కనిపించడం లేదు. మొక్కల పట్ల, మనుషుల పట్ల ఆమెకున్న ప్రేమ ముందు ఏదీ సాటి రాదు. లక్ష్మి పట్ల ఇప్పుడు నాక్కూడా కొండంత అభిమానం! నేనూ శశీ ఇద్దరం కాలక్రమేణ ఆమె అభిమానులమై పోయాం. అడపాదడపా అందరం కలుసుకుంటూనే ఉన్నాం. వ్యాపారరీత్యా విదేశాల్లో ఉన్న లక్ష్మి తండ్రి హఠాత్తుగా పోయాడు. వీళ్లు హడావిడిగా ఇండియా వదిలి వెళ్లి వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఆరేళ్లపాటు అక్కడే ఉండిపోయారు.
ఒకనాడు పిడుగులాంటి వార్త విన్నాం. ఇంక ప్రకాష్ ఇండియా వచ్చి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుండగా మాసివ్ హార్టెటాక్‌తో లక్ష్మి మరణించింది! నేనూ శశీ చాలా బాధపడ్డాం. మేమే ఆ విషాదం తట్టుకోలేక పోయాం అంటే ఇంక ప్రకాష్ సంగతి ఊహక్కూడా అందదు. కానీ కాలగమనానికి అడ్డూ అదుపూ ఉండదుగా. బతికున్న వాళ్లు బతక్క తప్పదుగా. ఏడాది తరువాత ఇండియా రాగలిగాడు ప్రకాష్. పెళ్లికి వెళ్లిన మిత్రులం దాదాపు అందరం వాడిని పరామర్శించడానికి వెళ్లాం. మనిషి అప్పుడెలా ఉన్నాడో అలాగే ఉన్నాడు.
మొక్కుబడిగా ఏదో మాట్లాడి వచ్చేస్తుంటే, ‘వాడు బానే ఉన్నాడు’ అన్నాడు ప్రసాద్ నర్మగర్భంగా. ‘ఇంకిప్పుడు ఆస్తంతటికీ వాడే మహారాజు’ అన్నాడు రాజారావు తేటతెల్లంగా.
ఏదో చెప్పలేని బాధ నా హృదయాన్ని మెలితిప్పింది. తరువాత ఆర్నెల్లకి ప్రకాష్ దగ్గర్నుంచి మా మిత్రబృందానికి ఆహ్వానాలందాయి. ఇదివరకటంత గొప్పగానూ ఉన్నాయి ఆహ్వాన పత్రికలు. కొంచెం ఆశ్చర్యపోయాను.
నేనూ శశీ ఆసక్తిగా చదివాం. పెళ్లికూతురి పేరు ‘శారద’.
అమ్మాయి తండ్రి ఇండియాలో వాడి ఆఫీస్‌లోనే పనిచేసే గుమాస్తా కూతురుట. తండ్రి ఈ మధ్యనే పోయాడట’ వార్త మోసుకొచ్చి మీడియ వాళ్లకన్నా అతి వేగంగా ప్రచారం చేశాడు రాజారావు.
ప్రకాష్ ప్రస్తుత సంపదతో పోలిస్తే పెళ్లికూతురు పేదపిల్ల కేటగిరీలోకి వస్తుంది.
అంటే.. ఆనాడు డబ్బెక్కువ. అలాగే బరువూ ఎక్కువ. ఇప్పుడు పేద పిల్ల... డబ్బు తక్కువే కాబట్టి.. ఆమె ఎలా ఉంటుందో ఊహించుకోవాలని నా మనసు ఉవ్విళ్లూరిపోవడం నాకే ఆశ్చర్యం వేసింది.
అదే ధ్యాస పెళ్లి రోజువరకూ.
నా ఆత్రం కనిపెట్టినట్టు కొంటె నవ్వులు వొలకబోస్తూనే ఉంది శశి.
‘నువ్వు మరీనూ రవీ. అతని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావ్? అందరు ఫ్రెండ్స్‌లాగానే అతనూను. ఏదో అతనికి తోచిన రీతిలో అతని బతుకతను బతుకుతున్నాడు’ అంది.
‘కాదులే. నాకు లక్ష్మి గుర్తొస్తోంది. చాలా మంచి మనిషి’ అంటూ మాట తప్పించాలని చూశాను. శశికి తెలీదా నా మనసు.
ఆ రోజు రానే వచ్చింది. పీటల మీద పెళ్లికూతురిని చూస్తూనే స్టన్నయిపోయాం నేనూ, శశి.
రాజారావు భార్య శశితో అంటోంది. ‘ఆ చీర అప్పుడు పీటల మీద లక్ష్మి కట్టుకున్నదే.. వెటకారపు నవ్వు ఆమె మొహంలో.
ఆ అమ్మాయి.. అమ్మాయేవిట్లే, కాస్త రంగు, హైటూ కూడా తక్కువే.. మళ్లీ నవ్వులు.
‘హైటొక్కటేనా వెయిటో?’ మరో మహిళ కవ్వింపు.
‘వెయిటు వెయ్యో వంతు’ మళ్లీ నవ్వులు.
వీళ్ల నోటికి తాళం వేసేవారెవరూ లేరక్కడ.
అర్థమైంది కదా. ఈ పెళ్లికూతురు పీలగా, పరమ నల్లగా. హేవిటో ఈ ప్రకాష్! నేనూ శశీ నోరు మూసేసుకుని పెళ్లి అయ్యేవరకూ ఓపిక పట్టి బయటపడ్డాం.
ఓ రెండు నెలల పాటు దేశ విదేశాల్లో హనీమూన్ జరుపుకోడానికి వెళ్లిపోయాడు ప్రకాష్ అన్నారు మిత్రులు.
రెణ్నెల్ల తరవాత వాడి దగ్గర్నుంచి ఫోన్ కాల్ అందుకున్నాను. ‘మా ఫామ్‌హౌస్‌లో ఓసారి కలుద్దాంరా. చిన్న గెట్ టు గెదర్. నువ్వూ శశీ పిల్లలూ తప్పకుండా రావాలి. నీకు కారు పంపుతాను’
కాదనగలనా? నాకు ఆనాటి తోట జ్ఞాపకాలతో ఆ రాత్రి నిద్రపట్టలేదు. లక్ష్మి ఎంత ప్రేమించిందీ ఆ మొక్కలనీ ఆ పూలనీ - వాటితోపాటు భర్తనీ!
లక్ష్మి స్మృతులతో బరువెక్కిన గుండెలతో ‘్భవనం’లోకి ప్రవేశించాం నేనూ శశీ. పిల్లలు ‘వనం’లోకి ఒకటే పరుగు ఏ మాత్రం మొహమాటం లేకుండా. చాలా దగ్గర స్నేహితులు మరో మూడు కుటుంబాలు వచ్చాయి.
పిల్లలంతా తోటలో పడి ఆగకుండా గెంతులే గెంతులు. చిరుఫలహారాలయ్యాక-
‘రండి తోటలో కాసేపు విహరిద్దాం’‘ అన్నాడు ప్రకాష్. తోటలో ప్రవేశిస్తూనే ‘ఎంత అందంగా పెంచిందీ లక్ష్మక్క ఈ తోటని! చూసీ చూడగానే మనసంతా ఇక్కడే పారేసుకున్నా’ చిన్నగా అంది శారద శశితో.
లక్ష్మక్క! ఎంత ప్రేమగా అంది.. నా మనసు పులకించింది.
‘ఊహూ.. పారేసుకున్నా అనకు. పాడేసుకున్నా అనాలి. పాడెయ్ మరీ’ అన్నాడు నవ్వుతూ ప్రకాష్.
‘ఊరుకోండి’ సిగ్గుపడింది శారద.
‘పాడండీ శారద అని పేరు పెట్టుకున్నాక పాడక తప్పదు’ సరదగా బలవంత పెట్టింది శశి.
నిజంగా పాడుతుందనుకోలేదు మేమిద్దరం.
‘ఇంతలో ‘హాయ్ ఫ్రెండ్స్!’ అంటూ కేక పెట్టి, ‘నాకు తోటలోకి రాగానే ఏ పాట గుర్తొచ్చిందో తెలుసాండీ?’ రాజు భార్య రమ అందరినీ ఉద్దేశించి పెద్ద గొంతుతో గొప్పగా అడిగింది.
‘తోటలో నా రాజు అనీ ఒక పాత పాటుంది అదా?’ ఎవరో అడిగారు.
‘యెస్స్.. యూ ఆర్ కరెక్ట్!’ గ్రాండ్‌గా అంది రమ వైఫ్ ఆఫ్ రాజు.
‘అయితే ఆలస్యమెందుకు? పాడెయ్యండి’ ఎవరో ప్రోత్సహించారు. మొహమాటపడకుండా శుబ్బరంగా పాడేసింది సునాయాసంగా.
అయితే మా చెవులకి మహా ఆయాసం, శ్రమా అయింది.
‘మా శారదకి తోటలోకి రాగానే ఏ పాట గుర్తొస్తుందో తెలుసా?’ ప్రకాష్ శారద వైపు మురిపెంగా చూస్తూ అడిగాడు.
‘మొక్కజొన్న తోటలో అంతేనా?’ కేకెట్టింది రమ.
‘కాదు. నేను చాలా చిన్నపిల్లప్పుడు రేడియోలో అప్పుడప్పుడు వినపడేది. మా అమ్మమ్మ దగ్గర గ్రామ్‌ఫోన్ రికార్డు అంటారే, అదుండేది. ఒక మృదుమధురమైన పాట! ఆ పాట గుర్తొస్తుంది. మీరెవరూ వినుండరసలు’ అంది నవ్వుతూ శారద. మేం వింతగా చూశాం.
‘పాడు మరీ’ తొందరపెట్టాడు ప్రకాష్.
మేం కొంచెం ఆసక్తిగా ఎదురుచూశాం.
‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయమూ ఆ ఆలయములోనీ అందగాడెవరే..’ ‘చల్లగా తియ్యగా ఆ గానం సాగుతూంటే అందులో లీనమై పోకుండా ఉండడం సాధ్యమేనా మానవమాత్రులకు! పాట ఆగగానే ఏదో మత్తులోంచి మేలుకున్నట్టు ఉలిక్కిపడ్డాం అందరం. నెమ్మదిగా తేరుకుని ప్రశంసల జల్లు కురిపించాం. చక్కగా విరగబూసిన మందార చెట్టు దగ్గర నిలబడి, కరుణశ్రీ ‘పుష్పవిలాపం’ పాడుతుంటే ఆశ్చర్యానందాల నుంచి తేరుకోవడం మా తరం కాలేదు. ‘పూలబాసలు తెలుసు ఎంకికి. పూల మనసులూ తెలుసీ కోకిలకి’ అన్నట్టు ఆ కోకిలగాన మాధుర్యంలో అలా అలా ఓలలాడి తడిసి ముద్దయిపోయాం మేం అందరం. అందరి ముఖాల్లోనూ అబ్బురం. ఏదో అద్భుతం అనుభవించినంత ఆనందం.
‘మరి నా ఫేవరైట్ పాడవా? ఆ.. అదేంటీ మామా అంటూ పాడతావూ?’ అన్నాడు ప్రకాష్. ‘మావ మావా మావా పాటేనా? అదేనా?’ ఊగిపోతూ అడిగింది రమ. ‘కాదు’ సింపుల్‌గా రమకు జవాబిస్తూ ‘పాడు శారదా, నా ఫేవరైట్ సాంగ్’ బతిమాలాడు ప్రకాష్. గొంతు సవరించుకుని ‘రావోయి బంగారి మావా, నీతోటి రహస్య మొకటున్నదోరుూ’ అంటూ రాగం తీసి శారద ‘అవిసిపూవులు రెండు అందకున్నవి నాకు’ అంటుంటే అసలు అవిసిపూలంటే ఏంటో కూడా తెలియని మేమందరం ఆ గాన మాధుర్యంలోనే ఆ పూలను దర్శించి ఆ పరిమళానికి పరవశించాం అంటే అతిశయోక్తి అనిపిస్తుందేమో మీకు. కానీ అది నిజం. అదే నిజం. ఇప్పుడు తెలిసింది! ప్రకాష్ డబ్బు సంపాదించగలడు. డబ్బు పెంచగలడు.కానీ డబ్బే లోకంగా బతకడు. కొందరిలా డబ్బు మనిషి కాడు. మనసు మనిషి. అతడు మనసున్న మనిషి. లక్ష్మిని మర్చిపోలేదు. మళ్లీ తెచ్చుకున్నాడంతే - మరో రూపంలో. అప్పుడు వనలక్ష్మి. ఇప్పుడు గానవిశారద.
**
పోడూరి కృష్ణకుమారి
501, హైలైట్ హవేలీ,
స్ట్రీట్ నెం.6, హబ్సిగూడ
హైదరాబాద్-500 007
9441226880

పోడూరి కృష్ణకుమారి